మనం చేసే పని సరైనది నమ్మితే ఏ పనైనా సునాయాసంగా చేయగలిగే సత్తా ఆడవాళ్లలో ఉంది. మహిళలు వ్యాపారం చేయాలంటే బ్యూటీ, బొటిక్‌లకి మించింది లేదనే ఆలోచన నుంచి బయటపడాలి. అలాగే కాలు నొప్పి, కడుపు నొప్పి అని ఇంట్లో కూర్చోవద్దు. పనిలో పడితే బుర్ర, మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. చురుకుగా తయారవుతారు.
"మేము హైదరాబాద్ రాకముందు సూరత్, బెంగళూరుల్లో ఉన్నాము. మాది మార్వాడీ కుటుంబం కావడంతో ఆడవాళ్లు పెద్దగా ఉద్యోగాలు చేయరు. నేను కూడా నా పెళ్లయ్యాక ఆరేళ్లు గృహిణిగానే ఉన్నాను. బుర్రలో మాత్రం ఏదైనా పని చేస్తే బాగుండనే ఆలోచనలు తిరుగుతుండేవి. ఆ ఆలోచనను మా అత్తగారు బాగా గ్రహించారు. ఎందుకంటే ఖాళీ సమయంలో మిగతా వాళ్లలా టి.వి. చూడడం, గాసిప్స్ మాట్లాడడం వంటివి చేసేదాన్ని కాదు. సమయం దొరికితే ఏదో ఒక పుస్తకం పట్టుకుని చదువుకునేదాన్ని. కాలక్షేపం పుస్తకాలు తప్ప ఏ పుస్తకమైనా ఓకే నాకు. నన్ను, నా అలవాట్లను గమనించిన తరువాత ఇంటి నుంచి చేసే పనేదైనా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను బిఎస్సీ టెక్స్‌టైల్ డిజైనింగ్ చదువుకున్నాను. పెళ్లయిన తరువాత జువెలరీ డిజైనింగ్ కోర్సు కూడా చేశాను. దాంతో సూరత్‌లో ఉండగా ఇంటి నుంచి, బెంగళూరు వచ్చాక షాపు ఏర్పాటుచేసి డైమండ్ జువెలరీ వ్యాపారం చేశాను. దాదాపు ఎనిమిదేళ్లు నేనే ఆ షాపు నడిపాను. ఆ పని చేసేటప్పుడు ఇంటినుంచి ఉదయం బయల్దేరితే సాయంత్రం తిరిగి ఇంటికెళ్లే వరకు ఒక్క చుక్క నీరు తాగేదాన్ని కాదు. తినేదాన్ని కాదు. కారణం షాపులో గాని, చుట్టుపక్కల గాని టాయిలెట్ సౌకర్యం లేకపోవడమే. మార్కెటింగ్ పనిమీద బయట ఎంతసేపు తిరగాల్సి వచ్చినా కూడా అదే పరిస్థితి. దానివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.
జువెలరీ వద్దనుకున్నాను
ఆ తరువాత మా ఆయన ఉద్యోగరీత్యా 2008లో హైదరాబాద్‌కి వచ్చాము. హైదరాబాద్ వచ్చాక జువెలరీ వ్యాపారం చేయొద్దని నిర్ణయించుకున్నాను. అందుకని ప్రింటింగ్ క్యాట్రిడ్జ్‌ల రీఫిల్లింగ్ వ్యాపారం చేశాను. 2009లో సెంటర్ ఫర్ సోషల్ ఇనిషియేటివ్ అండ్ మేనేజ్‌మెంట్ (సిఎస్ఐఎమ్)లో ఎన్జీవో మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన కోర్సు చేశాను. అది పూర్తయ్యాక రైళ్లలోని బయో టాయిలెట్లను అమర్చే 'ఓఇఎమ్స్' అంటే ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మానుఫాక్చరర్స్‌కు సర్వీస్ ఏజెంట్‌గా పనిచేశాను. ప్రారంభంలో మా ఎదుట ఉన్న సవాల్ - భారతీయ రైల్వేలకి అమ్మిన టాయిలెట్స్ సరిగా పనిచేస్తున్నాయా లేదా చూడడం. అవి సరిగా పనిచేసేందుకు మా టీం 24 గంటలూ పనిచేసింది. అప్పుడు మేము పడిన కష్టం అంతా ఇంతా కాదు.
బయోలూతో పరిష్కారం
రైళ్లలో ఏర్పాటుచేసిన బయో టాయిలెట్లు డిఆర్‌డిఒ శాస్త్రజ్ఞుల సృష్టి. అయితే ఈ టాయిలెట్లని రైళ్లతో పాటు వ్యాన్‌ల వంటి పెద్దపెద్ద వాహనాల్లో ఏర్పాటుచేసుకుంటున్నారు. వీటిని కనీసావసరాలు లేని గ్రామాల్లో, ఇరుకుగా ఉండే మురికివాడల్లో నివసించే వాళ్లకు కూడా ఏర్పాటుచేయొచ్చు కదా అనిపించింది నాకు. నా ఆలోచనకు తగ్గట్టుగా వాటిని డిజైన్ చేసి డిఆర్‌డిఒ వాళ్లను సంప్రదించాను. కొన్ని మార్పులుచేర్పుల తరువాత వాళ్లు ఆ డిజైన్‌కు ఓకే చెప్పారు. వాటికే 'బయోలూ' అని పేరుపెట్టి తయారీ మొదలుపెట్టాను. ఈ టాయిలెట్లని ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. రెడీమేడ్‌గా ఉంటాయి కాబట్టి రెండుగంటల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కువ స్థలం కూడా అక్కర్లేదు. మురుగు కాలువ వ్యవస్థ లేని దగ్గర వీటికి మించిన పరిష్కారం లేదు. దీని ప్రత్యేకత ఏమిటంటే... టాయిలెట్ కింది భాగంలో ఒక బాక్స్ ఉంటుంది. అందులో బయో డైజెస్టివ్స్(బ్యాక్టీరియా) ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మలాన్ని తిని నీటిని మాత్రం బయటికి వదులుతాయి. అలా వదిలిన నీటిని గార్డెనింగ్‌కి వాడొచ్చు. లేదా అలానే వదిలేసినా భూమికి నీటి సారం అందించిన వాళ్లమవుతాం. దీని ధర ఇప్పుడయితే 22 వేల రూపాయలు. టాయిలెట్ తయారీకంటే రవాణాకే ఎక్కువ ఖర్చవుతోంది. అందుకని డిజైనింగ్‌లో కొన్ని మార్పులు చేసి ధరని ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు వంద బయో టాయిలెట్స్ నిర్మించాం.
ప్రతీ ఇంటి అవసరం
ఈ టెక్నాలజీతో మా కంపెనీకి పెద్ద కంపెనీల పక్కన స్థానం కలిగింది. బయోటాయిలెట్లను పబ్లిక్ ప్రదేశాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, నిర్మాణాలు జరిగే దగ్గర, కొండ ప్రాంతాల్లో - ఎక్కడ మురుగు నీటి కాలువ వ్యవస్థ లేదో అక్కడ నిర్మించుకోవచ్చు. బీహార్, జార్ఖండ్‌లలో బయో టాయిలెట్లను అందుబాటులోకి తేనున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామాలతో పోలిస్తే అక్కడి గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది, భువనేశ్వర్, కలకత్తాల్లో 22 మంది ఉద్యోగులు మా కంపెనీకి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల్లో పనిచేసేందుకు మరింత మంది ఉద్యోగులు కావాలి. టాయిలెట్స్‌కి సంబంధించిన పని అని చాలామంది ఆసక్తి కనపర్చరు. మా కంపెనీలో పనిచేసే వాళ్లు మొదట్లో కొన్నాళ్లు తామెక్కడ పనిచేస్తున్నామో చెప్పేవారు కాదట. కాని ఇది ప్రతీ ఇంటి అవసరమని గుర్తించాలి. ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు.
చివరగా మహిళలకి ఒక విషయం చెప్తాను. 1999 నుంచి నేను వ్యాపారరంగంలో ఉన్నాను. ప్రారంభంలో నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా భయపడేదాన్ని. కాని ఈ రోజున వ్యాపారరంగంలో ఉన్న మగవాళ్లు ఎలాగైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. శారీరకంగా, మానసికంగా కూడా ఎంతో దృఢంగా తయారయ్యాను. మనం చేసే పని సరైనది నమ్మితే ఏ పనైనా సునాయాసంగా చేయగలిగే సత్తా ఆడవాళ్లలో ఉంది. మహిళలు వ్యాపారం చేయాలంటే బ్యూటీ, బొటిక్‌లకి మించింది లేదనే ఆలోచన నుంచి బయటపడాలి. అలాగే కాలు నొప్పి, కడుపు నొప్పి అని ఇంట్లో కూర్చోవద్దు. పనిలో పడితే బుర్ర, మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. చురుకుగా తయారవుతారు'' అని ముగించారు.