బ్యాంకింగ్ రంగంలో రేణు సూద్ కర్నాడ్ అంటే తెలియనివారుండరు. కానీ ఈమె గురించి మాత్రం కొంతమందికి తెలియదనడంలో ఆశ్చర్యంలేదు. ఈమె హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటడ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేసింది. అంతేకాక ముంబాయి విశ్వవిద్యాలయం నుంచి లా కూడా చేసింది. ఈమెకు మనదేశంలో మార్టిగేజ్ రంగంలోను, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగంలోను, అపారపరిజ్ఞానం ఉండటం వలన ఎంతో అనుభవాన్ని గడించింది. అదీకాక ఈమె యూఎస్‌ఏలోని ఉడ్రో విల్సన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్‌లో ప్రిన్స్‌టోన్ విశ్వవిద్యాలయం నుంచి పర్విన్ ఫెలోషిప్ చేసింది. దానితో ఈమె హెచ్‌డిఎఫ్‌సి కార్పొరేషన్‌కి మేనేజింగ్‌డైరెక్టర్‌గా జనవరి 1, 2010 నుంచి సేవలు అందిస్తోంది.
రేణూ సూద్ కర్నాడ్ 1978లో హెచ్‌డిఎఫ్‌సిలో చేరింది. 20 సంవత్సరాల పాటు అనేక స్థాయిల్లో అకుంఠిత సేవలందించింది. ఈమె కృషికి ఫలితంగా 2000 సంవత్సరంలో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవినలంకరించింది. ఈ పదవిలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి 2007 నాటికి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. అలాగే మరింత ప్రజ్ఞాపాటవాలతో మేనేజింగ్ డైరెక్టర్‌గా 2010 జనవరి 1న పదవీ బాధ్యతలు చేపట్టింది. కంపెనీ ఋణ సదుపాయాలు, బ్యాంకు విస్తరింపచేయడం వంటి క్లిష్టమైన బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకుని ఆ దిశగా ఎన్నో విజయాలు సాధించింది. ఈమె ఆధ్వర్యంలో క్రమంగా హెచ్‌డిఎఫ్‌సి రుణ వ్యాపారం సుమారుగా 3.73 ట్రిలియన్స్‌కి ఎదిగింది. అదనంగా మానవ వనరులు, కమ్యూనికేషన్ కార్యకలపాలని కూడా చూసుకుంటూ ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తోంది.
బాధ్యతలు
ఈమె భారతదేశ అన్ని రుణవ్యవహారాల్లో మంచి వ్యూహాత్మకంగా, క్రమబద్దమైన బడ్జెట్ ప్రణాళికలతో ఉత్పత్తిని అభివృద్ధి చేయడం, వాటిని సమంగా పంపిణీ చేయడం మొదలైన అంశాల మీద ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు. హెడీఎఫ్‌సి కార్పొరేషన్ సీనియర్ మేనేజ్‌మెంట్‌లో కూడా సేవలు అందిస్తోంది. భారతదేశంలోని హౌసింగ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడంలో గణనీయమైన కృషి చేసింది. ఈమె భారతదేశ గృహ రుణాల సేవా సంస్థకు కూడా మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 17 ఇతర పరిశ్రమల్లో 15 వివిధ సంస్థలో 154 మంది బోర్డ్ మెంబర్స్‌తో అనుసంధానం కలిగివుందంటే చాలామందికి ఆశ్చర్యం కలగక మానదు. మార్టిగేజ్ సెక్టార్‌లో ఈమెకున్న అపార మేథాసంపత్తి, విజయ పరంపరల కారణంగా అంతర్జాతీయ గృహ రుణాల యూనియన్‌కు సేవలందిస్తూ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సొసైటీకి కూడా డైరెక్టర్‌గా వ్యవహరిచారు.
హెచ్‌డిఎఫ్‌సి గ్రూపు సంస్థలకు, బ్యాంకుతో సహా ప్రాపర్టీ వెంచర్స్‌కు కూడా అధ్యక్షురాలిగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ తన సత్తా చాటుకున్నారు. అదేవిధంగా కర్నాడ్ జాతీయ, అంతర్జాతీయ సంస్థలైనా ఆక్జోనోబుల్ ఇండియా లిమిటెడ్, బోన్చ్ లిమిటెడ్, క్రెడిట్ ఇన్ఫర్‌మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్, ఫీడ్‌బ్యాక్ వెంచర్స్ లిమిటెడ్, ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్, లఫర్‌జీ అండ్ స్పాష్ బిపిఓ సర్వీసెస్ లిమిటెడ్, వేల్యూ అండ్ బడ్జెట్ హౌసింగ్ కార్పొరేషన్ (ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్, ట్రాన్స్‌యూనియన్ ఎల్‌ఎల్‌సి, చికాగో అండ్ హెచ్‌డిఎఫ్‌సి ప్లీ మాల్డీవ్స్ వంటి అనేక సంస్థల బోర్డ్ వ్యవహారాలను కూడా సజావుగా నిర్వహిస్తోంది. ఇన్నిటిని నిర్వహిస్తూనే ఇండియన్ కార్పరేట్, మల్టీనేషనల్ కంపెనీలకు ముఖ్య సలహామండలి సభ్యురాలిగా కూడా తన సేవలందిస్తోంది.
చెరగని చిరునవ్వు
హెచ్‌డిఎఫ్‌సిలో పనిచేసే ప్రతిఒక్క ఉద్యోగికీ ఈమె ఆదర్శంగా నిలుస్తూ, ఎన్నో ఘన విజయాలు సాధించిన రేణూ సూద్ కర్నాడ్ ఎంతో నిరాడంబరంగా చిరునవ్వుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. వినియోగదారుల్ని, తోటి ఉద్యోగుల్నీ ఆదరంగా చూస్తూ అనేక సహాయ సహకారాలు అందిస్తూ తన స్థానాన్ని పదిల పరుచుకున్న వ్యక్తి.
పురస్కారాలు,సత్కారాలు
రేణూ సూద్ కర్నాడ్ తన నిరంతర సేవలకు, అకుంఠిత దీక్షకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకుంది.
- 2012లో అత్యుతమ వ్యాపార మహిళా నాయకురాలిగా, భారతీయ వ్యాపార నాయకురాలిగా అవార్డులు అందుకుంది.
- 2011లో ఇండియా టుడే ప్రకటించిన 25మంది అత్యంత పరపతి కలిగిన మహిళల్లో ఈమెను సత్కరించింది.
- అదే విధంగా 2010లో కూడా ఈమె అత్యంత శక్తివంతమైన మహిళా సిఇఓగా సన్మానింప బడింది.
- ఇదే సంవత్సరం వెర్వీ మాగజైన్ నివేది కలో కూడా 50మంది శక్తివంతమైన మహిళలో ఈమె స్థానం దక్కించుకుంది.
- బిజినెస్ టుడే నిర్వహించిన నివేదికలో భారత దేశ అత్యంత శక్తివంతమైన వ్యాపార మహిళగా వరుసగా 2004. 2006, 2007, 2008, 2009 సంవత్సరాల్లో స్థానం పొంది హ్యాట్రిక్ సాధిం చింది.
- 2008లో యూఎస్‌కి చెందిన బ్యాకర్స్ మాగజైన్‌లో కూడా 25మంది నాన్‌బ్యాంకింగ్ ఇన్ ఫైనాన్స్ రంగంలో ఈమె కూడా స్థానం దక్కింది.
- అదే విధంగా బిజినెస్ మరియు ఎకానమీ మేగజైన్ నివేదికలో కూడా 2007- 08 సంవత్సరానికి బెస్ట్ ఉమెన్ కార్పొరేట్ లీడర్‌గా పురస్కారాన్ని అందుకుంది.
- 2007లోనే ఎఫ్‌ఐసిసిఐ మహిళా ఆర్గనైజేషన్ ఉమెన్ అచీవర్ అవార్డ్‌తో సత్కరించారు.
- 2006లో వాల్‌స్ట్రీట్ ఏసియా 10 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఈమెను కూడా చేర్చారు.
మూలం : సూర్య దినపత్రిక