కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే స్టేషన్. మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో.. తెలంగాణ ఎక్స్‌వూపెస్ కూత పెట్టుకుంటూ స్టేషన్‌ని చేరుకుంది.
పెద్దపల్లి నుంచి యైంటిక్లయిన్ కాలనీ వెళ్లే ఆటోలు వరుసగా బారులు తీరి ఉన్నాయి. ఆ దారి అధ్వాన్నంగా ఉంటుంది. అందుకే అటు వైపు తక్కువ ఆటోలు వెళతాయి. ఆటోడ్రైవర్‌లంతా వచ్చే ప్రయాణికుల కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో కుమారి కూడా ఉంది. అక్కడి డ్రైవర్‌లు ముందు కుమారి ఆటో నిండిన తర్వాతే తమ ఆటోలోకి ఎక్కించుకుంటారు ప్రయాణికులని. అక్కడి నుంచి ఆమె ప్రయాణం మొదలవుతుంది. అలా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కనీసం నాలుగు ట్రిప్పులు వేస్తుంది. ఆరు సంవత్సరాలుగా ఆ ప్రాంతానికి ఆమె సుపరిచితురాలు. ఆమె పేరులోనే రాజరికం ఉంది, కానీ ఆమె మాత్రం పేదరికాన్ని అనుభవిస్తున్నది. మగవాళ్ళకు ఏ మాత్రం తీసిపోకుండా తన సత్తాను చాటుతోంది. ఆటోడ్రైవర్ అంటే మగవాళ్లే అన్న మాటను కుమారి తిరగరాసింది. జిల్లాలోనే మొదటి ఆటోడ్రైవర్‌గా డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా పొందింది. త్వరలో హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకొని బస్సు స్టీరింగ్ తిప్పాలని కలలు కంటోంది.
అక్షరాలు నేర్వలేదు..
రాజకుమారి సొంత ఊరు కేరళలోని కొల్లెం. ఆమెకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే కుటుంబమంతా బతుకుదెరువు కోసం కరీంనగర్‌జిల్లాలోని యైంటిక్లయిన్ కాలనీకి చేరుకుంది. కుమారికి ఒక తమ్ముడు. ఆ కుటుంబం ముందు చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆ తర్వాత తల్లిదంవూడులు ఒక చిన్న హోటల్ పెట్టారు. అందులో వాళ్ళకు చేదోడువాదోడుగా ఉండేది కుమారి. దాంతో బడి బాట పట్టలేదు. పైగా ‘ఆడపిల్లలకు చదువు అవసరం లేదు’ అంటూ తల్లిదంవూడులు అనడంతో ఆ ఊసే ఎత్తలేదామె. ఆమెకు చదువు మీద మాత్రం చాలా ఆసక్తి ఉండేది. అందుకే ఖాళీ దొరికినప్పుడు పక్కింటి పిల్లల దగ్గరకు వెళ్ళి చదువు చెప్పమనేది. వాళ్ళు అక్షరాలు దిద్దుతుంటే చూసేది. అలా వాళ్లు చెప్పిన అక్షరాలను గుర్తుంచుకొని గోడల మీద పేర్లు, కరపవూతాలు చదవడం మాత్రం నేర్చుకుంది. కానీ రాయడం మాత్రం ఇప్పటికీ తెలియదు.
కుమారి తండ్రి దగ్గర చిన్న లూనా ఉండేది. ఆమెకు ముందు నుంచే కాస్త దూకుడెక్కువ. చూసి రమ్మంటే కాల్చి వచ్చేంత చురుగ్గా ఉండేది. ఆ లూనా వేసుకొని కాలనీ అంతా చుట్టేది. అలా ద్విచక్ర వాహనం నడపడం అలవాటైంది. ఏవైనా పనులు చేయాలంటే బండి చేతికి ఇస్తేనే చేసేది. ఈ దూకుడుకు కల్లెం పడింది గోపీ పరిచయంతో. కుమారి ఇంటి పక్కన ఇంట్లో ఉండేవాడు అతను. వాళ్ళది కూడా ఎక్కడి నుంచో వచ్చి జీవనం సాగిస్తున్న కుటుంబం. అతని తండ్రికి ఎస్టీడీ బూత్ ఉండేది. అందులోనే ఉండేవాడు ఆ అబ్బాయి. ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు చెబితే ముందు ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత వీళ్లు పట్టుబట్టడంతో ‘ఊ’ అనక తప్పలేదు వాళ్లు. అలా పదమూడేళ్ళకే సంసార జీవితంలోకి అడుగుపెట్టింది కుమారి.
ఆటో ప్రయాణం..
చిన్నప్పటి నుంచి కష్టాలు ఉన్నా పెద్దగా అవి ఆమెను బాధించలేదు. కానీ పెళ్ళయ్యాక ఏ ఉద్యోగం లేని భర్త, పైగా పెద్దలు వద్దన్నా చేసుకున్న పెళ్ళి కావడంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పుడే భర్త ఆటో నడపడం మొదలుపెట్టాడు. కుమారి తల్లిదంవూడుల హోటల్లోనే పనిచేసేది. అలా కొన్ని సంవత్సరాలు జీవనాన్ని సాగించారు. కానీ అరకొర డబ్బులతో సంసారం కష్టమైపోయింది. అందుకే ఇనుప సామాన్ల దుకాణం పెట్టారు. అదీ వాళ్ళకు అచ్చిరాలేదు. ఆ దందాలో భర్త జైలుకు కూడా పోయాడు. ఆ సమయంలో ఎవ్వరూ వాళ్ళని ఆదుకోలేదు.
ఆ క్షణమే ఏమైనా చేయాలనుకుంది. కానీ ఏమీ చేయలేని నిస్సత్తువ. దాదాపు మూడు సంవత్సరాలు భర్తకు దూరంగా బతికింది. ఆ సమయంలోనే తల్లి కూడా చనిపోవడంతో హోటల్‌ని తనే చూసుకుంది. భర్త తిరిగి వచ్చాడు. మళ్లీ ఆటో నడపడం మొదలుపెట్టాడు. కుమారి అలాగే హోటల్‌నే నమ్ముకుంది. అయితే ఈ చాలీచాలని బతుకులు ఎందుకనుకునేది ప్రతిరోజూ. పైగా అప్పటికే ముగ్గురు పిల్లలు. రోజురోజుకు ఖర్చులు ఎక్కువ అవ్వడంతో ఏం చేయాలని రాత్రింబవళ్లు ఆలోచించేది. అలా వచ్చిన ఆలోచనే ఆటో నడపడం. రాత్రి భర్త ఆటోను ఇంటి ముందు పెట్టేవాడు. ఆటో ఖాళీగా ఉంటుంది కాబట్టి నేర్చుకుంటానని భర్తని అడిగింది. మొదలు ఒప్పుకోలేదు. కానీ ఆమె పట్టుబట్టడంతో అతను నేర్పించక తప్పలేదు. అలా రాత్రుళ్ళు ఆటో నడపడం నేర్చుకుంది మెల్లమెల్లగా. ఆ తర్వాత వాళ్ల పక్కింటి వాళ్ళ ఆటోను అడిగి ఉదయం కూడా ప్రాక్టీస్ చేసేది.
బ్యాంకు రుణంతో..
ఆటో నడపడమైతే అలవోకగా నేర్చుకుంది. లైసెన్స్ కోసమే చాలా కష్టాలు పడింది. చివరకు ఎలాగోలా లైసెన్స్ సంపాదించింది, కానీ ఆటో! అక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అమ్మాయి ఆటో నడపడమేంటి? బండి నడిపి క్షేమంగా తిరిగి తమ చేతికి ఇస్తుందా? అని చాలామంది చాలా సందేహాలు వెలిబుచ్చారు. ఆటో అద్దెకు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. సొంత ఆటో అయితే ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేదనుకుంది. బ్యాంకు రుణం కోసం దరఖాస్తు పెట్టుకుంది. బ్యాంకు వాళ్లు సానుకూలంగా స్పందించి ఆమెకు లోను ఇప్పించారు. ఇచ్చేముందు ఒక షరతు విధించారు. కచ్చితంగా ఆమె నడుపుతానం ఇస్తామని. అంతేకాదు, మధ్యలో చెక్ చేస్తామని కూడా చెప్పారు. అలా ఆమె ఆటో రోడ్డు మీదకు వచ్చేసింది. ఉదయం ఆటో ఆమె నడిపితే, రాత్రుళ్ళు అదే ఆటోను భర్త నడిపేవాడు.
సీఐ సహకారంతో..
ఆటోను రోడ్డయితే ఎక్కించింది కానీ మిగతా ఆటోవాళ్ళను, ప్రయాణికులను మెప్పించలేకపోయింది. అంటే.. ఒక అమ్మాయి ఆటో నడపడమేంటని అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ ఎక్కడా తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఒక్కరిద్దరినే ఎక్కించుకునైనా వెళ్ళిపోయేది. అలా.. అలా.. ఆమె డ్రైవింగ్ మీద నమ్మకం ఏర్పడింది అక్కడున్న వాళ్ళందరికీ. దాంతో ఆమె ఆటోలో ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. కొన్ని రోజులు సాయంత్రం ఆరు, ఏడు వరకు కూడా ఆ లైన్లలో ఉండి ఆటో నిండాక కాని బయలుదేరకపోయేది. పెద్దపల్లి సీఐ ఇదంతా గమనించాడు. అక్కడున్న వాళ్ళతో ముందు కుమారి ఆటో నింపి పంపించేసి ఆ తర్వాత లైన్లు చూసుకోమన్నాడు. అప్పటి నుంచి ఆమె ఆటో నిండిన తర్వాతే అక్కడున్న మిగతా ఆటోలు కదులుతాయి.
అంతా పిల్లల కోసమే..
‘‘నేను మొట్టమొదటిసారి మా ఆయనకు తెలియకుండా ఒకసారి ఆటో తీశాను. ఉదయం ఐదు గంటలకు నిద్రపట్టక ఆటో నడపుదామని అనుకున్నాను. అప్పుడే కాలనీలో రౌండ్లు వేస్తుంటే సింగరేణి వాళ్ళు పనులకు వెళుతూ ఆటో కోసం చూస్తున్నారు. నేను వెళ్లి తీసుకెళతాను అంటే ముందు తటపటాయించినా ఎక్కి కూర్చున్నారు. క్షేమంగా వాళ్ళని దించాను. దాంతో నా మీద నమ్మకం కుదిరింది వాళ్ళకి, నాకు కూడా. అలా ఆటో నడిపి 42 రూపాయలు సంపాదించాను. అప్పటిదాకా హోటల్ నడిపినప్పుడు వచ్చిన డబ్బులకంటే ఈ డబ్బులను చూస్తే ఎంతో గర్వంగా అనిపించింది.
ఎంతో సంతోషమేసింది కూడా! ఆ డబ్బులను తీసుకొచ్చి మా ఆయనకిచ్చాను. ముందు కాస్త మందలించారు చెప్పకుండా ఆటో తీసుకెళ్ళినందుకు కానీ ఆ తర్వాత సంతోషించారు. నేను ఇంత కష్టపడేది నా పిల్లల కోసమే. నాకెలాగూ చదువూసంధ్యా లేదు. కనీసం వాళ్ళనైనా మంచి కొలువుల్లో చూడాలి. వాళ్లు కూడా బాగా చదువుతున్నారు. అదే నేను ఎంతటి కష్టన్నైనా ఇష్టపడేలా చేస్తోంది. ఈ మధ్యే సాయంవూతంపూట కుట్టు మిషన్ కూడా నేర్చుకుంటున్నాను. అది కూడా ఏదో ఒకలా సాయంగా ఉంటుంది కదా! ఇంకా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. కానీ దానికి పదవతరగతి పాస్ కావాలంటా! నాకేమో అక్షరం కూడా రాదు. చదువుతానంటే పిల్లలేమో వద్దంటున్నారు. కానీ ఎలాగైనా చదివి తీరాలని నాకనిపిస్తోంది. ఏ రోజుకారోజు సంపాదిస్తేనే పూట గడవడం కష్టంగా ఉంది. ఇంకా చదువు మీద ధ్యాసే ఏముంటది? అందుకే ఆలోచిస్తున్నాను.’’