పేదవాళ్లకు ప్రభుత్వ పథకాలు అందాలంటే... ముందు పేదవారిగా గుర్తింపు పొందాలి. ఆ గుర్తింపు వస్తే చౌక ధరకు బియ్యం వస్తుంది. ఉపాధి హామీ లభిస్తుంది. రుణాలొస్తాయి. ఇంకా ఇలాంటివెన్నో అందుతాయి. కానీ ఏ గుర్తింపూ లేని వారి పరిస్థితి ఏంటి..? ఒక చిరునామా లేకుండా ఊరూరా తిరిగే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది? అలాంటి అభాగ్యుల సంఖ్య దేశవ్యాప్తంగా 60 లక్షలట! అందులోనూ ఒక్క గుజరాత్‌లోనే 40 లక్షల మంది ఉన్నారంటే నమ్మగలరా? బండి కట్టుకుని ఏదో ఊరెళ్లడం, అక్కడో వారం రోజులుండటం, అక్కడివాళ్లు పెట్టింది తిని, సంపాదించిన నాల్రూపాయలు మూటకట్టుకుని ఇంకో ఊరికి వెళ్లడం... ఇదీ కథ. గుజరాత్‌లో దాదాపు 300 తెగలకు చెందిన ఇలాంటి కుటుంబాలు తమకంటూ ఓ గుర్తింపు లేకుండా, ఓ గూడు లేకుండా బతుకుతున్నాయి. పిట్టల్ని కొట్టేవాళ్లు, వెదురు వస్తువులు చేసేవాళ్లు, గంగిరెద్దుల్ని, కోతుల్ని ఆడించేవాళ్లు, డ్యాన్సులు చేసేవాళ్లు... ఇలా రకరకాల వ్యక్తులు ఈ కోవలోకే వస్తారు.
ఆరేళ్ల క్రితం జర్నలిజం విద్యార్థిగా ఉన్నపుడు గుజరాత్‌కి చెందిన మిట్టల్ పటేల్ వీరిపై దృష్టి పెట్టింది. వారి కష్టాల్ని కళ్లారా చూసింది. ఓ ఇరవై ఏళ్ల క్రితమైతే వారి పరిస్థితి మెరుగే. గ్రామాల్లో వీరి విన్యాసాలు బాగానే వినోదం పంచేవి. కాసులు రాల్చేవి. కడుపు నింపేవి. ఇలాంటి బృందం ఊళ్లోకి వచ్చిందంటే... సాయంత్రం పూట తీరిక చిక్కాక జనమంతా ఒకచోటికి చేరేవారు. వారి ప్రదర్శనలు ముగిశాక తమకు తోచింది ఇచ్చేవారు. తిండి పెట్టేవారు. కానీ దేశంలో సాంకేతిక విప్లవం మొదలయ్యాక క్రమంగా ఇలాంటి ఆటలకు ఆదరణ తగ్గింది. టీవీలు వచ్చాక జనం వీరిని కన్నెత్తి కూడా చూడడంలేదు. తన పరిశోధనలో తెలిసిన విషయాలతో మిట్టల్ తీవ్రంగా కలత చెందింది. వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. స్నేహితుల సహకారంతో ‘విచారత సముదాయ సమర్థన్ మంచ్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మొదలైంది అసలు కథ.పట్టు వదల్లేదు!ముందుగా ఈ వలస పక్షులకు ఓ గుర్తింపు తెచ్చిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది మిట్టల్.
ప్రభుత్వ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగింది. చివరికి వారి పంచాయితీల నుంచి వారిని గ్రామస్థులుగా గుర్తిస్తున్నట్లు లేఖలు తెమ్మన్నారు. ఐతే ఇది అంత సులభంగా సాధ్యం కాలేదు. చాలా గ్రామాల్లో పెద్దలు, సర్పంచులు వారిని తమ గ్రామస్థులుగా గుర్తించడానికి ఒప్పుకోలేదు, ఓటరు జాబితాలో వారికి చోటిస్తే... వారి అవసరాల్ని తీర్చాల్సి వస్తుందన్న భయంతో! మిట్టల్ అలాంటి వారితో సమావేశాలు ఏర్పాటు చేసి, పదే పదే నచ్చజెప్పి విజయం సాధించింది. తర్వాత వారి వివరాల్ని రికార్డుల్లోకి ఎక్కించే పని చేపట్టింది. ఐతే సరైన పేర్లు కూడా లేని, కనీసం వయసు కూడా చెప్పుకోలేని దుస్థితి చాలామందిది. ఎలాగోలా దరఖాస్తులు నింపిన తర్వాత వెరిఫికేషన్ దశ దాటడం మరో సమస్య. ఈ క్రమంలో ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాల చుట్టూ మిట్టల్ బృందం కొన్ని వందలసార్లు తిరిగింది. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. దాదాపు 20 వేల మందికి ‘గుర్తింపు’ లభించింది. ఓటర్ ఐడీ కార్డులు లభించాయి. అది మిట్టల్ బృందం సాధించిన చారిత్రక విజయం.
తర్వాత మరో బృహత్తర ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది మిట్టల్. నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడి ఈ వలస జీవుల కోసం ఒక తీర్మానాన్ని సాధించింది. వారికి భూమి హక్కు కల్పించింది. తొలి దశలో 502 మందికి ఇంటి స్థలాలు లభించాయి. తర్వాత ఈ తెగల పిల్లల కోసం టెంట్ స్కూల్స్ ఏర్పాటు చేయించింది. పడుపు వృత్తిలో ఉన్న ఈ తెగల ఆడపిల్లల్ని బయటికి తెచ్చింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామూహిక వివాహాలు జరిపించింది.ఈ విజయాలన్నీ మిట్టల్ ఐదేళ్ల వ్యవధిలో సాధించినవి. చదవడానికి ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించవచ్చు కానీ... వ్యవస్థనే కదిలించి, వేలాది మంది జీవితాల్లో వెలుగు తేవడానికి మిట్టల్ చేసిన ప్రయత్నం, పడిన కష్టం అనితర సాధ్యమైనది. అయితే ఆమె ప్రయత్నం ఇంతటితో ఆగిపోలేదు. మొత్తం దేశంలో ఉన్న 60 లక్షల మంది వలస జీవులకూ ఓ గుర్తింపు లభించి, ‘మేము భారతీయులం’ అని తలెత్తుకుని చెప్పగలిగినప్పుడే ఆమె విశ్రమించేది!