నల్లగా ఉన్నానని, లావుగా, పొట్టిగా ఉన్నానని, ఎత్తు పళ్లు ఉన్నా యని, ముఖం నిండా మొటిమలున్నాయని వేదన చెందుతూ కుమిలి పోతూ, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, జీవితాన్ని అంధకారం చేసుకుం టున్న వారు కొందరైతే, ఆత్మహత్యలకు పాల్పడుతున్న అమ్మాయిలూ ఉన్నారు. ఇలాంటి వారికి హెలెన్‌కెల్లర్ ఓ స్ఫూర్తి ధీరవనిత. 1880వ సంవత్సరం జూన్ 27వ తేదీన తుస్కిబియాలోని అలబామా రాష్ట్రంలో జన్మించారు. ఈమె పూర్తిపేరు హెలెన్ ఆడమ్స్ కెల్లర్. తండ్రి ఆర్థర్ కెల్లర్. అతడు మిలటరీలో కెప్టెన్‌గా పని చేసేవాడు. ఆమె తల్లి కేట్ ఆడమ్స్. హెలెన్‌కెల్లర్ పుట్టుకతోనే అంధురాలు కాదు కానీ ఆమె 19నెలల వయసులో అనుకోని వ్యాధితో ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. దీని ప్రభావంతో ఆమె శాశ్వత అంధురాలిగాను, వినడం, మాట్లాడే శక్తిని కోల్పోయింది. తర్వాత సుదీర్ఘశిక్షణ తర్వాత హెలెన్‌కెల్లర్ మాట్లాడేశక్తిని పొందినా, వినికిడి లోపంతోపాటు అంధురాలిగా మిగిలిపోయారు.
గ్రాహంబెల్ సలహాతో ఉన్నత శిఖరం
'తమ బిడ్డ జీవితాంతం అవయవాలలోపంతో కుమిలిపోవాల్సిందేనా, అంధకార జీవితాన్ని వెలుగులతో నింపేది ఎలా?' అంటూ ఇతరులతో చెప్పుకుని కుమిలిపోతున్న తల్లిదండ్రులకు ఒక మహనీయుడైన వ్యక్తి సలహాతో కొత్త జీవితానికి స్ఫూర్తి అయ్యింది. వాషింగ్టన్‌లోని అలెగ్జాండర్ గ్రాహంబెల్ వద్దకు తీసుకెళ్లమని తెలిసినవారు ఒక సలహానిచ్చారు. టెలిఫోన్ ఆవిష్కర్త అయిన గ్రాహంబెల్ వద్దకు హెలెన్‌కెల్లర్‌ను తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు. హెలెన్‌ను పరీక్షించిన గ్రాహంబెల్ 'ఈమెలో అపారమైన తెలివితేటలున్నాయని, సరైన విధానంలో ప్రోత్సహిస్తే, చక్కగా తన జీవితాన్ని వృద్ధి చేసుకుంటుందని, అలాగే నైపుణ్యం గల డాక్టర్లకు చూపిస్తే మాట్లాడేశక్తిని తిరిగి పొందగలదని' చెప్పాడు. 'ఒక మంచి టీచర్ చూసి, ఆమెకు సహాయంగా ఉంచమని' కూడా గ్రాహం బెల్ చెప్పాడు. 'పెర్మిన్ ఇన్‌స్టిట్యూట్'లో ఉన్న అన్నే సలీవాన్ అనే ఉపాధ్యాయురాలిని తీసుకొచ్చి హెలెన్‌కు టీచర్‌గా ఉంచారు. ఈ టీచర్ చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అంధుల సేవకు తన జీవితాన్ని అంకితం చేసింది. ఈ టీచరే హెలెన్‌కెల్లర్ జీవితానికి ఓ ఆశాకిరణంగా మారింది. సలీవాన్ హెలెన్‌కు ఒక ఆటబొమ్మను చేతిలో పెట్టి 'డాల్' అని రాశారు. సూక్ష్మగ్రాహి అయిన కెల్లర్ వెంటనే తిరిగి 'డాల్' అని రాశారు. హెలెన్‌కెల్లర్ నేర్చుకున్న మొదటి పాఠం డాల్. మరోసారి ఒక నీటిపంపు వద్దకు తీసుకెళ్లి ధారగా వస్తున్న నీటిని చూపించి 'వాటర్' అని చెప్పింది. ఇలా మొదలైన హెలెన్‌కెల్లర్ విద్య అంచెలంచెలుగా వేగంగా నేర్చుకోసాగారు. హెలెన్‌కెల్లర్ అచంచలమైన ఆత్మవిశ్వాసం, నిబ్బరంతో టీచర్ చెప్పే విషయాలను అర్థం చేసుకుంటూ, తన కెరీర్‌ను వృద్ధి చేసుకోసాగారు. ఇదే పరిస్థితులలో అంధుల జీవితంలో ఊహించని వెలుగును నింపిన వ్యక్తి 'లూయీ బ్రెయిలీ' ఆవిష్కరించిన 'బ్రెయిలీ లిపి' హెలెన్‌కెల్లర్‌కు కాస్త కలిసి వచ్చినా, ఆ బ్రెయిలీ పద్ధతిలో వినికిడి శక్తి, మాట్లాడలేని ఆమెకు నేర్పడం కష్టమైంది. అయినా ఆమె టీచర్ సలీవాన్ ఓర్పుతో నేర్పించసాగింది. ఇలా మెల్లగా పుస్తకాలను చదవడం ఆరంభించారు హెలెన్..
తొలి డిగ్రీ రికార్డు
1900వ సంవత్సరంలో హెలెన్ కాలేజీలో చేరి, డిగ్రీని పొందిన తొలి అంధ వనితగా రికార్డుకెక్కారు. నిత్యం హెలెన్‌కు సలీవాన్ తోడుగా ఉంటూ అభ్యుదయ, మనోధైర్యం, సోషలిస్టు భావాలను నూరిపోశారు. హెలెన్ డిగ్రీపట్టాతో తృప్తి పొందలేదు. అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు ఎన్నో గ్రంథాలను చదవడం ఆరంభించారు. తండ్రి మరణంతో రచనల వైపు దృష్టిని సారించారు హెలెన్‌కెల్లర్. 'ద స్టోరీ ఆఫ్ మై లైఫ్' ఆమె రాసిన మొదటి పుస్తకం. తన 22 సంవత్సరాల వయసులోనే ఈ పుస్తకం రాసిన, అంధురాలిగా రికార్డుకెక్కారు. అందుకే ఈ పుస్తకం పాపులర్ అయ్యింది.
భాషల్లో దిట్ట
హెలెన్‌కెల్లర్ తనకున్న అంధత్వ వైకల్యంతో జీవితం వృధాగా చేసుకో కూడదని దృఢసంకల్పంతో కష్టపడడం అలవర్చుకున్నారు. జర్మనీ, ఇటాలియన్, ఫ్రెంచ్ వంటి భాషల్ని నేర్చుకున్నారు. హెలెన్‌కెల్లర్ కృషికి మెచ్చి టెంపుల్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, స్కాట్లాండ్‌లోని గ్లాస్కో, జర్మనీలోని బెర్లిన్, భారత్‌లోని ఢిల్లీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ఇచ్చాయి.
మనసంతా సామాజిక సేవే
హెలెన్‌కెల్లర్‌కు సామాజిక సేవ చేయాలనే ఆకాంక్ష ఉండేది. అందుకు తనకున్న వైకల్యం అడ్డుకారాదని తపించారు. తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు 1914 నుంచి పలుదేశాలను సందర్శించడం మొదలుపెట్టారు. అంతేకాదు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో క్షతగాత్రులైన సైనికుల పునరావాస కేంద్రాల ఏర్పాటుకు హెలెన్‌కెల్లర్ విశేషంగా కృషి చేశారు. అంతేకాదు ఆయా యుద్ధాల్లో మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అంధత్వం ఆటంకం కలిగించినా, చెవిటితనం నిరాశ పర్చినా తనలో ఉన్న పట్టుదలను నిర్వీర్యం చేసుకోలేదు హెలెన్‌కెల్లర్. వైకల్యం ఎవరికైనా శాపం కారాదు, దాన్ని ఒక సవాల్‌గా తీసుకోవాలని బోధించారు. వికలాంగుల్లో ప్రేరణ కల్పించేందుకు హెలెన్‌కెల్లర్ దాదాపు 39 దేశాలను పర్యటించారంటే వారిపట్ల ఆమెకున్న ప్రేమ, అభిమానానికి నిదర్శనం. వికలాంగులతో పాటు బాలలు, మహిళలు, కార్మిక వర్గం హక్కులు, సంక్షేమంపై ఉపన్యాసాలు, అనేక పుస్తకాలు, వ్యాసాలు రాసారు. ఆమె రాసిన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ముద్రితమయ్యాయి. అవన్నీ అంధులకు, మూగచెవిటి వారికి ఆత్మీయ పుస్తక నేస్తాలుగా అయ్యాయి. ఇంతటితో ఆమె సేవ ఆగిపోలేదు. అంధుల శ్రేయస్సు కోసం దేశవిదేశాలు తిరిగి కోట్ల డాలర్లను సేకరించి, వారి జీవితాల్లో వెలుగును నింపే సంక్షేమకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విదేశీయులు సైతం ఆమెను తమ దేశానికి ఆహ్వానించి అంధుల సేవాకార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్‌కు ఆమెను ఆహ్వానించి అంధుల సహాయార్థం విరాళం ఇచ్చారట!
ఆధ్యాత్మిక చింతనలో
హెలెన్‌కు సలీవాన్ యేసుక్రీస్తును గురించి బోధించసాగారు. అంతే కాదు బైబిల్‌కు సంబంధించిన పలు పుస్తకాలను హెలెన్‌కు అందించారు సలీవాన్. ఈ పుస్తకాలను చదివి,ప్రభువు భక్తురాలిగా మారిన హెలెన్ 1927లో 'మై రెలిజన్' అనే పుస్తకాన్ని రాశారు. ఇదే పుస్తకం 1994లో 'లైట్ ఇన్ మై డార్క్‌నెస్' పుస్తకంగా మారి, మలిప్రచురణగా ముద్రించబడింది. 'దేవుడి బుద్ధిజ్ఞానం, ప్రేమ అనంతమైనవని' వర్ణిస్తూ పలు వ్యాసాలను రాశారు.
పట్టుదలతో మాట్లాడం నేర్చుకుంది
ఒకరోజు 'నార్వేలో ఒక మూగమహిళ మాట్లాడటం నేర్చుకోగలిగింది' అనే వార్తను చదివిన హెలెన్ కెల్లర్ తానూ మాట్లాడాలని ఎంతో శ్రమించారు. నార్వే మహిళ మూగదైనా, ఆమెకు చూపు చక్కగా ఉందనీ, ఇతరులు మాట్లాడేటప్పుడు పెదవుల కదలికలను అనుకరించి రోజూ సాధన చేసి సాధించిందని, నీకు చూపు లేదు కనుక ఇది సాధ్యం కాదని టీచర్ ఎంత వారించినా సమాధానపడలేదు. మాట్లాడాలన్న కోరికతో మాట్లాడటం నేర్పే టీచర్‌ను నియమించుకుని, ఆమె మాట్లాడుతుంటే ఆమె ముఖం, పెదవులు, నాలుక ఏ విధంగా కదులుతున్నాయో, తన వేళ్ళతో తడిమి తెలుసుకుని, ఆమెని అనుకరించి నిర్విరామంగా సాధన చేశారు. ఇలా సాధన చేయడం వల్ల ఆమె స్వరపేటికలో కొద్దిగా మార్పువచ్చి, మాట్లాడసాగారు. తర్వాత హెలెన్ పలు కాలేజీల్లో గెస్ట్ టీచింగ్‌గా వెళ్లి, తన ప్రసంగంతో అనేకులను ఆకట్టుకోగల్గారు. 1913లో నేషనల్ లైబ్రరీ ఫర్ బ్లైండ్‌కు అధ్యక్షురాలిగా ఎంపికై బ్రెయిలీ భాషలో అసంఖ్యాకమైన పుస్తకాలు అచ్చు వేయించింది.
అవార్డులు
అమెరికా ప్రభుత్వం హెలెన్ ఎనభయ్యో సంవత్సరంలో ఘనంగా సత్కరించి అంతర్జాతీయ అవార్డు బహూకరించింది. 1964లో అమెరికా అధ్యక్షుడు జాన్సన్ హెలెన్‌కెల్లర్‌ను తమ దేశ ముద్దుబిడ్డగా ప్రకటించి ''ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్" అత్యున్నత పురస్కారం అందించారు. వీటితో పాటు ఇంకా అనేక అవార్డులు అందుకున్నారు. వికలాంగుల జీవితాల్లో వెలుగును ప్రసాదించడం కోసం 80 సంవత్సరాల వయస్సులోనూ రోజుకు 10 గంటలు సామాజికాంశాల్లో పాల్గొనేవారు. వికలాంగులకు ఆమె చేసిన సేవకు గుర్తింపుగా ప్రపంచ దేశాలు విద్యా సంస్థలకు ఆమె పేరు పెట్టాయి. వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరు పొందిన హెలెన్‌కెల్లర్ ఎందరికో స్ఫూర్తినిచ్చారు. జార్జి బెర్నార్డ్ షా, థామస్ అల్వా ఎడిసన్, ఐన్‌స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్, చార్లీచాప్లిన్ మొదలైన ప్రముఖుల మీద తన ప్రభావం చూపించిన ఈమె మహోన్నత వ్యక్తిగా నిలిచారు. ఇలా 19వ శతాబ్దంలో నెపోలియన్ తర్వాత రెండవ వ్యక్తిగా, శక్తివంతమైన మహిళగా హెలెన్‌కెల్లర్ నిలిచారు. 1968లో తన 87వ ఏటా నిద్రలోనే తుదిశ్వాసను విడిచారు.
మూలం : వార్త దినపత్రిక