క్రిమికీటకాలు లేకుండా ప్రకృతి శోభిల్లదనేది కొంతమందికే తెలుసు. అలాంటి వారు ప్రకృతిలోని ప్రతి పురుగునూ ప్రేమిస్తారు. అవి అంతరించిపోకుండా పాటుపడతారు. ఈ కోవకు చెందినశుభలక్ష్మి (42) జీవవైవిధ్య పరిరక్షణకు తన వంతు కృషి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. ముంబైకి చెందిన ఆమె దట్టమైన అడవుల్లోకి వెళ్లి అందమైన సీతాకోకచిలుకలను, కాంతులీనే కీటకాలను సేకరించటం ఓ అలవాటుగా చేసుకుంది. ఈ అలవాటే కీటకాలపై పరిశోధన చేసే దిశగా అడుగులు వేయంచడంతో- శుభలక్ష్మి డాక్టరేట్‌ను సాధించింది. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌ల్లోని దట్టమైన అడవుల్లో ప్రతి చెట్టూ ఆమెకు సుపరిచితమే. అక్కడ ఎగిరే సీతాకోకచిలుకలన్నీ ఆమెకు నేస్తాలే. అటవీ ప్రాంతంలో రాత్రి వేళ సంచరిస్తూ కీటకాలను పట్టుకోవడం అంటే ఆమెకు ఎంతో సరదా. చిన్నపాటి బోను, తెల్లటి దుప్పటి, 165 మెగావాట్ల మెర్క్యూరీ లైట్- ఇవే ఆమె ఆయుధాలు. దట్టమైన అడవుల్లో రెండు చెట్ల మధ్య దుప్పటి ఏర్పాటు చేసి అక్కడ లైటు ఉంచితే- ఆ కాంతికి సీతకోకచిలుకలు చేరుతాయి. వెంటనే వాటి గురించి అక్కడే నోట్సు రాసుకొని ఫొటోలు తీసుకుంటుంది. ఇలాంటి కష్టతరమైన వృత్తిని అమ్మాయిలు ఎంపికచేసుకోరు. కానీ, శుభలక్ష్మి దీన్ని ఎంపిక చేసుకోవటం ఆమె నిర్భయత్వానికి నిదర్శనం.
ఇప్పటి వరకూ మహారాష్టల్రో 419 రకాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 500 రకాలకు చెందిన కీటకాల వివరాలను సేకరించి ఆమె అధ్యయనం చేసింది. అరుదైన కీటకాలను, సీతాకోకచిలుకలను ఎన్నింటినో శుభలక్ష్మి వెలుగులోకి తెచ్చింది. నేడు ఎవరైనా ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌కు వెళితే అరుదైన, అందమైన సీతాకోకచిలుకలను, వివిధ జాతులకు చెందిన కీటకాలెన్నింటినో చూడవచ్చు. కార్పెంటర్ తేనెటీగ అనేది మయన్మార్‌లోనే ఉంటుందని చాలామంది భావిస్తారు. శుభలక్ష్మి వాటిని సేకరించి ఈ పార్క్‌లో ఉంచింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన 12 అడుగుల చిమ్మట జాతికి చెందిన ఓ కీటకాన్ని కూడా ఆమె వెలుగులోకి తెచ్చింది. పురుషులు మాత్రమే వచ్చే ఈ రంగంలోకి మీరెందుకు వచ్చారని ఎవరైనా అడిగితే, చిన్నతనం నుంచి ఏ కీటకాన్ని చూసినా తనకు విపరీతమైన భయమని, అయితే ప్రకృతి అంటే ఎంతో ఇష్టమని, కీటకాల పట్ల ఉన్న భయాన్ని తొల గించుకునేందుకు వాటిపై అధ్యయనం చేయాలన్న ఆసక్తి తనలో పెరిగిందని ఆమె చెబుతుంటారు.
మనదేశంలో కీటకాల అధ్యయానికి సంబంధించి వేళ్లమీద లేక్కించే శాస్తవ్రేత్తలే ఉన్నారు. 2004లో వీటిపై శుభలక్ష్మి డాక్టరేట్ సాధించిన తరువాత, పలు డాక్యుమెంట్లను మహారాష్టల్రో విడుదల చేశారు. దీంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులు, టీచర్లు, పర్యావరణవేత్తలు పురుగులు, సీతాకోకచిలుకలు, కీటకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆమె నుంచి తెలుసుకునేవారు.
2011లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఓ ఉపాధ్యాయురాలు ఓ పట్టుపురుగుకు సంబంధించిన ఫొటోను శుభలక్ష్మికి పంపారు. ఆ ఫొటోలోని పురుగును ఎవరూ గుర్తించలేదని, దానికి సంబంధించిన సమాచారం కూడా లభ్యం కావటం లేదని ఆమె రాసింది. దాంతో 10 రోజుల పాటు అరుణాచల్‌ప్రదేశ్ అడవులలో పగలూ, రాత్రి సంచరించి ఆ పురుగుకు సంబంధించిన వివరాలను సేకరించగలిగానని శుభలక్ష్మి తెలిపారు.
ఇప్పటివరకు సుమారు 500 రకాల కీటకాల వివరాలను సేకరించి డాక్యుమెంట్లు రూపొందించినట్లు ఆమె తెలిపారు. ముంబై నేచురల్ సొసైటీకి చెందిన నరేష్ చతుర్వేది ఆమెకు గైడ్‌గా వ్యవహరించారు. సీతాకోకచిలుకలపై పరిశోధన చేస్తున్నపుడు ఆయన ఓ విలువైన సూచన చేశారు. ఇప్పటివరకూ ఈ జాతులకు సంబంధించిన సరైన ప్రాథమిక సమాచారమే లేదని, ఆమె పరిశోధన ఫలితంగా రాబోయే తరానికి విలువైన సమచారం అందాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన మాటలే తనకు శిరోధార్యమయ్యాయని, అందుకే ఎలాంటి భయం లేకుండా కీటకాలకు సంబంధించిన ఎన్నో వివరాలను సేకరించి పుస్తకాల రూపంలో నిక్షిప్తం చేశానని ఆమె తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా 1,20,000 జాతుల సీతాకోక చిలుకల వివరాలు రికార్డుల రూపంలో లభ్యమవుతున్నాయని, మనదేశంలో 12,000 రకాలపై వివరాలున్నట్లు ఆమె తెలిపారు. అటవీ జంతువులు, పక్షులు, కీటకాలకు సంబంధించిన జాతులను భద్రపరిచే సంజయ్‌గాంధీ నేషనల్ పార్క్‌లోకి ఆమె 1993లో అడుగుపెట్టింది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ వాటితో అనుబంధాన్ని పెంచుకొని, వాటి సంరక్షణే ధ్యేయంగా సేవలందిస్తోంది. ఆ పార్క్ సిబ్బంది ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతుంటారు. పార్క్‌కు చెందిన ఓ అసిస్టెంట్, ఓ డ్రైవర్ మాత్రమే ఆమెకు తోడుగా అడవుల్లోకి వెళతారు. రాత్రివేళ పులులు, భయంకరమైన పాములు సంచరిస్తున్నా ఎలాంటి భయం లేకుండా ఆమె తిరగటం చూసి పార్క్ సిబ్బంది ఆశ్చర్యపోతారు. సంజయ్ గాంధీ పార్క్‌కు వెళ్లే సందర్శకులు అక్కడి సీతాకోకచిలుకలు, కీటకాలను చూసి పరవశించి పోతారు. అవి అంత అందంగా కనువిందు చేస్తున్నాయంటే శుభలక్ష్మి కృషి దాగివుంది. అడవుల్లోకి వెళితేనే కొన్ని కీటకాల జాతులను మాత్రమే చూడగలం. పట్టణాలు, నగరాల్లో వాటి ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారింది. కనీసం మన ఇళ్ళలో పెంచుకునే గార్డెన్‌లలో సైతం సీతాకోకచిలుకల జాడ లేదు. పొలాల్లో పురుగుమందులు, రసాయన ఎరువుల ప్రభావంతో ఇవి కనుమరుగవుతున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడేలా వీటిని గనుక మనం రక్షించుకోకపోతే రాబోయే కాలంలో ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం ఖాయమని శుభలక్ష్మి అంటున్నారు. ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనే వాస్తవాన్ని చిన్నారులకు మనం నేర్పితే- సీతాకోకచిలుకలు, కీటకాలు వంటివి కనుమరుగు కావని ఆమె నమ్ముతోంది.