పాకిస్తాన్ 'సైన్యంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒకే ఒక మహిళా ఫైటర్ పైలట్ మీరే' అని అంటే ఆలివ్‌గ్రీన్ స్కార్ఫ్ చుట్టుకున్న హెల్మెట్ ధరించిన ఆయేషా చిరునవ్వులు చిందిస్తారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని చారిత్రక నగరం భవల్పూర్‌కు చెందిన ఆయేషా గత పదేళ్లుగా పాకిస్తాన్ వైమానిక దళం లోని 19 మంది మహిళా పైలట్లలో ఒకరు. ఆయే షాయే కాక ఇంకా ఐదురుగు మహిళా ఫైటర్ పైలట్లు కూడా ఉన్నారు. కానీ వీరంతా యుద్ధ రంగంలో పోరాడడానికి అర్హత సాధించే ఆఖరి పరీక్షల్లో ఇంకా పాల్గొన లేదు.
ఆయేషా మాత్రం 'నేను ఎలాంటి తేడానూ గమనించలేదు. మేం అందరి లాగే ఒకే పనులు చేస్తాం. నిర్దేశిత ప్రదేశంలో కచ్చితంగా బాంబులు వేస్తాం' అని తన పురుష సహచరులతో మృదువుగా అంటారు. వీళ్ల స్థావరం ఉత్తర పాకిస్తాన్‌లోని ముషఫ్ బేస్. ఇక్కడ 50 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రతలో చక్కగా పేర్చిన యుద్ధ అస్త్రా లున్న చోట కూర్చొని ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్ మహిళల వైఖరిలో మార్పు వస్తోందనడానికి ఆయేషాయే ప్రత్యక్ష ఉదాహరణ. కొన్నేళ్లుగా పాకిస్తాన్ రక్షణ బలగాల్లో మహిళలు చేరడం పెరుగుతోంది. 'తీవ్రవాదం, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మా కాళ్లపై మేము నిలబడటం ముఖ్యం ' అని ఆయేషా చెప్పారు. తాలిబాన్ తీవ్రవాదులను, పెరుగుతున్న మత హింసను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ వ్యాఖ్య చేశారు. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రత క్షీణిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇక్కడున్న అమెరికా సైనిక దళాలు వెనక్కు వెళతాయి. మరోవైపు భారత్‌తో అసౌకర్యమైన సంబంధం దీనికి తోడైందని అంటారు.
నిరక్షరాస్యురాలైన తన వితంతు తల్లితో విభేదించి ఏడేళ్ల క్రితం ఆయేషా ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. 'మా సమాజంలో చాలా మంది అమ్మాయిలు విమానంలో ప్రయా ణించడమనే ఆలోచన చేయరు' అని చెప్పారు. కుటుంబ ఒత్తిడి ఎదుర్కొని సైన్యంలో చేరినా, ఇక్కడ సాంప్రదా యిక పురుషాధిక్యత వల్ల యుద్ధానికి సిధ్దమయ్యే చివరి దశకు వెళ్లడం మానుకుంటున్నారని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ దశకు చేరుకోలేని వారు దళాలకు సామగ్రి తరలించే, నెమ్మదిగా నడిచే విమానాలను నడుపుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దున ఉన్న గిరిజన ప్రాంతంలో అత్యాచారాలు, అవయవాలు తొలగించడం, మహిళల్ని చంపడం శతాబ్దాలుగా కొనసాగుతోంది. మహిళల హక్కులను రక్షించడంలో పాకిస్తాన్ విఫలమైంది. కానీ ఇప్పుడు మహిళలు తమ హక్కులను తెలుసుకుంటున్నారు. వైమానిక దళంలో చేరి సాధికారత సాధించడానికి సిద్ధమవు తున్నారు. 'చాలా మంది మహిళలు ఎయిర్ ఫోర్స్‌లో చేరుతు న్నార'ని వింగ్ కమాండర్ ఆఫ్ స్క్వార్డ్రన్ నసీమ్ అబ్బాస్ తెలిపారు. ఆయేషాతో సహా 20 మంది మహిళలను పైలట్లుగా అబ్బాస్ తయారు చేశారు.
ఆయేషా చైనా తయారు చేసిన ఎఫ్-7పిజి ఫైటర్ జెట్‌లో ప్రయాణిస్తున్నారు. 'తీవ్రవాదం నుండి పాకిస్తాన్‌ను రక్షించడం చాలా ముఖ్యం. ఇందులో ప్రతీ ఒక్కరూ భాగ స్వాములవడం కూడా చాలా ముఖ్యం' అని 24 ఏళ్ల ఎవియా నిక్స్ ఇంజనీర్ ఆనం హసన్ అన్నారు. హసన్ ఎఫ్-16 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పనిచేస్తారు. ఆ మాటలకు తగ్గట్లే పాకిస్తాన్ సాయుధ దళాల్లో ప్రస్తుతం 4000 మంది మహిళలున్నారు. ఇందులో చాలా మంది డెస్క్ ఉద్యోగాలు, వైద్యం సంబంధ పనులు చేస్తున్నారు. గత దశాబ్దంలో మహి ళలు స్కై మార్షల్స్ అయ్యారు. ఎంపిక చేసిన కొంత మంది మహిళలు ఎలైట్ యాంటి-టెర్రరిస్టు ఫోర్సులో ఉన్నారు. ఐదేళ్ల కిందట ఎయిర్‌ఫోర్స్‌లో 100 మంది మహిళలుం డగా, ఇప్పుడు 316 మంది ఉన్నారని అబ్బాస్ తెలిపారు. ఆయేషా లాంటి మహిళా ఫైటర్ పైలట్ల రాకతో, వివక్ష క్రమంగా కనుమరుగవుతుందనే ఆశ కలుగుతోంది.
మూలం : ఆంధ్రజ్యోతి