తన కల సాకారం కావడం గురించి వెంకటలక్ష్మి మాట్లాడుతూ, న్యాయవాది కావడం అనేది తన చిరకాల వాంఛ అని చెబుతోంది. నేటి రోజుల్లో సాధారణ ప్రజానీకానికి న్యాయం దొరకడం అంత సులువైన విషయం కాదని, అందుకే తాను న్యాయవాది కావాలని కోరుకున్నట్లు చెబుతోంది.
వెంకటలక్ష్మి నిజానికి చాలా ధైర్యవంతురాలు. హైస్కూలులో చదివే రోజుల్లోనే కర్నాటక ప్రభుత్వం నుంచి సాహస బాలిక అవార్డును దక్కించుకుంది. వేగంగా వస్తున్న బస్సు కింద సహచర విద్యార్థిని పడబోతుంటే ప్రాణాలకు తెగించి ఆమెని రక్షించడంతో ఈ అవార్డు వరించింది. అటువంటి ధైర్యవంతురాలైన వెంకటలక్ష్మిని కొనే్నళ్ల క్రితం అయిదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి బలాత్కరించబోయారు. ఎంతో తెగువ, సాహసం కలిగిన ఆమె వారిని ఎదిరించి తప్పించుకుంది. ఆ కేసు తొమ్మిది సంవత్సరాలు కోర్టులో నడిచింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసును తేల్చకుండా అలా పొడిగిస్తూనే ఉండడంతో ఒకరోజు వెంకటలక్ష్మి ధైర్యంగా తన కేసు తానే వాదించుకుంటానని జడ్జిని కోరింది. అందుకు న్యాయమూర్తి సరేననడంతో వెంకటలక్ష్మి ఏకధాటిగా రెండున్నర గంటల పాటు వాదించి తనపై ఐదుగురు దుండగులు ఎలా దాడిచేశారో, తాను వారి నుంచి ఎలా తప్పించుకున్నదో జడ్జికి వివరించి చెప్పింది. స్వయంగా వాదించి ఆ కేసులో ఆమె గెలిచింది. ఆ స్ఫూర్తితో ఎప్పుడో చేయాలనుకున్న ఎల్‌ఎల్‌బి కోర్సును వెంటనే చేయాలని నిశ్చయించుకుంది. బసవేశ్వర్‌నగర్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ లా కాలేజీలో చేరింది. తెల్లవారక ముందే నిద్ర లేచి వంటపని పూర్తిచేసేది. కుమార్తెను బడికి సిద్ధం చేసేది. మధ్యాహ్నం పూట తినేందుకు ఇద్దరికీ క్యారేజీలు కటి,్ట పాపని స్కూలు వద్ద దించేసి కాలేజీకి వెళ్లిపోయేది. క్లాసులు పూర్తికాగానే, ఖాళీగా ఉండకుండా ఆటో నడిపి ఎంతోకొంత ఆదాయం సంపాదించేది. స్కూలుకి వెళ్లి పాపని తీసుకుని ఇంటికి చేరుకునేది. ఇలా ఐదేళ్లు కష్టపడ్డాక ఆమె లా కోర్సు పూర్తయింది.
కాలంతో పోటీ పడుతూ లా కోర్సు పూర్తిచేసిన వెంకటలక్ష్మి ఏ రోజూ చదువును, వృత్తిని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఏ రోజు పాఠాలు ఆ రోజు నిద్రపోవడానికి ముందే పూర్తిచేసేది. పద్ధతిగా చదివి, పరీక్షలు చక్కగా రాసి లా పరీక్షలో ఉత్తీర్ణులయింది. ఆటోలోనే లా కోర్సు పుస్తకాలు పెట్టుకుని ఏ మాత్రం అవకాశం ఉన్నా చదువుకునేది. కబుర్లతో కాలక్షేపం చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకునేది.
లా కోర్సు పూర్తి చేశాక ఆమె కర్ణాటక బార్ అసోసియేషన్‌లో తన పేరు నమోదు చేసుకుంది. అయినప్పటికీ ఆమె ఆటో నడపడం మానలేదు. కుటుంబ అవసరాలకు నెలకి ఎలా లేదన్నా పది వేల రూపాయలు ఉండాలని, అందుకే ఆటో నడుపుతున్నానని ఆమె చెబుతోంది. కుటుంబాన్ని పోషించుకుంటూ, మరోవైపు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తానని చెబుతోంది. సమాజంలో అణగారిన వర్గాలకు ఉచితంగా న్యాయ సహాయం అందించడం, ఐఎఎస్‌కు ఎంపిక కావడం తన లక్ష్యాలని చెబుతున్న వెంకటలక్ష్మి పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తోంది.