చిన్నప్పుడే తనను వదిలేసిన అమ్మ... తాగుడుకు బానిసైన నాన్న... పనిమనిషిలా చూసిన సవతి తల్లి... హింసించిన భర్త... అంతా కలిసి ఇలా తమని రోడ్డున పడేసిన చేదు జ్ఞాపకాలు కళ్లల్లో మెదిలాయి. బేబీ అమ్మానాన్నలకు ఒక్కగానొక్క కూతురు. నాన్నకి తనంటే ఇష్టమే. కానీ తాగి వస్తే రాక్షసుడై పోతాడు. వాళ్లమ్మని తిట్టి, కొట్టి బాధపెడతాడు. చాలా ఏళ్లు ఆ కష్టాల్ని భరించిన ఆమె భర్తనీ, బిడ్డనీ వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు బేబీకి నాలుగేళ్లే. అమ్మ లేక, తండ్రి తాగొచ్చి కొడితే ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా బాధపడింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోవడంతో ఆమె కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. సవతి తల్లి చదువు మాన్పించి, బేబీతో ఇంటి పనులన్నీ చేయించేది. అయినా దొంగతనంగా, తనుండే ముర్షిదాబాద్‌లోని స్కూలుకెళ్లి బెంగాలీలో చదవడం, రాయడం నేర్చుకుంది.
పట్టుమని పన్నెండేళ్లు నిండలేదు... బంధువులెవరో పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. బేబీని వదిలించుకోవడానికి ఇదే అవకాశం అనుకున్న సవతి తల్లి భర్తని ఒప్పించి, ఇరవై ఆరేళ్ల వయసున్న అబ్బాయికిచ్చి పెళ్లి చేసింది. భర్త చిరుద్యోగి. సంపాదన తక్కువ. సాధింపులు ఎక్కువ. ఇంటిపనీ, వంటపనీ చేయలేక, భర్త తిట్లు భరించలేక చాలా బాధపడింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దాదాపు చావు అంచుల దాకా వెళ్లి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ తరవాత రెండేళ్లలో మరో ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. భర్త, కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో... పిల్లలకి తిండి పెట్టేందుకు ఇళ్లల్లో పాచి పనులకు వెళ్లడం ప్రారంభించింది.
ఏళ్లు గడుస్తున్నాయి... బేబీ కష్టాలు ఇంకా పెరిగాయి. సరిగ్గా ఆ సమయంలోనే తన చెల్లెల్ని మరిది చంపేశాడన్న వార్తతో నిలువునా కుంగిపోయింది. తనకీ అలాంటి పరిస్థితి వస్తే పిల్లల పరిస్థితేంటి... అని ఆలోచించింది. ఓ రోజు ఎప్పటిలాగే భార్యాభర్తలిద్దరి మధ్యా పెద్ద గొడవ. అప్పటికే విసిగిపోయి ఉన్న బేబీ పిల్లలతో కలిసి ఇంట్లోంచి బయటికొచ్చి, కంటికి కనిపించిన బస్సు ఎక్కేసింది. ఢిల్లీకి దగ్గర్లోని గుర్‌గావ్‌కు చేరుకుంది. అక్కడ ప్రొఫెసర్ ప్రబోధ్ కుమార్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. పదవీ విరమణ పొందిన ప్రబోధ్ ఇంట్లో ఎటు చూసినా పుస్తకాలే. ఒకరోజు బేబీ అల్మరాలు తుడుస్తుండగా కొన్ని పుస్తకాలు కిందపడ్డాయి. వాటిని అపురూపంగా చూసుకునే ప్రబోధ్ 'వాటిని చదివితే కానీ ఎంత విలువైనవో తెలియదు' అంటూ కోప్పడి కొన్ని పుస్తకాలిచ్చి, వాటిల్లో తనకి నచ్చిన పుస్తకం చదవమని చెప్పాడు.
బెంగాలీలో ఉన్న తస్లీమా నస్రీన్ ఆత్మకథని చదవడం మొదలుపెట్టింది బేబీ. ఒకటీ, ఇంకొకటీ, మరొకటీ... ఇలా వరుసగా పుస్తకాలు చదువుతూ ప్రపంచాన్నే మరిచిపోయింది. కొన్ని రోజులు గడిచాక ప్రొఫెసర్ కొన్ని కాగితాలిచ్చి, 'నువ్వు చదివిన పుస్తకాల్లో ఏది నచ్చిందో, ఎందుకు నచ్చిందో రాసివ్వు' అన్నారు. తస్లీమా నస్రీన్ పుస్తకం గురించి తనకొచ్చిన వాడుక భాషలో రాసిచ్చింది. దానిని చదివిన ప్రబోధ్ ఆమె రాసిన తీరుకీ, వాక్యాల్లోని గాఢతకీ ఆశ్చర్యపోయాడు. కట్ట కాగితాలిచ్చి, ఏదయినా కథ రాసి తెమ్మన్నాడు. పగలంతా పనులు చేసుకుని, రాత్రి వేళ తన జీవితాన్నే కథగా రాయడం మొదలుపెట్టింది. చిన్ననాటి చేదు జ్ఞాపకాలూ, కష్టాలూ, పారిపోయి వచ్చిన సంగతులూ, పిల్లలూ, వాళ్ల గురించిన కలలూ... 143 పేజీల కథ సిద్ధమైంది.
ఆడపిల్ల కష్టాల్నీ, కన్నీళ్లనీ కళ్లకు కట్టే ఆ కథ ప్రొఫెసర్‌ని కదిలించింది. ఆయన దాన్ని హిందీలోకి తర్జుమా చేయించి 'ఆలో ఆంధరీ' పేరుతో కొన్ని పుస్తకాలు అచ్చు వేయించాడు. కొన్ని రోజుల్లోనే అన్నీ అమ్ముడయ్యాయి. పనిమనిషి జీవిత కథగా చాలా పేరుతెచ్చుకుంది. జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. బెంగాలీ, మలయాళంతో సహా సుమారు ఇరవై భాషల్లోకి అది తర్జుమా అయ్యింది. ఆర్థికంగా, సామాజిక గౌరవం పరంగా బేబీ హాల్దార్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్సాహంగా 'ఇషత్ రూపాంతర్' పేరుతో రెండో పుస్తకం రాసింది. అదీ ఆదరణ పొందింది. ప్రస్తుతం మూడో పుస్తకం రాసే పనిలో ఉన్న బేబీ పిల్లలకి మంచి చదువు చెప్పిస్తోంది. కోల్‌కతాలో సొంత ఇల్లు కట్టుకుంటోంది.
మూలం : ఈనాడు దినపత్రిక