అందుకేనేమో ఉర్దూ పురుడు పోసుకున్న ఈ నగరం ఆ భాషలో
ఎందరో కవులు, రచయితలనూ కని భాగ్యవంతురాలైంది!
హైదరాబాద్ అదృష్టాన్ని పెంచిన వాళ్లలో జిలానీ బాను కూడా ఒకరు!
పంచదార పలుకుల ఉర్దూకు పరిసరాల యోచనలను జాగృతపరిచే రచనలను అందించింది..
తన కలాన్ని హైదరాబాద్ సంస్కృతికి అద్దంలా మార్చిన జిలానీ బాను గురించి....
ఇప్పటి వరకు నేను 94 పుస్తకాలు రాశాను. ప్రతి పుస్తకం హైదరాబాద్ నేపథ్యానికి సంబంధించినదే! నేను రాసిన ‘పత్తరోంకీ బారిష్’ (హెల్ ఆఫ్ స్టోన్స్) అనే ఉర్దూ నవల ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ వంటి చాలా భాషల్లోకి అనువాదమైంది. నా నవలల్లో చాలావాటిని దాశరథి రంగాచార్యులు తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారు. నాలుగు గోడల మధ్య కూర్చొని రాసే టైప్ కాదు నేను. నా చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకొని, పరిశీలించి రాసే రచయితను.
స్వేచ్ఛనిచ్చాడు...
మా నాన్న గొప్ప షాయర్ (కవి), అంతే గొప్ప స్కాలర్ కూడా! మా ఇల్లు పుస్తకాల నిలయంగా ఉండేది. అందులో విదేశీ రచయితల పుస్తకాలతోపాటు పాకిస్థాన్ రచయితల పుస్తకాలూ ఉండేవి. సంగీత కచేరీకి మా ఇల్లు పెట్టింది పేరు! సాయంత్రం అయిందంటే చాలు రోజూ ఇంట్లో సంగీత కచేరీ జరిగేది. ఆ వాతావరణంలో పెరిగిన నాకు అటు సాహిత్య పఠనం, ఇటు సంగీత శ్రవణం రోజువారీ కార్యక్షికమాల్లో భాగం అయ్యాయి. అవే నా రచనాశక్తికి ప్రేరణ, స్ఫూర్తిని కలిగించాయని చెప్పొచ్చు! నాకు పాడడం రాకపోయినా హిందుస్థానీ సంగీతంలోని ప్రతి రాగాన్ని గుర్తుపట్టగలను. ఇప్పటికీ ఏదైనా రాగం వినిపించి అదే రాగమో అడిగితే తడుముకోకుండా టక్కున రాగం పేరు చెప్పగలను! ఇస్లాం సంప్రదాయ హద్దుల్లోనే పెరిగినా మా నాన్న మాకు అన్ని విషయాలు నేర్చుకునే స్వేచ్ఛనిచ్చాడు. ఒకేదానికి పరిమితమై పోవడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అయితే మా మేనమామ మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేవాడు. మా చిన్నప్పుడు మా అమ్మ ఇస్మత్ ఛుగ్తాయ్ పుస్తకాలను లైబ్రరీ నుంచి తెప్పించుకొని బాగా చదివేది. ఆమెతోపాటు నేనూ చదివేదాన్ని. కానీ మా మమయ్యకు ఇష్టం ఉండకపోయేది. ‘ఇవి ఆడవాళ్లు చదివే పుస్తకాలు కావు, చదవొద్దు’ అని మా అమ్మతో చెప్పేవాడు. అలాంటి కట్టుబాట్లు కొంచెం ఉండేవి కానీ మరీ ఆడవాళ్లు గడప దాటకూడదు అనే ఆంక్షలైతే లేకుండే!
పల్లె జ్ఞానం...
మా చిన్నప్పుడు మా ఇంట్లో లక్ష్మి అనే హిందూ మహిళ పనిచేసేది. అసలు మమ్మల్ని పెంచింది ఆవిడే! సెలవుల్లో ఆమెతో వాళ్ల ఊరికి వెళ్లేవాళ్లం. ఎడ్ల బండ్లమీద ప్రయాణం! లక్ష్మీ వాళ్ల ఊరు వెళ్లిన ప్రతీసారి అక్కడి ప్రజలు, వాళ్ల జీవన విధానం, సమస్యలు, అవసరాలు వగైరా అన్నిటినీ పరిశీలించేదాన్ని. భూస్వాములు, నాయకులు పిల్లలతో వెట్టి చేయించుకునేవారు. చదువంటే తెలిసేది కాదు వాళ్లకు. ఇట్లా ఆ పల్లెటూరు నాకు చాలా విషయాలను నేర్పింది. ఎంతో జ్ఞానాన్నిచ్చింది. తర్వాత తర్వాత అవే నా రచనలకు మూల వస్తువులయ్యాయి.
నాకు పధ్నాలుగేళ్లప్పుడనుకుంటా...
ఓ కథ రాశాను ‘దూర్ కి ఆవాజ్’ పేరుతో! అది చూసిన మగ్దుం మా నాన్నతో ‘అంత చిన్న పిల్లకు సమాజం గురించి ఏం తెల్సని పెద్ద పెద్ద విషయాల మీద కథ రాస్తుంది? అలాంటివి రాయొద్దని చెప్పు జిలానీతో’ అని అన్నాడట! మా నాన్న ఇంటి కొచ్చి ‘మగ్దుం ఇలా అంటున్నాడు.. అలాంటి విషయాల మీద తప్ప ఇంక దేనిమీదైనా రాసుకోమ్మా’ అని నాతో చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకు ఏదో పనిమీద మగ్దుం మా ఇంటికి వచ్చాడు ‘జిలానీ.. కథలు బాగా రాస్తున్నావ్.. శభాష్! అలాగే మంచిగా రాయి’అని మెచ్చుకున్నాడు. మా నాన్నతో ‘ఈ అమ్మాయి మీద ఆంక్షలేమీ పెట్టకు. తనకు నచ్చింది రాయనియ్’ అని చెప్పాడు. నా రచనలను చదివి పాకిస్థాన్‌లో ఉన్న రచయితలు కూడా ‘బాగా రాస్తున్నావ్’ అని ప్రశంసిస్తూ ఉత్తరాలు రాసేవారు. ఇంటర్ పూర్తవగానే పెళ్లయింది. ఆయనకూడా మంచి షాయర్, ఆలీగఢ్ యూనివర్శిటీ ప్రొఫెసర్. రైటర్, టీవీ సీరియల్ డైరెక్టర్. ఆయనా నాకు చదువుకునే స్వేచ్ఛనిచ్చాడు. ఎక్కడా నా ఆసక్తులకు ఆటంకం కలిగించలేదు. అందుకే పెళ్లాయ్యాకే జామియా యూనివర్శిటీ నుంచి బీఏ, ఢిల్లీ యూనివర్శిటీనుంచి ఎమ్మే చేశాను. పీహెచ్‌డీ చేయాలనే తపన ఉన్నా పిల్లలు, ఇతర బాధ్యతలతో కాలేదు.
వెల్‌డన్ అబ్బా..
హైదరాబాద్ పరిసరాలు, పరిస్థితుల నేపథ్యంతో ‘నర్సయ్యకీ బౌడీ’ అనే టెలీప్లే రాశాను. దాన్నే శ్యాం బెనెగళ్ ‘వెల్‌డన్ అబ్బా’ పేరుతో సినిమా తీశాడు. అసలు హైదరాబాద్‌కున్న కల్చరే వేరు. వందల ఏండ్ల కిందటి నుంచే ఇది కాస్మాపాలిటన్ కల్చర్‌కు కేరాఫ్‌గా ఉంది. హిందూ, ముస్లింలు సహజీవనం చేస్తారిక్కడ. అదే హైదరాబాద్ పెహచాన్! దేశంలో ఇంకెక్కడికి వెళ్లినా ఈ అద్భుతం కనిపించదు మనకు. అంతెందుకు మా చిన్నప్పుడు మేం మల్లేపల్లిలో ఉన్నప్పుడు మా పనమ్మాయి లక్ష్మితో కలిసి హిందూ దేవాలయాలకు వెళ్లేవాళ్లం. దసరా ముందు బతుకమ్మ ఆడేవాళ్లం. అందుకే నాకు హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం. ఆ కల్చర్ మీద బోలెడు రచనలు చేశాను. దీనికి ఇప్పటి యువత దూరమవుతోంది. సాహిత్యం అంటే ఇప్పటి పిల్లలకు పరిచయంలేని విషయం. పుస్తకాలు చదివితేనే సమకాలీన సమాజం తెలుస్తుంది. చరిత్రా అవగతమవుతుంది. మానసిక పరిణతి పెంచేవి ఇవేకదా! సాహిత్యం తర్వాత తరాలకు ఓ గైడ్ లాంటిది. మా మనవలు, మనవరాళ్లకు మాత్రం వీటన్నిటితో స్నేహం చేయిస్తున్నాను.
వాళ్ల కొరత ఎక్కువే..
ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలంటాన్నేను. అప్పుడే మాతృభాష వికాసం చెందుతుంది. విస్తృతమవుతుంది. భాషతోనే సంస్కృతీ బతుకుతుంది. అలాగని ఇంగ్లీష్ అవసరంలేదు అనను. కానీ మాతృభాష మీద పట్టు అత్యంతావశ్యకం అంటున్నాను! తెలుగు మాట్లాడగలను, కానీ చదవలేను కాబట్టి తెలుగు సాహిత్యం లోతుపాతుల గురించి అంతగా తెలియదు. హిందీ, ఉర్దూ భాషల్లో రొమాన్స్ గురించే కాదు సమాజంలోని పరిస్థితులు, సమస్యల గురించీ మంచి రచనలు చేసేవాళ్లు ఉన్నారు. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే ఒక రచయితగా నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది అనిపిస్తుంటుంది. మగ్దుం కవితలతో ఇప్పటికీ నేను స్ఫూర్తి పొందుతుంటాను. ఆయనలాంటి కవులు ఇప్పుడు లేరు. కొరత అనిపిస్తుంటుంది. అసలు ఇప్పటి తరంలో రచయితలు, కవులు, కళాకారులు, చిత్రకారులు చాలా చాలా తక్కువ! వాళ్ల కొరత ఎక్కువే!
జిలానీ బాను సాహితీవేత్తగానే కాదు సామాజికవేత్త కూడా! వెట్టిచాకిరి, స్త్రీ సమస్యలు, నగర జీవితంలోని ఒత్తిళ్లు మొదలైన అంశాల మీద పనిచేస్తోంది. అస్మిత స్వచ్ఛంద సంస్థకు చైర్ పర్సన్ బాధ్యతలను నిర్వహిస్తోంది. అంతేకాదు చైల్డ్ అండ్ విమెన్, హ్యూమన్‌రైట్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్‌రైట్స్(ఇండియా)కు ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా కూడా. ఉర్దూభాషకు సంబంధించి విశేష కృషిచేస్తున్న 76 ఏళ్ల జిలానీబానును గాలిబ్, ఆల్‌ఇండియా ఔమీ హలీ, ఆలమ్ ఎ ఉర్దూ ఫరోఘి అవార్డులతో పాటు ఎన్నో దేశవిదేశీ సత్కారాలు వరించాయి. 2011లో మన ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది!
మూలం : నమస్తే తెలంగాణ దినపత్రిక