ఆదుకునే వాళ్లు లేక, బతకడానికి ఏ దారీ దొరక్క కొందరూ... ఎవరో చేసిన మోసం వల్ల ఇంకొందరూ... ఇలా ఎందరో మహిళలు వ్యభిచార కూపాల్లోకి చేరుతున్నారు. దిక్కుతోచని స్థితిలో అక్కడ ఉండిపోతున్నారు. కానీ ఏళ్లు గడిచేకొద్దీ వాళ్ల జీవితాలు దుర్భరంగా తయారవుతాయి. వాళ్లు పడే బాధలు తెలిసి వాళ్లను ఆదుకోవాలనుకున్నా. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సూచించాలనుకున్నా. అయితే నా దృష్టిలో మహిళలకు ఉపాధి అంటే కుట్టుపని ఒక్కటే కాదు. ఎందుకంటే ఒక వీధిలో ఇద్దరుముగ్గురు టైలర్లు ఉంటే... ఎవరికీ ఆదాయం సరిగా రాదు. అందుకే బాగా ఆలోచించి, ఇతర స్వచ్ఛంద సంస్థలతో చర్చించి, అలాంటి మహిళలకు కుక్కర్లూ, మిక్సీలూ, మొబైల్ ఫోన్ల రిపేరింగ్, బేకరీ పదార్థాల తయారీలో శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమయ్యా. ఏడాదిన్నరగా మేం నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో సుమారు మూడు వేల మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే స్థితికి చేరుకున్నారు.
పదో తరగతి చదువుతున్నప్పుడే స్కూలు తరఫున కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా. కాలేజీలో చేరాక వాటిని కొనసాగించా. ఆ సమయంలోనే ఇంటాబయటా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కలిగింది. అది మహిళల మానసిక స్థితిగతులపై అధ్యయనం చేసే దిశగా నన్ను నడిపించింది. విమెన్ మెంటల్ హెల్త్‌లో పీహెచ్‌డీ చేశాక దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్లాన్ ఇండియాలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా చేరా. దాని తరఫున పని చేస్తున్నప్పుడే అమ్మాయిల అక్రమ రవాణా, వారు వ్యభిచార గృహాల్లో పడుతున్న బాధల గురించి తెలిసి, చలించిపోయా. వారిని ఆదుకుని, ఆసరా ఇవ్వాలనుకున్నా. నా ఆలోచనలకు ప్లాన్ ఇండియా మద్దతూ లభించడంతో ఉత్సాహంగా ముందుకు కదిలా.
మొదట వ్యభిచార గృహాల్లోని మహిళల్ని కలిసి ప్రత్యామ్నాయ ఉపాధి ఆలోచనల గురించి చెప్పా. ఒక్కరూ నమ్మలేదు. 'ఏదో ఇలా బతికేస్తున్నాం... ఇప్పుడు బయటికొచ్చి ఏం చేస్తాం' అన్నారు. ఇప్పుడంటే జీవితం సాఫీగా సాగిపోతోంది. వయసు పైబడ్డాక, హెచ్‌ఐవీ లాంటివి వస్తే మీ పరిస్థితి ఏంటనేది ఎప్పుడయినా ఆలోచించారా అని ఎదురు ప్రశ్నించా. వాళ్ల దగ్గర సమాధానం లేదు. ఉత్సాహంగా ముందుకొచ్చిన కొందరు మహిళల్ని ఓ బృందంగా ఏర్పాటుచేసి కొన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చాం. సొంతంగా వ్యాపారం ప్రారంభించేలా రుణ సదుపాయం లభించేలా చూశాం. వారి జీవితంలో వచ్చిన మార్పు చూశాక మరికొందరు ముందుకొచ్చారు. అలా మహిళల్ని బృందాలుగా ఏర్పరచి, వారి ఆసక్తిని బట్టి కుక్కర్లూ, మిక్సీలూ, మొబైల్ ఫోన్ల మరమ్మతులో శిక్షణ ఇచ్చాం. ఒక్కొక్కరికి కనీసం రెండు అంశాల్లో శిక్షణ ఇచ్చాం. దానివల్ల వారి ఆదాయం పెరుగుతుందనే మా ఆలోచన.పల్లెటూళ్లలో కూడా కేకులు కొనుక్కునే వాళ్ల సంఖ్య పెరిగింది. అందుకే ఈ మహిళల్లో కొందరికి వాటిల్లోనూ శిక్షణ ఇచ్చాం.
అయితే అందరికీ అన్నీ కాకుండా మహిళల వయసూ, చేయగల సామర్థ్యం, ఆసక్తి ఉన్న వాళ్లకు మాత్రమే నేర్పిస్తున్నాం. ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించడానికి జనశిక్షణ సంస్థ, ప్రాంగణం లాంటి సంస్థల సాయం తీసుకుంటున్నాం. నిధుల కోసం యాక్సిస్ బ్యాంక్ ఫౌండేషన్ సహకరిస్తోంది. అన్నివేళలా మేమే రుణ సదుపాయం కల్పించాలని కాకుండా వ్యాపారం ప్రారంభించిన మహిళలకు బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేశాం. అందులో కొద్దికొద్దిగా పొదుపు చేసుకుంటూ.. అవసరమైనప్పుడు దాన్నుంచే రుణం తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం యాబై మంది సభ్యులతో కలిసి ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. ఈ ఏడాది మరిన్ని జిల్లాలకు విస్తరించాలన్నదే మా ఆలోచన.