ఆమె జీవితపు ప్రతి కోణం ఒక పాఠం నేర్పే రీతిలో ఉంటుంది. ఒక ఆదివాసీ సమాజపు నేపథ్యం నుండి దేశ అత్యున్నత పురస్కారాలకు ఎదగడం మధ్య జరిగిన జీవిత అనుభవాలు ఎలాంటివో అవి తెలిస్తే నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పురుషులు చెప్పే పండ్వానీ కథని పోట్లాడి మరీ పాడిన మొదటి మహిళ ఘనత తీజన్‌బాయిది. ఇది సాహిత్యంలో గుర్తింపు పొందగలగాలి. ఆ కథ, దాని ఔన్నత్యం, ఆ కథనరీతి, శైలి... అది భారతీయ కథనరీతులను ప్రభావం చేసిన తీరు సవిస్తార పాఠ్యాంశంగా ఉండగలగాలి. పాడేవాళ్ళు పాడుకుని సంతోషిస్తే, చదువరులు దాన్ని చదువుకుని తమ తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.ఎరుపు, నలుపు రంగులు కలిసిన తన ప్రాంతపు కట్టుబొట్టతోకఢా, కాక్‌నీ, బిందీ లాంటి నగలతో తన (ఆహార్యాన్ని) దుస్తులని తానే ఎంచుకున్నానని చెబుతారామె. అన్నీకలిసి ఎనిమిది కిలోల బరువుంటాయట. మోస్తూ కథ చెప్పడం కష్టం కదా అంటే చెప్పేది భీముడు, సుయోధనుడు, ద్రౌపదిల గురించి కదా అని చమత్కరించింది. భీముడు ఆవిడకి ఇష్టుడు. కల్లాకపటం లేనివాడు కాబట్టి. ఒక్క భారతమే ఎందుకు రామాయణం కూడా చెప్పవచ్చు కదా అంటే భారతంతో మనసు అంటారు.
అలా హృదయపు లోతుల్లో నుండి రాలేని కళ జనంలోనికెళ్ళలేదు, వాళ్ళ మనసులని తాకలేదు అని ఆమె భావన.అలా జనాల్లోకి వెళ్ళిన తన కళని ఇప్పటికి రెండు వందలపైగా ఔత్సాహికులకి ఆమె నేర్పారు. వాళ్ళలో ఉపాబాలా, మీనా సాహు, రీతూ వర్మ, సీమాఘోష్ లాంటి విద్యార్థులని గుర్తుచేసుకుంటారు తీజన్‌బాయి. తన దగ్గరకొచ్చి తర్ఫీదయే విద్యార్థులు కాకుండా తన గాన రీతిని సొంతం చేసుకొని పాడేవాళ్ళని ఆమె ఆక్షేపించరు. మీ సలహాలేకుండా మీ శైలిలో పాడుతున్నారు కదా అంటే విశ్వవ్యాప్త కళ ఇది. పరిధులు, సీమలు ఎందుకంటారు. రామ్‌పూర్ విశ్వవిద్యాలయం ఈ కళని పాఠ్యాంశంగా ఇంకా గుర్తించనప్పటికీ, ఈ కళారూపం గానరీతి పద్ధతులపై వర్క్‌షాపులవీ నిర్వహిస్తుంటారని తీజన్‌బాయి సెక్రటరీ చెప్తారు. ఆ పరంగా తన కళని ఆగకుండా ముందుకు తీసుకెళ్తున్నారామె. వయసెంతని అడిగితే మనమల పిల్లల్ని ఆడించుకుంటానని జవాబు. ఇన్నేళ్ళ ఎగుడు దిగుడు జీవితం ఒకవైపు, ఎలాంటి ఎగుడుదిగుడుల్లోనైనా మొక్కవోని తన పండ్వాని కథ మరోవైపు. కథని జీవితం చేసుకున్నాక జీవితం తనని బాధించలేదు.
ఆ కళలో ఏకలీనం అవుతుందామె. ఇక తీజన్‌బాయిలో గుర్తించాల్సిన మరో కోణం ఏమిటంటే ఈ సాద్‌గీని భద్రంగా పెట్టుకోవడం కూడా తన కళలో భాగమైంది. దేశ విదేశాలు అఖండ ఖ్యాతి, పేరు ప్రతిష్ఠలు, కొద్దిపాటి డబ్బు, ఆ పరంగా వచ్చే మార్పులు ఇవేవీ కళని తాకనివ్వకుండా తనని తాను సంభాళించుకోవడం కూడా ఒక కళనే. ఒక సెక్రటరీ, అపాయింట్‌మెంట్స్ ఆ హంగుల్లో ఉంటూ కూడా అతి సాదాసీదాగా తనని తాను ఉంచుకోవడంలో సఫలీకృతులయ్యారు తీజన్‌బాయి.
మూలం : సూర్య దినపత్రిక