బీదరికం నుంచి ప్రొఫెసర్దాకా
పంజాబ్ రాష్ట్రానికి చెందిన దలీప్ కౌర్ ఉన్నతవిద్యను అభ్యసించారు. దలీప్ కౌర్ తివానా భారతీయ పాఠకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన పంజాబీ రచయిత్రి. 'నవ్వు చివర విషాదం, ఆనందం అంచున దుర్భర శోకం, విషాద వ్యంగ్య వైభవం ఆమె రచనలకు గల లక్షణాలు!' కథా రచయిత్రిగా ఆమెకు ఎంత గొప్ప పేరుందో, నవలా రచయిత్రిగా అంతే గుర్తింపు ఉంది. ఉద్యోగరీత్యా పంజాబు విశ్వవిద్యాలయంలో పంజాబీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయితే రచయిత్రిగా తన రచనా పటిమతో సాహితీ ప్రియులను ఉర్రూతలూగించి సంపాదించిన పేరు ప్రతిష్ఠలే విలువైనవిగా ఆమె భావిస్తారు. ఆమెకు గ్రామాలన్నా, గ్రామీణులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఆమె కథల్లో, నవలల్లో అమాయక జనం, అట్టడుగు జనం ఎక్కువగా కనిపిస్తారు. వారి ఆశ, నిరాశల్నే ఆమె ఎక్కువగా చిత్రించారు.
దలీప్ కౌర్ తివానా 1935లో పంజాబ్‌లోని రబ్బో అనే కుగ్రామంలో జన్మించారు. పాటియాలా పట్టణంలోని పెద్దమ్మ ఇంట పెరిగారు. ఆమెకు సంతానం లేకపోవడంతో దలీప్ కౌర్‌ను పసితనంలోనే దత్తత తీసుకున్నారు. అలా బీదరికంలో పుట్టిన దలీప్‌కౌర్ భాగ్యవంతురాలైన పెద్దమ్మ ఇంట పెరిగారు. ఆ తర్వాత రచయిత్రిగా సమాజంలోని వర్గాల మధ్య తారతమ్యాలను గుర్తించగలిగారు. ఉన్నత కుటుంబంలో అల్లారుముద్దుగా పెరుగుతూ, ఉన్నతవిద్యనభ్యసించారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలయ్యారు. క్రమక్రమంగా డీన్, యూనివర్సిటీ నేషనల్ ప్రొఫెసర్ వంటి ఉన్నతస్థాయి పదవుల్ని కూడా చేపట్టారు.
ఒడుదుడుకుల జీవన పయనంలో నిర్భయంగా...
దలీప్ కౌర్ వైవాహిక జీవితం ఆశించినంత సంతోషంగా సాగలేదు. సంసార నావ ఎన్నో ఆటుపోట్లకు గురైంది. అయినా ఆమె అధైర్యపడలేదు. ఓటమిని నిబ్బరంగా ఎదుర్కొంటూ, విద్యారంగంలోనూ, సాహితీ రంగంలోనూ నిరంతర కృషి కొనసాగించారు. సాహిత్య అకాడమీ పురస్కారంతో సహా పలు అవార్డులను ఆమె కైవసం చేసుకున్నారు.
మలుపు తిప్పిన మేగజైన్ కథ
ఇంటాబయటా ఎక్కడా సాహిత్య వాతావరణం లేని రోజుల్లో కళాశాలలోని ఓ అధ్యాపకురాలు ఈమెను కథా రచన వైపు మళ్లించారు. కాలేజీ మేగజైనుకు ఏదో ఒకటి రాసుకురమ్మని ప్రోత్సహించారు. దాంతో దలీప్‌కౌర్ ఓ చిన్న కథ రాసుకుపోయారు. అది అచ్చయిన తర్వాత కళాశాల ప్రిన్స్‌పాల్ దలీప్ కౌర్‌ను ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. దీంతో ఆమెకు తన రచనా శక్తిపట్ల విశ్వాసం పెరిగింది. ఆ రకంగా ఆమె ఆ తర్వాత రెండు వందల కథలు రాయగలిగారు. ఎనిమిది సంపుటాలు ప్రచురించగలిగారు. ప్రముఖ పంజాబీ కథా రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగారు. 'మేరీసారీ కహానియా పేరుతో ఒక సర్ప కథా సంకలనం కూడా వెలువరించారు. పంజాబీ కథానికా రంగంలో శైలీ పరంగా వచ్చిన మార్పులన్నీ దలీప్‌కౌర్ కథల్లో స్పష్టంగా చూడొచ్చు.
సంఘర్షణల చుట్టే కథలు
సర్వసాధారణంగా దలీప్ కౌర్ స్వీకరించిన ఇతివృత్తాలన్నీ మహిళల జీవితానికి సంబంధించినవే. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ బాంధవ్యాలు సంఘర్షణల చుట్టూ తిరిగేవే. ఒక్కోసారి ఇంటి బయటే కాకుండా ఇంటి లోపల కూడా ఇద్దరు ముగ్గురు పురుషుల వాంఛాపూరిత దృక్కులను స్త్రీలు ఎదుర్కోవలసి వస్తుందని ఆమె చెబుతారు. చదువులూ ఉద్యోగాల నిమిత్తం మహిళలు బయట అడుగు పెడుతుండటంతో సమాజంలో వారిపై ఎందరెందరో కళ్లో పడుతుంటాయని (ఉదాహరణకు ఎక్ ఖరాబ్ ఔరత్ కథ) ఆమె కొన్ని కథల్లో హెచ్చరించారు. ఒక్కోసారి స్త్రీ ఎన్నోరకాల ఒత్తిళ్లకు గురౌతుంటుంది. తనను తాను రక్షించుకోలేకపోతే ఆత్మహత్యే ఆమెకు పరిష్కారమవుతుంది. 'మనమొక సంధియుగంలో ప్రయాణిస్తున్నాం. సంప్రదాయానికి అభ్యుదయానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఈ రెండింట్లో దేన్నీ పూర్తిగా వదిలించుకోలేక, దేన్నీ పూర్తిగా స్వీకరించలేక తల్లడిల్లుతున్నాం' అంటారు దలీప్ కౌర్. మార్పు చాలా మందకొడిగా వస్తోందని, అయితే వచ్చిన మార్పు తాలూకు మంచి అవకాశాల్ని, స్వేచ్ఛని పురుషులు చేజిక్కించుకుంటూ, సంస్కృతీ సంప్రదాయాల పేరుతో స్త్రీలను ఇంకా తొక్కి పెడుతున్నారని, కొన్నిసార్లు స్త్రీలే బయటపడలేక తమని తాము ఒక చట్రంలో బిగించుకుని జీవనం సాగిస్తున్నారనీ వాపోతారు దలీప్‌కౌర్.
పురుషులపై ఘాటు విమర్శల కథలు
కలిసి పనిచేసే మహిళలు తమతో స్నేహంగా ఉండాలని పురుషులు కోరుతుంటారు. కానీ తమ భార్యలు ఇతర పురుషులతో స్నేహంగా ఉంటే భరించలేరు. ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా పురుషుల ఆలోచనా ధోరణిలో రావాల్సినంత మార్పు రాలేదు అని దలీప్‌కౌర్ తన కథలలో వెల్లడించారు. 'గోధూలి కథలో కథానాయిక వేసేకొన్ని ప్రశ్నల్ని పరిశీలిస్తే రచయిత్రి ఆలోచనలు సృష్టమౌతాయి. 'ఒక ఉత్తరం రాసుకునే స్వాతంత్య్రం కూడా నాకు లేదా?' 'ఇతరులెవరో క్షణకాలం నా ఆలోచనల్లోకి వచ్చినంత మాత్రాన నేను అపవిత్రమైపోతానా?' 'మీరు గీసిన లక్షణరేఖ దాటి అడుగు వేసినంత మాత్రాన నేను శీలం చెడినదాన్నా?' అంటూ ప్రశ్నించే రచనలు స్త్రీలో చైతన్యానికి పురిగొల్పాయి. మామూలు కుటుంబ సంబంధమైన కథలు రాస్తూనే, మనో వైజ్ఞానిక దిశానిర్దేశం చేసిన లేఖిని ఆమెది (ఎక్ అదర్ రాత్, డే డ్రీమింగ్ వంటి కథలు) భారతీయ మహిళ ఈ యాభై యేళ్ల కాలంలో పురోగమించిన తీరుతెన్నుల్ని దలీప్‌కౌర్ సాహిత్యీకరించారు. 'వితిన్ వితవుట్' అనే ఆంగ్ల శీర్షికతో రాసిన కథలో బుద్ధుడు, యశోధర, రాహుల్‌ల జీవనయానంలోంచి భారతీయ మూలాల్ని వెతికి చూపించారు. సులభంగా, వేగంగా సాగే ఆమె శైలి, పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆమె కథలన్నీ ప్రథమ పురుషలో సాగుతాయి గనక, పాఠకులు ఆమె ప్రవాహంలో కొట్టుకుపోయి తన్మయం చెందుతారు. తొలిదశలో కథరచనకు పూనుకున్న ఈ రచయిత్రి మలిదశలో నవలా రచన చేపట్టారు. సమాజ చిత్రణకు, పాత్రల మనస్తత్వ విశ్లేషణకు నవల ఎక్కువ అవకాశం ఇస్తుంది గనుక, ఆమె ఆ ప్రక్రియ చేపట్టారు. నవలా రచయిత్రిగానూ ఆమెకు గొప్ప పేరుంది. 'నంగే పేరన్ ద సఫర్' అనే శీర్షికతో ఆత్మకథను కూడా రాసుకున్నారు.
ఆత్మకథలో...
దలీప్‌కౌర్ రచనాశైలిని అర్థం చేసుకోవడానికి ఆమె ఆత్మకథలోని ఒక భాగాన్ని పరిశీలిద్దాం. 'చెప్పులు లేని కాళ్లతో ప్రయాణం' అనే శీర్షికతో రాసుకున్న ఆత్మకథలో పెండ్లికి ముందు ఆడ పెండ్లివారు పడే యాతనంతా రచయిత్రి ఎలా కళ్లకు కట్టినట్టు చిత్రించారో గమనిస్తే...'అమ్మమ్మ చెప్తుంది. మనం మరికొన్ని నగలు చేయించారు. మరి కొన్ని బట్టలు కుట్టించాలి. ఏయే ఎంబ్రాయిడరీ చేయించాలో కూడా నిర్ణయించారు. బూట్లది పెద్ద సమస్యే కాదు. పట్నం వెళ్లినప్పుడు తెచ్చుకోవచ్చు. అయితే అల్లిక చేసిన అందమైన బూట్లు కావాలంటే మాత్రం కాస్తా ఓపిక పట్టాలి. ముందే ఆర్డరివ్వడం మంచిది. సింగార్దాస్ (మేకప్ డబ్బా), అత్తరులు, సిల్కు చేతి రుమాళ్లు, వెండి కాటుకపెట్టె, మంచి లెదర్ సూట్‌కేసు అన్నీ కొన్ని పెట్టుకోవాలి' అంటూ రచయిత్రి దలీప్‌కౌర్ తన తొలి యవ్వనదశలో పెండ్లి గురించి ఊహించుకుంటూ గడిపిన సుమధుర క్షణాల గురించి ఆత్మకథలో ఎంతో ఉల్లాసంగా రాసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లోవారి హడావుడి ఎలా ఉండిందో, ఎవరెవరు ఎలా వరసలు కలుపుకునేవారో చాలా చక్కగా వర్ణించారు.
మాటలకు తక్కువ, భావం ఎక్కువ
ఇందులో చివరకు జరిగేదేమిటంటే మగపెళ్లివారు పెళ్లి తేదీలు మార్చి మార్చి తమ ఆధిపత్యాన్ని ప్రకటించారు. ఆడపెళ్లి వాళ్లు ఎన్నో రకాలుగా సర్దుకుపోతారు. విషయం చాలా కాలం సాగదీసి, చివరకు ఆ పెళ్లి తమకు ఇష్టం లేదని తేలికగా చెప్పేస్తారు. అందం తక్కువా? గుణం తక్కువా? తనని వాళ్లు ఎందుకు కాదన్నారు అని పెళ్లికూతురు కుమిలిపోతుంది. ఖాయమైన పెళ్లి ఆగిపోవడంతో ఇక ఈ పిల్ల పెళ్లి ఎలా జరుగుతుందీ అని పిల్ల అమ్మమ్మ భోరున ఏడుస్తుంది. తక్కువ మాటలతో, లోతైన భావాల్ని వెలిబుచ్చుతూ కవితాత్మకంగా కథ రాయడం తివానాకు చాలా బాగా చేతనవును. అందుకే దేవేంద్ర సత్యార్థి, అజీత్ కౌర్, గుర్ దయాళ్‌సింగ్, మోహన్ భండార్ వంటి ప్రఖ్యాత పంజాబీ కథా రచయిత్రుల సరసన దలీప్‌కౌర్ తివానా తన పేరు సుస్థిరం చేసుకున్నారు. తన కథల్ని తానే హిందీలోకి అనువదించుకున్న దలీప్‌కౌర్ 'అతీత్ వర్తమాన్' (గడిచిపోయిన స్వయంగా ఈ గ్రంథ రచయితకు సాదరంగా పంపించారు.
అవార్డులు
'కథా కహూ ఊర్వశి' నవలకు 2001లో ప్రతిష్ఠాత్మకమైన సరస్వతీ సమ్మాన్ స్వీకరించారు. శిరోమణి సాహిత్యకార్, దలివార్, పంజాబ్ అకాడమీ వంటి అవార్డులతో పాటు ఐదు జాతీయ పురస్కారాలతోపాటు రెండు అంతర్జాతీయ అవార్డులు కూడా స్వంతం చేసుకున్నారు.
మూలం : వార్త దినపత్రిక