భారతదేశంలో టాప్‌టెన్ జర్నలిస్ట్ జాబితాలో చోటు సంపాదించారంటే ఆమెకున్న ప్రతిభను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బర్కాదత్ టీవీ జర్నలిస్ట్‌గా, కాలమిస్ట్‌గా ఢిల్లీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీటీవిలో గ్రూప్‌ఎడిటర్‌గా, వార్తాయాంకర్‌గా పనిచేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన బర్కాదత్ కార్గిల్ యుద్ధం, 2002లో గుజరాత్ అల్లర్లు, 2008లో ముంబయిలో ఉగ్రవాదుల దాడులు వంటి సంచలన వార్తల్ని ధైర్యంగా రిపోర్టింగ్ చేసి, పాపులర్ మహిళా జర్నలిస్ట్‌గా కీర్తిగడిస్తున్నారు.
పుట్టిపెరిగింది ఢిల్లీలోనే...
బర్కాదత్ 1971లో డిసెంబర్ 18న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీలో పిజీ వరకు చదివిన ఆమె కొలంబియా యూనివర్సిటీలో మరో పిజీ చేశారు. 1991లో ఆమె తన కెరీర్‌ను ఆరంభించారు. బర్కాదత్ తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. ఆమె తల్లి ప్రభాదత్ హిందుస్థాన్ టైమ్స్‌లో జర్నలిస్ట్‌గా పనిచేసారు. 1984లో ఆమె అనారోగ్యంతో మరణించడంతో, బర్కాదత్ తన తల్లి వృత్తిని ఆదర్శంగా స్వీకరించి, జర్నలిస్ట్‌గా మారారు. బర్కాదత్ ఎన్డీటీవిలోకి రాకముందు సిఎన్‌ఎన్ ఐబిఎన్‌లో కూడా పనిచేశారు.
కెరీర్‌లో మలుపు తిరిగిన సందర్భాలు
కార్గిల్‌యుద్ధంపై బర్కాదత్ చేసిన రిపోర్డింగ్‌తో ఇండియాలో పేరుపొందిన జర్నలిస్టుల జాబితాలో చేరారు. కాశ్మీర్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ వంటి దేశాలకు సంబంధించి ఎన్నో వివాదాస్పద అంశాలపై రిపోర్టింగ్ చేసిన అసమాన అనుభవం ఆమెది. ప్రత్యేకంగా ఆదివారం ఆమె నిర్వహించిన 'టాక్‌షో' విశేష ఆదరణ పొందడమే కాక, ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమానికి అమెకు ఎన్నో అవార్డులు వరించాయి. 'టివి పర్సనాల్టీ ఆఫ్ ద ఇయర్' అనే అంతర్జాతీయ టీవీ అవార్డును బర్కాదత్ గత సంవత్సరం పొందారు.
బర్కాదత్ రిపోర్టింగ్‌లో ఉన్న విశేషం
బర్కాదత్ వార్తల్ని రాసే విధానం అసమానంగా ఉంటుంది. వార్తల్ని ఏదో వార్తగా రాయకుండా ఆ వార్త లోతు అంచుల్లోకి వెళ్లి, పరిశోధనాత్మకంగాను, విశ్లేషణాత్మకంగాను రాయడంలో ఆమెకు ఆమే సాటి. 2004లో మనదేశాన్ని కదిలించిన సునామీ విషాదంపై ఆయాప్రాంతాలను బర్కాదత్ పర్యటించి, వార్తల్ని సేకరించి, ఎప్పటికప్పుడు టివి ఛానల్స్‌కు పంపేవారు. కేంద్ర ప్రభుత్వం ఆమె సేవల్ని గుర్తించి 2008లో పద్మశ్రీ బిరుదును ఇచ్చారు. 'గ్లోబల్ లీడర్స్ ఆఫ్ టుమారో' అనే పేరుతో విడుదలైన వందమంది టాప్‌లిస్ట్ లేడీస్‌లో బర్కాదత్‌కు చోటు దక్కింది. 'వరల్డ్ ఎకానమీ ఫోరమ్' లో 2001-2008 వరకు పనిచేశారు. 2005లో భారతదేశంలో 50మంది మహిళల్లో ఆమె ఒకరుగా అదీ 35 సంవత్సరాల వయసులోనే చోటు చేసుకోవడం విశేషం.
విమర్శలు, వివాదాలు ఉన్నాయి
ఇంత పేరును పొందిన బర్కాదత్ జీవితంలో వివాదాలకు కొదువ లేదు. ఆమె పలు విమర్శలకు కూడా గురికావాల్సి వచ్చింది. గుజరాత్ ప్రజలు సంప్రదాయాల ముసుగులో జీవిస్తున్నారని, 'ప్రొ సోనియాగాంధీ' పేరుతో ఆమె రూపొందించిన కార్యక్రమం పలు విమర్శలకు దారితీసింది.
గుజరాత్ అల్లర్లపై రిపోర్టింగ్
2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా అల్లర్లు మనకు తెలిసింది. గాద్రా బాధితులతో నేరుగా మాట్లాడుతూ, లైవ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంతా బర్కాదత్ రిపోర్టింగ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ చేసేందుకు వరదరాజ్ కమిటికి, ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆమె ముఖ్య సమాచారాన్ని అందించినవారిలో ప్రముఖురాలిగా నిలిచారు.
ముంబయిలో ఉగ్రవాదుల దాడులపై ప్రత్యేక కవరేజ్
2008లో ముంబయిలోని తాజ్‌మహల్ హోటల్, ఒబెరా త్రిడెంట్‌లపై జరిగిన ముష్కరుల దాడిపై బర్కాదత్ అసమాన ధైర్యసాహసాల్ని ప్రదర్శించారు. ఒకవైపు ఉగ్రవాదులు తాజ్‌మహల్ హోటల్‌లో ఉండి, దాడులకు పాల్పడుతుంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులు, ఫొటోగ్రాఫులతో సమానంగా బర్కాదత్ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా రిపోర్టింగ్ చేశారు. ఈమె ధైర్యాన్ని గమనించిన న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన రిపోర్టర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనిపై బర్కాదత్‌కు ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి. కారణం బర్కాదత్ తన రిపోర్టింగ్ ద్వారా టివీలో లైవ్ ప్రసారాలతో ఆమె టెర్రరిస్టులకు మంచి సమాచారం ఇచ్చినట్లుగా అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఏదీఏమైనా బర్కాదత్ జర్నలిజం ఫీల్డ్‌లో తనకున్న ప్రతిభ ద్వారా చిన్నవయసులోనే సంచలనాత్మక వార్తల్ని రాసి, మనదేశంలో టాప్‌టెన్ జర్నలిస్టుల్లో ఒకరుగా కీర్తిగడించడం మామూలు విషయం కాదు. 41 సంవత్సరాల కాలంలోనే పద్మశ్రీ వంటి ఉన్నతమైన అవార్డులను పొందడం కూడా సాధారణ విషయం కాదు. మహిళలపై నిత్యం లైంగిక దాడులు జరుగుతున్నా, ఆమె వికాసానికి అడ్డంకులు, అవాంతరాలు జరుగుతున్నా పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు ఇలాంటివన్ని గడ్డిపరకల్లా ఏరి పక్కకు పడేస్తూ ముందుకు సాగేందుకు బర్కా దత్ వంటి ధైర్యవంతమైన మహిళలే స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటారు.
మూలం : వార్త దినపత్రిక