భారత జూనియర్ టెన్నిస్ విభాగంలో..
జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా నిలిచింది..
అతి పిన్నవయసులోనే డిగ్రీ పూర్తి చేయబోతున్నది..
ఒకేసారి రెండు చేతులతో రాస్తుంది..
పియానో వాయిస్తూ శ్రావ్యంగా పాడగలదు..
కేవలం 25నిమిషాల్లోనే ఘుమఘుమలాడే..
హైదరాబాదీ బిర్యానీని వండి వడ్డించగలదు..
భగవద్గీత శ్లోకాలైతే కంఠస్థం! ఆ బహుముఖ ప్రజ్ఞాశాలే.. నైనా జైస్వాల్
కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్నది హైదరాబాద్ కాచిగూడకి చెందిన నైనా. ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్న సామెతను అక్షర సత్యం చేస్తున్నది. ఆల్ ఇన్ వన్‌గా గుర్తింపు పొంది అందరినీ అబ్బురపరుస్తున్నది. ఎవరైనా ఒక్కపని చేయడానికే అపసోపాలూ పడుతుంటారు. అలాంటిది నైనా చదువుల్లో.. ఆటల్లో.. సంగీతంలో మేటి అనిపించుకుంటున్నది. అంతేనా.. నాలుగు భాషలు అనర్గళంగా మాట్లాడేస్తుంది! కఠోర శ్రమ, పట్టుదల ఆమె సొంతం. అందుకే రాబోయే ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంచాలనే దిశగా అడుగులు వేస్తున్నది.
కుటుంబ నేపథ్యం..
తండ్రి అశ్వినీ కుమార్ జైస్వాల్ అడ్వకేట్. మార్వాడీ ఉమ్మడి కుటుంబం. కూతురు కోసం తన ప్రాక్టీసును వదులుకొని కోచ్‌గా మారాడు. తన కోసం ఇప్పుడు చదువును కొనసాగిస్తున్నాడు. తల్లి భాగ్యలక్ష్మి. వరంగల్ వాసి. తల్లిదండ్రులది ప్రేమ వివాహం. నైనాకు మొదటి గురువు తల్లే. నైనాను ఫస్ట్‌క్లాస్ వరకు మామూలు పిల్లల్లాగానే స్కూలుకు పంపించారు. ఆ తర్వాత టెన్నిస్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అది చదువుకు ఇబ్బందిగా మారుతుందని ఇంట్లోనే నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేది భాగ్యలక్ష్మి. నైనా ఒకసారి చదివితే గుర్తుంచుకునే రకం. అందుకే 8ఏళ్ళ ప్రాయంలోనే తన చేత పదవతరగతి పరీక్షలు రాయించాలని నిర్ణయం తీసుకుంది తల్లి. ఆ దిశగా అమ్మాయిని స్కూలుకు పంపించకుండానే హోం స్కూలింగ్ ద్వారా పదవతరగతి పరీక్షలు రాయించింది. అది కూడా ఐటీసీఎస్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి. నైనాకు ఒక తమ్ముడు. పేరు అగస్త్య. అక్కకు గట్టి పోటీ. వయసు 7 సంవత్సరాలే కానీ చిచ్చర పిడుగు. అక్కతోపాటు ప్రాక్టీసులకు వెళతాడు. నాలుగు భాషలు మాట్లాడగలడు. భగవద్గీత శ్లోకాలు, దేశాల రాజధానులు టకటకా చెప్పేస్తాడు.
ఆటల్లో మేటి..
గేమ్స్‌లో మ్యాజిక్స్ ఏమీ ఉండవు. కాకపోతే దాన్ని ఒక ఆటలా కాకుండా ఎంజాయ్ చేస్తూ ఆడితే గెలుపు తథ్యం. ఆ సూత్రాన్నే నమ్మింది నైనా. తండ్రి ఎంత కోచ్‌గా వ్యవహరించినా కోర్డులోకి దిగిన తర్వాత ఆమె వెనక ఎవరూ కనిపించరు. ఎంకరేజ్ చేయరు. అలా చేస్తే ఎక్కడ ఒత్తిడికి గురవుతుందేమోనని ఆ తండ్రి భయం. అందుకే ఆట ముగిసే వరకు ఆ ప్రాంగణంలో ఎక్కడా కనిపించడు. నైనాను వన్‌మెన్ ఆర్మీలా పంపించడమే అతనికి ఇష్టం. సింగిల్స్, డబుల్స్‌లోనూ కలిపి ఇప్పటిదాకా 12 గోల్డ్‌మెడల్స్, 4 వెండి, 6 కాంస్య పతకాలను సాధించింది. ఇక ట్రోఫీలు, ప్రతిభా పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలకైతే లెక్కేలేదు. నేషనల్ లెవల్ అండర్ - 15 విభాగంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించి, ప్రపంచ ర్యాంకింగ్‌లో 6వ స్థానంలో నిలిచింది నైనా.
చదువుల్లో లేరు సాటి..
ఆటల్లో పడి చదువును కొనసాగించడం కొంచెం కష్టమే. కానీ నైనా స్కూల్‌కి వెళ్ళకపోయినా ఇంట్లోనే చదువుకొని చిన్న వయసులోనే పదవతరగతి పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్‌లో పాసయింది. ఆ ప్రతిభ చూసి సెయింట్ మెరీస్ కాలేజీ యాజమాన్యం ఇంటర్ చదవడానికి ఉచిత ప్రవేశాన్ని కల్పించింది. పదకొండేళ్ళకు ఇంటరూ పూర్తి చేసింది. ఇప్పుడు నైనాకు పదమూడేళ్ళు. అదే కాలేజీలో బీఏ ( మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నది. రెండు సంవత్సరాలకు కలిపి కూడా ఫస్ట్ క్లాస్ మార్కులే వచ్చాయి. తన ఇరవయ్యో ఏటికల్లా పొలిటికల్ జర్నలిజంలో పీహెచ్‌డీ పూర్తి చేయాలని కలలు కంటున్నది.
ప్రతిభకు లేదు హద్దు..
కుడిచేతితో రాస్తే.. ఎడమ వైపు మెదడు పనిచేస్తుంది. ఎడమ చేతితో రాస్తే కుడివైపు మెదడు చురుకుగా ఉంటుంది. కానీ ఒకేసారి రెండు చేతులతో రాయాలంటే చాలా కష్టపడాలి. ఇన్ని చేస్తూ కూడా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంది నైనా. రెండు చేతులతో రాస్తూ.. ముత్యాల్లాంటి అక్షరాలతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. ఇక పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రావడం మామూలే! అందుకే చైనీస్ నేర్చుకుంది. ఆ భాషే నేర్చుకోవడం వెనక కూడా ఓ కారణం ఉంది. ఈ ఆటలో ఆ దేశం నుంచే ఎక్కువమంది ప్లేయర్స్ ఉన్నారు. వారితో మాట్లాడడం, ఆటలో మెళకువలు నేర్చుకోవడం కోసం ఆ భాషను ఎంచుకొంది. ఐదు సంవత్సరాలున్నప్పుడే పియానో మీద ఆసక్తితో అదీ నేర్చుకుంది. అప్పుడప్పుడు కచేరీలు కూడా ఇస్తుంది. భగవద్గీత శ్లోకాలు కంఠస్తమే కాదు.. దాన్ని హిందీలో ట్రాన్స్‌లేట్ చేసి కూడా చెప్పగలదు. ఇక బిర్యానీ వండాలంటే.. గంటల తరబడి ప్రయాసపడడం తప్పనిసరి! కేవలం 25నిమిషాల్లో రుచికరమైన బిర్యానీని మన ముందు పెట్టగలదు. దానికోసం చిన్న, చిన్న టెక్నిక్స్ వాడుతుందట. ఆ వంటకం వెనక రహస్యం మాత్రం సీక్రెట్ అంటుంది. ఇవేకాక సరదా కోసం ఫొటోషాప్, కోరల్‌వూడాలాంటి సాఫ్ట్‌వేర్ సంబంధమైన కోర్సులు కూడా నేర్చుకుంటున్నది.
పర్‌ఫెక్ట్ టైమింగ్స్..
సమయాన్ని వృథా చేయడం అస్సలు ఇష్టం ఉండదు నైనాకు. ప్రతి నిమిషం బిజీగా ఉండడానికే ఓటు వేస్తుంది. ఉదయం 6 నుంచి ఆమె షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఒక గంటపాటు ఇంట్లోనే యోగా చేసి తొమ్మిది గంటల వరకు రెడీ అయి లాల్‌బహుదూర్ స్టేడియం చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం 12దాకా ప్రాక్టీస్. మళ్ళీ ఇంటికి వచ్చి మూడింటిలోపు భోజనం.. కాసేపు విశ్రాంతి. మూడింటికి జిమ్‌కు వెళుతుంది. అక్కడ రెండు గంటలు వర్కవుట్లు చేసి ఐదింటికి ఎల్‌బీ స్టేడియం వెళ్తుంది! ఒక గంటపాటు మళ్ళీ ప్రాక్టీస్ చేసి అక్కడ తోటి క్రీడాకారులుంటే.. వాళ్ళతో ఢీ అంటే ఢీ అంటూ మ్యాచ్ ఆడుతుంది. మెల్లగా ఎనిమిదింటికి ఇంటికి చేరి తిండి, తల్లి నోట్స్ ఏదైనా ప్రిపేర్ చేస్తే చదవడంతో రోజును ముగిస్తుంది.
సరైన ప్రోత్సాహం లేక..
‘‘నా కృషి వెనక నా తల్లిదంవూడులు, మా తాతయ్య డాక్టర్ మల్లేషం శ్రమ, ప్రోత్సాహం ఎంతో ఉంది. ఏదైనా కష్టపడి కాదు, ఇష్టపడి చేయాలంటారు వాళ్లు. అందుకే నాకు అదే అలవాటైంది. వచ్చే సంవత్సరం జర్నలిజంలో పీజీ చేయాలనుకుంటున్నాను. నాన్న నాకోసం అందులో జాయిన్ అయ్యాడు. వచ్చే సంవత్సరానికి నోట్స్ ప్రిపేరేషన్‌కి ఈజీగా ఉంటుంది కదా! చాలామంది తల్లిదంవూడులు కోచింగ్ సెంటర్లలో డబ్బులు కట్టి పిల్లలకి ర్యాంకులు రావడం లేదు, ఆటల్లో పైకి రావడం లేదు అనుకుంటుంటారు. ఎవరికైనా సరైన శిక్షణ కావాలి. అది తల్లిదంవూడులే తీసుకుంటే మరింత బెటర్ అని నా అభివూపాయం. ఏ పని చేసినా ఒక వ్యసనంలా చేయాలన్నది నా పాలసీ. రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి తండ్రి తోడ్పాటుతో పాటు సచిన్, గంగూలీ, అమితాబ్‌లను ఆదర్శంగా తీసుకున్నాను. వాళ్ళు కూడా ఇలా రెండు చేతులతో రాయగలరు అని తెలిసిన క్షణం నాన్నని అడిగాను.
నాన్న కూడా కొందరి దగ్గర సలహాలు తీసుకొని దగ్గరుండి నేర్పించారు. ఎప్పుడూ స్కూల్, కాలేజ్‌కి వెళ్ళలేదు అన్న ఫీలింగ్ లేదు. బయట షికారుకు తీసుకెళ్ళలేదనే బెంగా లేదు. చదువుతున్నంతసేపు నేను కాలేజ్‌లో ఉన్నట్లే ఫీలవుతాను. ఇక టోర్నమెంట్సే నా అవుటింగ్. దేశ, విదేశాలు తిరిగాను. అంతకు మించి ఏం కావాలి? కిరణ్‌బేడీ నాకు రోల్ మోడల్. ఆమెలా ఐపీఎస్ కాదు కానీ ఐఏఎస్ అవ్వాలని ఆశ. సైనా, పుల్లెల గోపీచంద్‌లాంటి వాళ్లు కలిసినప్పుడల్లా బాగా మాట్లాడతారు, ఆటల్లో ఇంకా రాణించాలని చెబుతుంటారు. ఇన్ని సాధించినా.. ఒక్క విషయమే కాస్త బాధ కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సింగిల్స్‌లోనూ, అటు డబుల్స్‌లోనూ గుర్తింపు లభించింది. కానీ ఇప్పటి వరకు మన ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయసహకారాలు లేవు. స్టోర్స్‌కోటాలో వచ్చే ఏ బెనిఫిట్స్ పొందలేదు. అలా అని ఏ సంస్థ నాకు స్పాన్సర్‌షిప్ అందించడం లేదు. నాన్న ఇంతకుముందు బిజినెస్ చేసేవారు. కూడబెట్టినవన్నీ నా కోసం, తమ్ముడి కోసం ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు.. స్టేడియంలో జిమ్‌కి పర్మిషన్ లేదు. అందుకే డబ్బులు కట్టి వేరేచోట వెళుతున్నాను.
ఏపీ టీటీ అసోసియేషన్ మల్టీ టాలెంట్ గల అమ్మాయిగా కనీసం అనౌన్స్ చేయడానికి కూడా సాహసించదు. డ్రాస్ కమిటీలో కూడా నాకు ప్లేస్ లేదు. కేవలం నేను ఈ ప్రాంతానికి చెందిన దాన్ని అనే చిన్న చూపేమో’’ అంటోంది నైనా. ఇన్ని అర్హతలు పెట్టుకొని.. సరైనా ప్రోత్సాహం లభించకున్నా.. ఛాంపియన్‌గా నిలిచిపోవాలనే ఆమె ప్రయత్నం గొప్పది. అందులో ఆమె సఫలం అవ్వాలని ఆశిద్దాం!
మూలం : నమస్తే తెలంగాణ దినపత్రిక