మా అమ్మనాన్నలు బాగా చదువుకున్న వాళ్లు. నాతో పాటూ చదువుకున్న వాళ్లు ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో చేరిపోవాలని అనుకుంటున్నప్పుడు నేను జర్నలిజంలో పీజీ చేస్తానని చెప్పా. అమ్మానాన్నలూ ఒప్పుకున్నారు. పీజీ అయ్యాక ఓ ప్రైవేటు సంస్థలో చేరా. చిన్నప్పట్నుంచీ నాకు పత్రికలు చదవడం అలవాటు. ఒకసారి ఓ మారుమూల గ్రామం వెళ్లా. అక్కడ ఒక్క పత్రికా దొరకలేదు. చాలా వెలితిగా అనిపించింది. అప్పుడు ఆలోచిస్తే చూపులేని వాళ్ల పరిస్థితి ఏంటీ అనిపించింది. ఆరా తీస్తే మన దేశంలో చూపులేని విద్యావంతులు యాభైలక్షల మందికి పైనే ఉన్నట్లు తెలిసింది. వాళ్ల కోసం ఓ మ్యాగజైన్ తీసుకొస్తే అని ఆలోచించా.
వెంటనే ముంబయిలోని 'నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్త్లెండ్ (ఎన్‌ఏబీ)' అధికారుల వద్దకెళ్లి నా ఆలోచన చెప్పా. 'ఇరవై మూడేళ్ల అమ్మాయి... బ్రెయిలీలో మ్యాగజైన్ తీసుకురావడం సాధ్యమేనా' అన్నారు. కాస్త నిరుత్సాహం కలిగినా, అది కొన్ని రోజులే. ఆంగ్ల పత్రికలు తిరగేశా. చూపులేని వాళ్లతో మాట్లాడి ప్రతినెలా ఎలాంటి సమాచారం ఇవ్వొచ్చో తెలుసుకున్నా. ఖర్చుఎక్కువ అయినా రెండు గదులు అద్దెకు తీసుకున్నా. నాలుగు నెలలు రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరిగాక 'వైట్ ప్రింట్' పేరుతో పత్రిక తెచ్చేందుకు అనుమతి లభించింది.
ఓ బ్లాగు ప్రారంభించి, ఫ్రీలాన్స్ జర్నలిస్టులను ఆహ్వానించా. ఇవన్నీ సరే... డబ్బులు కావాలిగా! నేను ఉద్యోగం చేస్తున్నా వచ్చేది సరిపోదు! ప్రకటనలు ఇవ్వమని చాలా సంస్థల్ని అడిగా. కొందరయితే 'మా ఉత్పత్తులు గుడ్డి వాళ్లకెందుకు..' అనడిగారు. కానీ నేను పడుతున్న కష్టం చూసిన ఎన్‌ఏబీ అధికారులు ఆర్థిక సాయం అందిస్తాం అన్నారు. బ్రెయిలీ ప్రింటర్లు అందిచ్చారు. దాంతో అరవై నాలుగు పేజీలతో... ఆహారం, షాపింగ్, సినిమాలూ, ఆరోగ్యం, కథలూ, స్ఫూర్తి కథనాలూ, ప్రముఖుల ఇంటర్వ్యూలతో పత్రిక తీసుకురావడం మొదలుపెట్టా. జర్నలిస్టు బర్ఖాదత్ దీన్లో ఓ కాలమ్ రాస్తున్నారు. మొదట రెండు మూడు వేల కాపీలు ఉచితంగానే ఇవ్వాలనుకున్నా. ఆశ్చర్యంగా... అంధులు 'మామీద జాలితో ఇవ్వకండి. డబ్బు తీసుకుని ప్రోత్సహించండి' అన్నారు. ఏడాది మొదట్లో ప్రారంభమైన పత్రికకు గత కొన్ని నెలల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలూ ప్రకటనలతో పాటూ ఆర్థిక సాయం చేయడానికీ ముందుకొచ్చాయి. ప్రస్తుతం ముంబయితో పాటూ ప్రముఖ నగరాల్లో ఈ పత్రిక అందుబాటులో ఉంది.