నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన పూనమ్ అమెరికాలోని యూనివర్శిటీలో ఉచితంగా చదువుకొనే అవకాశం దక్కించుకుంది. అదెలాగో చదవండి.నమ్ పుట్టి పెరిగింది హర్యానాలోని కైతా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో. ఆమె తండ్రి సురేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పూనమ్ డిగ్రీ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకుంది. ఎప్పుడూ క్లాస్ ఫస్ట తనే! తండ్రికి కష్టం కలిగించకుండా... సాయంత్రం ట్యూషన్లు చెప్పుకొని వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుక్కొనేది. తమ్ముడూ, చెల్లికి కావల్సిన అవసరాలూ తనే చూసేది. పూనమ్ వాళ్ల గ్రామంలో ఆడపిల్లలను బయటకు పంపడం చాలా తక్కువ. కాలేజీ చదువంటే తల్లిదండ్రులు ముందుకొచ్చేవారు కాదు. అలాంటిది పూనమ్ ఇంట్లో వాళ్లని బలవంతంగా ఒప్పించి.. తనతోపాటు చెల్లికూడా చదువుకొనేలా ప్రోత్సహించింది. ట్యూషన్లు చెబుతూనే డిగ్రీ వరకూ చదివిన పూనమ్ ఎమ్మెసీకి ప్రవేశ పరీక్ష రాస్తే పంజాబ్ యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఇల్లు వదిలిపెట్టి వచ్చి యూనివర్సిటీలో చదువుకుంటానంటే చాలామంది పూనమ్ కుటుంబసభ్యుల్ని విమర్శించారు. అయినా వాళ్లు లెక్క చేయకుండా యూనివర్సిటీకి పంపారు. కష్టపడి చదివి 99 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసింది. పీహెచ్‌డీ కోసం అమెరికాలోని కరోలినా యూనివర్శిటికీ ప్రవేశ పరీక్ష రాసింది. అందులో మంచి ర్యాంకు సాధించింది. ర్యాంకు తెచ్చుకున్నందుకే కాదు, ఆమె ఎంత కష్టపడి పైకి వచ్చిందో తెలుసుకొని అభినందిస్తూ... యూనివర్సిటీ పూనమ్‌కు యాభై వేల డాలర్లు అంటే ముప్ఫై లక్షల ఉపకార వేతనంతోపాటు పీహెచ్‌డీ పూర్తయ్యే వరకూ ఖర్చులు భరించడానికి ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతోంది. వీసా కోసం దరఖాస్తు చేస్తుంటే ఈ విషయం బయటకు వచ్చింది. అది తెలిసి... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర్ హుడా పూనమ్‌ని ప్రత్యేకంగా కలిసి అభినందించడమే కాదు తన తమ్ముడూ, చెల్లీ చదువుకోవడానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు.
0 Comments
|