
పాదయాత్ర నిర్వహించిన మహిళా రాజ్యాధికార సంఘం అధ్యక్షురాలు
మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం పేరిట ఉద్యమం
విద్యార్థునుల సమస్యలపై ఆవేదన
దాదాపు నెల రోజులు జనం మధ్యే
త్వరలో రాజకీయాల్లోకి వస్తా
నిర్మాతగా రాణిస్తున్న ఆకుల విజయ
సందేశాత్మక చిత్రాల నిర్మాతగా ఎంతో మందికి ఆమె సుపరిచితం. కానీ అంతటితో ఆమె సరిపెట్టుకోలేదు. సమాజానికి తన వంతు బాధ్యతగా ఏదో చేయాలని తలచింది. అది మహిళల సమస్య అరుుతే బాగుటుందని భావించింది. నగరంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. అందులో ఆమెకు చాలా ఇబ్బంది, బాధ అనిపించిన విషయం మహిళలు టాయ్‌లెట్లు లేక ఇబ్బందిపడడం. ఇది ఎవరికీ చెప్పుకోలేని బాధ. సమస్య పరిష్కారం కోసం ఆమె పాదయాత్ర చేసింది. నిర్మాతగా, మహిళా నాయకురాలిగా పలువురి మన్ననలు అందుకున్న ఆమే ఆకుల విజయ.
హైదరాబాద్ నగరం మహా పట్టణం. కోట్ల జనాభాతో దేశంలోనే ఐదవ అతిపెద్ద నగరంగా, ఐటి హబ్‌గా, దేశానికి రెండో రాజధానిగా విల్లసిల్లుతోంది. ఇది ఒక పార్శం మాత్రమే. రెండోవైపు ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. నిరంతరం లక్షల మంది మహిళలు వివిధ కారణాల రీత్యా నగరంలో తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి స్థితిలో ఎప్పుడైనా టాయ్‌లెట్‌కు వెళ్లాలంటే ఎలా? ఇది ఎవరికీ చెప్పుకోలేని బాధ. ఎంతో మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాంటి వారి బాధను అర్థం చేసుకున్న మహిళా రాజ్యాధికార సంఘం అధ్యక్షురాలు ఆకుల విజయ ఉద్యమం ప్రారంభించింది. 35రోజులు పాదయాత్ర చేసింది. నగరంలోని పలు ఏరియాల్లో పర్యటించి వారి ఇబ్బందులను తెలుసుకుంది. పాఠశాలలను సందర్శించింది. వందల మంది విద్యార్థునులు ఉన్న పాఠశాలల్లో కూడా ఒకే ఒక్క టాయ్‌లెట్ ఉండడం ఆమెను ఆవేదనకు గురిచేసింది. ఆమె పాదయాత్ర ద్వారా ఈ ఇబ్బందిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.
మొదట ఇదేం సమస్య అన్న వారే తరువాత విజయ మహిళల ఆత్మ గౌరవ పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 10 తేదీన ప్రారంభం అయిన ఆకుల విజయ పాదయాత్ర నగరంలోని చాలా ప్రాంతాల్లో సాగి మార్చి 5 ముగిసింది. మల్కాజ్‌గిరి, ఉప్పల్ ప్రాంతాల్లోని స్కూల్ విద్యార్థునుల ఆమె ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారి ఇబ్బందులు విన్న విజయ ఎంతో చలించిపోయారు. బల్కంపేట, ఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్లోనే కాక చుట్టు పక్క ప్రాంతాల మహిళలు కూడా సమస్యల పరిష్కారంలో కోసం ఈమెను సంప్రదిస్తుంటారు. వారి విన్నపంలో న్యాయం ఉందని అనిపిస్తే వారికి సాయం చేస్తారు విజయ. పాదయాత్ర గురించి ఆమె మాట్లాడుతూ నగరంలో ఇంత మంది మహిళలు సంచరిస్తుంటే ప్రభుత్వ పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. విద్యార్థునులు ఎక్కువగా ఉన్న పాఠశాలలో సంఖ్యాపరంగా టాయ్‌లెట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. మహిళల ఇబ్బందులను తెలియజేస్తూ పలువురు మంత్రులను కలిసి విన్నవించినట్లు చెప్పారు.
విజయ అభ్యర్థనకు వారు సానుకూలం స్పందించి సిఎంతో మాట్లాడతామని హామీ ఇచ్చినట్లు ఆమె వివరించింది. దీనిపై మీరు సంతృప్తి చెందారా అని ప్రశ్నించగా సమస్య పరిష్కారం అయిన నాడే తాను సంతోషిస్తానని బదులిచ్చారు. మహిళలు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె వివరించారు. సమస్యలు పరిష్కారం చేయాలంటే అది చట్టసభల్లో సభ్యురాలిగా ఉంటేనే సాధ్యమన్నారు. త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అంతేకాదు సమాజంలో సగం అయిన మహిళలకు చట్టసభల్లోనూ 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని అందు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని విజయం చెప్పారు.
‘బొమ్మాళి’, ఆపరేషన్ దుర్యోధన-2 లాంటి పలు చిత్రాలను ఆకుల విజయ లక్ష్మీ ప్రణవ్ ప్రొడకన్స్‌పై నిర్మించారు. అనుకున్న స్థాయిలో చిత్రాలు హిట్ సాధించకపోయినా సమాజానికి సందేశాత్మక చిత్రాలను అందించానన్న తృప్తి పొందినట్లు నిర్మాత ఆకుల విజయ చెప్పారు.