లక్ష్మి ఢిల్లీలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఓ రోజు స్కూలైపోయాక సరదాగా స్నేహితురాలు ఇంటికెళ్లింది. అక్కడే ఉన్నాడు నయీమ్ ఖాన్. స్నేహితురాలి అన్న. 'ఈ అమ్మాయి నాదే'... బంగారు బొమ్మలా ఉన్న లక్ష్మిని చూడగానే అతని మెదడులో కదిలిన ఆలోచన ఇదే. నెమ్మదిగా మాట కలిపాడు. అతని విషపు ఆలోచనను గుర్తించలేక స్నేహితురాలి 'అన్న' కదాని తనూ సరదాగా మాట్లాడింది. దాన్ని అలుసుగా తీసుకుని వెంటపడ్డాడు. ఫోను నంబరు తీసుకున్నాడు. 'ఐ లవ్యూ' అంటూ ఎస్సెమ్మెస్ పంపాడు. అది చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. భయపడింది. ఆమె వయసు పదిహేను. అతనికి ముప్ఫై రెండు. 'అతనింత దుర్మార్గుడా' అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది. ఇంతలో మరో ఎస్సెమ్మెస్. 'వెంటనే జవాబివ్వు. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి'. అది చదివి వణికిపోయింది. ఇంట్లో చెబితే తననే తిడతారు. చదువు మానిపిస్తారు. నెమ్మదిగా ధైర్యం కూడదీసుకుంది. 'మిమ్మల్ని అన్నలా భావించాను. నాకు ఆలాంటి ఆలోచనలు లేవు. దయచేసి వదిలేయండి' అంటూ బదులిచ్చింది. అటు నుంచి జవాబు రాలేదు. అర్థం చేసుకున్నాడనుకుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనక రాక్షసత్వం దాగుందని వూహించలేకపోయింది.
తన ప్రేమను కాదనిందన్న అవమానంతో నయీమ్ పగతో బుసలు కొడుతున్నాడనీ, రహస్యంగా వెంబడిస్తున్నాడనీ తెలుసుకోలేకపోయింది.లక్ష్మి కలలూ, ఆశలూ కూలిపోవడానికి పట్టిన సమయం కేవలం ముప్ఫై సెకన్లు. యాసిడ్ పడగానే... మొదట రెండు చెవులూ కరిగిపోయాయి. ముక్కు పిండి ముద్దలా మారింది. పెదాలు పొట్టులా రాలిపోవడం మొదలైంది. రెప్పపాటులో కళ్లకు చేతుల్ని అడ్డం పెట్టుకుంది. ఒళ్లంతా భరించలేనంత మంట.... శరీరంలో ఒక్కో భాగం కాలిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయినా చేతులను కళ్లపై నుంచి తీయకుండా బాధతో అరుస్తూనే ఉంది. అటుగా వచ్చిన ఓ వ్యక్తి కారులో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించేప్పటికే స్పృహతప్పింది. ఒళ్లంతా సూదులు గుచ్చినంత బాధ. ఎక్కడ ముట్టుకున్నా బ్యాండేజీలు. ముఖానికి ఏమీ జరిగి ఉండదులే అని ఏ మూలో చిన్న ఆశ. పది వారాలు గడిచాయి. కాస్త స్థిమిత పడింది. మునుపటిలా మాట్లాడటం మొదలుపెట్టింది. కానీ డాక్టర్ ముఖానికి ఉన్న కట్లు విప్పినప్పుడు అద్దంలో తన ముఖం చూసుకుని తట్టుకోలేకపోయింది. ముఖమంతా కాలిన చర్మపు ముడతలు చూసుకుని, 'ఆ రోజు చేతులు అడ్డుపెట్టుకోకుండా ఉండుంటే, ఇప్పుడిలా నన్ను చూసుకునే దుస్థితి వచ్చుండేది కాదు' అని వలవలా ఏడ్చింది. అయినా అద్దాన్ని పక్కకు జరపలేదు. దాన్లో ముఖం చూసుకుంటూ, తనేం కోల్పోయిందీ, ఇక ముందు జీవితం ఎలా ఉండబోతోందీ అర్థం చేసుకొనే ప్రయత్నం చేసింది.'ప్రేమను ఒప్పుకోలేదని ఓ అమ్మాయి జీవితాన్ని ఇంత సులువుగా నాశనం చేస్తాడా... చెల్లెలి లాంటిదాన్ని అన్నా కనికరం చూపలేదే...' చికిత్స జరుగుతున్నన్నాళ్లూ లక్ష్మి ఆలోచన ఇదే. పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. కానీ నెల తిరిగేసరికి బెయిలుపై విడుదలయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. ఏ పాపం ఎరుగని లక్ష్మి మాత్రం చావుకీ, బతుక్కీ మధ్య వూగిసలాడుతోంది.
'ఏ తప్పూ చేయని నేను జీవితాన్ని కోల్పోయాను. అన్నిటికీ కారణమైన అతను స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనికి గుణపాఠం చెప్పేందుకు ప్రాణం ఉన్నంత వరకూ పోరాడాలి..' అనుకుంది. అప్పటికే ఆమెకు ఏడు శస్త్ర చికిత్సలు జరిగాయి. మరో నాలుగు చేయాలని డాక్టర్లు చెప్పారు. పూట గడిస్తే చాలనుకొనే కుటుంబం ఆమెది. చికిత్స కోసం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. లక్ష్మి తండ్రి ఓ వంటవాడు. ఓ వైద్యురాలి దగ్గర పనిచేస్తాడు. ఆమె సాయంతోనే లక్ష్మికి చికిత్స జరిగింది. శరీరం నొప్పి నుంచి కోలుకుంది. కానీ మనసు మాత్రం రంపపు కోత అనుభవిస్తూనే ఉంది. హాయిగా ఆడుతూ, చదువుతూ తిరగాల్సిన వయసులో ఆమె జీవితం ఆస్పత్రి గోడలూ, కోర్టు మెట్లకు అంకితమైంది.యాసిడ్ శరీరాన్నే గాయపర్చింది. అంతులేని ఆమె ధైర్యాన్ని ఇసుమంతైనా కదిలించలేకపోయింది. గాయాల నుంచి కోలుకున్నాక జీవితంతో పోరాడాలని లక్ష్మి నిశ్చయించుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ, యాసిడ్‌ని నిషేధించాలని ఆన్‌లైన్‌లో ఆమె ఉంచిన పిటిషన్‌కు మద్దతుగా 27వేల మంది సంతకాలు చేశారు. ఆ స్పందన కొండంత ధైర్యాన్నిచ్చింది. ఓ న్యాయవాది సాయంతో 'యాసిడ్ అమ్మకాలను నిషేధించాలనీ, దాడులకు పాల్పడిన వాళ్లను తీవ్రంగా శిక్షించాలనీ' కోరుతూ 2006లో సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. కోర్టు విచారణకు స్వీకరించింది. ఓ కమిటీని నియమించి యాసిడ్ దాడులకు సంబంధించిన చట్టంలో మార్పులకు మార్గం సుగమం చేసింది. న్యాయనిపుణులూ, మేధావులూ దీనిపై చర్చించారు. గణాంకాలను పరిశీలించారు. చివరికి చట్టంలో సవరణను సూచించారు.
అమె ధైర్యాన్ని చూసి విధి అసూయ పడిందేమో! మరిన్ని పరీక్షలు పెట్టింది. అన్నయ్య క్షయ వ్యాధితో మంచం పట్టాడు. తరవాత కొన్ని రోజులకే తనకు ధైర్యం నూరిపోసిన తండ్రి చనిపోయాడు. కుటుంబ భారమంతా లక్ష్మి మీదే పడింది. అన్ని బాధల మధ్యలోనూ చదువుకు దూరమవని ఆమె పన్నెండో తరగతిలో చేరింది. ఉన్న చదువుతోనే ఉద్యోగాల వేట మొదలుపెట్టింది. అక్కడా అవమానాలే. బీపీవోలూ, బ్యూటీ పార్లర్‌ల చుట్టూ ఉద్యోగాల కోసం తిరిగింది. వాటిలో పనిచేయడానికి అవసరమైన శిక్షణను తీసుకుంది. ప్రతి ఇంటర్వ్యూలో తన కథ వినడం. జాలి పడటం. మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పడం. ఉద్యోగం ఇస్తామన్న వారే లేరు. కనీసం తనను మామూలు మనిషిలా చూస్తే చాలనుకుంది. అదీ తీరలేదు. తనను చూసి భయపడేవాళ్లూ, పిల్లల్ని దూరంగా తీసుకెళ్లే వాళ్లే తప్ప స్నేహంగా ఉండేవాళ్లూ, సాయం చేసేవాళ్లూ కనిపించలేదు.
అప్పుడే తనలాంటి బాధితులను కలిసింది. అందరినీ కూడగట్టి యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా పోరాడటం ప్రారంభించింది.'యాసిడ్ దాడులను తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నాం. వాటికి పాల్పడిన వారికి కనీసం పదేళ్ల నుంచి జీవిత కాలపు జైలు శిక్ష, పది లక్షల రూపాయల జరిమానా విధిస్తాం. వివరాలు నమోదు చేయకుండా యాసిడ్ అమ్మడానికి లేదు. అలా చేస్తే కఠిన శిక్షలు తప్పవు. బాధితులకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయల జరిమానా చెల్లించాలి' అంటూ సుప్రీంకోర్టు గత నెలలో ఇచ్చిన తీర్పుతో లక్ష్మి కోల్పోయిన ఎనిమిదేళ్ల జీవితం తిరిగొచ్చినట్లయింది. నయీం ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. అయినా లక్ష్మి శాంతించలేదు. 'కోర్టు తీర్పు సమాజంలో భయాన్ని పుట్టిస్తుంది కానీ కోల్పోయిన మా శరీరాన్ని తిరిగి ఇవ్వలేదు. యాసిడ్ దాడికి గురయితే చికిత్సకు సుమారు పదిలక్షలపైనే ఖర్చవుతుంది. మూడు లక్షలు సరిపోవు. ఉద్యోగాలు రావు. పెళ్లిళ్ళు కావు. జీవచ్ఛవంలా బతకాలి. డిసెంబర్ 16 ఘటనకు దేశమంతా ఒక్కటైంది కదా! మేం అలాంటి బాధనే జీవితాంతం అనుభవిస్తాం. దేశంలో ప్రతి మూడు రోజులకు ఒకరు యాసిడ్ దాడికి గురవుతున్నారు. మా గురించి ఎందుకు ఎవరూ పట్టించుకోరూ...' అంటూ బాధపడుతుంది. ఇప్పుడు లక్ష్మి 'స్టాప్ యాసిడ్ ఎటాక్' అనే స్వచ్ఛంద సంస్థలో బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తూ, నెలకు పదివేల ఆదాయం పొందుతోంది. అన్న చికిత్సకూ, కుటుంబ పోషణకూ, తన చదువుకూ అదే ఆధారం. మామూలూ వ్యక్తులకు ఆమె శరీరానికైన గాయాలే కనిపిస్తాయి. కాస్త మనసుపెట్టి చూస్తే ఆమె కళ్లల్లో నిండిన ఆత్మవిశ్వాసం, పెదాలపై చెరగని చిరునవ్వూ పలకరిస్తాయి. యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా అలుపెరగక పోరాడుతున్న లక్ష్మి, జీవిత పోరాటంలోనూ ఆనుకున్న విజయాన్ని సాధించాలని ఆశిద్దాం!
మూలం : ఈనాడు దినపత్రిక