పూణెలోని అబాసాహెబ్ గర్వారే కాలే జ్లో చదువుతున్న సమయంలో అపూర్వ తన స్నేహితులు ఎన్సీసీ పెరేడ్లో పాల్గొనడం చూసింది. కవాతు చేస్తున్నప్పుడు వాళ్ల యూనిఫామ్, దానిమీద కదిలే పతకాలు - ఎంతో ఠీవిగా ఉన్నట్టనిపించాయి. అంతేకాదు ఎన్సీసీలో చేరితే ఫ్లయింగ్, స్కూబా డైవింగ్, పారాసెయిలింగ్ నేర్చుకోవచ్చన్న విషయం కూడా ఆమెకు ఆరోజే తెలిసింది. మర్నాడే వెళ్లి ఎన్సీసీ ఎయిర్ యూనిట్లో చేరిపోయింది. అక్కడ చాలా కఠినమైన శిక్షణ ఉంటుందని ముందే తెలిసినా భయపడలేదామె.
ఆస్ట్రేలియాకు టేకాఫ్
"నాకు భూమ్మీద నిలకడగా కూర్చోవడం ఇష్టం లేదు. పైలెట్ అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నాను'' అని చెప్పే అపూర్వ తన నిర్ణయాన్ని అమల్లోపెట్టి, శిక్షణ కోసం ఆస్ట్రేలియాలోని ఏరోస్పేస్ ఏవియేషన్ సంస్థలో చేరింది. ఈ శిక్షణలో మొదటి రెండు నెలలు గ్రౌండ్ క్లాసులుంటాయి. వాటి తర్వాత మంచి వాతావరణ పరిస్థితులున్నప్పుడు శిక్షకుడు పక్కనుండగా విమానాన్ని నడపడం మొదటి దశ. సొంతంగా ఒక్కరే వెళ్లి నడపడం మలి దశ. "మొదటిరోజు టేకాఫ్, లాండింగ్ సొంతంగా చేస్తుంటే... ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను...'' అంటోందీ అమ్మాయి. వాటి తర్వాత జనరల్ ఫ్లయింగ్ ప్రోగ్రెస్ టెస్ట్, ప్రైవేట్ పైలెట్ లైసెన్స్, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ అందుకుంది అపూర్వ. ఆఖరుగా మల్టీఇంజన్ కమాండ్ ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ చేతికొచ్చింది. 2008 సంవత్సరానికి బెస్ట్ స్టూడెంట్ అవార్డూ తనకే వచ్చింది. శిక్షణ పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియాలో 250 గంటల విమాన అనుభవం ఆమె సొంతమయింది.
కష్టాల్లోకి ల్యాండింగ్
'పైలెట్ లైసెన్స్ ఇలా రాగానే అలా ఉద్యోగం వచ్చేస్తుంది' అనుకుంటారు చాలామంది. కాని అపూర్వ 2009లో స్వదేశంలో కాలుపెట్టే సమయానికి పరిస్థితి వేరేగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల విమానయాన రంగం ఇబ్బందుల్లో పడిపోయింది. దాంతో ఆమెకు కొలువు వెంటనే లభించలేదు. అప్పటిదాకా అపూర్వ చదువు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తండ్రి చేతులెత్తేసాడు. ఆయన కేవలం ఒక ప్రభుత్వోద్యోగి. ఆమె శిక్షణ పూర్తయ్యే సమయానికి రిటైరయ్యాడు కూడా. దాంతో వాళ్లు తీసుకున్న పర్సనల్, ఎడ్యుకేషనల్ లోన్ తీర్చడం కష్టమైపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే తండ్రి స్నేహితులు ఆదుకున్నారు. అపూర్వకు ఒక చెల్లీ తమ్ముడూ కూడా ఉన్నారు. తాను ఖాళీగా కూర్చుంటే వాళ్ల భవిష్యత్తుకు ఆటంకమవుతుందని ఆమెకు అర్థమైపోయింది. సమయం వృథా కాకుండా గ్లైడర్ పైలట్ లైసెన్స్ పొంది, తన ఫ్లయింగ్ నైపుణ్యానికి మెరుగులద్దుకోవటంతో పాటు ఇండిగో వారు కేబిన్ క్రూ కావాలంటూ వేసిన ప్రకటనచూసి దరఖాస్తు పెట్టుకుంది.
మళ్లీ ఆకాశంలోకి
కమర్షియల్ పైలెట్‌గా శిక్షణ తీసుకున్నా, కుటుంబానికి ఆర్థికంగా ఆసరా కావాలంటే ఈ ఉద్యోగం తప్పనిసరి అపూర్వకు. 'కాక్‌పిట్‌లో ఉండాల్సిన తను బైట ఉద్యోగం చెయ్యడమేమిటి' అనిపించినా- ఎలాగోలా విమానమైతే ఎక్కాను కదా' అని సరిపెట్టుకుంది. 'పైలెట్లకు అవసరమైన ఆహార పదార్థాలను అందించడానికి కాక్‌పిట్‌లోకి వెళుతుంటాం. అలా వె ళ్లిన ఒక్క నిమిషమే ఎంతో సంతోషంగా అనిపించేది. నేను ఉండాల్సిన ప్రదేశం ఇదే అనుకునేదాన్ని. కేబిన్ క్రూగా పనిచెయ్యడం వల్ల ప్రతిరోజూ ఎంతోమందిని చూసే వీలు కలిగింది. వివిధ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ఒకేసారి బోలెడన్ని పనులెలా చెయ్యాలి, కలిసికట్టుగా పనిచెయ్యడంలోని కష్టసుఖాలేమిటి ఇవన్నీ బోధపడ్డాయి' అని చెబుతున్న అపూర్వ అలా రెండేళ్లు పనిచేశాక డిసెంబర్ 2012లో కోపైలెట్గా చేరింది. నెల రోజుల క్రితమే పూర్తి స్థాయి కో పైలెట్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఇక ఇప్పుడు ఆకాశంలో రెక్కలు చాచి అందినంత మేరా ఎగిరిపోవడమే ఆమె పని.
అర్హతకు తగిన ఉద్యోగం లేదని బాధపడుతున్నవాళ్లెందరో ఉంటారు. అలాంటి వాళ్లు -
- తమలోని నిప్పును ఆరిపోనివ్వకూడదు. లక్ష్యాన్ని మర్చిపోకూడదు.
- సబ్జెక్టును మరిచిపోకుండా తరచూ చదువుతుండాలి, చదువుతున్న విషయానికి పదును పెడుతుండాలి.
- అవకాశాల కోసం ఎదురుచూడటం తప్పదు. కాని అవకాశం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడొస్తే అప్పుడు చటుక్కున దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.