వయోవృద్ధురాలైనప్పటికీ ఈమె ఎవరిపైనా ఆధార పడకుండా ఇప్పటికీ తన పనులన్నీ తానే చేసుకుంటారు. చూపు కాస్త మందగించిప్పటికీ జ్ఞాపక శక్తి, వినికిడి శక్తిలో ఎలాంటి లోపం లేకుండా గంభీరమైన మాటలతో అప్పటి సంగతులను, మధురమైన జ్ఞాపకాలను అందరికీ చెబుతుంటారు. స్ర్తిలు విద్యావంతులైతేనే వారిలో సంస్కార బలం వస్తుందన్న నమ్మకంతో కుటుంబ సభ్యులు తనను ‘సనాతన స్ర్తి విద్యాలయం’లో చేర్పించారని, అక్కడ నేర్చుకున్న విషయాలే తనను తీర్చిదిద్దాయని ఆమె చెబుతుంటారు.
వెంకట రమణమ్మ తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని కేశనకుర్రులో గుడిమెట్ల జగన్నాథ శాస్ర్తీ, కామేశ్వరమ్మ దంపతులకు 1918 ఫిబ్రవరి 28న జన్మించారు. 11వ ఏటనే ఆమెకు అదే జిల్లాలోని వాకతిప్పకు చెందిన చెల్లూరి సీతారామయ్యతో వివాహం జరిగింది. బి.ఎ చదివి, సహకార శాఖలో పనిచేసే సీతారామయ్య తన భార్య కూడా విద్యలో రాణించాలని ఎంతగానో ప్రోత్సహించేవారు. స్ర్తి విద్య, బాల్య వివాహాల నిర్మూలన, వితంతు వివాహాల కోసం సమాజాన్ని ఎదిరించి ధైర్యంగా పోరాడిన కందుకూరి వీరేశలింగం రచనలు సీతారామయ్యపై ఎంతో ప్రభావం చూపేవి. అవే భావాలతో వెంకట రమణమ్మ కూడా సమాజ సంస్కరణకు తన వంతు కృషి చేయడం ప్రారంభించారు.
విదేశీయుల పాలన నుంచి విముక్తి కోసం దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర సమరం ఉవ్వెత్తున సాగుతున్న రోజులవి. అదే సమయంలో స్ర్తిల స్థితిగతులు మారాలంటూ రాజమండ్రిలో వీరేశలింగం పంతులుతో పాటు మరెందరో ప్రముఖులు సమాజ సంస్కరణోద్యమాన్ని ఉద్ధృతంగా నడిపేవారు. దేశానికి ఎప్పటికైనా స్వాతంత్య్రం రావడం ఖాయమని, అయితే ముందుగా స్ర్తిలు సామాజిక కట్టుబాట్ల నుం చి విముక్తి పొందాలంటూ ‘దేశ బాంధవి’ దువ్వూరి సుబ్బమ్మ వంటి వ్యక్తులు నడుం బిగించారు. అతివల కోసం అక్షరోద్యమం ప్రారంభించాలంటే వారికి ప్రత్యేక పాఠశాల అవసరమని భావించిన సుబ్బమ్మ 1924లో ‘సనాతన స్ర్తి విద్యాల యం’ ప్రారంభించారు. ఆ విద్యాలయంలో చేరిన వెంకట రమణమ్మ అప్పటి సమాజ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. ‘మహాత్మా గాంధీ దర్శనమే పావనము..’, ‘మాకొద్దీ తెల్లదొరము..’ వంటి పాటలు పాడుతూ సహచర బాలికలతో పాటు వెంకట రమణమ్మ వీధుల్లో తిరిగేవారు. రాట్నం వడుకుతూ ఖద్దరు దుస్తుల విక్రయాన్ని ప్రోత్సహించేవారు. స్ర్తిలను ప్రోత్సహించ కూడదని ఏ ధర్మశాస్త్రాల్లోనూ చెప్పలేదని, వారు పునర్విహాలకు అర్హులేనని కొన్ని పురాణాలు సైతం అంగీకరిస్తున్నాయని వెంకట రమణమ్మ చెబుతుంటారు.
అవన్నీ అనాచారాలే...
అప్పట్లో స్వాతంత్రోమం ఓ వైపు కొనసాగుతుండగా, మరో వైపు మూఢాచారాలు, సామాజిక కట్టుబాట్ల ఫలితంగా మహిళలు నానాపాట్లు పడేవారని వెంకట రమణమ్మ తన జాపకాలను వివరిస్తుంటారు. రజస్వల వేడుకకు ముందే ఆడపిల్లకు విధిగా పెళ్లి చేసేవారని, చిన్న వయసులోనే భర్తలను కోల్పోయే స్ర్తిలను అన్నింటికీ దూరంగా ఉంచుతూ అడుగడుగునా వివక్ష చూపేవారని అలనాటి సంగతులను చెబుతుంటారు. భార్యను కొట్టడం, సంతానాన్ని పట్టించుకోకపోవడం, చెడు వ్యసనాలతో మగాళ్లు మరీ బరితెగించేవారు. ఆచారాలు, సంప్రదాయాల ముసుగులో అన్ని రకాలుగా స్ర్తిలను అణగదొక్కేవారు. భర్తను కోల్పోయిన మహిళను ఇంట్లో నిర్బంధించి నానా బాధలు పెట్టేవారు. అన్ని రకాల ఆహార పదార్థాలను వారు తినరాదంటూ ఆంక్షలు విధించేవారు. స్వేచ్ఛ కోసం ప్రయత్నించే వితంతువులుంటే- వారికి దెయ్యం పట్టిందని చావ బాదేవారు. వితంతువు ఎదురైతే అపశకునంగా భావించి నిందలు మోపేవారు. చదువుకోవాలని ఆసక్తి ఉన్నా ఆడపిల్లలను బడికి పంపేవారు కాదు. భార్యలపై భర్తల దాష్టీకాలు దారుణంగా ఉండేవి.
వీరేశలింగం వంటి సంస్కర్తలు ఎన్ని రచనలు చేసినా వాటిని చదివేందుకు, మార్పు చెందేందుకు కొందరు పురుషులు విముఖత చూపేవారు. స్ర్తిలపై అప్పట్లో కొనసాగిన దౌర్జన్యాలను, అనాచారాలను చూస్తుంటే ఒక్కోసారి భయం కలిగేదని వెంకట రమణమ్మ అంటుంటారు.
కాగా, 95 ఏళ్ల వయసులోనూ తాను ఎలాంటి శారీరక, మానసిక సమస్యలు లేకుండా ఉన్నానంటే చిన్నప్పటి జీవన విధానం, అప్పటి ఆరోగ్య అలవాట్లే కారణమని ఆమె వివరిస్తుంటారు. తన భర్త కీర్తిశేషులై 35 ఏళ్లు నిండాయని, ప్రస్తుతం విశాఖలో తన కుమార్తెల చెంత ఎలాంటి చీకూచింతా లేకుండా శేష జీవితం సాఫీగా సాగుతోందని ఆమె తెలిపారు. తమ సంతానమైన ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు జీవితంలో స్థిరపడ్డారని, మనవలు, మునిమనవలతో కాలక్షేపం చేయడం కంటే ఇంకేం కావాలని ఆమె ప్రశ్నిస్తుంటారు. కాలం ఎంతగా మారినప్పటికీ, నేటి నవ నాగరిక సమాజంలోనూ మహిళల కోసం చేయాల్సింది ఎంతో ఉందని వెంకట రమణమ్మ అంటారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు మరింతగా దూసుకుపోవాలంటే ముందుగా వారు విద్యలో రాణించాలని ఆమె సూచిస్తున్నారు. విద్య వల్లే సంస్కార బలం, మనో నిబ్బరం, ఆత్మవిశ్వాసం, సాధికారత వంటివి సాధ్యమవుతాయని ఆధునిక మహిళలకు ఆమె ధైర్యం చెబుతుంటారు.