ప్రపంచంలో యుద్ధ వార్తలను పత్రికలకు అందించే పనిలో నియుక్తురాలైన మొట్టమొదటి మహిళా విలేఖరి కూడా ఆమె. అలా తొలి మహిళా 'వార్ కరెస్పాం డెంట్'గా ఆమె రెండో ప్రపంచ యుద్ధ వార్తా దృశ్యాలను జనం ముందుకు తెచ్చారు. అలాగే, సోవియట్ యూనియన్‌లో పర్యటించి, అక్కడి అంశాలను ఛాయాచిత్ర బద్ధం చేయడానికి అనుమతి పొందిన తొలి అమెరికన్ కూడా ఆమే.
ఆమె సోవియట్ యూనియన్ అంతా తిరిగి, అక్కడ శరవేగంతో సాగుతున్న పారిశ్రామికీకరణను ఫోటోలు తీశారు. అంతే కాకుండా, క్రెమ్లిన్‌లో స్టాలిన్ ఫోటో కూడా తీశారు.
మన దేశానికి సంబంధించి కూడా మార్గరెట్ ఫోటోలకు ప్రత్యేకత ఉంది. ఆమె తీసిన అత్యంత ప్రముఖమైన ఫోటోలు అనేకం భారతదేశ స్వాతంత్య్ర సముపార్జన సమయంలోవి కావడం విశేషం. దేశం భారత, పాకిస్తాన్‌లుగా విభజనకు లోనై, బ్రిటీషు పరిపాలన నుంచి స్వాతంత్య్రం వైపు అడుగులు వేసిన సమయంలో ఆమె తీసిన అద్భుతమైన ఫోటోలెన్నో ఇవాళ ఆనాటి చరిత్రను కళ్ళకు కడుతున్నాయి.
మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నాలతో సహా ఆ కాలపు ప్రముఖ నేతలందరినీ ఆమె ఫోటోలు తీశారు. పట్టుబట్టి, కావాల్సిన విధంగా ఆమె ఫోటోలు తీసే పద్ధతి చూసి, 'హింసాకారిణి' అంటూ ఆ రోజుల్లోనే గాంధీ ఆమెను ఛలోక్తిగా పిలిచేవారు. దేశ విభజన సమయంలో లక్షలాది ప్రజలు వలస పోవడం, మత ఘర్షణల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఆమె కళ్ళారా చూశారు. భారత ఉపఖండం రెండు స్వతంత్ర దేశాలుగా చీలిన ఘట్టానికి ఆమె, ఆమె కెమేరా ప్రత్యక్ష సాక్షులు.
''1946లో వసంతకాలపు తొలి రోజుల్లో నేను భారత్‌కు వెళ్ళాను. అప్పటికే భారతదేశ స్వాతంత్య్రానికి పునాది పడింది. ఆ ఏడాదిలో చాలా కాలం నేను భారత్‌లోని వివిధ ప్రాంతాలకు పర్యటించాను. ఆపైన నేను స్వదేశానికి తిరిగి వచ్చాను. ...కానీ, భారతదేశం గురించి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గుర్తించాను. అందుకే, భారత్‌కు మళ్ళీ వచ్చి, 1947లో కొంత భాగం, ఆ మరుసటి ఏడాది అంతా ఇక్కడే గడిపాను'' అని మార్గరెట్ తన అనుభవాల్లో పేర్కొన్నారు.
1904 జూన్ 14న జోసెఫ్ వైట్, మిన్నీ బూర్క్ దంపతులకు మార్గరెట్ జన్మించారు. ఆ దంపతుల ముగ్గురి సంతానంలో రెండో వ్యక్తి - మార్గరెట్. ప్రకృతినీ, ప్రాణులనూ అమితంగా ప్రేమించే తల్లితండ్రుల ప్రభావంతో ఆమె పెరిగారు. పాముల లాంటి సరీసృపాలతో చెలిమి చేసిన ఆమె దాదాపు ఓ జంతుశాస్త్రవేత్త అవుతుందేమో అని అందరూ అనుకున్నారు.
అయితే, ఫోటోగ్రఫీ మీద, ఫోటోలు తీసే విధానాలను మెరుగుపరచడం మీద ఆమె తండ్రికి ప్రేమ చాలా ఎక్కువ. ఆయనకు సహాయకురాలిగా వ్యవహరించారు.
నిజానికి, ఆమె ఎన్నడూ ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలని అనుకోలేదు. అయితే, కాలేజ్‌లో ఉండగా తమ ఇంటి దగ్గర, కొండల నేపథ్యంలో ఓ శిబిరానికి ఆమె ఫోటోగ్రఫీ కౌన్సెలర్‌గా వ్యవహరించాల్సి వచ్చింది. తెలతెలవారుతుండగానే కొండల నేపథ్యంలో ఆ శిబిరం ఫోటోలు తీయడానికి రాత్రంతా ఆమె సహనంతో వేచి చూసేవారు. అలా తీసిన ఓ ఫోటో ప్రతులు కొన్ని వందల సంఖ్యలో అమ్ముడయ్యాయి.
దాంతో, ఫోటోగ్రఫీని వృత్తిగా చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అదే జీవితంగా గడిపారు. ''నాకు పనే దైవం. పని మీద అంతటి గౌరవం నాలో పెంపొందింపజేయ డానికి మా నాన్న గారే కారణం!'' అని మార్గరెట్ చెప్పారు.
సమకాలీన పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఫోటోల రూపంలో ప్రతిఫలించే మ్యాగజైన్‌గా 'లైఫ్' పత్రిక అమెరికాలో ప్రారంభమైనప్పుడు ఫోటో జర్నలిస్టుగా తొలి అవకాశం ఆమెకే దక్కింది. అవసరమైన ఒకే ఒక్క గొప్ప ఫోటో కోసం ఎన్ని రీళ్ళు ఖర్చు చేసినా నష్టం లేదని ఆమెకు కెరీర్ తొలినాళ్ళలోనే అర్థమైపోయింది. అందుకే, ఆమె మిగిలినవాళ్ళు చాలనుకొనేదాని కన్నా చాలా ఎక్కువ ఫోటోలు తీసేవారు. అందుకు ఒక్క కెమేరా చాలదు కాబట్టి, ఒకేసారి అయిదు కెమేరాలను వెంట ఉంచుకొనేవారు.
అలా ప్రపంచమంతా తిరుగుతూ ఫోటోలు తీయడం ద్వారా ఆమె పేరు, ముఖం, ఫోటోలు లక్షల మందికి సుపరిచితమయ్యాయి. భారత్, పాకిస్తాన్‌ల విభజనతో పాటు జనం లక్షలాదిగా వలస వెళ్ళిన ఘట్టాన్ని కెమేరాలో చిత్రాలుగా బంధించడానికి 'లైఫ్' మ్యాగజైన్ ఆమెను ప్రత్యేకంగా నియోగించింది. అలా 1946 నుంచి 1948 వరకు ఆమె భారతదేశం నలుమూలలా పర్యటించారు. ఎంతోమందితో స్నేహ సంబంధాలు నెరపారు. ఆమె రాతలు, ఫోటోలు ఆ కథలను మన కళ్ళకు కడతాయి. ''భారత, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న రోడ్లన్నీ శరణార్థుల గుంపులతో క్రిక్కిరిసిపోయాయి. కొత్తగా తలెత్తిన సరిహద్దుల వెంట భవిష్యత్తు తెలియకుండా వారంతా వెళుతున్న దృశ్యాలు బైబిల్ కాలాన్ని గుర్తు చేశాయి'' అని రాశారామె.
విశేషం ఏమిటంటే, భారతదేశంలో తనకు కలిగిన అనుభవాలనూ, దేశ స్వాతంత్య్రం, విభజన సమయంలో తాను తీసిన ఫోటోలనూ కలిపి 'హాఫ్‌వే టు ఫ్రీడమ్: ఎ రిపోర్ట్ ఆన్ ది న్యూ ఇండియా ఇన్ ది వర్డ్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ ఆఫ్ మార్గరెట్ బూర్క్-వైట్' పేరిట ఆ రోజుల్లోనే పుస్తక రూపంలో వెలువరించారామె.
ఫోటోజర్నలిస్టుగా విస్తృతమైన జీవితానుభవాలున్న మార్గరెట్ ఆ అంశాలన్నిటినీ స్పృశిస్తూ, 'పోర్‌ట్రయిట్ ఆఫ్ మైసెల్ఫ్' పేరిట ఆత్మకథ రాశారు. ఆమె మరణానంతరం ఆమెపై జీవిత చరిత్ర గ్రంథం కూడా వచ్చింది. చిత్రం ఏమిటంటే, దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో రూపొందించిన 'గాంధీ' (1982) చిత్రంలో కూడా మార్గరెట్ పాత్ర కనిపిస్తుంది. దాన్ని బట్టి అప్పటి మన చరిత్రలో ఆమెకు ఎంతటి అవిస్మరణీయ పాత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు.
నలభై ఏడేళ్ళ వయస్సులో తనకు పార్కిన్‌సన్స్ వ్యాధి వచ్చినట్లు గ్రహించిన ఆమె ధైర్యంగా ఆ వ్యాధిని ఎదుర్కొన్నారు. వ్యాయామం, ధ్యానం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకొనేందుకు ప్రయత్నించారు. అందు కోసం వివాదాస్పదమైన ఓ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తరువాత మరో ఇరవై ఏళ్ళ పాటు మార్గరెట్ చురుగ్గా ఫోటోలు తీస్తూ, ప్రయాణాలు సాగిస్తూ గడిపారు.
క్రమంగా పరిస్థితులు కష్టంగా మారినప్పటికీ, జీవితం మీద, చేస్తున్న పని మీద ఆఖరి వరకు ఆసక్తినీ, ఉత్సాహాన్నీ ఆమె కోల్పోవకపోవడం విశేషం. 1971లో ప్రమాదవశాత్తూ కిందపడిన ఆమె కదలలేని పరిస్థితికి చేరుకొని, కన్ను మూశారు. టెలివిజన్ ఆవిర్భావంతో ఫోటో జర్నలిజమ్‌లో స్వర్ణయుగానికి తెర పడుతున్న రోజుల్లోనే ఈ అత్యుత్తమ ఫోటో జర్నలిస్టు తుదిశ్వాస విడిచారు.
మార్గరెట్ చనిపోయిన ఓ ఏడాది తరువాత ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన 'లైఫ్' మ్యాగజైన్ ఆమె ఫోటోలతో పాపులరైన పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలోకి మారిపోవడం విషాదం. వెరసి, ప్రపంచంలోని అత్యుత్తమ మహిళా ఫోటో జర్నలిస్టుల్లో ఒకరిగా మార్గరెట్ ఇవాళ్టి నవ యువ మహిళా ఫోటోగ్రాఫర్లకు నిరంతర స్ఫూర్తిప్రదాత అంటే అతిశయోక్తి కాదు. ఆమె కెమేరాలో బంధించిన దృశ్యాలే అందుకు తిరుగులేని ఉదాహరణ