వ్యవసాయ సాగులో ఆమెకు ఆమేసాటి....
కన్న వారి కలలు కొడుకులు మాత్రమే తీరుస్తారని అనుకుంటారు...
కాని కూతుళ్లు కూడా సాకారం చేస్తారని నిరూపించిందో చిన్నమ్మీ. ఆడవాళ్లంటే అబల అని మగాడే ఏదయినా చేయగలడని అంటుంది మనపురుషాధిక్య సమాజం. కాని అది నిజం కాదు అన్నింటిలోనూ మేమున్నామని అనేక సందర్భాల్లో మహిళలు నిలిచిన సంఘటనలున్నాయి. నాట్లేయడం, కలుపుతీయడం, కోతకోయడం, నూర్పిడి చేయడం వంటి పనుల వరకే వ్యవసాయంలో మహిళలున్నారని తెలుసు కాని మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండలంలో ఓ చిన్నమ్మ అరకదున్నడం, విత్తనం సాలు దున్నడం, గుంటక పాయడం, బరువులు మోయడం లాంటి పనులు చేస్తూ తల్లిదండ్రులకు మగపిల్లలు పుట్టలేదనే ఆలోచన రాకుండా చేస్తోంది.
మా నాన్నకు నలుగురం ఆడపిల్లలం. నేనే చిన్నదాన్ని. మాది నిరుపేద కుటుంబం. మగపిల్లలు లేనిదే కుటుంబం నిలబడదని మా నాన్న చింతించేవాడు. మా అక్కల పెళ్లి కోసం అప్పు చేశాడు. అప్పులను తీర్చేదారి లేక మా నాన్న మంచం పట్టాడు. ఉన్న నాలుగు ఎకరాల భూమి రెండేళ్లు పడావుపడింది. తినడానికి కూడా తిండి లేక ఉపవాసం ఉండే పరిస్థితి ఉండేది. నాకప్పుడు పద్నాలుగేళ్లు. నాన్న కష్టాలు చూసి ఉండలేకపోయాను. చిన్న వయసు నుండే పొలం పనులకు వెళ్లేదాన్ని మగ సంతానం ఉంటే నాకు కొంతైనా ఆసరా అయ్యేవాడని కుమిలి పోయేవాడు. ఇది చూసి ఉండలేకపోయాను. ఈ పొలం పనులు నేను చేయలేనా నాన్న అంటే.. ఆడపిల్లవు కదా బిడ్డా.. నీకేమొస్తది అంటూ సమాధానం చెప్పేవారు. కాని నాన్న మాటల్లో ఎక్కడో నిరాశ కనిపించింది. ఎలాగైనా వ్యవసాయం చేయాలని నాన్న వెంట ఉండి గమనించాను. మొదట చిన్నచిన్న పనులకు సహాయపడ్డాను. తర్వాత పొలం పనులన్నీ నేనే చూసుకుంటున్నాను అంటూ 19ఏళ్ల చిన్నమ్మ చెప్పింది.
తెలకపల్లి మండలం నడిగడ్డలో ఎరుకలి కాశన్న నిరంజనమ్మ దంపతులకు నాలుగో సంతానం చిన్నమ్మ. పెద్ద కూతురు జంగమ్మ, రెండో కూతురు చంద్రకళ, మూడో కూతురు కృష్ణవేణి, నాలుగో సంతానం చిన్నమ్మ. అప్పుచేసి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేశాడు. చిన్నకూతురుకు ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకున్నారు. వ్యవసాయం, పనులు చేయడానికి తనకు వయసు సహకరించకపోవడం పొలం పనులు చేసేవారు లేక కాశన్న దిగాలు చెందారు. ఇంకా మైనార్టీ తీరని చిన్నమ్మ తండ్రికి అన్నివిధాలుగా సహాయసహకారాలు అందిస్తూ వస్తోంది. ఇక పొలం పనులు అన్నీ చేస్తూ చేదోడువాదోడుగా ఉంటూ వచ్చింది. ఆరేళ్లుగా వ్యవసాయం పనులుచేస్తూ మగరాయుడు అనిపించుకుంటోంది. విత్తనం సాలు నుంచి అచ్చు పనుల వరకు ఆమే చేస్తుంది. పత్తి చేను మనిషిలోతు ఉన్నా గుంటుక కొట్టడంలో ఆమె ఆరితేరింది. అనుభవం ఉన్న వ్యవసాయదారులే పత్తి చేలో గుంటుక కొడితే పత్తి చెట్లను విరగకొడుతారు. చిన్నమ్మ గుంటక పడితే ఒక్క చెట్టు కూడా విరిగిపోకుండా పొలం పనులు చేస్తుంది. కాడెద్దులు సైతం చిన్నమ్మ పిలుపునకు నిలిచిఉంటాయి. పత్తిచేను వేయడానికి అచ్చు గొడితే అవతల కోడి గుడ్డు కూడా కనపడుతుంది. సాలు కొట్టిన విధానాన్ని చూస్తే పెద్ద రైతులు సైతం అబ్బురపడుతారు. ఉదయం ఆరున్నరకు పొలంలోకి వస్తే సాయంత్రం 7 వరకు పొలం నుండి ఇంటికిపోదు. అమ్మ తెచ్చిన సద్ది తిని పొలం పనులు చక్కగా చేసుకుంటుంది. నాలుగు ఎకరాలకు తోడుగా మరింత భూమిని కౌలుకు తీసుకొని పొలం పనులు చేస్తుంది. వ్యవసాయ పనుల్లో ఏనాడు కూడా అలసటకు గురికాలేదు. విత్తనం వేసే అచ్చు కొట్టడమంటే ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. ఒకే రోజు నాలుగు ఎకరాలు అచ్చు కొడుతుంది. విత్తనాలు వేయడంలోనూ ఆమెది అందెవేసిన చెయ్యే. కరిగెటలో(మడిదున్నడం) ఇరువాలు అయితే ఎకరం, ఒంటిసాలు అయితే రెండు ఎకరాలు దున్నుతానని ఆమె అంటోంది. మోకాళ్లలోతు దిగబడినా ఆమె కరిగెటలో సునాయసంగా గడెం కొట్టగలదు. గొర్రు తోలడంలోనూ ఆమెకు మంచి ప్రావీణ్యత ఉంది. వేసవి కాలంలో కరెంటు లోవోల్టేజీ ఉన్నప్పుడు రాత్రీపగలు నిద్రకాసి నీళ్లు పెడుతుంది. గడెం పనులు పూర్తి అయిన తర్వాత ఎడ్లకు పచ్చిక మేపుతుంటుంది. పశువులకు నీళ్లు తాపడం, మేత వేయడం మొదలుకొని వ్యవసాయ పనులు పూర్తిగా ఆమెనే చేస్తుంది. భుజానికి పంపు వేసుకొని మందు పిచికారి కూడా సునాయసంగా చేస్తుంది. పిండి చల్లడంలో మగవారికంటే ముందు వరసలో ఉంటుంది. పంటపొలాలకు వచ్చే తెగుళ్లను గుర్తించి వాటికి ఏ మందులు వాడాలో కూడా తానే నిర్ణయించి చెబుతుంది. పోయిన ఖరీఫ్‌లో ఒక పత్తిలోనే రూ.80వేల పంటను పండించింది. మిగితా పంటలు మరో రూ.50వేల వరకు పండించింది. ఏ సమయంలో ఏ పంటలు వేయాలో కూడా ఆమెకు తెలుసు. రెండేళ్ల క్రితం రూ.5లక్షలు అప్పు ఉన్న ఆ కుటుంబానికి ప్రస్తుతం ఎలాంటి అప్పు లేదు.
ఎత్తిపొడుపుల మాటలు భరించాను : చిన్నమ్మ
నేను గడెం పట్టి వ్యవసాయం చేస్తుంటే మగరాయుడు అంటూహేళన చేసేవారు. తాత, అవ్వ, వదిన వరస ఉన్న వారయితే అనేక రకాలుగా మాటలనేవారు. ఏందే మొగోనిలా గడెం దున్నుతున్నవ్ అనేవారు. కుటుంబం కోసం ఎవరెన్ని అన్నా భరించాను. వ్యవసాయ పనులు చేయడంలో నాకు సంతోషం తప్ప ఏనాడు బాధ లేదు. కొన్నిసార్లు పొలం పనులకు కొంతమంది ఆటంకం కలిగించేలా చేశారు. అయినా అదరలేదు బెదరలేదు. పొలం పనులు చేసుకుంటూ ఇంటి పనులు కూడా సులభంగా చూసుకునేదాన్ని. పొలంలో ఏనాడు కూడా యంత్రాలు ఉపయోగించలేదు. నేనే స్వయంగా పొలం పనులు అన్నీ చేసుకునేదాన్ని. యంత్రాలు అయితే ఖర్చవుతుంది. చేతిలో చిల్లి గవ్వలేదు. అందుకే పొలం పనులు అన్నీ నేనే స్వయంగా చేసేదాన్ని.
మగ బిడ్డలేని లోటు తీర్చింది : కాశన్న, తండ్రి
తనకు మగబిడ్డలు లేని లోటును నా చిన్న కూతురు చిన్నమ్మ తీర్చింది. మగ పిల్లలు చేసే పనులన్నీ చిన్నమ్మ చేస్తుంది. ఆమె పనులు చూసి చాలా సంతోషంగా ఉన్నాను. పొలం పనులు చేయాలంటే తనకు సత్తువ ఉండేది కాదు. రెండేళ్లు భూమిని పడావుపెట్టాను. ఇప్పుడు తన భూమితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని చేస్తున్నార. నాకు సపోర్టుగా నా కూతురు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా బిడ్డకు ఇల్లరికం పెట్టుకుంటున్నాను. అల్లుడు బిడ్డా సుఖ సంతోషాలతో ఉండటమే నాకు కావాల్సింది.
చిన్నమ్మను చూసుంటే సంతోషంగా ఉంటుంది అంటారు ఇరుగుపొరుగు వారు.
మగవారు సైతం వ్యవసాయంలో నానాతంటాలు పడుతుంటే చిన్నమ్మ వ్యవసాయ పనులన్నీ చకచకా చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఆడ వ్యవసాయంలో ఆరితేరిన వారికంటే అన్ని రకాలుగా సాగు చేయడం ఆమెకు ఆమెనే సాటి. ఏంటమ్మా సాగు చేస్తుంటే ఎవరైనా ఎత్తిపొడుపు మాటలు అన్నారా అంటే.. ఎన్నో అన్నారు.. వారే నోరు మూసుకున్నారు.. అనడం ఆమె నిబద్ధతకు నిదర్శనం.