ఎరుపు రంగులో గులాబీపూల గుబాళింపులు..
పసుపు రంగులో పండునిమ్మ సువాసనలు..
ఆరెంజ్ రంగులో కమలా పండు కమ్మదనాలు..
ఇదేంటిలా ఒక్కో రంగును ఒక్కో వాసనతో పోల్చారు. ఈ రంగులేవీ అలాంటి వాసనలు రావే అంటున్నారా. అవును మామూలుగా అయితే రంగులకి ఆ వాసనలేవీ ఉండవు. కాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రంగులు కూడా సువాసనలు విరజిమ్ముతాయి. చీకటి ప్రపంచంలో రంగుల వెలుగుల్ని పరుస్తాయి.
"చూపులేకపోవడం వల్ల మా కళ్లకి చీకటి తప్ప మరోటి కనిపించదు. కాని అదంతా మమ్మల్ని లలిత మేడమ్ కలవనంత కాలమే. ఆమెతో పరిచయం ఏర్పడిన తరువాత రంగుల్ని గుర్తించగలుగుతున్నాం. ప్రకృతి అందాలను మనసుతో చూడగలుగుతున్నాం. మనసు చూసిన వాటికి రంగులద్ది పెయింటింగ్‌లు వేస్తున్నాం. ఆవిడకొచ్చిన విద్యను మాకు నేర్పించాలనే ఉద్దేశంతో లలిత మేడమ్ ఎంతో శ్రమపడ్డారు. మేము వేసిన పెయింటింగ్స్‌తో త్వరలో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తానంటున్నారామె. ఇంకా బాగా నేర్చుకుని మంచి పెయింటింగ్‌లు వేస్తాం'' అని ఎంతో దృఢంగా చెప్పారు ఇంటర్మీడియెట్, డిగ్రీ చదువుతున్న సుధ, దివ్య, సుష్మ, సంధ్య, లక్ష్మి.
బాబా ఇచ్చిన పిల్లలు వాళ్లు
కంటిచూపులేని వాళ్లకు పెయింటింగ్ నేర్పించాలనే ఆలోచన ఎలా వచ్చిందని లలితకుమారిని అడిగితే... "ముందునుంచీ ఆలోచించి, పెద్దపెద్ద ప్రణాళికలు వేసుకుని ఈ పని చేయలేదు నేను. సాయిబాబా పూజని 49 రోజులు చేయాలని ప్రారంభించాను. ఈ పూజకిగాను వారంలో ఏడు రోజులు సాయిబాబా పుస్తకాన్ని నాతో కలిసి ఆరుగురు వ్యక్తులు ప్రతిరోజూ చదవాలి. కొన్నిరోజులు స్నేహితులు, బంధువులు వచ్చి చదివారు. ఆ తరువాత రోజూ ఏడుగురు వ్యక్తులు దొరకడం కష్టమైంది. మనుషులు దొరక్కపోతే పూజ చేయడం కుదరదు. ఎలాగా అని ఆలోచిస్తుంటే ఓల్డేజ్ హోమ్స్ గుర్తుకు వచ్చాయి. వాటిలో ఉంటున్న పెద్దవాళ్లని రమ్మంటే బాగుంటుంది అనిపించింది. దానికోసం ఓల్డేజ్‌హోంలను సంప్రదిస్తే వాళ్లను బయటకు పంపడం కుదరదని చెప్పారు. అప్పుడొచ్చింది అంధులను కూర్చోపెట్టి ఆ పుస్తకం చదివి వినిపించాలన్న ఆలోచన. వెంటనే అంధులకి ఆశ్రయమిస్తున్న గోపాల్‌గారితో విషయం చెప్పాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు.
ఆయనకి తెలిసిన వేరే వాళ్ల వివరాలు కూడా నాకు ఇచ్చారు. దాంతో నాకు మనుషుల్ని వెతుక్కోవాల్సిన అవసరం తప్పింది. ప్రతి రోజు ఏడుగురు పిల్లల్ని ఇంటికి తెచ్చుకుని బాబా పుస్తకం చదివి వినిపించేదాన్ని. వచ్చిన ఆ పిల్లలతో బాగా పరిచయం ఏర్పడింది. ఆ పిల్లలు కూడా అప్పటివరకు తాము తరగతి పుస్తకాలను తప్ప ఇటువంటి పుస్తకాలు బ్రెయిలీ లిపిలో లేకపోవడం వల్ల చదవలేకపోయామని, బాబా పుస్తక శ్రవణం చాలా ఆనందాన్ని ఇచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. చివరి 20 రోజుల పూజ ఆ పిల్లలతోనే చేశాను. వాళ్లతో మాట్లాడుతుండగా పలు విషయాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ చూపు లేకపోవడం వల్ల వాటిని చేయలేకపోతున్నామని బాధపడ్డారు.
రంగులు కనపడకపోతేనేం...
నేను పెయింటింగ్స్ వేస్తుంటాను. ఆసక్తి ఉంటే పెయింటింగ్ వేయడం మీకూ నేర్పిస్తాను అన్నాను. దానికి వాళ్లు "పెయింటింగ్ మేమెలా వేయగలం? రంగుల్ని ఎలా గుర్తించగలం? పిల్లి, కుక్క, పక్షుల వంటి వాటినైతే స్పర్శ ద్వారా, వాటి అరుపుల ద్వారా గుర్తించగలం. అవే గోడ మీద కూర్చుంటే ఎలా ఉంటాయి, ఎగురుతుంటే ఎలా ఉంటాయి, చెట్లమీద ఎలా ఉంటాయి, పడుకుంటే ఎలా ఉంటాయనేది మాకు తెలియదు కదా'' అన్నారు. మీరవేవీ ఆలోచించొద్దు. మీకు పెయింటింగ్ నేర్పించే బాధ్యత నాది అన్నాను. ఓ ఐదుగురు పిల్లలు ఆసక్తి కనపరిచారు. ఇక అప్పటి నుంచి వాళ్లకి రంగుల్ని అర్థమయ్యేలా చెప్పేందుకు కొన్ని ప్రయత్నాలు చేశాను. ఎలా చెప్తే వాళ్లకి సులభంగా అర్థం చేయించగలనో తెలుసుకునేందుకు నా మీద నేనే ప్రయోగం చేసుకున్నాను. కళ్లు మూసుకుని రకరకాల పద్ధతులు అవలంబించిన తరువాత చివరికి ఒక పద్ధతి కనుగొన్నాను.
దాని ద్వారానే వాళ్లకు పెయింటింగ్ వేయడం నేర్పాలనుకున్నాను. వాసనల ద్వారా రంగుల్ని ముందుగా పరిచయం చేశాను. అంటే తెలుపు రంగు గుర్తించేందుకు మల్లెపువ్వు వాసనను తెలుపు రంగులో కలిపాను. ఎరుపు రంగుకోసం గులాబి, ఆరెంజ్ రంగు కోసం కమలా ఫ్లేవర్, పసుపు రంగులో నిమ్మపండు ఫ్లేవర్‌లు కలిపి రంగులు గుర్తించడం నేర్పించాను. కళ్లతో చూడలేనిది మైండ్‌తో చూడొచ్చనే విషయాలను అర్థమయ్యేలా చెప్పి ఆ తరువాత పెయింటింగ్ పని మొదలుపెట్టాను.
ఐదుగురు పిల్లలు నెల రోజుల్లో 15 పెయింటింగ్‌లు వేశారు. పేపర్ మీద గ్లూ కలర్‌తో అవుట్‌లైన్స్ ఎంబోజింగ్ చేశాను. పారుతున్న నది, ఒడ్డు, ఒడ్డు మీద చెట్టు, నదిలో బాతులు, చెట్టు మీద పక్షులు ... ఇలా అన్నింటికీ అవుట్‌లైన్స్ గీసిచ్చాను. పిల్లలు చేతివేళ్లతో నెమ్మదిగా తడుముతూ వాటి వివరాలు ముందు తెలుసుకునేవారు. ఆ తరువాత బొమ్మను బట్టి ఎంపిక చేసుకోవాల్సిన రంగుల్ని నేను సూచిస్తుంటే, వాసన ద్వారా రంగుల్ని గుర్తించి బొమ్మలకి రంగులద్దారు. ఒక్కో బొమ్మకు మూడు నాలుగు రోజుల సమయం కూడా పట్టింది. బొమ్మ పూర్తవ్వగానే వాళ్ల మొహాల్లో కనిపించిన ఆనందం చూస్తే వాళ్ల కోసం ఇంకా ఏదైనా చేస్తే బాగుండనిపించింది. పెయింటింగ్‌లో మరికొన్ని పద్ధతులు కూడా నేర్పించి గ్రీటింగ్ కార్డులు తయారు చేయించాలనుకుంటున్నాను. అలాగే వాళ్లు వేసిన పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాను. వీళ్లకే కాకుండా క్యాన్సర్ ఆసుపత్రులకు వెళ్లి క్యాన్సర్ సోకిన పిల్లలకు కూడా పెయింటింగ్ నేర్పిస్తున్నాను.
జీవితాన్ని ఇంకా ప్రేమించాలి
స్కూల్‌కి వెళ్లే రోజుల్లో నేను డ్రాయింగ్స్ వేస్తుంటే 'చదువుకోకుండా అదేం పని' అని మా అమ్మ నన్ను తిట్టేది. కాని నాకు చిన్నప్పట్నించీ డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే పెద్దయ్యాక సొంతంగానే పెయింటింగ్ నేర్చుకున్నాను. నా పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత మళ్లీ నా అభిరుచికి పదును పెట్టాను. నేను సింగిల్ పేరెంట్‌ని. వ్యక్తిగత జీవితంలో ఎదురైన గందరగోళం నన్ను పెయింటింగ్‌కి బాగా దగ్గర చేసింది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా కోర్సు చేశాను. ఫ్యామిలీ కౌన్సిలింగ్‌లో పిజి డిప్లొమా చేశాను. ప్రాణిక్ హీలింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో కొన్ని కోర్సులు చేశాను. నాకు తోచినంతలో ఇతరులకు సాయం చేస్తున్నాను. యోగాలో శిక్షణ కూడా ఇస్తున్నాను. సమస్యలు ఎదురైనప్పుడు ఆడవాళ్లు కుంగిపోవాల్సిన అవసరంలేదు. ఇంకా అప్పుడే బలంగా తయారవ్వాలి. జీవితంపై ప్రేమ పెంచుకోవాలి. గెలుపు సాధించాలి'' అన్నారు వి.లలిత కుమారి.
పిల్లలు చేతివేళ్లతో నెమ్మదిగా తడుముతూ వాటి వివరాలు ముందు తెలుసుకునేవారు. ఆ తరువాత బొమ్మను బట్టి ఎంపిక చేసుకోవాల్సిన రంగుల్ని నేను సూచిస్తుంటే, వాసన ద్వారా రంగుల్ని గుర్తించి బొమ్మలకి రంగులద్దారు.