
అలాంటి చోట-తిని పడేసిన ఎంగిలి ప్లేట్లు, తాగి విసిరేసిన టీ గ్లాసులు, ఖాళీ పొట్లాలు, ప్లాస్టిక్ బాటిళ్లను ఏరుకుంటూ అందరికంటా పడింది ఓ తెల్లమ్మాయి. అక్కడున్న వాళ్ల బాధ ఒకటైతే, ఆమె బాధ 'చెత్త' బాధ. కొండప్రాంతాల్లో ఇలా చెత్తంతా పేరుకుపోతే, భవిష్యత్తులో పరిసరాలన్నీ ఏమైపోతాయి..? మైదానాల్లో అయితే ఎవరో ఒకరు తీసేస్తారు. ఇలాంటి క్లిష్టమైనచోటికొచ్చి ఎవరు శుభ్రం చేస్తారు..? అంటున్న ఆ యువతి పేరు జోడీ అండర్‌హిల్. దేశం ఇంగ్లండ్. లండన్ నుంచి ఇండియాకు వచ్చి, కేవలం పర్వతసానువుల్లోని చెత్తను తొలగించే సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏ సేవకైనా ఒక పేరు కావాలి కాబట్టి.. తన బృందాన్ని 'వేస్ట్ వారియర్స్' అని పిలుస్తోందీ యువతి.
"నాకు పదిహేడేళ్లప్పుడు ఇంటి నుంచి వచ్చేశాను. రకరకాల దేశాలు తిరిగా. ఫండ్‌రైజింగ్ అసిస్టెంట్‌గా, ఛారిటీల్లో వాలంటీర్‌గా, లీగల్ ఎడిటర్‌గా.. ఇలా ఎన్నెన్నో ఉద్యోగాలు చేసి మానేశాను. ఎందులోనూ సంతృప్తి దొరకలేదు. ఉత్తరభారతంలో పర్వతాలు ఎక్కువ. వాటిలో దర్శనీయస్థలాలు, పర్యాటక ప్రదేశాలకు కొదవే లేదు. ఏటా ఇక్కడికొచ్చే భక్తులు, సందర్శకుల సంఖ్య పెరిగిపోతోంది. వాళ్లు పడేసిన చెత్త కూడా రెట్టింపవుతోంది. స్థానిక అధికారులు దీన్నొక సమస్యగా గుర్తించడం లేదు. అందుకని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నాం..'' అని వివరించారు అండర్‌హిల్. తొలిసారి - ఉత్తరాఖండ్‌లోని ధర్మశాలకు సమీపంలో ఉన్న చెత్తను తొలగించారు వేస్ట్‌వారియర్స్ సభ్యులు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు.
కొన్నాళ్లకు-'లండన్ నుంచి వచ్చిన అమ్మాయే మా ప్రాంతాన్ని శుభ్రం చేస్తుంటే, మేము చూస్తూ ఊరుకోవడం ధర్మం కాదు'' అంటూ వందమంది స్థానికులు వేస్ట్‌వారియర్స్‌తో చేతులు కలిపారు. ఆ తర్వాత గుణమాత ఆలయం పరిసరాలను శుభ్రం చేశారు వాళ్లు. "కొండప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి పరిశుభ్రతకున్న ప్రాధాన్యాన్ని వివరించాము. పిల్లల పార్కులకు వెళ్లి చెత్తను తొలగించాం. సేకరించిన చెత్తను వేరుచేసి, రీసైకిల్‌కు పంపిస్తున్నాం..'' అందా లండన్ అమ్మాయి. ఆమె 'చెత్తశుద్ధి'ని గమనించిన స్థానిక పత్రికలన్నీ 'గార్బేజ్ గర్ల్' అంటూ తెగ పొగిడేస్తున్నాయట. "నేను తెల్లమ్మాయిని కాబట్టి నా దగ్గర దండిగా డబ్బు ఉంటుందనుకుంటున్నారు అందరూ. నేనేమీ ధనవంతుల కుటుంబం నుంచి రాలేదు. మా బృందానికి ప్రతి నెలా తొంభైవేలు ఖర్చు అవుతోంది. ఇప్పుడు నా చేతిలో ఉన్నది కేవలం పద్దెనిమిది వేలు. ఎలా బతకాలో మీరే చెప్పండి?..'' అన్నారు.
దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఎంతో కష్టపడి కొండకోనల్లో పడేసిన చెత్తను తీసేస్తున్న అండర్‌హిల్‌ను ప్రోత్సహించాల్సిందిపోయి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. డెహ్రాడూన్‌లోని ఆరోగ్యకార్యకర్తలకు తమ సంస్థ తరఫున శిక్షణ ఇచ్చేందుకు అనుమతినివ్వాలంటూ.. పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేశారు అండర్‌హిల్. కాని ఆయన నుంచి ఏ సమాధానమూ రాలేదు. ఎన్ని ఫోన్లు చేస్తున్నా స్పందనే లేదు. "చెత్త అనేది రోత కాదు. మీరెప్పుడైనా చిప్స్ తింటే, ఆ ఖాళీ కవర్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయకండి. ఒకవేళ దగ్గర్లో డస్ట్‌బిన్ లేకపోతే, ఖాళీ కవర్‌ను మడిచి పర్సులో పెట్టుకోండి. డస్ట్‌బిన్ కనిపించాకే అందులో పడేయండి. అందరూ ఇలాచేస్తే పరిశుభ్ర భారత్ ఆవిర్భవిస్తుంది..'' అని చెప్పారు.