ఫిరంగులను పేల్చి గెలవొచ్చు.
పావురాలను ఎగరేసి గెలవొచ్చు.
ఇచ్చిపుచ్చుకుంటూ గెలవొచ్చు.
వచ్చిపోతూ గెలవొచ్చు.
అంతేనా...
రుచిగా ఇంత వండిపెట్టి కూడా గెలవొచ్చు!
అలా గెలిచే...
‘లెసొతో’ రాజ్యానికి క్యాటరింగ్ మహారాణి అయ్యారు ఎలిజబెత్ స్కినర్!
‘హైదరాబాదీ ఖీమా’ను సర్వ్ చేసి ఏకంగా ఆ దేశపు రాజుగారి చేతే...
లొట్టలు వేయించిన ఈ ‘తెలుగింటి’ ఆంగ్లో ఇండియన్ ఆడపడుచు అంతదూరం ఎందుకు వెళ్లినట్లు?!
ఇంత ఘనత ఎలా సాధించినట్లు?
మన ఊళ్లో వ్యాపారం పెట్టి సక్సెస్ అవ్వడం గొప్పకాదు. పక్క ఊరిలో పాగా వేసి పదిమందితో శభాష్ అనిపించుకుంటే ప్రత్యేకత ఉన్నట్టు. అలా చెయ్యడానికి ధైర్యం ఒక్కటీ ఉంటే సరిపోదు, బోలెడన్ని తెలివితేటలుండాలి. ఆ విజయం పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే వందశాతం నిజాయితీ ఉండాలి. కేవలం పక్కూర్లో స్థిరపడడం కోసమే ఇన్ని మాట్లాడుకుంటే... ముప్పైఏళ్లకిత్రం దేశం వదిలి ఎక్కడో దక్షిణాఫ్రికా దగ్గర్లోని లెస్సోతో అనే దేశంలో అడుగుపెట్టి అక్కడివారితో ‘మనమ్మాయి’ అనిపించుకోవడం అంటే మాటలు కాదు. ఎందుకంటే విమానం ఎక్కడానికే వెయ్యిసార్లు ఆలోచించే ఆ రోజుల్లో ఒకమ్మాయి విదేశాలకు ఒంటరిగా పయనమయ్యిందంటే ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఒక భారతీయ వనితకు ఇది సాధ్యమయ్యే పనేనా? అని. నిజమే ఆమె ఒట్టి ఇండియన్ కాదు. ఆంగ్లో ఇండియన్. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అయినా... మాతృభాష ఇంగ్లీషు కావడం, ఆడా మగా అంటూ పట్టింపులు వారి సమాజంలో బాగా తక్కువగా ఉండడం ఎలిజెబత్ స్కినర్ పాలిట వరాలయ్యాయి. లెస్సోతోలో ఆహార పరిశ్రమలు పెట్టి విజయం సాధించిన ఎలిజెబత్ స్కినర్ అక్కడి ప్రజలందరితో ప్రతిరోజూ ‘అన్నదాతా సుఖీభవ...’ అనిపించుకుంటోంది.
సికింద్రాబాద్ అమ్మాయిని...
‘‘నేను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పుట్టాను. నాన్న రుబిన్ స్కినర్ మిలటరీ పనిచేసేవారు. అమ్మ డోరస్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేది. ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు...మొత్తం ఏడుగురు సంతానాన్నీ ఎలాంటి లోటు లేకుండా పెంచారు. అందరికంటే నేనే చిన్నదాన్ని. మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల మాకు చదువు ఆ తర్వాత ఉద్యోగాలు తప్ప మరో ఆలోచనలు ఉండేవి కావు. నేను బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివాక ఇక్కడే ఇసిఐఎస్ కంపెనీలో అడ్మిస్ట్రేషన్‌లో కొన్నాళ్లు పనిచేశాను. ఇంతలో ఎవరో మా బంధువులు లెస్సోతోకి విహారయాత్రకు వెళుతున్నారంటే వారితో కలిసి అక్కడికి వెళ్లాను. నా కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి అక్కడ ఒక కంపెనీవారు ఉద్యోగం ఇస్తానన్నారు. ఇంటికి తిరిగొచ్చాక ఆ ఉద్యోగ అవకాశం గురించి అమ్మానాన్నలకు చెప్పాను. ‘మాకు నీ మీద, నీ శక్తి మీద నమ్మకం ఉంది. మన దేశానికి మంచి పేరు రాకపోయినా పరవాలేదు. చెడ్డపేరు మాత్రం రాకూడదు’ అని చెప్పారు. ఇక అక్కలు, అన్నయ్యలు ‘గో హెడ్’ అన్నారు. మా రెండో అక్క క్రిస్టీన్ లాజరెస్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చి నన్ను విమానం ఎక్కించిన క్షణాలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి.
కో ఆర్డినేటర్ జాబ్...
మచాచ్చే గ్రూప్ ఆఫ్ కంపెనీలో కో ఆర్డినేటర్ జాబ్‌లో చేరాను. అప్పటికి నా వయసు 29. ఆ ఏడాదిలోనే అక్కడే స్థిరపడ్డ గుజరాతి అబ్బాయి రాజ్‌దీప్‌షాతో పెళ్లి జరిగింది. ఏడాది ఉద్యోగ అనుభం వ్యాపారం పెట్టడానికి సరిపోతుందనుకున్నాను. లెస్సోతో చాలా చిన్న దేశం. ఇప్పటికీ రాచరికం కొనసాగుతున్న దేశం. చల్లని ప్రదేశం, టూరిజానికి అనుకూలమైన ప్రదేశం కావడంతో భారతీయ వంటలకు గిరాకీ ఉంటుందనుకుని ధైర్యం చేసి క్యాటరింగ్ వ్యాపారం మొదలెట్టాను. దానికోసం ప్రత్యేకంగా వంటలు నేర్చుకున్నాను. కూరలు తెచ్చుకోవడం నుంచి వండి, వచ్చినవారికి అందించేవరకూ అన్ని నేనే చేసుకునేదాన్ని. వ్యాపారసూత్రాలు పాటిస్తూనే నాణ్యమైన ఆహారం అందించడం కోసం చాలా కష్టపడేదాన్ని.
రెస్టారెంట్ ప్రయోగం...
క్యాటరింగ్‌లో విజయవంతంగా నడుస్తున్న సమయంలో నా భర్త ఆలోచనతో ‘ది రెగల్’ పేరుతో ఒక రెస్టారెంట్ కూడా పెట్టాం. దానికోసం ఒక చెఫ్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. టీ, కాఫీ మొదలు...మీట్ వరకూ మా రెస్టారెంట్ చాలా ఫేమస్ అయ్యింది. మొదట్లో నేను రోజుకి 14 గంటలు పనిచేసేదాన్ని. కొన్నేళ్లపాటు అలా కష్టపడడం వల్ల ఇప్పటికీ నాలుగు గంటలకంటే ఎక్కువ నిద్ర పట్టదు నాకు. ఇంతలో వేడుకలకు ఆహ్వానం ఉండేది. నా క్యాటరింగ్ లేని వేడుకలకు మాత్రమే హాజరయ్యేదాన్ని. ఎందుకంటే క్యాటరింగ్ ఉన్న ప్రతీ చోటకి వెళ్లి వంటలు, వడ్డింపులను నేను స్వయంగా వెళ్లి చెక్ చేసుకునేదాన్ని. మాకు ఒక అబ్బాయి.. ఎలిస్టిర్ స్కినర్. నేను లిస్సుటోలో స్థిరపడ్డాక అమ్మానాన్న, అక్కలు, అన్నయ్యలు, మా అత్తగారు... అందరూ మా ఇంటికొచ్చి కొన్నాళ్లుండి మేం వ్యాపారం చేసే విధానాన్ని చూసి బాగా ఎంజాయ్ చేసేవారు. రోజూ వందలమంది వచ్చిపోయే రెస్టారెంట్ యజమానినైనా అవసరమైతే కస్టమర్లు తిన్న ప్లేట్లని తీసి నేను శుభ్రం చేసేసుకుంటానక్కడ. ఆ దేశంలో అలా పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తారు.
రాజు...ప్రశంస
లెస్సోతో రాజు లెట్సీ...మా రెస్టారెంట్‌కి వచ్చినప్పుడల్లా స్పెషల్‌గా హైదరాబాదీ ఖీమా కూరని ఆర్డర్ చేస్తారు. దాంతోపాటు స్పైసీగా ఉండే చికెన్ కబాబ్‌ని కూడా చాలా ఇష్టంగా తింటారాయన. మన దేశం నుంచి విఐపీలకు అపాయింట్‌మెంట్ తీసుకుని ఆ రాజుగారిని పరిచయం చేస్తుంటాను. క్యాటరింగ్, రెస్టారెంట్‌లతో పాటు ‘స్టెమ్ బచేరి’ పేరుతో కూరగాయలు, మాంసం కట్ చేసే కంపెనీ పెట్టాం. ఆ ఆలోచన నాదే. అది కూడా బాగా సక్సెస్ అయ్యింది.
చేతనైనంత సాయం...
ఇన్నేళ్లలో ఎన్నో ప్రశంసలు, అవార్డులు, పదవులు... నాలో మరింత శక్తిని నింపాయి. సౌత్ ఆఫ్రికా చెఫ్ అసోసియేషన్‌లో ప్రొఫెషనల్ మెంబర్‌గా పనిచేసినప్పుడు చాలా రెస్టారెంట్‌లు తిరిగాను. చాలా దేశస్తుల్ని కలిసాను. బోలెడంతమంది భోజనప్రియుల్ని చూశాను. వారి దీవెనల్ని అందుకున్నాను. వ్యాపారాలతో పాటు లెస్సోతోలో కొన్ని సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను. లెస్సోతో కూడా ఎయిడ్స్ బాధిత దేశమే. ఎయిడ్స్ రోగులకు మందుల పంపిణి, పేదవిద్యార్థులకు ఆర్థికసాయం, దూరప్రాంతాలకు మంచినీరు సరఫరా వంటి సేవాకార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నాను. ఏటా ఆగస్టు రెండవ తారీఖు ఆంగ్లో ఇండియన్ వార్షిక వేడుకలు మొదలవుతాయి. రేపటితో ముగియనున్న ఈ వేడుకలు, ఈ సందర్భంగా మా కమ్యూనిటీ సంక్షేమం కోసం తలపెట్టిన కార్యాలు సఫలమవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అన్నపూర్ణ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ మనం కూడా ఆమెకి ఆల్ ది బెస్ట్ చెబుదామా!
మూలం : సాక్షి దినపత్రిక