విజయవాడలో పుట్టిపెరిగిన షరోన్ సాయి ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఉన్నత చదువులు చదివి 1999లోనే ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డారు. ఆ దేశ రాజధాని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. దాదాపు 70 దేశాల్లో పర్యటించి అక్కడి విశ్వవిద్యాలయాల పనితీరును అర్థం చేసుకున్నారు. వాటిలోని మంచి విషయాలను గమనించి తాను పనిచేస్తున్న చోట వాటిని అమల్లో పెట్టి ఉత్తమ ఉపాధ్యాయినిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అత్యున్నత అవార్డులూ అందుకున్నారు. మామూలుగానైతే ఏ చీకూచింతా లేని జీవితం. కానీ రొమ్ము కేన్సర్‌తో తన సోదరి మరణించడంతో షరోన్ సాయి కుంగిపోయారు. ఆ బాధ నుంచి బయటికొచ్చాక ఆమెలో ఆలోచన మొగ్గ తొడిగింది. 'ఎందుకు ఇంతమంది మహిళలు క్యాన్సర్‌తో చనిపోతున్నారు? ముందునుంచే కాస్త జాగ్రత్తపడితే దీన్ని కొంతమేరకైనా నివారించలేమా?' అనిపించిందామెకు. 'ఇదొక్కటే కాదండి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చెయ్యడానికి ఆస్ట్రేలియా వస్తున్న భారతీయ యువతలో పాతిక శాతం మంది మధుమేహం, రక్తపోటు వంటివాటితో బాధపడుతున్నారని అక్కడి ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వాటిని చూస్తే ఎవరికైనా మన దేశం ఎటు పోతోందా అనే బాధ తప్పకుండా కలుగుతుంది' అన్నారామె.
యువతే కీలకం
సెలవుల్లో పుట్టినిల్లు విజయవాడకు వచ్చినప్పుడు తనకు తెలిసిన ఒకటి రెండు కాలేజీలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడేవారు షరోన్. ఆమె మాటలతో ప్రభావితమై వారిలో కొందరు తమ జీవనశైలిని మార్చుకున్నారు. దాంతో ఆమెకు ఏం చెయ్యాలో తెలిసింది. 'మొక్కయి వంగనిది మానై వంగునా' అన్న సామెత మనకు ఉండనే ఉంది. యువతలో దురలవాట్లను మొగ్గలోనే తుంచేసి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రేరేపించగలిగితే తాను అనుకున్న లక్ష్యానికి చేరువకావడం సులువనిపించింది ఆమెకు. వెంటనే తాను చేస్తున్న ఉద్యోగానికి ఏడాదిపాటు శెలవు పెట్టేసి ఇక్కడకు వచ్చారు. మన రాష్ట్రంలోని కాలేజీలను చుట్టబెడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందడం ఎలాగో వివరిస్తున్నారామె. తాను రూపొందించిన 'స్క్రీమ్ ఔట్ - స్టే ఫ్రెష్' కార్యక్రమం ద్వారా భావి పౌరుల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు.
గడప తొక్కనివ్వడం లేదు!
ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కాలేజీలను సందర్శిస్తారు షరోన్ సాయి. రెండు నుంచి నాలుగు గంటల పాటు విద్యార్థులకు వివిధ ఆరోగ్య అంశాలపైన అవగాహన కల్పిస్తారు. అయితే ఇదంతా నల్లేరు మీద నడకలాగా ఏమీ సాగటం లేదు. "కొన్ని కాలేజీల్లో గేటు లోపలకు సైతం అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటారు. మరికొన్ని కాలేజీల్లో మరోసారి చూద్దాంలెండి అంటారు. ఇప్పుడు అడ్మిషన్లు, మరికొన్నాళ్లు పోతే పరీక్షలు అని చెప్పేస్తారు...' అని బాధపడుతున్నారామె. ఆమె బాధలో సత్యముంది. షరోన్ చేస్తున్న ఉద్యోగానికి ఏడాదిపాటు శెలవు పెట్టేసి మరీ ఈ పని చేపట్టారు. శెలవులో ఉండటం వల్ల ఆమెకు జీతం రాదు. బంధుమిత్రులందరూ వారిస్తున్నా సరే, ఇప్పటిదాకా దాచుకున్న సొమ్మునంతా ఆ కార్యక్రమం కోసమే ఖర్చు చేస్తున్నారు. 'ఉచితంగా చేస్తానని ఎంత చెప్పినా వినడం లేదండీ' అంటున్నారామె. చాలా తక్కువ కాలేజీల యాజమాన్యాలు మాత్రం షరోన్ చేస్తున్న పని విలువను గుర్తిస్తున్నాయి. వాళ్లు మాత్రం తమ విద్యార్థుల్లో మరింత అవగాహన కల్పించడానికి ఆమెను ఆహ్వానిస్తున్నారు. 'ఎన్ని ఇబ్బందులెదురైనా నేను వెనక్కి తగ్గను. అనుకున్నది సాధిస్తాను. నేను ఏడాది పాటు తిరగడం వల్ల కనీసం వందమంది విద్యార్థులైనా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకుంటే అదే నాకు పదివేలు' అంటున్నారు షరోన్.
ఫలితాలున్నాయి
ఇబ్బందులున్నా, షరోన్ పట్టుదలగా ముందుకే సాగుతున్నారు. అయితే ఆమె కష్టం ఊరికే పోవడం లేదు. 'సింగపూర్ ఎయిర్‌పోర్టులో ముగ్గురు ఉపాధ్యాయులు ఇక్కడివాళ్లే కనిపించారు. నేను వాళ్ల కాలేజీకి వెళ్లి ఆరోగ్య అవగాహన కల్పించిన తర్వాత వాళ్లు ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నామని, చాలా మార్పును గమనించామని చెప్పుకొచ్చారు. గుంటూరు బస్సులో వెళుతున్నప్పుడు ఓ పద్దెనిమిదేళ్ల అమ్మాయి ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నానని చెప్పింది...' అని ఆనందంగా చెప్పారామె. 'ఊరికే పాఠాలు బట్టీపట్టడం వల్ల మన విద్యార్థుల్లో సృజనాత్మకత చచ్చిపోతోంది. వందకు వంద మార్కులొస్తే అదే ప్రతిభ అనుకుంటున్నారు తప్ప, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సొంతంగా ఆలోచించేందుకు తోడ్పడటం లేదు. నేను 70 దేశాల్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేశాను. ఎక్కడా మన దగ్గర ఉన్నలాంటి రుబ్బుడు, రొడ్డకొట్టుడు పద్ధతి లేదంటే నమ్మండి. ఈ చదువుల వల్ల పిల్లలు ఆటలాడటం లేదు.
కోరిందల్లా కొనివ్వడం వల్ల ఆరోగ్యం పాడవుతోంది. శరీరం చురుగ్గా లేకపోతే మెదడు ఏం చురుగ్గా ఉంటుంది?' అని ప్రశ్నిస్తున్నారు షరోన్. ఆటలాడకపోవడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలకు తోడు పిల్లల్లో స్పోర్టివ్ స్పిరిట్ పోయి వాళ్లు పెద్దయినప్పుడు స్వార్థపరులుగా అయిపోతున్నారని బాధపడుతున్నారామె. దీన్ని నివారించడానికి అటు ప్రభుత్వాలూ, ఇటు పౌరులూ కలిసి పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నది ఆమె లక్ష్యం. మన భావి పౌరులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గట్టిగా చెబుతున్నారు షరోన్. ఆహ్వానిస్తే ఏ కాలేజీకైనా రావడానికి తాను సిద్ధమంటున్నారు ఆమె.
షరోన్ సాయి ఫోన్ నెంబర్ : 97032 01225
ఏమిటీ కార్యక్రమం
షరోన్ సాయి ప్రసంగమంతా 'స్క్రీమ్ ఔట్ - స్టే ఫ్రెష్' చుట్టూ నడుస్తుంది. ఈ పదాల స్పెల్లింగుల్లో ప్రతి అక్షరమూ మనకు అత్యంత అవసరమైన ఒక్కో అంశాన్ని సూచిస్తుంది.
ఎస్ : స్లాష్ ఎక్సెసివ్ సుగర్ : తినే తిండిలో చక్కెరల స్థాయి తగ్గించుకోవాలి
సి : కట్ సిగరెట్ : ధూమపానం మంచిది కాదు
ఆర్ : రెడ్యూస్ రిఫైన్డ్, ప్యాకేజ్‌డ్ ఫుడ్ : ఎక్కువ ప్రాసెస్ చేసి ప్యాకెట్లలో అమ్మే పదార్థాలు తినకూడదు
ఇ : ఎలిమినేట్ ఇనాక్టివిటీ : బద్దకాన్ని పారద్రోలండి
ఎ : ఎవాయిడ్ ఆల్కహాల్ : మద్యపానం మానేయండి
ఎమ్ : మినిమైజ్ మీట్ : మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి
ఇక స్టే ఫ్రెష్
ఎఫ్ : ఫోకస్ ఆన్ హెల్త్ : శారీరక దృఢత్వం మీద దృష్టి పెట్టండి
ఆర్ : రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ : ఏదో ఒక వ్యాయామం నిత్యం చెయ్యండి
ఇ : ఈట్ లోక ల్ ఫుడ్ : స్థానికంగా పండించే, చౌకగా దొరికే పండ్లు, కూరగాయలను తినండి
ఎస్ : సిట్ ఇన్ సైలెన్స్ : ఉదయం లేవగానే, రాత్రి పడుకోబోయే ముందు కనీసం పదేసి నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి.
హెచ్ : హేవ్ ఫెయిత్ ఇన్ యువర్‌సెల్ఫ్ : ఆత్మవిశ్వాసం ఉంటే అన్నీ ఉన్నట్టే.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక