జీవితంలో ఎంతో సాధించాలని, ఏదేదో చేయాలని వైశాలి కలలు కంది. అయితే ఆమె తల్లిదండ్రులు వైశాలి ఎనిమిదో తరగతి చదువుతుండగానే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కనీసం పదో తరగతైనా చదవనివ్వండని పట్టుబట్టి ఒప్పించింది వైశాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదివింది. మళ్లీ పెళ్లి ఒత్తిడి మొదలైంది. ఈసారి మాత్రం తల్లిదండ్రులు ఆమె మాటను మన్నించే స్థితిలో లేరు. ఇక లాభం లేదనుకుని ఒకరోజు మధ్యాహ్నం చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి బయటికొచ్చేసిన వైశాలి నేరుగా రైల్వే స్టేషన్కు వచ్చి దొరికిన రైలు ఎక్కేసింది... టికెట్ కూడా తీసుకోకుండా! ఆ రైలు భోపాల్కు వెళ్లింది. దిగాక, స్నేహితులకు ఫోన్ చేద్దామంటే డబ్బుల్లేవు.
ఓ ఎస్టీడీ బూత్ యజమానిని బతిమాలి.. కొంతమందికి ఫోన్ చేసింది. చివరికి ఓ స్నేహితురాలు ఆమె ఉన్న చోటికి వచ్చి తనుంటున్న హాస్టల్కు తీసుకెళ్లింది. కొన్ని రోజులు తనే వైశాలి ఖర్చులు భరించింది. ఈ సమయంలోనే వైశాలి ఓ చిన్న కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్గా పనికి కుదిరింది. కొన్ని నెలలు అక్కడే పనిచేశాక మరో ఉద్యోగం చూసుకుంది వైశాలి. అక్కడ జీతం రూ.1500. కొంతలో కొంత నయం. కానీ ఇది సాధించడానికేనా తను ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వచ్చేసింది! వైశాలికి దుస్తుల విషయంలో, డిజైన్ల విషయంలో మంచి అవగాహన ఉందని స్నేహితులు అంటుండేవారు.
అది గుర్తొచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకుంది వైశాలి. అక్కడే ఒక యూనివర్శిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు సిలబస్ మెటీరియల్ తెచ్చుకుని సొంతంగా పాఠాలు నేర్చుకుంది. ఆ అవగాహనతో గుజరాత్లోని ఓ ఇన్స్టిట్యూట్కు ఇంటర్వ్యూకు వెళ్లింది. వారికి ఈమె ప్రతిభ నచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ టీచర్గా అవకాశమిచ్చారు. అక్కడ కొన్ని నెలలు పనిచేశాక.. ఆ అనుభవంతో ముంబయిలో ఓ సంస్థలో ఉద్యోగం తెచ్చుకుంది. ఇక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది.
ముంబయిలో ఓ లేడీస్ జిమ్లో ఆమెకు ఒక బ్యాంకర్ పరిచయమై లోన్ ఏర్పాటు చేశారు. రూ.50 వేల పెట్టుబడితో చిన్న డిజైనర్ డ్రెస్ దుకాణం ప్రారంభించింది. ఇద్దరు టైలర్లను కూడా పెట్టుకుంది. ఆమె డిజైన్ చేసిన దుస్తుల్లో నవ్యత వల్ల కస్టమర్లు బాగా ఆకర్షితులయ్యారు.
వైశాలి ముంబయి వచ్చే సమయానికే తనకు పూర్వపు స్నేహితుడైన ప్రదీప్ కూడా ముంబయికి చేరాడు. ఇద్దరి అభిరుచులు కలిసి పెళ్లి చేసుకున్నారు. ప్రదీప్ ప్రోత్సాహంతో తన వ్యాపారాన్ని విస్తరించింది వైశాలి. ఆ తర్వాత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల పరిచయంతో దుస్తుల డిజైనింగ్లో మరిన్ని మెళకువలు నేర్చుకున్న వైశాలి.. తన దుస్తుల్ని ఫ్యాషన్ వీక్లలో మోడల్స్తో ప్రదర్శన ఏర్పాటు చేసే స్థితికి చేరుకుంది. ఇలా ముంబయిలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ఎదిగిన వైశాలి షదన్గులే విజయగాథ ప్రతి మహిళకూ ఆదర్శం.
మూలం : సాక్షి దినపత్రిక