నేనూ ఓడిపోవాలనుకోలేదు. ఆర్థిక సమస్యలూ, అప్పుల వేదనలూ, ఆకలి మంటలూ, ఆత్మహత్య ఆలోచనలూ... అన్నిటినీ అధిగమించాను. కొందరు స్నేహితులూ, బంధువులూ మా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. 'హాయిగా ఉద్యోగం చేసుకోక లేనిపోని ప్రయోగాలెందుకు' అని విమర్శించారు. ఈ మాటలన్నిటినీ సానుకూలంగానే తీసుకున్నా. ఎలాగయినా అనుకున్నది సాధించాలని రెండేళ్ల పాటు కష్టపడ్డాను. దాని ఫలితంగానే ఈ రోజు 'కేన్ కోక్'ల తయారీ పరిశ్రమలో నిలదొక్కుకోగలిగాను. ఇప్పుడు మా సంస్థ టర్నోవరు కోటి రూపాయలకు దగ్గర్లో ఉంది. ఉత్త చేతులతో హైదరాబాద్ వచ్చి సాధించిన ఈ విజయం వెనక నిద్రలేకుండా పస్తులతో పడుకున్న రాత్రులున్నాయి.లక్షల నష్టం...
మాది గుంటూరు జిల్లాలోని ఖమ్మంపాడులో ఓ వ్యవసాయ కుటుంబం. చదువు మీద ఆసక్తితో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాను. కానీ వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎంబీఏ చేశా. మా గ్రామంలో పీజీ చేసిన మొదటి అమ్మాయిని నేనే. చదువయ్యాక అవగాహన కోసం హైదరాబాద్‌లోని ఓ సంస్థలో హెచ్‌ఆర్‌గా చేరా. కొన్నాళ్లకు నష్టాలు రావడంతో దాన్ని మూసేశారు. అక్కడున్నప్పుడే సహోద్యోగితో పరిచయం ప్రేమగా మారింది. పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నాం. సొంతంగా ఏదయినా చేయాలన్న నా ఆలోచనకు మా వారి ప్రోత్సాహం లభించింది.
అప్పుడే పాఠశాలలో పిల్లల హాజరూ, వారు బడికి రాగానే ఆటోమేటిగ్గా తల్లిదండ్రులకు ఎస్సెమ్మెస్‌లు వెళ్లేలా ఓ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశాను. ఈ సాఫ్ట్‌వేర్ ఆలోచన నచ్చడంతో చాలా పాఠశాలలు తీసుకోవడానికి ముందుకొచ్చాయి. దాంతో కొంతమంది సిబ్బందిని నియమించుకుని, స్కూళ్లలో సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేశాం. కానీ నిర్వహణలో లోపాలతో ఆ సాఫ్ట్‌వేర్ ఉపయోగాలను పూర్తిగా పొందలేకపోయారు. దాంతో చాలా స్కూళ్లు ఆర్డర్లు వెనక్కి తీసుకున్నాయి. ఆఫీసూ, కంప్యూటర్ల అద్దె, ఉద్యోగుల జీతాలూ... అన్నీ కలిపి కొన్ని లక్షల రూపాయలు నష్టపోయాం. ఇంటాబయటా అందరికీ మా మీద నమ్మకం పోయింది. మాకు మాత్రం... మళ్లీ ఏదయినా చేసి, అందరి ముందూ గర్వంగా నిలబడాలనే కసి మొదలైంది.
సరిగ్గా అప్పుడే రిసార్ట్స్ ఆలోచన వచ్చింది. నీళ్లలో వెదురుతో కాటేజీలు నిర్మించి... ఆధునిక సౌకర్యాలు అందిస్తే ఆదరణ, ఆదాయం పొందగలం అనుకున్నాం. ఇంట్లో వాళ్లకి చెబితే అసలు ఒప్పుకోలేదు. 'హాయిగా ఉద్యోగం చేసుకోండి... మీరు బాధపడి, మమ్మల్ని బాధపెట్టకండి' అన్నారు. వినలేదు. ఈసారి ఎలాగయినా కలిసొస్తుంది అని ఒప్పించాం. మా నాన్నా, మావగారూ ఇంట్లో బంగారమంతా తాకట్టు పెట్టి డబ్బిచ్చారు. అరకులో నాలుగెకరాల పొలం కొని పనులు ప్రారంభించాం. ప్రాజెక్టు మొదలయ్యే లోపే మరో దెబ్బ. మేం కొన్న స్థలం మరో వ్యక్తి పేరు మీదా రిజిస్టరై ఉందని తెలిసింది. కాటేజీల నిర్మాణం ఆపమని అతను గొడవ. కేసు కలెక్టర్ దాకా వెళ్లింది. వాస్తవాలు తేలేవరకూ పనులు ఆపమని అధికారులు ఆదేశించారు. ఆర్థికంగా మళ్లీ నష్టం. ఈ రకంగా మొత్తమ్మీద పాతిక లక్షల నష్టంతో అప్పుల్లో కూరుకుపోయాం. ఇంట్లో వాళ్ల ముందు తలెత్తుకోలేకపోయాం. ఎక్కడా కలిసి రావట్లేదనే బాధ ఒకవైపు. చదువుకుని కూడా అవగాహన లేకుండా అడుగు వేశామనే బాధ మరోవైపు. ఒకానొక సమయంలో ఆత్మహత్య గురించీ ఆలోచించాను. అయితే అప్పటికి నాకు ప్రసవమై మూడు నెలలు. పసి పాప కోసమైనా బతకాలనిపించింది.
ఛార్జీలకు కూడా డబ్బుల్లేని పరిస్థితుల్లో నాన్న అప్పు చేసి హైదరాబాద్ పంపించారు. ఆయనిచ్చిన డబ్బులతో కొన్నాళ్లు గడిపాం. తరవాత కొన్నాళ్లు తినీతినకా నిమ్మరసంతో కడుపు నింపుకున్నాం. పెద్దవాళ్లకి విషయాలు తెలిస్తే బాధపడతారని ఉద్యోగం చేస్తున్నామని అబద్ధం చెప్పాం. సరిగ్గా ఆ సమయంలోనే ఈనాడు ఆదివారం అనుబంధంలో చెరకు రసం యంత్రంతో బెంగళూరులోని కొందరు కోట్లలో టర్నోవర్ సాధిస్తున్నారని చదివాను. నేను కూడా అలాంటి వాటిని ఆధునికంగా తయారు చేసి మార్కెటింగ్ చేయొచ్చనిపించింది. మా దగ్గరి బంధువొకరు సాంకేతికంగా మద్దతివ్వడానికి ముందుకొచ్చాడు. ఈసారి తొందర పడలేదు. పూర్తిగా అవగాహన వచ్చాకే ఆచరణలో పెడదామనుకున్నాం. చాలామంది మేం మళ్లీ వ్యాపారం చేయబోతున్నాం అని తెలిసి ఆశ్చర్యపోయారు. కొందరు మాత్రం మా పట్టుదలకు మెచ్చుకొని ఆర్థికసాయం చేయడానికి ముందుకొచ్చారు.విఫలమయ్యాక విజయం...అసలు బయట చెరకు రసానికి ఎంత ప్రాధాన్యం ఉంది. ఎలాంటి ప్రాంతాల్లో దాన్ని అమ్ముతున్నారో తెలుసుకున్నాం. హైదరాబాద్‌లో కార్పొరేట్ తరహాలో అవుట్‌లెట్లు తెరిచి బాగా సంపాదిస్తున్న వారూ కనిపించారు. కానీ ఆ యంత్రాలు అత్యాధునికమైనవి కావు. అవి చూసి కొత్తగా ఎలాంటి మెషీన్లు తయారుచేయగలమా అని ఆలోచించా.
చెరకు గెడ నుంచి పూర్తిస్థాయిలో రసం తీసి, చల్లబరిచి.. సెకన్లలో నచ్చిన రుచిలో బయటికొచ్చే యంత్రాన్ని తయారుచేయాలనుకున్నా. చెరకు రైతులకు ఇదే విషయాన్ని చెబితే చాలామంది యంత్రాలను తీసుకొని చెరకు రసం అమ్మడానికి ఆసక్తి చూపించారు. తక్కువ స్థలంలో యంత్రం అమర్చడానికి వీలుగా తయారు చేస్తే కిరాణా షాపులూ, బేకరీలూ, జిరాక్స్ సెంటర్లూ... ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చనే ఆలోచన వచ్చింది. చిన్న చిన్న వ్యాపారులతో మాట్లాడితే, మేం కొంటామని హామీ ఇచ్చారు. ఆత్మవిశ్వాసం పెరిగింది. అధ్యయనం చేసి, నిపుణులతో మాట్లాడి, సాంకేతిక సాయం పొంది... మొదట ఒక డమ్మీ యంత్రాన్ని తయారు చేశాం. దాన్నుంచి రసం పూర్తి స్థాయిలో రాలేదు. కొంత నిరాశ. మరో యంత్రాన్ని తయారు చేశాం. అదీ ఫెయిల్. ఇలా నాలుగు డమ్మీలను తయారు చేస్తే చివరిది అనుకున్న ఫలితాన్నిచ్చింది.
ఇదంతా పూర్తయ్యేప్పటికి పద్నాలుగు నెలలు పట్టింది. చాలా ఖర్చయ్యింది. ఆరు సెకన్లలో కేజీ చెరకు నుంచి ముప్పావు లీటరు రసం వచ్చింది. టచ్ స్క్రీన్ సాయంతో చెరకు రసం తీసుకునే ఏర్పాటూ చేశాం. అన్ని పరిశీలనలూ పూర్తయ్యాక ఈ ఏడాది ఏప్రిల్‌లో 'కేన్ కోక్' పేరుతో మా ఉత్పత్తి బయటికొచ్చింది. దీనితో రోజుకు నాలుగొందల కప్పుల్ని అమ్మొచ్చు. యంత్రం డిజైన్‌ను బట్టి లక్ష నుంచి రెండున్నర లక్షల వరకూ ధర ఉంటుంది.నేను ఆలోచనలు చెబితే, టెక్నికల్‌గా మా బంధువు సాయిబాబా యంత్రాన్ని డిజైన్ చేశారు. మేం ఈ విజయం సాధించడానికి మా అడపడుచూ, స్నేహితులూ పెట్టుబడికి కావల్సిన పద్దెనిమిది లక్షలు ఆందజేశారు. యంత్రాల విడిభాగాల తయారీ నుంచి అన్నీ మేమే తయారు చేయడం మొదలుపెట్టాం. వైజాగ్, విజయవాడ, మెదక్, హైదరాబాద్‌లో కొన్ని మెషీన్లను అమ్మాం. మన రాష్ట్రంతో పాటూ మధ్యప్రదేశ్, బెంగళూరు, చెన్నై, మహారాష్ట్రల నుంచి 80 దాకా ఆర్డర్లు వచ్చాయి. మాకు ఇప్పుడు చేతినిండా పని ఉంది.
సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పని చేసే కొందరు ఉద్యోగులు అవుట్‌లెట్లను తెరవడానికీ మమ్మల్ని సంప్రదించారు. ఒక్కో యంత్రం తయారీకి ఇరవై రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం మా దగ్గర పాతిక మంది పని చేస్తున్నారు. అలానే చెరకు రైతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రసం ఆర్నెల్ల వరకూ నిల్వ ఉండేలా బాటిళ్లలో భద్రపరిచి మార్కెట్‌లోకి తేవాలనుకుంటున్నాం. మైసూర్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వరంలో పనిచేసే కంట్రోలింగ్ ఫుడ్ టెక్నాలజీ సంస్థ మాకు సలహాలూ, సూచనలూ ఇస్తోంది. మూడు నెలల్లో అనుకున్నది ఆచరణలోకి వస్తుంది. ప్రస్తుతం మూడేళ్ల మా అమ్మాయిని మా పుట్టింట్లో ఉంచి నేనూ, మావారూ ఈ వ్యాపారం మీదే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం