రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక సాధనలో శారదేదేవి పాలుపంచుకోవడం, ఆయనకు తోడ్పడడం గురించి అందరికీ తెలిసిందే. కాపురానికి వచ్చిన కొత్తలో రామకృష్ణుడు ఆమెను ‘‘నన్ను మాయలోనికి లాగడం నీ అభిమతమా?’’ అని అడిగితే ‘‘అదేమిటి? పారమార్థిక మార్గంలో మీకు తోడ్పడడానికే వచ్చాను’’ అన్న శారదాదేవి వ్యక్తిత్వం గురించి ఆధునిక స్ర్తిలు తెలుసుకోవడం అభిలషణీయం.
ఆడా, మగా ఎవరైనా పిల్లలు సమానమేననీ, తల్లిదండ్రులు ఇద్దర్నీ సమంగా పెంచి విద్యాబుద్ధులు చెప్పిస్తే సమంగా ఆదుకుంటారనీ నేడు అంతా అంటున్నారు. సమంగా పెంచనంత మాత్రాన ఆడపిల్లలు తల్లిదండ్రులను ఆదుకోరాదా? సమంగా పెంచి, సమంగా ఆస్తి పంచినా, ‘‘అందుకు మావారు ఒప్పుకోరు’’ అంటూ బాధ్యతలను స్వీకరించని అమ్మాయిలు లేరా?
శారదాదేవి భర్త వద్దకు కాపురానికొచ్చిన ఆరు నెలలకే ఆమె తండ్రి మరణించాడు. నలుగురు కొడుకులతో కూడిన కుటుంబ బాధ్యతను ఆమె తల్లి శ్యామసుందరీ దేవి వహించాల్సి వచ్చింది. పొలంపై ఆదాయం పేరుకు మాత్రమే. ఇరుగు పొరుగు ఇళ్ళలో వడ్లు దంచి, ఆ ఆదాయంతో ఇల్లు గడిపే పరిస్థితి. ఈ కష్టకాలంలో తల్లికి తోడుగా ఉండడానికి పుట్టింటికి వెళ్లి కాయకష్టమైన వడ్లు దంపే పనిని చాలమటుకు చేస్తూ తల్లికి విశ్రాంతి కల్గించిన శారదాదేవి నేటి కూతుళ్ళందరికీ ఆదర్శం కాదా?
అయిదేళ్లకే వివాహమైన ఆ పల్లెటూరు పిల్లకు చదువుకునే అవకాశం లేనే లేదు. భర్త వద్దకు దక్షిణేశ్వరం వచ్చాక రామకృష్ణుల అన్న కూతురు బడికి వెళ్లి చదువుకోవడం చూసిన ఆమె- ఆ చిన్న పిల్లవద్దనే చదువుకోవడం ప్రారంభించింది. అణా పెట్టి కొనుక్కున్న పుస్తకాన్ని రామకృష్ణుల మేనత్త మనవడు హృదయుడు ఆమె చేతిలోనుంచి లాగేసుకున్నాడు. ‘‘స్ర్తిల కు చదువేమిటి? స్ర్తిలు రాయడం, చదవడం తగదు. ఈ రీతిలో నవలలూ, నాటకాలూ చదవడానికి సిద్ధపడుతున్నావా?’’ అని అన్నాడు. హృదయుడి మాటల్ని పట్టించుకోకుండా రామకృష్ణుల అన్న కూతురు బడికి వెళ్లి చదువుకునేది. ఇంటికి వచ్చి ఆ పాఠాలు శారదాదేవికి నేర్పేది. ఆ తరువాత గంగా స్నానానికి దక్షిణేశ్వరాలయానికి వచ్చే ఒక బాలిక దగ్గర శారదాదేవి చదువు సాగించింది. దేవాలయం తోటనుంచి వచ్చే కూరగాయలను ఆమెకు గురుదక్షిణగా ఇచ్చేది. అంతగా శ్రమపడి చదువుకుందుకు నేడెందరు సిద్ధంగా ఉన్నారు?
కాలానికీ, సంఘానికీ ఎదురీదుతూ చదువుకోవడం వల్లనేమో శారదాదేవికి రాయడం మాత్రం రాలేదు. అయినా అక్షరాస్యత వేరు, విద్య వేరు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నానాజాతి సమితి లేదా లీగ్ ఆఫ్ నేషన్స్‌ని స్థాపించారు. దాని గురించీ, దాని అధ్యక్షుడైన విల్సన్ గురించీ, ప్రపంచ శాంతి స్థాపన గురించీ ఒక శిష్యుడామెకు గొప్పగా చెప్పసాగాడు. ఆమె ‘‘నాయనా.. విల్సన్ మాటలు నాలుక చివరనుంచి వచ్చినవే కానీ మనస్ఫూర్తిగా చెప్పినవి కావు’’ అంది. ఎంత చక్కటి విశే్లషణ! లీగ్ ఆఫ్ నేషన్స్ నుంచి ముందుగా వైదొలగిన దేశాలలో అమెరికా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా మారణహోమం గురించి తెలియనివారెవ్వరు? కానీ, శారదాదేవిలా ముందే చెప్పగలిగినవారెందరు? బ్రిటీషు ప్రభుత్వం తెస్తున్న అభివృద్ధి గురించి పొగిడిన వారిని- ఆమె పెరిగిపోతున్న పేదరికం గురించి ప్రశ్నించింది. విషయ విశే్లషణే అసలైన విద్య కదా!
విద్యా విషయంలో, సాంఘిక సమాచారంలో ఎంత స్వతంత్రమైన ఆలోచనలున్నా ఆమె జీవన విధానం పాతకాలం పద్ధతిలోనే ఉండేది. ఉదయమే ఎవరూ లేవకముందే గంగాస్నానం చేసినా జుట్టుని ఎండలో ఆరపెట్టుకునేది మాత్రం- మధ్యాహ్నం ఆలయం ఖాళీ అయ్యాకనే. ఆమె పరుల కంటపడేది కాదు. రామకృష్ణుల వద్దకైనా మేలిముసుగుతోనే వెళ్ళేది. ఆలయంలో చాలామందికి ఆమె ఉన్నదని మాత్రమే తెలుసు. కుట్టిన దుస్తులు కానీ, పాదరక్షలు కానీ ఆమె ధరించి ఎరుగదు. సంపూర్ణమైన సంప్రదాయ జీవనం ఆమెది.
ఘోషాలోనే జీవించినా తనను ఎవరో వచ్చి రక్షించాలని ఎదురుచూస్తూ కూచునే తత్వం కాదు ఆమెది. ధైర్యస్థైర్యాలూ, సమయస్ఫూర్తీ ఆమె సొత్తు. పుట్టిన ఊరు జయరాంబాటి నుంచి దక్షిణేశ్వరానికి కేవలం అరవై మైళ్ళు. నేడైతే బస్సులోనో, కారులోనో రెండు, మూడు గంటలలో వెళ్లిపోవచ్చు. అప్పట్లో రెండు రోజుల కాలినడక ప్రయాణం. అందునా పదిమైళ్ళు నరబలలు ఇచ్చే బందిపోట్లుండే అడవి. ఓ సారి తోటి ప్రయాణీకులతో వేగంగా నడవలేని శారదాదేవి వెనుకబడింది. ఇద్దరు బందిపోట్లు అడ్డం పడ్డారు. మనసులో ఎంత భయంగా ఉన్నా పైకి ధైర్యంగా ‘‘నాన్నా.. నాతోడివారంతా వదిలేసి వెళ్లారు. దక్షిణేశ్వరంలో ఉన్న నీ అల్లుడి దగ్గరకు వెడుతున్నాను. నువ్వు సాయంగా వస్తే ఆయనెంతో సంతోషిస్తారు’’ అంది. దొంగల్లో రెండో వ్యక్తిని మొదటివాడి భార్యగా గుర్తించి, ‘‘అమ్మా.. నేను నీ కూతురు శారదని. నువ్వూ నాన్నా వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేదాన్నో’’ అంది. ఆ మెత్తని మాటలకు కరిగిపోయిన వారిద్దరూ ఆమెను ఆదరించి పక్క గ్రామం దాకా తోడు వెళ్ళారు. ఆ తరువాత కొంతకాలానికి మిఠాయిలతో ఆమెను చూడ్డానికి దక్షిణేశ్వరం కూడా వెళ్లి రామకృష్ణుల గౌరవ సత్కారాలు పొందారు.
ప్రతి సారీ సామం పనిచెయ్యదు. భర్త మరణకాలానికి శారదాదేవి ముప్ఫై ఏళ్ళ నిండు యవ్వనంలో వుంది. పల్లెటూళ్ళో అత్తవారింట ఒంటరిగా ఉన్న సమయంలో ఒకడు ఉన్మత్తతతోనో, కామోన్మత్తతతోనో ఆమె వెంటపడ్డాడు. అలసిపోయేదాకా గాదె చుట్టూ పరిగెత్తిన తరువాత ఆమె అతణ్ణి లాగి కింద పడేసి గుండెలమీద మోకాలు పెట్టి చెంపలు వాయగొట్టింది. స్ర్తి తనను తానే రక్షించుకోవాలనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదు.
స్ర్తికి వివాహమే సర్వస్వం కాదన్నది శారదాదేవి నమ్మకం. ఒక భక్తురాలు తనకు అయిదుగురు కూతుళ్ళనీ, వివాహం చెయ్యడం కష్టంగా ఉందనీ వా పోయింది. శారదాదేవి ఒక్కక్షణం వౌనం వహించి, ‘‘వివాహానికి ఎందుకంత తాపత్రయం? తగిన వరులు లభించకపోతే సోదరి నివేదిత నడిపే పాఠశాలకు పంపవచ్చు కదా? వారక్కడ చదువుకుని తాము సుఖపడి పరహితార్థం పాటుపడతారు’’ అని చెప్పింది. వివాహం వైపు దృష్టి మరల్చని వారికి బలవంతంగా వివాహం చెయ్యడం దారుణహింస అని చెప్పేది. స్ర్తిలు గుడ్డిగా పురుషులను అనుకరించకుండా తమ ప్రతిభను ప్రకాశింపచెయ్యాలన్నది ఆమె ఆకాంక్ష.
విశిష్టమైన శారదాదేవి వ్యక్తిత్వాన్ని గురించి సోదరి నివేదిత ‘‘ఆమె ప్రాచీన యుగానికి భరతవాక్యమా? లేక ఆధునిక యగానికి నాందియా?’’ అని ఆశ్చర్యపోయింది. ప్రాచీన యుగ నాటకానికి తెరదించుతూ ఆనాటి ఉత్తమ లక్షణాలు ఎల్లకాలం నిలవాలని శారదాదేవి ఆశించింది. ఆధునిక యుగ నాటకానికి నాంది పలుకుతూ నేటి మంచిని ఆహ్వానించింది. కొత్త పాతల మేలు కలయిక అయిన శారదాదేవిని ఆదర్శంగా తీసుకుంటే ‘పాత రోత, కొత్త వింత’ అనీ అన్పించదు. ‘‘గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్’’ అనీ తోచదు.