తండ్రి ఆశయం కోసం కష్టాన్ని ఇష్టపడడం మొదలుపెట్టింది!
డబ్బులడిగి చేసేది సేవకాదనే సిద్ధాంతాన్ని నిలపడం కోసం రోజుకు పన్నెండు గంటలు పనిచేయడం ప్రారంభించింది!
అందుకోసం విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించింది... సంపాదించిన రూపాయిలోని
ప్రతి అర్థరూపాయిని అనాథల కోసం ఖర్చుచేస్తున్నది! తన నిరంతర సేవతో అనాథల్లోనే కాదు వికలాంగులు, మహిళల్లోనూ కొత్త వెలుగులు నింపుతున్నది...ఆ సార్థక నామధేయురాలు తన గురించి చెప్తున్న వివరాలు....
నా గురించి నేను చెప్పుకునేముందు మా నాన్న పరిచయం చాలా అవసరం. ఎందుకంటే ఆయన ఆశయమే నన్ను నడిపిస్తున్నది కాబట్టి. 1964లో మా కుటుంబం నల్గొండలో సెటిల్ అయింది. నాన్నకు (పూజారి లక్ష్మీనారాయణ) నిరుపేదల డాక్టర్‌గా నల్గొండలో గొప్పపేరు. తన సర్వీసులో కన్సప్టూంట్ ఫీగా 5 రూపాయలు మాత్రమే తీసుకొని వైద్య సేవలు అందించారు. లెప్రసి సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉచిత వైద్యం చేశారు. జైపూర్ కాళ్లు లేనిరోజుల్లో నల్గొండలో వికలాంగుల కోసం ఇంట్లోనే క్లినిక్ పెట్టి కృత్రిమ కాళ్లు తయారు చేయించి అందించేవారు. నల్గొండ లయన్స్‌క్లబ్ ఫౌండర్‌గా, టి.బి అసోసియేషన్ అధ్యక్షునిగా, రెడ్‌వూకాస్ మెంబర్‌గా పేదవారికి సాయం అందే అన్ని మార్గాల్లో ఆయన ఉన్నారు. ఆయన భావాలు నా రక్తంలో కలిసిపోయాయి. మేం నలుగురు పిల్లలం. ఇద్దరు అన్నయ్యలు కవలలు. వారు డాక్టర్లు, చెల్లి సాయిలక్ష్మీ కూడా అమెరికాలో డాక్టర్. నాదే సపరేట్ ఫీల్డ్. సృజనాత్మక రంగం. షార్ట్ ఫిలింస్ తీశాను. డబ్బింగ్ చెబుతాను.పీఎల్‌ఎన్ ట్రస్టు
ఆవిర్భావం....
నాన్న సేవా కార్యక్రమాలు చూసి 2000 సంవత్సరంలో నాకూ సేవారంగంలో అడుగుపెట్టాలనుందని నాన్నతో చెప్పాను. అప్పుడు ఆయన ఒకటే అన్నారు...‘చెయ్యిచాచి ఎవ్వరినీ అడగకు, ఏమీ ఆశించకు. పవివూతమైన భావనతో సేవ చేయాలి’ అని. ఆయన భావాలు ప్రతిబింబించేలా పిఎల్‌ఎన్ ట్రస్టు ఏర్పాటు చేశాను. నేను చదువుకున్న వరంగల్ అండర్ బ్రిడ్జి దగ్గరి ‘చందా విద్యానాథ్ స్కూల్’ నుంచే నా తొలిసేవ ప్రారంభించాను. శ్రీధర్ అనే విద్యార్థికి మొదటి సహాయంగా 2,500 రూపాయలు అందించాను. ఎంతో సంతృప్తి.తొలిషాక్...
నాన్న పేరు మీద పి.ఎల్.ఎన్ ట్రస్టు ఏర్పాటు చేసిన రెండు నెలల్లోనే అనుకోకుండా నాన్న మరణించారు. షాక్‌కి గురయ్యాను. ఆరునెలలు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాను. ఒక్కోసారి ఊపిరి అడనట్టయ్యేది. ఎవర్ని చూసినా నాన్నలాగే కనిపించేవారు. అలా మనసు స్థిమితం లేని రోజుల్లో ఒకసారి రోడ్డు మీద నడుస్తుంటే పెద్ద యాక్సిడెంట్ నుంచి నన్ను ఓ వికలాంగురాలు కాపాడింది. ఇలా లాభంలేదనుకుని నాన్న జ్ఞాపకాలతో కాలంగడిపేకంటే నా సేవలో నాన్నని చూసుకోవాలని నిర్ణయించుకున్నా.
నైపుణ్యమే పెట్టుబడి..
పి.ఎల్.ఎన్ ట్రస్టు పెట్టేటప్పటికే నేను ఉస్మానియాలో సైన్స్ గ్రాడ్యుయేట్‌ని. తర్వాత పీజీడీసీఏ, హోటల్‌మేనేజ్‌మెంట్, జర్నలిజం , ఇంటీరియర్ డెకరేషన్ , ఫ్యాషన్ డిజైనింగుల్లో డిప్లొమా చేశాను. ప్రతీ కోర్సులో ప్రావీణ్యం సంపాదించా. మొదటగా పీఎల్‌ఎన్ హోంసైన్స్ ఇనిస్టిట్యూట్ పెట్టి వెయ్యిమందికి పైగా మహిళలకు చాక్లెట్ మేకింగ్, పెయింటింగ్, సాఫ్ట్ టాయ్స్ నేర్పించాను. కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్ ఇచ్చి మహిళలకు ఉద్యోగవకాశాలు ఇప్పించా. ఆ డబ్బుతో సేవా కార్యక్రమాలు పరిధి పెంచాను. అప్పుడే నేను సంపాదించే దానిలో సగం సేవా కార్యక్రమాల ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచి నా ప్రతి రూపాయిలో అర్ధ రూపాయి అనాథలకు, వికలాంగులకు వెళ్లిపోతున్నది. అందుకే ఎంత సంపాదిస్తే అందులో సగం సేవాకార్యక్షికమాలకే వినియోగిస్తున్నా.
మహిళగా...
ఈ నాడు స్త్రీ అడుగుపెట్టని రంగంలేదు. అయినా ఇప్పటికీ ఏదో ఒక చోట గృహహింస అనుభవిస్తూనే ఉంది. నిజానికి నేనూ పెళ్లయిన తర్వాత చాలా కష్టాలు అనుభవించాను. అందుకే సాటి స్త్రీకి అండగా నిలబడాలని నిశ్చయించుకున్నాను. వంగపహడ్‌లో వేశ్యావృత్తిలో ఉన్న దొమ్మెర కమ్యూనిటీ వారికి షాంపు, ఫినాయిల్, క్యాండిల్ తయారీ శిక్షణ ఇచ్చాను. పదుల సంఖ్యలో మహిళలకు ఆ వృత్తినుంచి విముక్తి కల్పించి కొత్త జీవితం వైపు అడుగులు వేసేలా స్వయం ఉపాధి కల్పించాం. సెక్స్ వర్కర్స్‌గా వారు అనుభవిస్తున్న వెతలు చూసి అప్పటి ఎస్పీ ప్రభాకర్ రావుకి లెటర్ రాశాను. విదేశాల్లోలా ఉమెన్ థెరఫిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించాను. ఒక కౌన్సిలర్, సైక్రియాటిస్టు, అడ్వకేట్‌తో వారి జీవితాల్ని వెలుగులోకి తీసుకురావచ్చు. ఎప్పటికైనా ఇలాంటి సెంటర్స్‌ను నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాను.
హన్మకొండ న్యూసైన్స్ కళాశాలలో కొత్త ప్రయోగం చేశాం. రెస్పాన్స్ ఎబిలిటీ పాత్‌వేస్(ఆర్‌ఏపీ) పేరిట యూత్‌ని 15రోజులు సిగరెట్లు, మందుని మాన్పించాం. వాటిపై పెట్టేఖర్చును మేమే తీసుకున్నాం. 15రోజులకు 68వేల రూపాయల కలెక్షన్ వచ్చింది. మన యూత్ సిగరెట్లు, మందుకు ఇంత ఖర్చు చేస్తున్నారా అని ఆశ్చర్యం వేసింది. ఆ డబ్బుతో నగరంలోని అనాథాశ్రమాలకు గిఫ్టులు పంపించాం. ఇలాంటివి ప్రతి కాలేజీలో నిర్వహించాలని అనుకుంటున్నా. మా ట్రస్టు తరపున యేటా ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు చదివే 20మందికి విద్యాసాయం అందిస్తున్నాను. 2011లో పదవ తరగతి ఫలితాల్లో ప్రతీ ఒక్కరూ 80శాతం మార్కులు సాధించారు.
అవార్డులు...
విభిన్న రంగాల్లో అవార్డులు అందుకున్నా. బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్, బెస్ట్ స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీ ట్రైనర్, ఉమెన్ ఎక్సపూన్స్, బెస్ట్ సోషల్ వర్కర్, బెస్ట్ హెచ్‌ఆర్, సర్వేపల్లి మెగాపురస్కార్ వంటివి లభించాయి. అంధులకు బ్రెయిలీ లేకుండా ఇంగ్లీష్ నేర్పించినందుకు సర్వేపల్లి మెగాపురస్కార్ లభించడం మర్చిపోలేను. ఇంగ్లీష్ అకాడమి డైరెక్టర్‌గా, స్మాల్ స్కేల్ ట్రైనింగ్ డైరెక్టర్‌గా విభిన్న రంగాల్లో అడుగుపెట్టి, విజం సాధించడంపైనే మనస్సు పెట్టాను.
స్ఫూర్తి ప్రదాతలు..
1974లో నాన్న మదర్ థెరిస్సాను నల్గొండలోని లయన్స్‌క్లబ్‌కు తీసుకువచ్చారు. ఆమె నిలు రూపం నాలో చెరగని ముద్ర వేసింది. నన్ను ఆశీర్వదించింది. ఆ ఆశీస్సులు నావెంటే ఉన్నాయి. చివరగా ఒక మాట... మొత్తం ఈ నా ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ‘సేవ చేస్తుందట సేవ’ అంటూ చాలామంది వంకరగా మాట్లాడారు. అయినా కుంగిపోలేదు. ట్రస్టు అనేది అఖండ దీపం. దాని నుంచి వెలుగు ఎప్పుడూ రావాలి. ఆ వెలుగును చూసి నాకంటే ముందు నాన్న పేరు తలుచుకోవాలి. ఆ దీపం నిరంతరం వెలుగుతూ ఉండడానికి ఏ అవమానాలనూ లెక్కచేయను. నా జీవితాంతం కృషి చేస్తూనే ఉంటాను.
మూలం : తెలుగు విశేష్