విజయనగరం జిల్లా గరుగుబెల్లి మండలం, తోటపల్లి గ్రామంలో చందనకు జన్మనిచ్చి తల్లి ఈ లోకం నుంచి సెలవు తీసుకుంది. తల్లి లేని చిన్నిపాప పెంపకం బాధ్యతను అమ్మమ్మ తీసుకుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పేదరికం ఒక వైపు, వృద్ధాప్యం మరోవైపు ఆ అవ్వది. సరిగ్గా అదే సమయంలో ఆపన్న హస్తాన్ని అందించింది జట్టు ఆశ్రమ నిర్వాహకురాలు పద్మజమ్మ. అంతే! ఆ పాప జీవితంలో చీకట్లు మెల్లగా తొలగి వెలుగు రేఖలు విరబూయటం ప్రారంభమైంది.
ఆశ్రమంలో నెలకొల్పిన శ్రీరజని రాజా కళాక్షేత్రంలో భరతనాట్యం, కూచిపూడి సాధన చేస్తున్న పెద్దక్కలను చూచి వారి అడుగులను అనుకరిస్తున్న చిన్నారి చందనలోని తపనను నాట్యగురువు శ్రీనివాస్ గమనించారు. గత ఏడాది నుంచి చందనకు శాస్త్రీయ నాట్యాన్ని సాధన చేసే అవకాశం కల్పించారు.
తొలి అడుగులోనే...
కేవలం మూడు రోజుల సాధనతో బొబ్బిలిలో జరిగిన ఉత్తరాంధ్ర స్థాయి భరత నాట్య పోటీలలో చందన ప్రథమ స్థానం పొందింది. ఇదే తన తొలి ప్రదర్శన కూడా. అంతే! ఆ రోజు మొదలు ఆ చిన్నారి నాట్యంలో తనదైన ప్రతిభను చాటుకుంటూ వచ్చింది. పలువురి ప్రశంసలు అందుకుంటున్న ఈ చిన్నారి దేశవ్యాప్తంగా సుమారు 50కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది.
పులకించిన రవీంద్రభారతి...
‘వందేమాతరం ఫౌండేషన్’ వారి కార్యక్రమంలో రెండురోజుల క్రితం హైదరాబాద్ రవీంద్రభారతిలో గణేశ స్తుతి ప్రదర్శన, థిల్లానాలో (భరతనాట్యం) చందన ప్రదర్శన ఇచ్చింది. కార్యక్రమ ప్రారంభ సూచికగా చిన్నారి చందన చేసిన గణేశస్తుతి ప్రదర్శన చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అందరూ వన్స్ మోర్ అంటూ, అభినందించారు.
‘‘యోగాలోను, నాట్యంలోను చందన చక్కటి కార్యదీక్ష, క్రమశిక్షణ కనబరుస్తుంది’’ అన్నారు నాట్యగురువు శ్రీనివాస్. అందుకే అంత లయ జ్ఞానం, నాట్యంలో పట్టు వచ్చిందని ప్రశంసించారు. ఎన్నో సంస్థలు ఈ చిన్నారి నాట్య ప్రదర్శనను కోరుతూ ఆహ్వానాలు పంపుతున్నారు.
సత్కారాలు...
- తొలి ప్రదర్శనను తిలకించిన ప్రముఖ నాట్యాచార్యులు శ్రీకాంత్ రఘు నగదు పురస్కారంతో చిన్నారి చందనను సత్కరించారు.
- చీపురుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో చందన నాట్యం చూసి ప్రేక్షకులు కరె న్సీ నోట్ల దండలతో చందనను సన్మానించారు.
- గత సంవత్సరం బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో చందన చేసిన నృత్యప్రదర్శనను చూసి ముగ్ధులెన ఆలయ నిర్వాహకులు ఆ చిన్నారిని సత్కరించారు.
- ఢిల్లీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, ప్రగతి మైదానంలో చందన ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులను ముగ్ధులను చేసింది.
మూలం : సాక్షి దినపత్రిక