భుజానికి బ్యాగు వేసుకుని బడికెళ్లే పిల్లల్ని చూసి తాను చదువుకోవాలని ఆశపడింది. పగలంతా పని చేస్తూనే ఉన్నా, మనసంతా చదువే. కొన్నేళ్లు ఇలా గడిచాక, ఓ స్వచ్ఛంద సంస్థ ఆ గ్రామంలో బాల కార్మికులను బడిలో చేర్పించే కార్యక్రమం చేపట్టింది. పిల్లల్ని పనిలో పెట్టుకునే సంస్థల పని పట్టేందుకు అధికారులూ కదిలారు. గ్రామస్తులందర్నీ కలిసి పిల్లలు చదువుకుంటే ఉండే ప్రయోజనాలను వివరించారు. ఇవన్నీ అక్కడి వాళ్లకు పట్టలేదు. ఆడపిల్లల్నీ బడికి పంపిస్తే, ఇల్లెలా గడుస్తుంది అనుకున్నారు. అంతా ఒక్కటై 'ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని బడికి పంపం' అని చెప్పేశారు. అధికారులు చెప్పినవి పెద్దవాళ్లకు పట్టకపోయినా, చిన్నారి రజియాకు బాగానే అర్థమయ్యాయి. దాంతో 'నేను బడికెళ్లి చదువుకుంటా' అని పట్టుబట్టింది. స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలను కలిసి, వాళ్లని ఇంటికి తీసుకొచ్చి అమ్మానాన్నలను పట్టుబట్టి ఒప్పించి, బడిలో చేరింది.
బాగా చదువుకోవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం వరకే రజియా పరిమితం అవలేదు. హైస్కూలుకి వచ్చాక గ్రామంలోని ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి 'పేదరికం పోవాలంటే మీ పిల్లలకు చదువు చెప్పించండి' అని కోరింది. ప్రయోజనాలను ఏకరువు పెట్టింది. వారిలో మార్పు రాలేదు సరికదా, అంతా కలిసి 'మా పిల్లల్ని చదువంటూ చెడగొడుతున్నావు' అంటూ ఆమెను తిట్టారు. ఇంటి మీదికొచ్చి గొడవ చేశారు. రజియా బెదిరిపోలేదు. స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలను కలిసింది. వాళ్ల సూచనల మేరకు బాల పంచాయతీని ఏర్పాటు చేసింది. దానికి నాయకురాలిగా ఉండి, పిల్లల్ని బడికి పంపాల్సిందేనని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి, ఒక్కొక్కరినీ బడిలో చేర్పించింది. ఈ రకంగా సుమారు యాభై మందిని పాఠశాలలో చేర్పించిన రజియా గ్రామానికి మంచినీటి వసతి వచ్చేలా, మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా అధికారులతో పోరాటం చేసింది. పదో తరగతి పూర్తిచేసి, ఇంటర్‌లో చేరాక పూర్తిగా పాడైపోయిన పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించింది. చదువుకుంటూ, గ్రామాభివృద్ధి పని చేస్తున్న పిల్లల్ని చూశాక గ్రామస్తుల్లోనూ మార్పొచ్చింది. చాలామంది తమ పిల్లల్ని స్వచ్ఛందంగా చదివించేందుకు ముందుకొచ్చారు.
నాలుగేళ్ల వయసులోనే ఎన్నో కష్టాలు పడుతున్న అశ్విని గురించి తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెను అక్కున చేర్చుకుంది. దత్త పుత్రికలా చూసుకుంటామంటూ తీసుకెళ్లి బడిలో చేర్చింది. వసతి కల్పించింది. అన్ని కష్టాలనూ అక్షరాలు దిద్దడంలో మర్చిపోయిన అశ్విని చదువుల తల్లిగా మారిపోయింది. బ్రెయిలీ నేర్చుకుంది. పదో క్లాసు, ఇంటర్ మంచి మార్కులతో పాసయ్యింది. భవిష్యత్తు లక్ష్యాలను ఏర్పర్చుకుంటూ డిగ్రీ పూర్తి చేసింది. ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగమూ సంపాదించింది.
అలాగని 'ఇక నాకేం ఇబ్బంది లేదు' అనుకుని వూరుకోలేదు. చూపులేక, చదువుకునే పరిస్థితుల్లేక బాధపడే చిన్నారులకు చేయూతను అందించేందుకు కృషి చేస్తోంది. తనకు ఆశ్రయం ఇచ్చిన సేవా సంస్థ తరఫున ప్రచారం చేస్తోంది. 'మనదేశంలో సుమారు నలభై మిలియన్ల మంది వికలాంగులు ఉన్నారు. వారిలో నలభై రెండు శాతం మంది మహిళలే. ఆడపిల్ల అంటేనే చులకనగా చూసే సమాజం మనది. అందులోనూ వికలాంగ బాలికలంటే కుటుంబానికి భారంగా భావించే తల్లిదండ్రులే అధికం. నేనూ అటువంటి పరిస్థితుల నుంచే వచ్చాను. అందుకే ఈ పోరాటం ఆపకుండా వారికోసం కృషి చేస్తాను' అన్న అశ్వినిని చూసి మలాలా కూడా స్ఫూర్తి పొంది 'జులై 12 మలాలా డే కాదు... అశ్విని డే కావాలి. ఎన్ని సమస్యలు ఎదురయినా ఆడపిల్లలు చదువుకునే దిశలో ఆలోచనలు చేయాలి' అని చెప్పింది. చదువుతో వైకల్యాన్ని గెలిచిన అశ్విని అమ్మానాన్నల ప్రేమనూ సాధించుకుంది. 'మా అమ్మాయి సాధించిన విజయాలు మాకెంతో గర్వకారణం' అంటూ వాళ్లిప్పుడు తనను అక్కున చేర్చుకుంటున్నారు.
మూలం : ఈనాడు దినపత్రిక