మలాలా యూసఫ్‌జాయ్ మొన్నామధ్య వరకు ఈ పేరు అంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈమె పేరు తెలియని ప్రపంచ దేశాలు ఉండవు. ఉర్దూలో ‘గుల్ మకాయి’ అంటే మొక్కజొన్న పువ్వని అర్థమట. ‘మలాలా’ అనే పేరు ప్రపంచానికి తెలియకముందు, ఆ కలంపేరుతో తమ ప్రాంతపు వెదను ప్రపంచానికి వెల్లడించింది మలాలా యూసఫ్‌జాయ్. అప్పుడు తన వయసు పదకొండేళ్లు. ఏడో క్లాసు చదువుతోంది. ఇంత చిన్నమ్మాయి ఇదంతా చేసిందంటే అబ్బురమనిపించొచ్చు. కానీ పరిస్థితులు ఎవరినైనా అలా తీర్చిదిద్దుతాయంటుంది తను, పెద్ద ఆరిందలా. తాలిబాన్ల ప్రాబల్యం ఉన్న పాకిస్తాన్‌లోని స్వాత్ ప్రాంతంలో, బాలికల చదువు మీద నిషేధాజ్ఞలున్న విపత్కర ప్రదేశంలో దానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2009 నుంచీ ప్రసార మాధ్యమాల్లో స్పందించింది. పిన్న వయసు విద్యాహక్కుల కార్యకర్తగా మన్ననలందుకుంది. దీన్ని సహించలేని తాలిబాన్లు మొన్న అక్టోబర్ 9న ఆమె మీద కాల్పులు జరిపారు. ఒక దశలో అంతిమసంస్కారాలకు ఏర్పాట్లు చేయడం గురించి ఆలోచించారామె తల్లిదండ్రులు. కానీ క్రమంగా కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి నవంబర్ 10ని ‘మలాలా డే’గా ప్రకటించిన నేపథ్యంలో ఈ మొక్కజొన్న పువ్వు ’ గురించి కొన్ని విషయాలు.
స్వాత్ నుంచి సమితి వరకు...
పాకిస్తాన్ స్వాత్ జిల్లాలోని ఒక పట్టణం మింగోరా. 1,75,000 జనాభా ఉన్న మింగోరా... స్వాత్ నదికి దగ్గరగా ఉన్న అందమైన పర్యాటక ప్రదేశం. అందుకే దాన్ని ‘స్విట్జర్లాండ్’గా అభివర్ణించారు రెండో ఎలిజబెత్ రాణి. మింగోరాతో సహా స్వాత్ జిల్లాలో తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ. పాకిస్తాన్ సైన్యానికీ వారికీ మధ్య తీవ్రమైన కాల్పుల తర్వాత ప్రస్తుతం ఈ ప్రాంతం సైన్యం అధీనంలో ఉంది. ఈ మింగోరా పట్టణంలోనే మలాలా 1997 జూలై 12న జన్మించింది. పష్తూన్ కవయిత్రి, ఆంగ్లేయులతో పోరాడిన వీరనారి మలాలాయి పేరుమీదుగా తన కూతురికి మలాలా అని నామకరణం చేశారు జియావుద్దీన్. ఈయన కవి, విద్యాసంస్థల యజమాని.
2009లో తాలిబాన్లు స్వాత్ జిల్లాను ఆక్రమించుకున్నప్పుడు జనవరి 14 నుంచీ బాలికల చదువును పూర్తిగా నిషేధించారు. దీనిమీద ఒక కార్యక్రమం రూపొందించడానికి ‘బీబీసీ’ ప్రయత్నించినప్పుడు, ప్రాణభయంతో గొంతు విప్పడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో మలాలా ధైర్యం చేసింది. తర్వాత ‘గుల్ మకాయ్’ పేరుతో అదే బీబీసీ ఉర్దూ బ్లాగులో డైరీ రాసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణకు నోచుకుంది. సొంతపేరుతో వెలుగులోకి వచ్చాక మలాలా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు సహా ఎన్నో ఇంటర్వ్యూలిచ్చింది. అంతర్జాతీయ సమాజం ఆమెతో గొంతు కలిపింది. ఇదే తాలిబాన్లకు కంటగింపుగా మారింది.
9 అక్టోబర్ 2012న మలాలా పరీక్ష రాసి స్కూలు బస్సులో ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు, ముసుగు ధరించిన ఒక తుపాకీ వ్యక్తి లోపలికి ప్రవేశించి, ‘ఇందులో మలాలా ఎవరు? లేదంటే అందరినీ కాల్చిపారేస్తాను,’ అని బెదిరించాడు. మలాలాను గుర్తించిన తర్వాత తలమీద, మెడ మీద రెండుసార్లు కాల్చాడు. తీవ్రంగా రక్తమోడిన ఆమెను వెంటనే పెషావర్‌లోని ఆసుపత్రికి తరలించారు. తర్వాత రావల్పిండిలోనూ చికిత్స జరిగింది. అటుపై కేసు తీవ్రత దృష్ట్యా బర్మింగ్‌హామ్ తీసుకెళ్లారు. ఇప్పుడామె క్రమంగా కోలుకుంటోంది. ఈ దాడిలో మలాలాతో పాటు గాయపడిన మరో ఇద్దరు బాలికలు కైనాత్ రియాజ్, షాజియా రంజాన్ పరిస్థితి కూడా నిలకడగా ఉంది. అసభ్యతకు, అవిశ్వాసానికి ప్రతీకగా మలాలాను చూస్తున్నట్టుగా తాలిబాన్ పేర్కొంది. ఆమెతోపాటు, ఆమె తండ్రి జియావుద్దీన్‌ను కూడా ఎప్పటికైనా చంపేస్తామని ప్రకటించింది. అయితే, మలాలా మీద జరిగిన దాడిని నిరసిస్తూ, ఆమె మీద కాల్పులు జరిపిన వారికి వ్యతిరేకంగా సుమారు 50 మంది పాకిస్తాన్ మతగురువుల బృందం ఫత్వా జారీ చేసింది.
‘మలాలా యూసఫ్‌జాయ్ ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాల’
చిన్న వయసులోనే బాలికల విద్య కోసం పోరాడుతున్న మలాలా 2011 సంవత్సరానికిగానూ ‘అంతర్జాతీయ శాంతి బహుమతి’కి నామినేట్ అయి, రన్నరప్‌గా నిలిచింది.
- 2011 డిసెంబరులో పాకిస్తాన్ తన మొట్టమొదటి ‘నేషనల్ యూత్ పీస్ ప్రైజ్’ను మలాలాకు బహూకరించింది.
- 2012 జనవరిలో స్వాత్‌లోని ఒక ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాలకు ఆమె పేరు పెట్టారు.
- దాడి జరిగిన తర్వాత, అక్టోబర్ 15న ఆమె ధైర్యసాహసాలను గౌరవిస్తూ పాకిస్తాన్ అక్కడి మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘సితారా ఎ షుజాత్’ను ప్రకటించింది.
మూలం : తెలుగు విశేష్