మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, డిగ్రీ వరకూ చదువుకున్న ఆస్మా అనారోగ్యంతో బాధపడే అలాంటి వారికి ఉపయోగపడే మంచి మాటలూ, వైద్య సలహాలూ అందించాలనుకుంది. తెలిసీతెలియక ఆ వ్యాధి బారిన ఎవరూ పడకుండా నిపుణుల సాయం అందించాలనుకుంది. ఆ వ్యాధితో బాధపడే వారి దుస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టాలనుకుంది. కానీ అది తన ఒక్కదాని వల్ల అయ్యే పనేనా? ఇలా ఒకటీ రెండూ కాదు... ఏడేళ్ల పాటు ఆలోచించింది. చివరికి ఓ పత్రిక ప్రారంభించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనుకుంది. అందుకోసం నాలుగు నెలల పాటు గ్రామాల్లో తిరిగి, వైద్యుల్ని కలిసి, బాధితులతో మాట్లాడి... ఓ అవగాహనకు వచ్చింది. అందరూ పత్రిక తీసుకొస్తే మంచిది అన్నారు.
హెచ్‌ఐవీకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. డబ్బులు పెట్టి కొనడానికి మాత్రం ఎవరూ మొగ్గు చూపలేదు. ఇంట్లో వాళ్లూ, తెలిసిన వాళ్లూ 'ఇక ఆ ప్రయత్నం ఆపెయ్' అన్నారు. ఆస్మా ఒప్పుకోలేదు. ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయని మంచి ఆలోచనని పక్కన పెట్టేస్తామా అని నిలదీసింది. పత్రికను ఉచితంగానే పంచాలని నిర్ణయించుకుంది. ఆలోచన సరే... కానీ అది ఖర్చుతో కూడుకున్న పని. ఏం చేయాలో పాలుపోలేదు. తమిళనాడులోని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీని సంప్రదించి తన ఆలోచనను చెప్పింది. 'మంచి పని చేస్తానంటే... మేం మద్దతిస్తాం' అంటూ అక్కడి సభ్యులు ముందుకొచ్చారు. ఆర్నెల్ల పాటు ప్రకటనలు ఇచ్చి సహకరిస్తామని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఆమె స్నేహితులు 'నువ్వేం దిగులుపడకు, నువ్వు నిలదొక్కుకునేదాకా మేం డబ్బు సాయం చేస్తాం' అన్నారు. అలా 2008 డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ డే నాడు 'పాజిటివ్+' పక్ష పత్రిక మార్కెట్లోకి వచ్చింది.
ఎనిమిది పేజీలు... ఐదు వేల కాపీలు. పేపర్లు అమ్మే వాళ్లతో మాట్లాడి పత్రికను రైళ్లలో పంచమని కోరింది. స్టేషనరీ యజమానులతో మాట్లాడి పుస్తకాలు కొన్నవారికి ఉచితంగా ఇవ్వమని చెప్పింది. రెండు నెలలు గడిచాయి. ఉచితంగా ఇచ్చినా ఎవరూ చదవట్లేదని తెలిసి బాధపడింది. అప్పటికే సుమారు లక్ష రూపాయల దాకా ఖర్చయ్యాయి. ఎక్కడ లోపం ఉందో తెలుసుకునేందుకు చాలామందిని కలిసి మాట్లాడింది. 'ఎయిడ్స్ బాధితుల కష్టాలే ఇస్తే ఏం చదువుతాం' అన్న మాటలు ఆలోచనలో పడేశాయి. వెంటనే తగిన మార్పులు చేసుకుంది. హెచ్‌ఐవీ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి... రోగనిరోధక శక్తిని పెంచే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి... వంటి విషయాలను నిపుణులతో చెప్పించింది. ఎయిడ్స్ బారినపడ్డా, పలు రంగాల్లో విజయాలు సాధించిన వారి స్ఫూర్తి కథనాల సంఖ్యను పెంచుతూ వచ్చింది. ఈ ప్రయత్నం ఫలించింది. కాలేజీ విద్యార్థులు బాగా ఆదరించారు. క్రమంగా పాఠకుల సంఖ్య పెరిగింది.
అది చూసి, చిన్న షాపుల యజమానులు ప్రకటనలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరింత ఉత్సాహంతో సినిమా ప్రముఖులూ, రాజకీయ నాయకుల అభిప్రాయాలనూ దాన్లో చేర్చింది. ఎయిడ్స్ బాధితుల కోసం ఉన్న హెల్ప్‌లైన్లూ స్వచ్ఛంద సంస్థలూ, బ్లడ్ బ్యాంకుల వివరాలూ, అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే ఆసుపత్రులూ కౌన్సెలింగ్ కేంద్రాల సమాచారం ఇవ్వడం ప్రారంభించింది. ఇవన్నీ పత్రిక ఆదరణనూ, ప్రకటనల రాబడినీ పెంచాయి. దాంతో ఆస్మా కష్టాలు కొంతవరకూ తీరాయి. తక్కువ ఖర్చుతో పత్రికను తీసుకొచ్చేందుకు ఆస్మా చాలా కష్టపడుతుంది. తనతో పాటూ ఇద్దరు స్నేహితులు బయట తిరిగి సమాచారం సేకరించుకుని వస్తారు. తను ఇంట్లో పనులు చేసుకుంటూనే ఆంగ్లం, తమిళంలో కథనాలు రాసుకుంటుంది. స్వయంగా పేజీలు డిజైన్ చేసుకుంటుంది. రోజుకి పదిహేను గంటలు కష్టపడుతూ సర్క్యులేషన్‌ను యాభై వేల కాపీలకు చేర్చిన ఆస్మాను ఎవరయినా ప్రశంసిస్తే 'ఆ సంఖ్యను చూసి నేను ఆనందించడం లేదు. సమాజంలో ఏ కాస్తయినా మార్పు తీసుకురాగలిగానా అనే ఆలోచిస్తున్నా' అంటుంది.