కోట్లాదిమంది జనాల మధ్య మనం ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ప్రత్యక్ష, పరోక్ష సంకేతాల ప్రయత్నంలో చిగురించే చిత్రాలే మరియ లాస్‌నిగ్ని పెయింటింగ్స్‌గా బాహ్యప్రపంచంలో విహరిస్తున్నాయి. మనచుట్టూ ఎన్నో సంఘటనలు తటస్థిస్తుంటాయి. అయినా వాటిని పట్టించుకునే ఓర్పు, సహనం మనకుండదు. ఆ కష్టం, బాధ మనవరకు వస్తే తప్ప ఆ సమస్య అగాధంలోకి తొంగిచూడలేని ఒక నిస్సహాయత స్థితిలో మనం జీవిస్తున్నాం. అందుకే ఈ జీవన పయనంలో అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు, మౌనంగా, కళ్లు మూసుకుని వాటిని ధాన్యిస్తే ఎంత బాగుంటుందో! 'సమాజం నాకు చేసిన మేలు ఏంటి' అని ప్రశ్నించుకోవడంలో మన హీనస్థితిని బహిర్గతం చేసుకుంటామే తప్ప 'ఈ సమాజానికి నేను చేసిన మంచి, మేలు ఏంటి?' అనే ప్రశ్న, సందేహం ఎవరిలో మెదులుతుందో వారిని సమాజం కూడా ఉన్నతశిఖరాల్లోకి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక మంచి ప్రశ్న మరో ఉజ్వలభవితకు బాటలు వేస్తుంది. అలాంటి వారు చైతన్యకెరటంలా దేశాన్ని, ప్రపంచాన్నే ప్రభావితం చేస్తారు. ఇలా ప్రభావితం చేసిన మహిళల్లో మరియ లాస్‌నిగ్ని ఒకరు.
19వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కళాకారుల్లో ఒకరిగా నిలబడ్డారామె. మరియ పెయింటింగ్‌లో అందవేసిన చేయి. టైమ్‌పాస్ కోసమో లేక పేరు ప్రఖ్యాతల కోసం ఆమె ఈ వృత్తిని చేపట్టలేదు. తన దేశంలో అనాదిగా స్త్రీ పడుతున్న వేదనకు ప్రతిస్పందనే ఆమె కుంచె పట్టుకునేందుకు కారణమైంది.
సెప్టెంబరు 8, 1919లో ఆస్ట్రియాలో జన్మించారు. ప్రస్తుతం వియన్నాలో జీవిస్తున్న మరియ పెయింటింగ్‌లో ఎక్కువగా స్త్రీ దేహానికి సంబంధించినవిగా ఉంటాయి. కారణం మహిళ అనగానే లైంగిక వాంఛల్ని తీర్చే ఒక వస్తువుగా భావించే పురుషసమాజంపై ఆమె రగిలిపోయేవారు. వారి వేధింపులకు గురవుతున్న మహిళకు తనవంతు సాయంగా ఏదో ఒకటి చేయాలనే తపన ఆమెను నిలువనిచ్చేది కాదు. ఆ ఆశ మరియను పెయింటింగ్‌వైపు తిప్పింది. స్త్రీకి తన దేహంపై ఎలాంటి హక్కు, స్వేచ్ఛ ఉందో తెలియచెప్పే ప్రయత్నం మరియ తన చిత్రాల ద్వారా చేసి చూపించారు. మహిళలకు కనీస అవగాహన ఉండాలని అంటారు. అందుకే ఆమె పెయింటింగ్స్ అన్నీ 'బాడీ అవేర్‌నెస్ అనే అర్థాన్ని ఇచ్చేలా ఉంటాయి.
చిత్రాల్లో గొప్పతనం
మరియ చిత్రాలను చూడగానే మహిళపై జరుగుతున్న లైంగిక దాడులు కంటికి కనిపిస్తాయి. స్త్రీ మానసికంగా ఎంత బలవంతురాలైనా శారీరకంగా ఆమె బలహీనురాలే. దీన్ని ఆసరాగా తీసుకున్న మగవారు ఆమెను అపురూపంగా చూసుకోవాల్సింది పోయి, తమ పశువాంఛల్ని తీర్చుకునేందుకు వీలైన వస్తువుగా భావిస్తూ, ఆమెపై చేస్తున్న దాడులపై మరియ తీవ్ర ఆవేదనకు గురయ్యేవారు. వియన్నా దేశమైనా, భారతదేశమైనా అమెరికా అయినా అభివృద్ధిచెందినా, చెందకపోయినా స్త్రీ విషయంలో వచ్చేసరికి అన్నిదేశాల్లో పురుషుల్లో మెదిలే భావం మాత్రం ఒకటే. స్త్రీని తక్కువగా చూస్తారు అనేది ఆమె ఉద్దేశం. వారి ఆలోచనావిధానాన్ని విమర్శిస్తూ చిత్రాలను వేయడంలో ప్రావీణ్యతను సంపాదించారు.
చిత్రాలపై డాక్యుమెంటరీ
మరియ తన చిత్రాలను రెండు డాక్యుమెంటరీలుగా రూపొందించి, ప్రేక్షకులకు అందించారు. పారిస్, లండన్, జర్మనీ వంటి దేశాల్లో ఆర్ట్ గ్యాలరీ ద్వారా ప్రదర్శనలకు నోచుకున్నాయి. వియన్నా, వెనిస్, ఆస్ట్రియావంటి పలు ప్రాంతాల్లో వందల ప్రదర్శన ద్వారా మరియ చిత్రాలు లక్షలాది మంది హృదయాన్ని దోచుకున్నాయి. పెన్సిల్స్‌తో ఆర్ట్ వేయడంలో ఆమె దిట్ట.
శిల్పకారిణి కూడా
మరియ పెయింటింగ్‌లోనే కాక శిల్పకారిణి కూడా. తనకున్న చిత్రలేఖనం అనుభవం ద్వారా శిల్పకళారంగంలో ప్రవేశించి, అద్భుత శిల్పాలను ఎన్నింటినో తయారుచేశారు. ఈ శిల్పాలు కూడా పలు ప్రదర్శనల ద్వారా ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఒకవైపు వయసు మీదపడుతున్నా తనకున్న ఆసక్తిని బట్టి, వయసును ఏమాత్రం లెక్కచేయకుండా ఇంకా చిత్రాలను గీస్తూనే ఉన్నారు. అదే తనకు అమితమైన ఆనందాన్ని ఇస్తుందని, మనసు ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడుతుందని అంటారు మరియ.
పేరు తెచ్చిన చిత్రాలు
మరియ 1979లో వేసిన 'స్లీపింగ్ విత్ ఎ టైగర్, 1961లో వేసిన 'ది బ్లూ ఫ్లవర్ ఆఫ్ రొమాంటిజమ్', 'విమెన్ అండ్ హర్ ఎమోషనల్స్' అనే ఈ చిత్రాలకు మంచి పేరుతోపాటు విశ్వఖ్యాతిని అందించాయి. స్త్రీకి ఒక మనసు ఉంది. అది స్పందిస్తుంది, ఆమెకూ కొన్ని వాంఛలు అనేవి ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని, భాగస్వామి సహకరించాలి అనేది మరియ చిత్రాల్లో కనిపించే ప్రధాన భావం. స్త్రీ అనేక సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటుందని, దీన్ని ఎవరూ గమనించరని, దీంతో ఆమె తీవ్రనిరాశ, నిస్పృహలకు గురై, అనారోగ్యం పాలవుతుంటుందని, ఇది నన్ను ఎంతో బాధించే విషయమని, నా చిత్రాలు వీటికే ప్రాధాన్యత ఇచ్చేలా ఉంటాయని చెబుతారు మరియ.
అవార్డులు
మరియ ఈ సంవత్సరం జూన్ నెలలో గోల్డెన్ లయన్ ఫర్ లైఫ్‌టైమ్ అవార్డును పొందారు. ఆర్ట్ అండ్ గ్యాలరీ అవార్డులను ఎన్నో పొందారు. ఏది ఏమైనా మరియ చిత్రాలు అనాదిగా స్త్రీ ఆవేదన, ఆలోచనల రూపకల్పనలే అని చెప్పక తప్పదు.
మూలం : వార్త దినపత్రిక