విజయవాడలోని అమ్మమ్మ కోటేశ్వరమ్మ, పెద్దమ్మ డాక్టర్ శశిబాల ఇంట్లో ఉత్సాహంగా గడిపేస్తుంది. ఆ మూడు నెలలూ భరత నాట్యం, కూచిపూడి, వీణ, పియానో... ఇలా తనకిష్టమైన ఆసక్తులతో కాలం గడుపుతుంది. సినిమాలు చూడటమూ తన అభిరుచుల జాబితాలో ఉంది. ప్రేమ కథలంటే మరీ ఇష్టంగా చూస్తుంది. ప్రభాస్ తన అభిమాన నటుడు. 'వర్షం సినిమా ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు' అంటుంది. చిన్నతనంలో సెలవులొస్తే చాలు నీనా... నాన్నతో కలిసి ఆయన పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లిపోయేది. అక్కడ ఆయన ఎంతోమందికి వైద్యం చేసి, సాంత్వననందించడం చూసి తను కూడా డాక్టర్ అవ్వాలనుకునేది. అంతేకాదు... చదువుకుంటూనే చిన్నారుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల్లో చేరి, వారి కార్యకమాల్లో చురుగ్గా పాల్గొనేది.
నీనా ప్రస్తుతం మిషిగన్ విశ్వవిద్యాలయంలో బ్రెయిన్ బిహేవియర్ అంశంపై ప్రాజెక్టు వర్క్ చేస్తోంది. తరవాత వైద్య విద్యను అభ్యసించడమే ఆమె లక్ష్యం. క్యాంపస్‌లో ఉన్నా ఆమె ఆలోచనలు చదువుకే పరిమితం కాలేదు. ప్రతినెలా డాన్స్, మారథాన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విరాళాలను సేకరించేది. ఆ వచ్చిన మొత్తాన్ని చిన్నారుల వైద్యానికి వినియోగించేది. నీనా చేస్తోన్న మంచి పనికి విశ్వవిద్యాలయంలోని వేల మంది సహ విద్యార్థుల అండదండలున్నాయి. చదువుకీ, సేవకీ సమప్రాధాన్యం ఇచ్చే నీనా ఇప్పటికే యూనివర్సిటీ మెరిట్, నేషనల్ ఆనర్స్ సొసైటీ అవార్డులను అందుకుంది. ఇంతకీ తను ఫ్యాషన్ రంగంలో ఎలా అడుగుపెట్టింది అంటారా? అది అనుకోకుండానే జరిగింది.
తను టీనేజీలో బాగా లావుగా ఉండేది. తెలుగింటి వంటకాలంటే బాగా ఇష్టం. ఒకానొక సమయంలో ఆహారం తీసుకొనే విషయంలో నియంత్రణ కోల్పోయింది. బాగా బరువు పెరిగింది. కానీ నాజూగ్గా మారడానికి తనని తాను మానసికంగా సిద్ధం చేసుకుంది. ప్లస్ టూకి వచ్చాక బాగా కసరత్తు చేసి, చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకుంది. అదే సమయంలో స్నేహితులు కొందరు 'మిస్ టీన్' పోటీలకు దరఖాస్తు చేశారు. తనూ వాటిల్లో పాల్గొంది. అది అప్పటికే సరదానే! కానీ ఆ పోటీల్లో తనదే రెండోస్థానం. వందల మందిని అధిగమించి అభినందనలు అందుకోవడం... ఆమెలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపింది. ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండమన్నాయి. హృద్రోగ నిపుణురాలు అవ్వాలనుకున్న నీనా మొదటి ప్రాధాన్యం... చదువుకే. దాంతో ఆ అవకాశాలను సున్నితంగా తిరస్కరించింది. డిగ్రీ పూర్తయింది. ఆర్నెల్ల విరామం. కాస్త సమయం దొరికింది. అప్పుడే స్థానిక అందాల పోటీల ప్రకటన చూసింది. ఉత్సాహంగా దరఖాస్తు చేసింది. గెలుపు తనదే. మిస్ న్యూయార్క్ పోటీలకు ఎంపికైంది. ఇక్కడ విజేతగా నిలవడానికి తను చాలా కష్టపడిందనే చెప్పాలి.
తనకిష్టమైన భారతీయ వంటకాలను తినకుండా, నోరు కట్టేసుకుంది. జంక్‌ఫుడ్, ఐస్‌క్రీమ్‌లూ, చాక్లెట్లను దూరం పెట్టింది. తెల్లవారు జామున నాలుగు గంటలకే నిద్రలేచి యోగా, ధ్యానం, ఏరోబిక్స్ చేసింది. బయటి ఆహారం పూర్తిగా బంద్. అమ్మ చేతి వంట మాత్రమే అదరహో! మానసిక దృఢత్వాన్నీ పెంచుకుంది. జూన్‌లో జరిగిన పోటీల్లో 'మిస్ న్యూయార్క్'గా ఎంపికై, మిస్ అమెరికా పోటీలకు అర్హత సాధించింది. ఇప్పటి వరకూ న్యూయార్క్ అందాల పోటీల్లో గెలిచిన తెలుగమ్మాయిలు లేరు. నీనాయే ఆ ఘనత సాధించింది. వేల డాలర్ల నగదు బహుమతి అందుకుంది. అలాగని ఆ మొత్తాన్ని విలాసాలకు ఖర్చు పెట్టలేదు. ఖరీదైన కార్లూ కొనుక్కోలేదు. క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారుల వైద్యం కోసం అందజేసింది. ఆ తరవాత వెంటనే మిస్ అమెరికా పోటీల్లోనూ పాల్గొంది. తనతో కలిసి యాభై మూడు మంది అందాల భామలు పోటీలో తలపడ్డారు. వివిధ వడపోత దశలు. అన్నిటినీ దాటింది. యాభై వేల డాలర్ల ఉపకార వేతనాన్నీ అందించింది. ఈ పోటీల్లో ప్రతిభను నిరూపించుకునే విభాగంలో.. సంప్రదాయ దుస్తుల్లో కూచిపూడి, భరత నాట్యం ప్రదర్శించింది నీనా. కొన్ని బాలీవుడ్ హిట్ పాటలకూ స్టెప్పులేసింది.
'తెలుగమ్మాయిగా పుట్టడం వల్లే చదువూ, సేవ, అందం, జీవితం గురించి నాకంటూ ఓ స్పష్టమైన అవగాహన ఏర్పడిందని అనుకుంటున్నా అనే నీనాకు దైవభక్తి ఎక్కువ. శిరిడీ సాయిబాబాను పూజిస్తుంది. సమయం దొరికితే పూజలు చేస్తుంది. ఆధునిక పద్ధతుల మధ్య పెరిగినా పండగలూ, ప్రత్యేక సందర్భాల్లో అమెరికాలో పట్టు పరికిణీలో కనిపించడానికే ప్రాధాన్యం ఇస్తా అంటుంది.అందమంటే ఇది...కృత్రిమ మార్పులు తెచ్చుకునే బదులు పుట్టుకతో మనకొచ్చిందే అందం అన్నది తన భావన. దీనినే న్యాయనిర్ణేత లకు సమాధానంగా చెప్పి అందాల కిరీటం గెలుచుకుంది నీనా.