కొన్నేళ్ల పాటు ఇద్దరం గ్రామీణుల మధ్య ఉంటూ వాళ్లకు చదువు చెప్పడం, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పడం చేశాను. ఆ సమయంలోనే సహజ వనరుల్ని ఉపయోగించుకోలేక, స్వయం ఉపాధి అవకాశాలు లేక మహిళలు పడే ఇబ్బందిని గమనించాను. ఆ చేయూతను వాళ్లకందిస్తే అభివృద్ధి సాధిస్తారని అనిపించింది. అనుకున్నదే తడవు, అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్‌నేటివ్స్ పేరుతో సంస్థను ప్రారంభించా. మహిళా సాధికారత లక్ష్యంగా మెదక్ జిల్లాలోని కొన్ని వెనుకబడిన గ్రామాలను ఎంచుకొన్నా. మహిళలకు చదువు చెప్పడంతో పాటూ ఆదాయం సంపాదించడం, ఆదా చేసుకోవడం గురించి అవగాహన కల్పించా. అప్పుడే ప్రభుత్వ డ్వాక్రా సంఘాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.
నేను స్థానిక డీఆర్‌డీఏ అధికారుల సాయంతో ఆరొందల బృందాలనూ, నాలుగు మహిళా సమాఖ్యలనూ ఏర్పాటుచేశా. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భజలాలు పెరిగేలా చూడటం, చెక్ డ్యామ్‌ల నిర్మాణం వంటి పనుల్ని మహిళా గ్రూపులకు అనుసంధానం చేశాం. సామాజిక వనాలూ, వంటింటి తోటలూ, నర్సరీల ఏర్పాటులో వాళ్లని నిమగ్నం చేశాం. దీంతో చాలామందికి ఆదాయ మార్గం ఏర్పడింది. భూసారాన్ని సంరక్షిస్తూ, పండ్ల తోటలూ కూరగాయలూ ఒకేచోట పండించే ప్రకృతి హితమైన వ్యవసాయ పద్థతులను గ్రామీణులకు పరిచయం చేయాలనుకున్నా. అందుకోసం కొన్ని ఎకరాల్లో పంట వేశాం. ఎరువులు లేకుండా పండించాం. దిగుబడి బాగా వచ్చింది. దీన్ని మెదక్ జిల్లాలోని ఎల్గోయి, ఆరు గ్రామాల్లోని రైతులు అందిపుచ్చుకున్నారు.
ఉత్సాహంతో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని ముప్ఫై గిరిజన గ్రామాల్లో ఎరువుల వాడకం లేకుండా సహజ పద్ధతుల్లో పంట దిగుబడి పెరిగేలా, మంచి లాభం వచ్చేలా ప్రణాళికలు అమలు చేశాం. మిద్దిచింత, రాంపూర్ వంటి గ్రామాల్లో కరెంటు సౌకర్యం లేకపోవడం గమనించి... పది లక్షల రూపాయలతో సౌరశక్తి దీపాలు ఏర్పాటుచేశాం. గ్రామీణుల సహకారంతో అరుదైన కూరగాయలూ, పండ్ల విత్తనాలను సేకరించి లక్ష మొక్కలతో రెండు నర్సరీలను ఏర్పాటు చేశాం. వీటిల్లో ఉత్పత్తి అయ్యే పండ్లూ, కూరగాయ మొక్కల్ని రైతులు తమ పొలంలో పెంచుకుని దిగుబడి సాధిస్తున్నారు. ఆదాయం పొందుతున్నారు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవాలనుకునే వారికి బ్యాంకులతో మాట్లాడి రుణం ఇప్పించడంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడ్డాయి