
హిమాలయాల్లో జరిగే సాహసయాత్రను సైకిల్‌పై పూర్తి చేసేందుకు ఆమె ధైర్యంగా ముందుకు వచ్చింది. ఇదే సందర్భంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలని ఆమె సంకల్పించింది. హిమాలయాల్లో బైక్, సైకిల్ రైడింగ్ అంటే ఎంతో ధైర్యం ఉండాలి. అందునా ఓ యువతి ఇలాంటి సాహసం చేయటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ‘హిమాలయన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ టూరిజం ప్రమోషన్ అసోసియేషన్’ అధ్యక్షుడు మోహిత్ సూద్ అంటున్నారు. ఈ అసోసియేషన్, సిమ్లా క్లబ్ సంయుక్తంగా ఈ సాహస కార్యక్రమాన్ని చేపట్టింది. హిమాలయాల్లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి మహిళలకు రొమ్ము క్యాన్సర్ గురించి బేడీ వివరిస్తోంది. దారి పొడవునా గ్రామాల్లో కరపత్రాలు పంచిపెడుతూ తన సాహస యాత్రను కొనసాగిస్తోంది.
శాస్ర్తియ పరిజ్ఞానం ఎంతగా విస్తరిస్తున్నా చాలామంది మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన లేదని ఆమె అంటోంది. దాదాపు 70 మంది సైక్లిస్టులు ఈ యాత్రలో పాల్గొంటుండగా జస్కీరాత్ ఏకైక మహిళ కావడం విశేషం. ఇప్పటికే ప్రారంభమైన ఈ సాహస యాత్ర మషోబ్రా, కుఫ్రీ, మటియానా, నార్కోండ్, హతు, బాఘీ, కద్రాలా, టిక్కర్ మీదుగా నార్కండ్‌కు చేరింది. రొమ్ము క్యాన్సర్ సోకితే సిగ్గుతో ఆ వ్యాధిని దాచుకోవద్దని, చికిత్సతో నివారించుకునేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని ఆమె ప్రచారం చేస్తోంది. కొంతమంది విదేశీయులు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. హిమాలయాల్లో 3,400 మీటర్ల ఎత్తు వరకూ శిఖరాగ్రంపై తన ప్రయాణం సాగుతోందని, రోజుకు 70 కిలోమీటర్ల మేరకు సైకిల్ తొక్కినా ఎలాంటి అలసట లేదని బేడీ చెబుతోంది.