1996వ సంవత్సరంలో భారతదేశాన్ని వదిలి లాస్ ఏంజిలిస్‌కి వలస వచ్చారు. అక్కడ ఆరు సంవత్సరాలు వున్న తరువాత కొంతకాలం మాంట్రియల్, కెనడాలో నివసించి 2003 నుండి ఫ్రీమౌంట్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. భర్త దేవకుమార్ మన్నెల. హాలీవుడ్ మూవీస్‌కు సంబంధించి స్పెషల్ ఎఫెక్ట్‌స డివిజన్‌లో ఉద్యోగస్తులు. ఇద్దరు మగ పిల్లలు విక్రాంత్... విఘ్నేశ్. 2004లో సిలికానాంధ్ర నిర్వహించిన తెలుగుతేజం ద్వారా బే ఏరియా లో అందరికీ సుపరిచతమయ్యారు. అదే సంవత్సరములో నృత్యానంద పేరుతో ఒక నాట్య కళాశాలను ప్రారంభించారు. హిమబిందు వద్ద అప్పట్లో సుమారు 30 మంది విద్యార్ధినీ విద్యార్ధులు నాట్యం నేర్చుకున్నారు. హిమబిందు చాలా చిన్న వయసులోనే నెల్లూరులో తల్లితండ్రులు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి చేర్పించారు.
అమ్మ పేరు సులోచన, తండ్రి పేరు శివరామి రెడ్డి. కాంట్రాక్టు బిజినెస్ ఆయనది. ఆ తరువాత కొంతకాలానికి మద్రాసులో స్థిరపడ్డాక తల్లితండ్రులు మాస్టారు దగ్గర చేర్చడానికి ప్రయత్నిస్తే ఆయన వయసు ఎనిమిది సంవత్సరాలన్నా ఉండాలని చెప్పారు.దాంతో తిరిగి పది సంవత్సరాల వయసులో వచ్చి అకాడమీలో చేర్చారు. అది తన జీవితములో ఒక మరపురాని ప్రయాణమని, ఒక గోల్డెన్ చాప్టెర్ అని వర్ణించారు. ఆయన అకాడమీలో చేరిన వారికి ఎవరికయినా నాట్యం మీద మక్కువ, క్రమశిక్షణ కూడా దానంతట అదే అలవడుతుందన్నారు. అంతేకాకుండా కొత్తగా చేరిన వారు తమ కన్నా ముందే చేరిన వారి దగ్గర చూసి నేర్చుకోవడం ఒక అభ్యాసన అని చెప్పారు.
హిమబిందు కూడా తన మాస్టారు గారి చిన్న కొడుకయిన రవి నాట్యం చేస్తుండగా చూసి ఎంతో నేర్చుకున్నారని, ఆయనను అనుకరించడానికి ఎంతో ప్రయత్నించారని చెప్పుకున్నారు. స్కూలు నుండి ఇంటికి రాగానే హోం వర్కు పూర్తి చేసుకుని పదిహేను నిముషాల దూరంలో ఉన్న అకాడమీకి సైకిలు మీద వెళ్ళేవారట. అక్కడికి వెళ్ళగానే అందర్నీ చూసి ఎంతో అనందం కలిగేదని, రెండు బ్యాచీలుగా క్లాసులు జరిగేవని, తమ వంతు వచ్చే వరకు వేచి చూసి ఆ తరువాత ఎంత సేపు నేర్చుకున్నా అలసట అనేది లేకుండా ఎంతో ఉత్సాహంగా కూడా ఉండేదన్నారు.
నాట్యం ఎవరికి వారు తమంతట తాము నేర్చుకోవడం కన్నా నాట్యం చేస్తున్న వారిని పరిశీలించటం అక్కడి విద్యార్ధులకు చక్కటి ఆచరణ అన్నారు. అకాడమీలో ప్రొద్దున మాస్టారు, సాయంత్రం సీనియర్ విద్యార్ధులు క్లాసులు తీసుకొనే వారని, ఒక్క శని,ఆది వారాలలో మటుకు ప్రొద్దున మాస్టారు గారు చెప్పే క్లాసులో నేర్చుకునే భాగ్యం కలిగేదని ఆవిడ అన్నారు. ప్రతివారు మాస్టారు గారి నుండి మెప్పుదల పొందాలని, అందరిలోను ఆధిక్యతగా ఉండడానికి ఎంతో ప్రయత్నించే వారని ఆవిడ అన్నారు. ఆయన ఒక విద్యార్ధిని మెచ్చుకోవటం చాలా అరుదని కూడా అన్నారు.
ఆయన అలా చేయకపోవటం వలన విద్యార్ధులకు ఇంకా బాగా నేర్చుకోవాలనే తపన, పట్టుదలే అక్కడి విద్యార్ధినీ విద్యార్ధులకు ఒక గట్టి పునాది వేసిందన్నారు. 1998లో మాస్టారు గారు అకాడమీని అడయారుకు మార్చేటప్పటికి, ఇంటికి దూరమయ్యిందని, మాస్టారు గారి సీనియరు విద్యార్ధిని అయిన సత్యప్రియ రమణ గారి దగ్గర నాట్యము కొనసాగించవలసి వచ్చింది. సత్యప్రియ గారు నాట్యానికి బాగా అంకితమయిన వ్యక్తి. ఆవిడ దగ్గర నేర్చుకుంటున్న సమయంలో తనకు ఎన్నో సోలో డాన్సెస్ చేసే అవకాశం లభించిందన్నారు, అలాగే కూచిపూడిలోని అడ్వాన్స్‌డ్ అయిటమ్స్ అన్నీ కూడా అవిడ దగ్గరే నేర్చుకోవటం జరిందని అన్నారు. హిమ గారు కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో వేరే పిల్లలకు నేర్పే అవకాశం కూడా కలిగిందని చెప్పారు.
కానీ యేదన్నా ప్రదర్శనలు ఇవ్వవలసి వచ్చే సమయంలో మటుకు మాస్టారు గారి అకాడమీలోనే రిహార్సల్స్ జరిగేవని అన్నారు. హిమబిందు నాట్యంతో పాటు సంగీతం, వీణ కూడా నేర్చుకున్నారు. ఆవిడ అబివృద్దికి తల్లితండ్రులే దోహదకారకులని, వారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని, వారికి తాను జీవితాంతం కృతజ్ఞురాలినని అన్నారు. సత్యప్రియగారు ఎంతో స్నేహ స్వభావురాలని, మాస్టారుగారు తనకు దేవుడితో సమానమని పేర్కొన్నారు. తాను ఎన్నడూ మరచిపోలేని ఒక గొప్ప అనుభవాన్ని ఇలా చెప్పారు... ఒక సారి నాట్య ప్రదర్శనలో శివుడి పాత్రను పోషించినపుడు మాస్టారు గారు తనను దీవించి ఎంతో ప్రేమగా వీపు మీద తట్టారని చెప్పారు. ఆయన తన క్రియలు మాటల్లో కన్నా చేతల్లో ఎక్కువగా కనిపించేవని, చూపించే వారని అన్నారు.
ఆవిడ ప్రారంభించిన నృత్యానంద నాట్య కళాశాలలో కూడా మాస్టారు గారి అకాడమీలో వారు పొందిన క్రమశిక్షణ, తన విద్యార్ధినీ విద్యార్ధులకు ఆ అదరణ కూడా లభించేటట్లు చేస్తానని ఆవిడ అన్నారు. తనను ఎంతో ప్రోత్సహించి ఒక కళాకారిణిగా రూపుదిద్దిన తన తల్లితండ్రులకు, మాస్టారు గారికి, సత్యప్రియరమణ గారికి, ఇప్పుడు చేయూతనిస్తున్న తన భర్తకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలుపకుంటు న్నాన న్నారు.
హిమబిందు గారు మాస్టారు గారి రూపకల్పనలో ప్రదర్శించిన ఎన్నో నృత్య నాటకాలలో పాత్రధారు లయ్యారు. ఉదాహరణకు 1996 చెన్నయ్‌లో ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణంలో శివుడిగా, అర్ధనారీశ్వరంలో సింధూనదిగా, శాకుంతలంలో గౌతమిగా మరియు ఇన్వొకేషన్ డ్యాన్సులో... 1998 అమెరికా టూర్ కి వచ్చినపుడు మేనకా విశ్వామిత్రలో ధరణీదేవిగా, అలాగే 2002లో అట్లాంటా, డెట్రాయిట్, పిట్స్ బర్గ్ పట్టణాల్లో మరలా మేనక విశ్వామిత్ర ప్రదర్శిం చినపుడు విశ్వామిత్రుడిగా, ఇంకా 2005లో పసుమర్తి వేంకటేశ్వర శర్మ గారి మహిషాసుర మర్ధిని నృత్య నాటికలో శివుడిగా నటించే అవకాశం కలిగిందని ఆవిడ చెప్పారు.
మూలం : సూర్య దినపత్రిక