వ్యక్తిగత జీవితం:
హీనా రబ్బానీ ఖర్ 1977 జనవరి 19న పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జన్మించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి అయిన యువ, తొలి మహిళ హీనా రబ్బానీ. ఈమె పాకిస్థాన్ ప్రముఖ రాజకీయవేత్త ఇబ్రహీం అర్కమ్ కుమార్తె.
వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన హీనా మూలాలు పంజాబ్ రాష్ట్రంలోని ముజఫరాహ్ జిల్లా ఖర్ ఘర్బీ గ్రామంలో ఉన్నాయి. 1999లో లాహోర్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ(హానర్స్) గ్రాడ్యుయేషన్ పొందారు. 2001లో మసాచూసెట్స్ యూనివర్శిటీలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఫిరోజ్ గుల్జార్‌ను వివాహమాడిన ఆమెకు ఇద్దరు పిల్లలు. లాహోర్‌లోని లాహోర్ పోలో మైదానంలో పేరొందిన ఉన్నతస్థాయి రెస్టారెంట్ పోలో లౌంజికి సహ భాగస్వామి.
రాజకీయ జీవితం:
హీనా రబ్బానీ ఖర్ పాకిస్థాన్ ముస్లీం లీగ్(పీఎంఎల్-క్యూ) తరపున 2002లో జాతీయ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో పీఎంఎల్-క్యూ ఆమెకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లో చేరి 84 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
యూసఫ్ రజా గిలానీ క్యాబినేట్‌లో హీనా ఆర్థిక వ్యవహారాలు, గణాంకాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009 జూన్ 13న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
విదేశాంగ మంత్రి:
ఆఫ్ఘన్-పాక్ ట్రాన్సిట్ ట్రేడ్ అగ్రిమెంట్‌పై ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రితో కలిసి హీనా రబ్బానీ సంతకం చేశారు. ప్రధాన మంత్రి యూసఫ్ రజా గిలానీ చేసిన క్యాబినేట్ పునర్‌వ్యవస్థీకరణలో 2011 ఫిబ్రవరి 11న విదేశాంగ సహాయ మంత్రిగా నియమించబడ్డారు.
షా మొహమ్మద్ ఖురేషి విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో 2011 ఫిబ్రవరి 13 వరకు తాత్కాలికంగా విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. జులై 19న అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీచే అధికారికంగా విదేశాంగ మంత్రిగా ఎంపికైన ఆమె జూలై 20న బాధ్యతలు స్వీకరించారు.
మీడియాలో:
దేశ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలుత ఆఫ్ఘానిస్థాన్‌లో పర్యటించిన ఆమె అనంతరం శాంతి చర్చలకు గానూ భారత్‌కు వచ్చారు. చర్చల కంటే హీనా అందం, ఫ్యాషన్ గురించే జాతీయ మీడియా ఎక్కువగా ప్రస్తావించడంతో భారత పర్యటన సందర్భంగా సాధారణ ప్రజలను సైతం ఆమె ఆకర్షించారు.
వివాదం-విమర్శలు:
తొలిసారి విదేశాంగ మంత్రిగా భారత్ వచ్చిన రబ్బానీ ఖర్ భారత ప్రభుత్వ ప్రతినిధులను కలవక ముందే కాశ్మీర్ వేర్పాటువాద నాయకులతో సమావేశమై వివాదాన్ని సృష్టించారు. దీంతో ఆమె ప్రతిపక్ష బీజేపీతో పాటు భారత మీడియా నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. వేర్పాటువాదులతో ఖర్ భేటీని ప్రోటోకాల్ ఉల్లంఘనగా పేర్కొన్న బీజేపీ ఈ అంశంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.