ముగ్గురు పిల్లలకు తల్లి.
ఒక పాపకు అమ్మమ్మ.
ఇప్పుడు నాలుగు నెలల గర్భిణి.
నలబై రెండు కిలోమీటర్ల మారథాన్ లో విజేతగా నిలిచి రికార్డ్ సృష్టించింది.
నేపాల్ కు చెందిన ఆంగ్ దామి మే నెలలో జరిగిన ఎవరెస్ట్ మారథాన్ లో ఆరు గంటల రెండు నిమిషాల్లో గమ్యం చేరుకొని ప్రశంసలందుకుంది. 2006 లో మొదటిసారి ఆంగ్ దామి ఈ మారథాన్ లో పాల్గొని విజయం సాదించింది. ఆ తరువాత ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడంతో మానసికంగా కుంగిపోయింది. మళ్లీ మారథాన్ లో పాల్గొన్నా ఓడిపోయింది. క్రమంగా బాధ నుంచి తేరుకున్న ఆమె పోటీల్లో పాల్గొనాలనుకుంది. ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పారు. నలబై రెండు కిలో మీటర్లు ఆగకుండా పరిగెత్తితే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమవుతుందోనని భయపడ్డారు. అయిన వెనుదీయని ఆంగ్ దామి వైద్యుల సలహాలు తీసుకుంది. వాళ్ళ సమక్షంలో కొన్ని రోజులు శిక్షణ పొందింది. పరుగు పందెంలో పాల్గొంది. విజేతగా నిలిచి యాబై వేల బహుమతి అందుకుంది. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని తనకు, కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి సమస్య లేదని నిర్థారించుకుంది. 'ఆరేళ్ళ నుంచి వరుసగా ఓడిపోతున్నా. ఈసారి గెలవాలనే తపనతో పోటి చేశా. అందుకు కడుపులో ఉన్న నా బిడ్డ కూడా సహకరించింది. నా తదుపరి లక్ష్యం ఏంటో తెలుసా ఎవరెస్ట్ ఎక్కినా గర్భిణిగా పేరు తెచ్చుకోవడం' అంటోంది ఆంగ్ దామి.