telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

నాట్య చందన

7/31/2013

0 Comments

 
Picture
                      ఆ పాప నాట్యం చేస్తే రంగస్థలమే పులకిస్తుంది. ఆ చిన్నారి అభినయానికి ప్రేక్షకలోకం పరవశిస్తుంది. బుడిబుడి అడుగుల ప్రాయంలోనే కాలికి గజ్జె కట్టి తన నాట్యకౌశలంతో అందరినీ అలరిస్తూ అద్భుతాలను సృష్టిస్తోంది చిన్నారి చందన(సంధ్య). ఈ చిన్నారి జీవితం విషాదంతో మొదలై ఇప్పుడిప్పుడే ఆనందమయంగా మారుతోంది. అందమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. కష్టాలు, సుఖాలు తేడా తెలియని ఆరు సంవత్సరాల చిన్నారి చందన జీవితంలో ఎన్నో మలుపులు, ఒడిదుడుకులు. 

                       విజయనగరం జిల్లా గరుగుబెల్లి మండలం, తోటపల్లి గ్రామంలో చందనకు జన్మనిచ్చి తల్లి ఈ లోకం నుంచి సెలవు తీసుకుంది. తల్లి లేని చిన్నిపాప పెంపకం బాధ్యతను అమ్మమ్మ తీసుకుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పేదరికం ఒక వైపు, వృద్ధాప్యం మరోవైపు ఆ అవ్వది. సరిగ్గా అదే సమయంలో ఆపన్న హస్తాన్ని అందించింది జట్టు ఆశ్రమ నిర్వాహకురాలు పద్మజమ్మ. అంతే! ఆ పాప జీవితంలో చీకట్లు మెల్లగా తొలగి వెలుగు రేఖలు విరబూయటం ప్రారంభమైంది. 

                 ఆశ్రమంలో నెలకొల్పిన శ్రీరజని రాజా కళాక్షేత్రంలో భరతనాట్యం, కూచిపూడి సాధన చేస్తున్న పెద్దక్కలను చూచి వారి అడుగులను అనుకరిస్తున్న చిన్నారి చందనలోని తపనను నాట్యగురువు శ్రీనివాస్ గమనించారు. గత ఏడాది నుంచి చందనకు శాస్త్రీయ నాట్యాన్ని సాధన చేసే అవకాశం కల్పించారు. 

తొలి అడుగులోనే...
కేవలం మూడు రోజుల సాధనతో బొబ్బిలిలో జరిగిన ఉత్తరాంధ్ర స్థాయి భరత నాట్య పోటీలలో చందన ప్రథమ స్థానం పొందింది. ఇదే తన తొలి ప్రదర్శన కూడా. అంతే! ఆ రోజు మొదలు ఆ చిన్నారి నాట్యంలో తనదైన ప్రతిభను చాటుకుంటూ వచ్చింది. పలువురి ప్రశంసలు అందుకుంటున్న ఈ చిన్నారి దేశవ్యాప్తంగా సుమారు 50కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. 

పులకించిన రవీంద్రభారతి...
‘వందేమాతరం ఫౌండేషన్’ వారి కార్యక్రమంలో రెండురోజుల క్రితం హైదరాబాద్ రవీంద్రభారతిలో గణేశ స్తుతి ప్రదర్శన, థిల్లానాలో (భరతనాట్యం) చందన ప్రదర్శన ఇచ్చింది. కార్యక్రమ ప్రారంభ సూచికగా చిన్నారి చందన చేసిన గణేశస్తుతి ప్రదర్శన చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అందరూ వన్స్ మోర్ అంటూ, అభినందించారు. 

‘‘యోగాలోను, నాట్యంలోను చందన చక్కటి కార్యదీక్ష, క్రమశిక్షణ కనబరుస్తుంది’’ అన్నారు నాట్యగురువు శ్రీనివాస్. అందుకే అంత లయ జ్ఞానం, నాట్యంలో పట్టు వచ్చిందని ప్రశంసించారు. ఎన్నో సంస్థలు ఈ చిన్నారి నాట్య ప్రదర్శనను కోరుతూ ఆహ్వానాలు పంపుతున్నారు. 

సత్కారాలు...
  • తొలి ప్రదర్శనను తిలకించిన ప్రముఖ నాట్యాచార్యులు శ్రీకాంత్ రఘు నగదు పురస్కారంతో చిన్నారి చందనను సత్కరించారు.
  • చీపురుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో చందన నాట్యం చూసి ప్రేక్షకులు కరె న్సీ నోట్ల దండలతో చందనను సన్మానించారు.
  • గత సంవత్సరం బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో చందన చేసిన నృత్యప్రదర్శనను చూసి ముగ్ధులెన ఆలయ నిర్వాహకులు ఆ చిన్నారిని సత్కరించారు.
  • ఢిల్లీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, ప్రగతి మైదానంలో చందన ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. 

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

ఐరాస మెచ్చిన అమ్మాయిలు

7/30/2013

0 Comments

 
Picture
                        చదువుకోకుండా పేదరికం అడ్డంకులు కల్పిస్తుందన్నది నిజమే. అలాగని దాన్నే తలుచుకుంటూ ఉండిపోతే అక్షరం ముక్క రాదు. అడుగు ముందుకు పడదు. చదువుకోవడం ఓ సవాలు అయినప్పుడు దాన్ని స్వీకరించాలి. కష్టాలను ఓర్చుకుంటూ చదువుల తీరం చేరుకోవాలి. ఉత్తరప్రదేశ్‌కి చెందిన రజియా సుల్తానా, కర్ణాటకకు చెందిన అశ్విని ఇలాగే చేశారు.రజియా సుల్తానాది మీరట్‌ జిల్లాలోని మారుమూల గ్రామం నాంగలకుంభ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పని చేస్తేనే ఇల్లు గడిచే పేద కుటుంబం వాళ్లది. అక్కడున్న చాలా కుటుంబాల మాదిరే... రజియా, ఆమె తల్లిదండ్రులకు ఫుట్‌బాల్‌లు కుట్టడమే జీవనోపాధి. ఐదేళ్ల వయసులో బడికి వెళ్లాల్సిన రజియా, అమ్మానాన్నలతో కలిసి పనికి వెళ్లడం మొదలుపెట్టింది.

                      భుజానికి బ్యాగు వేసుకుని బడికెళ్లే పిల్లల్ని చూసి తాను చదువుకోవాలని ఆశపడింది. పగలంతా పని చేస్తూనే ఉన్నా, మనసంతా చదువే. కొన్నేళ్లు ఇలా గడిచాక, ఓ స్వచ్ఛంద సంస్థ ఆ గ్రామంలో బాల కార్మికులను బడిలో చేర్పించే కార్యక్రమం చేపట్టింది. పిల్లల్ని పనిలో పెట్టుకునే సంస్థల పని పట్టేందుకు అధికారులూ కదిలారు. గ్రామస్తులందర్నీ కలిసి పిల్లలు చదువుకుంటే ఉండే ప్రయోజనాలను వివరించారు. ఇవన్నీ అక్కడి వాళ్లకు పట్టలేదు. ఆడపిల్లల్నీ బడికి పంపిస్తే, ఇల్లెలా గడుస్తుంది అనుకున్నారు. అంతా ఒక్కటై 'ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని బడికి పంపం' అని చెప్పేశారు. అధికారులు చెప్పినవి పెద్దవాళ్లకు పట్టకపోయినా, చిన్నారి రజియాకు బాగానే అర్థమయ్యాయి. దాంతో 'నేను బడికెళ్లి చదువుకుంటా' అని పట్టుబట్టింది. స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలను కలిసి, వాళ్లని ఇంటికి తీసుకొచ్చి అమ్మానాన్నలను పట్టుబట్టి ఒప్పించి, బడిలో చేరింది.

                        బాగా చదువుకోవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం వరకే రజియా పరిమితం అవలేదు. హైస్కూలుకి వచ్చాక గ్రామంలోని ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి 'పేదరికం పోవాలంటే మీ పిల్లలకు చదువు చెప్పించండి' అని కోరింది. ప్రయోజనాలను ఏకరువు పెట్టింది. వారిలో మార్పు రాలేదు సరికదా, అంతా కలిసి 'మా పిల్లల్ని చదువంటూ చెడగొడుతున్నావు' అంటూ ఆమెను తిట్టారు. ఇంటి మీదికొచ్చి గొడవ చేశారు. రజియా బెదిరిపోలేదు. స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలను కలిసింది. వాళ్ల సూచనల మేరకు బాల పంచాయతీని ఏర్పాటు చేసింది. దానికి నాయకురాలిగా ఉండి, పిల్లల్ని బడికి పంపాల్సిందేనని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి, ఒక్కొక్కరినీ బడిలో చేర్పించింది. ఈ రకంగా సుమారు యాభై మందిని పాఠశాలలో చేర్పించిన రజియా గ్రామానికి మంచినీటి వసతి వచ్చేలా, మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా అధికారులతో పోరాటం చేసింది. పదో తరగతి పూర్తిచేసి, ఇంటర్‌లో చేరాక పూర్తిగా పాడైపోయిన పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించింది. చదువుకుంటూ, గ్రామాభివృద్ధి పని చేస్తున్న పిల్లల్ని చూశాక గ్రామస్తుల్లోనూ మార్పొచ్చింది. చాలామంది తమ పిల్లల్ని స్వచ్ఛందంగా చదివించేందుకు ముందుకొచ్చారు.

Picture
                          పేదరికమే పెద్ద కష్టమంటే, అశ్వినికి పుట్టుకతో చూపు లేకపోవడం మరో పెద్ద సమస్య. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ పూట గడవని పరిస్థితి అశ్విని కుటుంబానిది. దాంతో అశ్వినికి వైద్యం చేయించడం, ఆలనాపాలనా ఆమె తల్లిదండ్రులకు తలకు మించిన భారమైంది. ఇటు చూపులేక, అటు కుటుంబ సభ్యుల ఆప్యాయత అందక అశ్విని మానసికంగా కుంగిపోయింది. 'ఎందుకీ జీవితం' అని బాధపడుతున్న అశ్వినికి చదువు ధైర్యాన్నిచ్చింది.

                        నాలుగేళ్ల వయసులోనే ఎన్నో కష్టాలు పడుతున్న అశ్విని గురించి తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెను అక్కున చేర్చుకుంది. దత్త పుత్రికలా చూసుకుంటామంటూ తీసుకెళ్లి బడిలో చేర్చింది. వసతి కల్పించింది. అన్ని కష్టాలనూ అక్షరాలు దిద్దడంలో మర్చిపోయిన అశ్విని చదువుల తల్లిగా మారిపోయింది. బ్రెయిలీ నేర్చుకుంది. పదో క్లాసు, ఇంటర్‌ మంచి మార్కులతో పాసయ్యింది. భవిష్యత్తు లక్ష్యాలను ఏర్పర్చుకుంటూ డిగ్రీ పూర్తి చేసింది. ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగమూ సంపాదించింది.

                           అలాగని 'ఇక నాకేం ఇబ్బంది లేదు' అనుకుని వూరుకోలేదు. చూపులేక, చదువుకునే పరిస్థితుల్లేక బాధపడే చిన్నారులకు చేయూతను అందించేందుకు కృషి చేస్తోంది. తనకు ఆశ్రయం ఇచ్చిన సేవా సంస్థ తరఫున ప్రచారం చేస్తోంది. 'మనదేశంలో సుమారు నలభై మిలియన్ల మంది వికలాంగులు ఉన్నారు. వారిలో నలభై రెండు శాతం మంది మహిళలే. ఆడపిల్ల అంటేనే చులకనగా చూసే సమాజం మనది. అందులోనూ వికలాంగ బాలికలంటే కుటుంబానికి భారంగా భావించే తల్లిదండ్రులే అధికం. నేనూ అటువంటి పరిస్థితుల నుంచే వచ్చాను. అందుకే ఈ పోరాటం ఆపకుండా వారికోసం కృషి చేస్తాను' అన్న అశ్వినిని చూసి మలాలా కూడా స్ఫూర్తి పొంది 'జులై 12 మలాలా డే కాదు... అశ్విని డే కావాలి. ఎన్ని సమస్యలు ఎదురయినా ఆడపిల్లలు చదువుకునే దిశలో ఆలోచనలు చేయాలి' అని చెప్పింది. చదువుతో వైకల్యాన్ని గెలిచిన అశ్విని అమ్మానాన్నల ప్రేమనూ సాధించుకుంది. 'మా అమ్మాయి సాధించిన విజయాలు మాకెంతో గర్వకారణం' అంటూ వాళ్లిప్పుడు తనను అక్కున చేర్చుకుంటున్నారు.


మూలం : ఈనాడు దినపత్రిక

0 Comments

మృత్యువునే పరిహసించిన సాహస బాలిక

7/29/2013

0 Comments

 
Picture
                                 ఎవరైనా అపాయంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంటే- పెద్దవాళ్లు సైతం ‘మనకెందుకులే ఈ తలనొప్పి వ్యవహారం’-అని తప్పించుకుని పోవడం సర్వసాధారణం. అయతే, ఆ బాలిక అలా భావించక, ప్రాణాలకు సైతం తెగించి అయదుగురిని మృత్యుముఖం నుంచి కాపాడింది. నీట మునిగిన ఐదుగురు చిన్నారులను రక్షించి సాహసానికి ప్రతీకగా ఆ బాలిక నిలిచింది. బీహార్‌లోని కటియార్ జిల్లా మోర్సంద గ్రామంలో కొద్ది రోజుల క్రితం పనె్నండేళ్ల రోజీ ఆరా ఓ చెరువు వద్ద ఉన్నపుడు- ఆకస్మికంగా చిన్న పిల్లల కేకలు వినిపించగా అటు పరుగెత్తింది. అక్కడ కనిపించిన దృశ్యం చూశాక ఆమెకి ఒక్కక్షణం నోటమాట రాలేదు. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా చెరువులోకి దూకేసింది. తనకన్నా వయసులో చిన్నవారైన ఆరుగురు పిల్లలు నీట మునిగిపోతున్నారని గమనించింది.

                      వారిని ఎలాగైనా రక్షించాలని ఈదుకుంటూ వెళ్లి తొలుత మహ్మద్ ఫరాన్ (7)ను ఒడ్డున పడేసింది. ఆ తర్వాత మెహక్ ఆరా(6), డాలీఖాటూన్ (8), మహ్మద్ జెహన్ (9), మహ్మద్ సమీర్ (8)లను రక్షించింది. ఒక చేత్తో మునిగిపోతున్న చిన్నారులను పట్టుకుని, మరోచేత్తో ఈతకొడుతూ ఎలాగో ఐదుగురిని ఒడ్డుకు చేర్చేసరికి రోజీలో శక్తి సన్నగిల్లింది. అయనా, బలాన్నంతా కూడదీసుకుని ఆరో చిన్నారి ఫర్హాన్ (7)ని రక్షించాలని మళ్లీ నీళ్లలోకి దూకింది. అప్పటికే నీళ్లు తాగేసి బరువెక్కి పోయన ఫర్హాన్‌ని మోస్తూ ఒడ్డుకు చేర్చేసరికి రోజీ స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికే గుమిగూడిన గ్రామస్థులు రోజీతో పాటు పిల్లలందరినీ ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అయతే, ఫర్హాన్ ప్రాణాలు కోల్పోయింది. ఏడో తరగతి చదువుతున్న రోజీ ఐదుగురి జీవితాలకు ప్రాణం పోసింది. అనన్య ధైర్య సాహసాలు చూపిన ఆమెను గ్రామస్థులందరూ అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె మానవత్వం చూపడంలో ఎంతో ఎత్తుకు ఎదిగిందని, ఆమె సాహసానికి ఏమి ఇచ్చినా తక్కువేనని, జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటామని బతికి బయటపడ్డ బాలికల తల్లిదండ్రులు అంటున్నారు.

                          ఇపుడు ఆ గ్రామంలో అందరూ రోజీ సాహసాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు. గతంలో జిల్లా స్థాయి ఈత పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉన్నప్పటికీ తన ప్రాణాలను లెక్కచేయకుండా పిల్లలను రక్షించేలా ఆమె ఎంతో తెగువ చూపింది. కష్టపడి చదివించి రోజీని ఆర్మీలో చేర్పిస్తానని దినసరి కూలీ అయన ఆమె తండ్రి గర్వంగా చెబుతున్నాడు. రోజీకి సాహస బాలల అవార్డు ఇవ్వాలంటూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు.


0 Comments

రెండు సగాల నిండుదనం

7/28/2013

0 Comments

 
Picture
రేవతిని ‘ఆమె’ అనలేం. ‘అతడు’ అనలేం.
అసలు ఏమీ అనుకోకుండానూ ఉండలేం.
తను స్పెషల్. మనిషి మేల్, మనసు ఫిమేల్.
అంతకన్నా స్పెషల్ ఏంటో తెలుసా?
మళ్లీ ఇలాగే పుట్టాలని రేవతి కోరుకోవడం!
తన జీవితంతో తనే ఫైట్ చేసి...
తన జీవితంతో తనే ఇన్‌సై్పర్ అయ్యి...
తనలాంటి వాళ్లకు ‘గ్రేట్ హ్యూమన్స్’గా గుర్తింపు తెస్తున్న రేవతి.


                 ఈ సమాజం ఆడవారికి గౌరవమిస్తుంది, మగవారికి గౌరవమిస్తుంది, కానీ పుట్టుకతోనే ఈ రెండువర్గాల లక్షణాలను కలబోసుకున్న వారిని మాత్రం చీదరించుకుంటుంది. అవమానపరుస్తుంది. అందుకే ప్రపంచంలో ఎవరైనా సరే మరోజన్మంటూ ఉంటే హిజ్రాగా మాత్రం పుట్టకూడదనుకుంటారు. అయితే సమాజం నుండి ఎన్నో తిరస్కారాలను ఎదుర్కొన్న ఓ హిజ్రా మాత్రం తనకు మరో జన్మంటూ ఉంటే హిజ్రాగానే పుడతానంటున్నారు! ఛీ కొట్టిన వారితోనే ఇప్పుడు శభాష్ అనిపించుకుంటున్నారు. తన జీవితగాథను రచించి, ప్రఖ్యాత పెంగ్విన్ పబ్లికేషన్స్‌నే తన ఇంటి ముందుకు రప్పించుకున్నారు. అంతేకాదు పుస్తకంగా వచ్చిన ఆమె జీవితగాథ ‘నాటకం’గా కూడా మారి ఇప్పటికే యాభై ప్రదర్శనలను పూర్తి చేసుకుంది. ఆ నిజజీవిత కథానాయికే... తమిళనాడుకు చెందిన రేవతి అలియాస్ దొరైస్వామి.

సమాధానాల కోసం వెదికిన ‘దొరైస్వామి’

                      తమిళనాడులోని సేలమ్ జిల్లా నమక్కల్ తాలూకా పుట్టెహళ్లిలో ఓ సంప్రదాయ రైతు కుటుంబంలో ముగ్గురు అన్నలు, ఒక అక్క తర్వాత దొరైస్వామి పుట్టారు. కుటుంబంలో చిన్నవాడు కావడంతో దొరైస్వామిని అందరూ ముద్దుగా చూసుకునేవారు. తల్లిదండ్రులు ఒక్కొక్కసారి దొరైస్వామికి అతని అక్కబట్టలు తొడిగి పూలజడ వేసి ముస్తాబు చేసేవారు. కాలంతోపాటు దొరైస్వామి కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా దొరైస్వామి నడక, నడత, ఆహార్యం అంతా అమ్మాయినే పోలి ఉండేది. ఇది గమనించిన తల్లిదండ్రులు మొదట దొరైస్వామిని మందలించారు. వినకపోయేసరికి తిట్టారు, కొట్టారు, బయటకు వెళ్లకుండా గదిలోపెట్టి తాళం వేశారు. మొదట అమ్మాయిగా అలంకరించి మురిసిపోయిన వారే ఇప్పుడు అబ్బాయిలా ఉండమని ఎందుకు బలవంత పెడుతున్నారు? తన మనసు ఎందుకు అబ్బాయిని కోరుకుంటోంది? ఇది తన తప్పా? తల్లిదండ్రుల తప్పా? తనలో అబ్బాయిని కోరుకునే లక్షణాన్ని పుట్టించిన దేవుడిదా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెదుకుతూ ఇంటి నుంచి ఢిల్లీ వెళ్లిపోయాడు దొరైస్వామి. అక్కడ ఓ గురువు చెంత చేరి నాలుగైదు నెలలు గడిపాడు. ఎలాగో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి దొరైస్వామిని బలవంతంగా ఇంటికి తీసుకువచ్చారు. గుండు కొట్టించి గదిలో పెట్టి తాళం వేశారు. బలవంతంగా మనసును మార్చలేరుగా? అందుకే దొరైస్వామి తిరిగి ఇంటి నుంచి పారిపోయి ముంబై చేరుకున్నాడు.

సమాధానాలు దొరికి రేవతిగా మారి...

                     ముంబైలో తనలాగే ఆలోచించే వర్గంలో ఒకరిగా జీవితాన్ని ప్రారంభించాడు దొరైస్వామి. తనను తాను మార్చుకోవడానికి తన శరీరాన్నే పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో శస్త్రచికిత్స చేయించుకుని రేవతిగా మారిపోయాడు దొరైస్వామి. రెండేళ్లు ముంబైలోనే గడిపిన తర్వాత కన్నవారిని చూడాలనే ఆశతో ఇంటికి వచ్చిన రేవతిని తల్లిదండ్రులతోపాటు తోడబుట్టిన వారు కూడా చేరదీయలేకపోయారు. దీంతో రేవతి మళ్లీ బెంగళూరు చేరుకుంది. జీవనం కోసం పగలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తూ, రాత్రి సమయాన్ని కొందరి పడకవాంఛలకు వెచ్చించేది. ఎన్నోసార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో జరిగిన ఒక సంఘటన రేవతి దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఓ రోజు రాత్రి బెంగళూరు కబ్బన్ పార్కు పోలీసులు రేవతిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.

                       స్టేషన్‌లో ఆమెను వివస్త్రను చేసి తోటిఖైదీలతో పాటు పోలీసులూ పైశాచికానందం పొందారు. దీంతో ఆమె మనసు పూర్తిగా మారిపోయింది. ‘జీవితం అంటే ఇంతేనా... నేను హిజ్రాను అయినంత మాత్రాన ఈ శరీరం మరొకరి కోరిక తీర్చడానికేనా? నా వల్ల ఎటువంటి ప్రయోజనం జరగదా?’ అంటూ రేవతి పరిపరివిధాలుగా ఆలోచించింది. దీంతో అంతవరకూ చేస్తున్న వత్తిని మానేసి సమాజం నుంచి దూరంగా ఉన్న (ఉంటున్న) అనాథలు, వేశ్యలు, ముఖ్యంగా హిజ్రాల సంక్షేమం కోసం కషి చేస్తున్న ‘సంగం’ సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్‌గా చేరి కొత్త జీవితం మొదలుపెట్టింది రేవతి.

ముంగిటవాలిన ‘పెంగ్విన్’

                         హిజ్రాల సంక్షేమం కోసం రేవతి రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేసేవారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని హిజ్రాలను సంప్రదించి వారి బాధలను తెలుసుకుని తమిళంలో ఉనర్వుమ్-ఉరువమ్ (మనసు-దేహం) అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం వివరాలు తెహల్కా మాగజీన్‌లో చూసిన ప్రపంచ ప్రసిద్ధ ప్రచురణ సంస్థ పెంగ్విన్ పబ్లికేషన్ ప్రతినిధులు రేవతిని వెతుక్కుంటూ వచ్చారు. ఉనర్వుమ్-ఉరువమ్‌ను తాము ఆంగ్లంలో ప్రచురిస్తామని చెప్పారు. అయితే రేవతి దీనిని సున్నితంగా తిరస్కరించింది. తాను తన జీవితచరిత్రను రచిస్తున్నానని, అందులో మరిన్ని కఠిన వాస్తవాలు ఉన్నాయని రేవతి చెప్పింది. వెంటనే ఆ పుస్తకాన్ని తమ సంస్థనుంచే ప్రచురిస్తామని చెప్పి అడ్వాన్స్ ముందుగానే ఇచ్చేశారు.

                        ఈ విధంగా పుస్తకం ప్రచురితం కాకుండానే ఓ అనామక రచయితకు అడ్వాన్స్ చెల్లించడం చాలా అరుదు. ఇక తన క(వ్య)థను పూసగుచ్చినట్లు చెబుతూ తమిళంలో ‘వెళ్లెమోళి’ పుస్తకాన్ని రేవతి రచించింది. దీనిని వి.గీత ఇంగ్లీషులోకి ‘ఏ ట్రూత్ అబౌట్ మి’ పేరుతో 2009న తర్జుమా చేశారు. మొదటి ప్రచురణలోనే 5000 ప్రతులు అమ్ముడుపోయాయి. 2010లో జైపూర్‌లో జరిగిన అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో రేవతి పుస్తకంపై ప్రత్యేకంగా గంటపాటు చర్చాగోష్టిని నిర్వహించారు. అక్కడివారి ప్రశంసలను ఇప్పటికీ మరచిపోలేనని రేవతి చెమర్చిన కళ్లతో చెప్పారు. ఈ పుస్తకాన్ని కన్నడలో ‘బదుకు బయలు’గా డి.సరస్వతి 2011లో తర్జుమా చేశారు. భాష ఏదైనా రేవతి కథ జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. తర్వాత తర్వాత కుటుంబ సభ్యులు కూడా రేవతిని దగ్గరకు చేర్చుకోవడం మొదలుపెట్టారు.

రంగస్థలం పైకి రేవతి

                     సంగం సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రేవతి ఎంతోమంది వేశ్యలు, హిజ్రాలు కొత్త జీవితం ప్రారంభించడానికి సహకారం అందించారు. ఇందుకోసం ప్రభుత్వంతో పోరాడారు. కార్పొరేట్‌ల సహకారం తీసుకున్నారు. దీంతో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికాయి. అనతికాలంలోనే రేవతి సంగం సంస్థకు డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. వద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత రేవతి పైనే పడింది. దీంతో ఏడాది క్రితం సంగం సంస్థ నుంచి బయటకు వచ్చి, వారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. పుస్తక ప్రచురణ ద్వారా వచ్చిన రాయల్టీ డబ్బుతో ఒకప్పుడు తనను ఇంటి నుంచి దూరంగా నెట్టేసిన తల్లికి మూత్రపిండాల వ్యాధికి చికిత్స చేయించింది. అయితే దురదష్టవశాత్తు తల్లిని పోగొట్టుకుంది. 95 ఏళ్ల తండ్రికి ప్రస్తుతం ఊతకర్రగా నిలుస్తోంది. అంతేకాకుండా సోదరుల పిల్లలను చదివిస్తోంది. ఈ విషయాలను తెలుసుకున్న కర్ణాటకలోని శివమొగ్గా జిల్లా హెగ్గోడుకు చెందిన గణేశ్ చలించిపోయారు. స్వతహాగా నాటక రచయిత అయిన గణేశ్, రేవతి జీవిత చరిత్ర ‘బదుకు బయలు’ను అదే పేరుతో నాటకంగా మలిచి రాష్ట్రం నలుమూలలా ప్రదర్శిస్తున్నారు. ఈ నాటిక ఇటీవలే 50వ ప్రదర్శనను పూర్తి చేసుకుంది.

ఏ జన్మకైనా ఇలాగే!

                       మగవాడిగానో లేదా ఆడమనిషిగానో పుట్టి ఉంటే నా కుటుంబానికి మాత్రమే నేను పరిమితమై ఉండేదాన్ని. హిజ్రాగా ఉండటంతో... ఒక స్త్రీ హృదయాన్ని ప్రతిబింబిస్తూ అంగడిలో సరుకై అమ్ముడుపోయిన విధివంచితులైన ఆడవారు తిరిగి గౌరవంగా బతికేందుకు, పురుషులుగా పుట్టి స్త్రీగా మారిన హిజ్రాల సంక్షేమం కోసం నావంతు కృషి చేశాను. నా ఆత్మకథ వల్ల ఉత్తేజం పొందిన కొంతమంది హిజ్రాలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకొందరు సొంతంగా వ్యాపారసంస్థలు నిర్వహిస్తున్నారు. ఇలా సమాజంలో మూడువర్గాల వారికి సేవ చేయడానికి అవకాశం కలగడానికి ప్రధాన కారణం నేను హిజ్రా కావడమే. అందువల్లే మరో జన్మే కాదు, అటు పైజన్మలోనూ హిజ్రాగానే పుట్టించమని దేవుడిని వేడుకుంటున్నాను.
- రేవతి

కంటతడి పెడుతున్నారు... ఉత్తేజం చెందుతున్నారు...

దాదాపు గంటన్నర నిడివిగల ‘బదుకు బయలు’ నాటకంలో మొదట హిజ్రాల కష్టాలను చూసిన ప్రేక్షకులు కంటితడి పెడుతున్నారు. అటు పై ఓ హిజ్రా... సమాజాన్ని ఎదిరించడమే కాకుండా ఆ సమాజం దష్టిలో హిజ్రాలపై ఉన్న ఓ రకమైన హీన భావాన్ని మార్చడానికి చేసిన కషిని చూసి ఉత్తేజం చెందుతున్నారు. వీరిలో హిజ్రాలతో పాటు మామూలు వారూ ఉన్నారు. ఈ నాటకం ద్వారా కంటతడి పెట్టించడమే కాకుండా కష్టాలకు ఎదురీది విజయం సాధించడం ఎలాగో చూపిస్తున్నాం. అందువల్లే రేవతి ‘బదుకు-బయలు’ నాటకం అనతికాలంలోనే ప్రేక్షకాదరణ పొంది 50 ప్రదర్శనలు పూర్తి par చేసుకుంది.
- గణేష్, నాటక రచయిత, దర్శకుడు


మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

కీర్తి శిఖారాలందుకుంటున్న జియామోడీ

7/25/2013

0 Comments

 
Picture
                 వృత్తి, ప్రవృత్తి అందరిలోనూ వైవిద్య భరితంగానే ఉంటుంది. వృత్తిరంగాల్లో కూడా మహిళలు తమ శక్తిసామర్ధ్యాల్ని కనబరుస్తూ అందనంత ఎత్తుకి ఎదిగిపోతున్నారు. అందులో న్యాయ వృత్తి, వైద్య వృత్తి సమాజానికి ఎంతో అవసరమైనవి. వాటిలో కూడా ఊహించని శిఖరాలు అధిరోమస్తు న్నారు మహిళలు. ఏ శాస్ర్ర్తాన్ని అభ్యసించినా అందులో నిష్ణాతులై తమ కంటూ ఒక ప్రత్యేకతని, ప్రాధాన్య తని కనబరుస్తున్నారు. మగవారిని తోసిరాజని అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభని చాటుకుంటున్నారు. వృత్తి పరంగా దేశవిదేశాల్లో కీర్తి శిఖరాలనందుకున్న జియా మోడీయే అందుకు ఉదాహరణ.
జియా స్థాపించిన న్యాయ సంస్థ


పేరు        : ఎజెడ్బి అండ్ పార్ట్నర్స్
అడ్రస్      : ఎక్స్ప్రెస్ టవర్స్, 23వ ఫ్లోర్
               నారిమన్ పాయింట్, ముంబాయ్-21
ఫోన్       : 91 22 6639 6880
                                                           ఫ్యాక్స్       : 91 22 6639 6888


                       1956లో పుట్టిన జియా మోడీ, ముంబాయిలోని ఎలిఫేస్టోన్ కాలేజీలో చదువు పూర్తిచేసింది. ఆ తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ‘లా ’లో పట్టభద్రురాలయ్యింది. అక్కడే 1979లో హార్వర్డ్ లా స్కూల్లో మాస్ట్ర్స్ డిగ్రీ కూడా పూర్తిచేసింది. అలాగే న్యూయార్క్ స్టేట్ బార్ పరిక్షలో కూడా ఉత్తీర్ణురాలై న్యూయార్క్ న్యాయ సలహాదారుగా నియమితురాలయ్యింది. అదేవిధంగా బాకర్ అండ్ మెక్కిన్జీకి కూడా 5 సంవత్సరాలు పనిచేసింది. ఆ తరువాత ఈమె భర్త సలహా ప్రకారం భారతదేశానికి తిరిగి వచ్చింది. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత 1984లో సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి, అతి స్వల్ప వ్యవధిలోనే మంచి గుర్తింపుని పొందింది. అదే కోవలో ఇతర ముఖ్య సంస్థలకు న్యాయ సలహాదారుగా పనిచేసింది.ఇండియా అతిపెద్ద న్యాయ సలహా సంస్థగా పేరుపొందిన ఏజెడ్బి అండ్ పార్టనర్స్ సంస్థకి మేనేజింగ్ పార్ట నర్గా విధులు ప్రారంభించింది. ఈ సంస్థలో సుమారుగా 40% అంతా న్యాయ శాస్తవ్రేత్తలే. 400 మంది సిబ్బంది, 225 మంది న్యాయ శాస్తక్రోవిదులతో కూడిన ఈ సంస్థ శాఖలు ముంబాయి, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో కూడా ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. జియా మోడీ ఇండియా మ్యూచ్యుయల్ ఫండ్స్కి సంబంధించిన ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్’ మెంబర్గాను, చాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్గాను కూడా తన సేవలనందించింది.

                      అకుంఠిత దీక్షతో తను చేపట్టిన వృత్తికి న్యాయం చేకూరుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన జియామోడీని బిజినెస్ టుడే 2004 సెప్టెంబర్లో 25 శక్తి వంతమైన మహిళల్లో ఒకరుగా ఆ సర్వే జాబితాలో 2011 వరకూ ఎన్నో సార్లు పేర్కొంది. ఈమె ఆర్ధిక విషయాల్లో వేగవంతమైన పరిజ్ఞానం కలదిగా కూడా అవార్డ్ అందుకుంది.2004, 2006లో ది ఎకనామిక్ టైమ్స్ సర్వేలో అత్యంత శక్తి వంతమైన మహిళలు 100 మందిలో జియా మోడీ ఒకరుగా నమోదుచేసింది. ఆ సందర్భంలో 2010లో ఆ సంవత్సరం నిరుపమాన వాణిజ్య వనితగా ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్ని పొందింది. 2006 జనవరి 12 నుండీ జియా హాంకాంగ్ షంగాయ్ బాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్కి అనధికారిక కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తోంది. ఎంత బిజీ కార్యక్రమా లున్నా మోడీ సమాజ సేవని మాత్రం విస్మరించటం లేదు. బార్లి సంస్థకి ట్రస్టీగా ఉంటూ, గ్రామీణ మహిళల సమస్యల్ని పరిష్కరించే దిశగా కూడా ఇండోర్ తన కార్యక్రమాలు రూపొందించింది. దీనికి బహ ఐ ఫెయిత్ సంస్థ సహాయసహకారాలు అందిస్తోంది. ఈ కార్యక్రమాల్లో గ్రామీణ మహిళలకి విద్య నేర్పడం, దానిమీద అవగాహన కలిగించడం ప్రధానంగా తీసుకున్న అంశం.అందుకు ఎందరో గ్రామీణ మహిళల్ని ఈ కేంద్రానికి తీసుకువచ్చి, తగిన వసతులు కల్పిస్తూ వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు.

                           ఈ విధంగా విద్యాదానం చేయడం వల్ల వాళ్ళ జీవితాల్లో ఉన్నతమైన మార్పులు కలిగి సమాజంలో సమానంగా జీవించడానికి అవకాశం ఉందని జియా నమ్ముతుంది. ఆ సిద్దాంతాన్నే ఆలంబనగా చేసుకుని విజయకేతనం ఎగురవేస్తోంది. ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టకపోతే వీరి పిల్లలు కూడా విద్యాహీనులై వీరిలాగే కష్టాలతో జీవితం గడపవలసి వస్తుందని జియా అంటుంది. ఇవి వారికెంతో ఊపయుక్తంగా ఉంటాయని, విద్యావంతతులు కొందరైనా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములుగా పాల్గొని ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో కూడా తమ వంతు సేవలందిస్తూవుంటే, దేశంలో చాలామంది మహిళలు విద్యావంతులయ్యి దేశానికి మరింత మేలు చేకూరుతుందన్నది జియా సంపూర్ణ విశ్వాసం.ఒక న్యాయవాద వృత్తిలో ఒక మహిళ దేశవిదేశాల్లో విజయ కేతనం ఎగరేసి, తన ఆశయ సాధనకోసం దేశంలో సేవాకార్యక్రమాలు కూడా చేపట్టి అందరి ఉన్నతికోసం పాటుపడటం సామాన్య విషయం కాదు. అందరూ సంఘటితంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే దేశం చాలా తొందర్లోనే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని జియా మోడీ ఉద్ఘాటిస్తోంది. ఎన్నో టీవీ ఇంటర్వూల్లో పాల్గొని ఈమె మనోభావాలు, కార్యాచరణలు తెలియచేసింది. నేటి తరానికి ఈమె ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది.

మూలం : తెలుగు విశేష్

0 Comments

మురికి నుంచి వెలుగులోకి

7/24/2013

0 Comments

 
Picture
                     ముంబైలోని కామాటిపురా (Red light area) అంటేనే అందరూ ఉలిక్కిపడతారు. దేశంలోనే పెద్ద వేశ్యావాటిక అది. అక్కడ పుట్టిపెరిగిన అమ్మాయి పెద్దయ్యాక ఏమవుతుందని ఊహిస్తాం? అక్కడినుంచి వచ్చిన శ్వేతా కట్టి ఇప్పుడు అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించింది.

                      శ్వేతకు పదిహేడే ళ్లు వచ్చేవరకూ ఆమె నివాసం ఒక వేశ్యాగృహం పైన. సవతి తండ్రి తాగొచ్చి బాగా కొట్టేవాడు. 'మా అమ్మ కర్ణాటకలోని బెల్గామ్ దగ్గర పల్లెటూళ్లో పెరిగింది. పేదరికం ఆమెను ఈ వృత్తిలోకి తీసుకొచ్చింది. అయినా ఆమె నాకు అండగా నిలిచింది' అంటుంది శ్వేత. పదిహేడేళ్లలోపలే ఆమె అనేక కష్టనష్టాలను అనుభవించింది. అందువల్లేనేమో, పదో తరగతిలో 71 శాతం మార్కులొచ్చినా కూడా శ్వేతలో ఆత్మవిశ్వాసపు ఛాయలేమీ ఉండేవి కాదు. దీనికి మరో కారణం కూడా ఉంది. ఆమె తండ్రితో సహా చుట్టుపక్కలవాళ్లంతా ఆమె నల్లగా ఉంటుందనీ, చూడటానికి అస్సలు బాగోదనీ అనేవాళ్లు. కానీ తల్లి ప్రోత్సాహం వల్ల శ్వేత దగ్గర్లోని బాలికల కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో చేరింది.

                              క్రాంతి అనే స్వచ్ఛందసంస్థ ఆ ప్రాంతంలో అడుగుపెట్టడంతో శ్వేత జీవితంలోకి వెలుగొచ్చింది. వాళ్లు ఆమెలో ఆత్మస్థైర్యం పెరిగేలా చేశారు. ఇంటర్మీడియెట్ అయిపోయిన తర్వాత 'క్రాంతి'లో చేరి ఏడాదిపాటు బాగా పనిచేసింది శ్వేత. నేపాల్ వెళ్లొచ్చింది, జార్ఖండ్‌లో సెక్స్ వర్కర్లకు వారి పిల్లలను తీర్చిదిద్దడం ఎలాగో చెబుతూ స్ఫూర్తిదాయక ఉపన్యాసాలిచ్చింది. ఏడాది కాలంలో ఏకంగా ఎనిమిది మహిళా కాన్ఫరెన్సులకు హాజరయ్యింది. ఇంగ్లీషులో ఒక్కముక్కయినా మాట్లాడలేని ఈ అమ్మాయి ఇప్పుడు దడదడా మాట్లాడేస్తోంది. మానసిక కౌన్సిలర్లు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరన్న నమ్మకం కుదిరిన శ్వేత తాను కూడా సైకాలజీనే చదువుకుని రెడ్‌లైట్ ఏరియాలో క్లినిక్ ప్రారంభించాలనుకుంటోంది. 'క్రాంతి' సాయంతో అమెరికన్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసింది. న్యూయార్క్ యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు మొత్తం ట్యూషన్ ఫీజును భరించి ఆమెను చేర్చుకుంటామని సమాచారం పంపాయి. అయితే అమెరికాలో ఉండటానికయ్యే ఖర్చును భరించే దాతల కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఈమధ్యే ప్రఖ్యాత 'న్యూస్‌వీక్' పత్రిక కూడా శ్వేత గురించి రాసింది.

                          'శ్వేత వంటి అమ్మాయిల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ వివిధ పరిస్థితుల వల్ల వాళ్లు తమ లక్ష్యాన్ని చేరుకోలేక మళ్లీ పాత జీవితాల్లోకే వెళ్లటమో, లేదా కుట్టుపని, వంటపని వంటివి చేస్తూ చాలీచాలని బతుకులీడ్చటమో చేస్తుంటారు. మేం అలా కాదు. కేవలం పన్నెండుమంది అమ్మాయిల మీదే మా దృష్టి పెట్టాం. వాళ్లు మంచి స్థాయిలో స్థిరపడేదాకా సాయపడతాం' అంటున్నారు 'క్రాంతి' వ్యవస్థాపకులు.


మూలం : ఆంధ్రజ్యోతి దినపత్రిక

0 Comments

ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక 

7/24/2013

0 Comments

 
Picture
                     ఆమె జీవితం ఆదివాసులతో పెనవేసుకునిపోయింది. వారి కన్నీళ్లు, వేదనలు, కటికదారిద్య్రం, దుర్భరజీవన విధానం ఆమెను కదిలించాయి. అందుకే వారినే తన జీవనంగా మలచుకుంది. ఆ స్పందనే ఆమెను వారికి 'మహామాత'గా చేసింది. ఒక బిడ్డకోసం తల్లడిల్లే తల్లి మనసు ఆదివాసుల ఆక్రందన విని కళ్లు చెమ్మగిల్లేవి. చీకటిలో జీవిస్తున్న ఆదివాసులకు వెలుగును నింపేందుకు ఓ అబలగా తన శక్తిసామర్థ్యాలతో ఏమీ చేయలేనని గ్రహించిన ఆ వనిత తనకున్న రచనాశక్తితో వారి వెట్టిచాకిరీని
సభ్యసమాజానికి చాటిచెప్పింది. ఒక్క కలం చాలు ఈ సమాజాన్ని మార్చేందుకు అని నమ్మిన ఆమె ఆ కలమే తన ఆయుధంగా మలచుకుని అహర్నిశలు శ్రమించారు. ఆమె ఎవరో కాదు మహాశ్వేత సుగథకుమారి మృణాల్‌ పాండే.


                    బీహార్‌ రాష్ట్రంలోని 'ముండాజాతి' ఆదివాసుల దుర్భరజీవనాన్ని కళ్లకు కట్టిపడేసే సన్నివేశాలను రచనల ద్వారా వెలుగులోకి తెచ్చేందుకు నవలలు, కథలే తన జీవితంగా భావించి శ్రమించారు. ఆమె శ్రమను గుర్తించిన కేంద్రప్రభుత్వం 'పద్మవిభూషణ్‌' అవార్డుతో సత్కరించింది. ఆరుదశాబ్దాలుగా రచనలు చేస్తున్న మహాశ్వేత కృషిని కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించినా, రచనల్లో అరుదైన అవార్డును పొందిన తొలి మహిళా రచయిత కావడం విశేషం. బీహార్‌ప్రాంతపు 'ముండాజాతి' ఆదివాసులతో కలిసి జీవించి వారిని వెట్టిచాకిరి నుంచి బంధవిముక్తులను చేయడానికి అహరహం కృషి చేశారు. అదే ఇతివృత్తంతో అనేక నవలలు కథలు రాశారు. కొన్ని తెలుగులోకి అనువాదమయ్యాయి కూడా!

ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా...

                      మహాశ్వేతాదేవి మంచి సాహిత్య వాతావరణంలో పుట్టారు. సృజనాత్మక పరిసరాలలో పెరిగారు. తండ్రి మనీష్‌ ఘటక్‌ ప్రముఖ బెంగాలీ రచయిత నూతనపంథాలో వినూత్న రచనలు చేసిన ఆనాటి కొల్లోల్‌ సాహిత్య కూటమిలో పేరెన్నికగన్నారు. తల్లి ధరిత్రీదేవి.  భారతీయ సమాంతర సినిమాకు ఆద్యుడైన రిత్విక్‌ ఘటక్‌ ఆమెకు దగ్గరి బంధువు. ఇలాంటి కుటుంబం నుండి వచ్చిన మహాశ్వేత బిజిన్‌ భట్టాచార్యను వివాహ మాడారు. నటుడిగా నాటక ప్రయోక్తగా ఆయనకు బెంగాల్‌లో పెద్దపేరు 'రచయిత్రిగా, సమాజసేవికగా, అధ్యాపకురాలిగా, ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌'గా మహాశ్వేతాదేవి వివిధ భూమికలు నిర్వహించారు. అందుకు ఆమె కుటుంబనేపథ్యం ఎంతగానో ఉపకరించింది. మనీష్‌కు తగిన కూతురని బిజిన్‌కు తగిన సహధర్మచారిణి అని అనిపించుకున్నా వారి ప్రభావాలు తన మీద పడకుండా తనదైన విశిష్ట వ్యక్తిత్వాన్ని ఆమె నిలబెట్టుకున్నారు. 1926 జనవరి 14న ఢాకాలో జన్మించిన మహాశ్వేత బాల్యం కలకత్తాలోని శాంతినికేతన్‌లో గడిచింది. ఆడుతూపాడుతూ చదువుకుని ఆంగ్ల సాహిత్యంలో ఎంఎ పట్టా సాధించారు. మొదట్లో కొంతకాలం కేంద్రప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్‌గా, తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేసి కళాశాల అధ్యాపకురాలిగా స్థిరపడ్డారు.

సమాజ పరిశీలనే ఓ అభిరుచిగా


                       మహాశ్వేత ఏ ఉద్యోగంలో ఉన్నా సమాజ పరిశీలన మాత్రం మానలేదు. రచనా వ్యాసంగం ఆపలేదు. బెంగాలీ ఇంగ్లీషు మాత్రమేగాక ఆదివాసులతో తిరిగి సంతాలీ భాష కూడా నేర్చుకున్నారు. ఒరియా హిందీలలో ప్రావీణ్యం గడించారు. 'వార్తిక' అనే బెంగాలీ పత్రికకు సంపాదకత్వం వహిస్తూ యోజన, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీలలో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాశారు. ఆదివాసీలను జనజీవన స్రవంతిలో కలుపుకోవా ల్సిన అవసరాన్ని ఎత్తి చూపారు. కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయస్థాయి సెమినార్లలో కూడా ఆమె ఈ విషయం ఎన్నోసార్లు చెప్పారు. అందుకామె అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు. సాహిత్య కృషి కొనసాగిస్తూనే సమాంతరంగా సామాజిక బాధ్యతల్ని ప్రత్యక్షంగా నెత్తిన వేసుకునే రచయితలు చాలా తక్కువమంది ఉంటారు. ఆ తక్కువమందిలో మహాశ్వేతాదేవి పేరును మొదటి వరసలో చెప్పుకోవాల్సి ఉంటుంది.

పిల్లలపై రచనలు


                     ఇక ఆమె సాహిత్య జీవితాన్ని పరిశీలిస్తే ఒక జీవితకాలంలో ఇంత కృషి చేయడానికి వీలవుతుందా? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. పిల్లలకోసం కథలు, నాటికలు రాయడమే కాదు సుమారు ముప్పయి పాఠ్యపుస్తకాలకు రూపకల్పన చేశారు. 1956లో ఆమె తన ముప్పయవ యేట 'ఝాన్సీరాణి జీవితచరిత్ర' రాశారు. విప్లవనారి జీవిత లక్ష్యం ఎలా ఉండాలో చెప్పే ఈ మొదటిరచన మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందామెకు. అప్పటి నుంచి 1996 దాకా అంటే డెబ్బయియేళ్ళ వయసుకు చేరుకునే వరకు ఆమె కలం అలసిపోలేదు. బాధ్యతతో పదునెక్కి భావోద్వేగంతో పరిగెత్తింది. ఆ పరుగు వంద పుస్తకాలలో నిక్షిప్తమై ఉంది.

పాఠకుల్ని ఆకర్షించిన రచనలు

                             ఆమె రాసిన వంద కథానికలు బెంగాలీభాషలో ఏడు సంపుటాలుగా వెలువడ్డాయి. నటి (1957) చెల్లెబేలా-టాగూర్‌ రంగ్‌మహల్‌ (1959) సాంఝ సకలార్‌ మా-వంటి రచనలు పాఠకుల్ని విశేషంగా ఆకర్షించాయి. బెంగాలీకవి బందోఘట్టి జీవితం ఆధారంగా కవి బందోఘట్టి ఘన్‌ఈర్‌ జిబన్‌ ఓ మృత్యు (1967) అనే నవలలో ఆ కవి చావుబతుకుల్ని అద్భుతంగా చిత్రించింది. చీకట్లో మెరిసే రత్నం-ఆధార్‌ మనిక్‌ (1967) హజర్‌ చౌరాశిమా (1974) సాల్‌ గఠార్‌ ఢాకే (1982) అగ్నిగర్భ (1978) చొట్టిముండా విచాంగ్‌-భారతీయ (1980) వివిక బిడార్‌ పలిగణేశ్‌ మహిమ (1981) ఎత్తిర్‌ పారె ఇట్‌ (1982) వంటి నవలలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా 'అరణ్యార్‌ అధికార్‌' నవల గొప్ప సంచలనాన్ని సృష్టించింది. అడవిలో జీవించే హక్కు మాకుంది అన్న ఆదివాసుల ఆత్మఘోషను ఆమె ఆ నవలలో పలికించారు. ఆదివాసుల వెట్టిచాకిరిని ప్రశ్నిస్తూ ఆమె హిందీలో ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు 'భారత్‌ మె బంధువా మజ్దూర్‌'.

జ్ఞానపీఠ, రామన్‌మెగసెసే అవార్డులు


                        'ప్రజల మధ్యకు వెళ్ళండి. వాళ్ళ జీవిత సత్యాలను తెలుసుకోండి' అని యువతరానికి హితవు చెప్పిన ఈ రచయిత్రి సాహిత్యం ద్వారా సమాజానికి చేస్తున్న సేవను భారతప్రభుత్వం ఇతర సంస్థలూ గుర్తిస్తూనే ఉన్నాయి. 1979లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1980లో  జ్ఞానపీఠ అవార్డు స్వీకరించిన మహాశ్వేతాదేవి అంతకు ముందు లీలా అవార్డు శరత్‌చంద్ర మెడల్‌, బూబన్‌ మోహినీదాస్‌ మెడల్‌ (కలకత్తా విశ్వవిద్యాలయం) అమృతా అవార్డు తారా శంకర్‌ అవార్డు రామన్‌మెగసెసే అవార్డు వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎన్ని పురస్కారాలు స్వీకరించినా ఆమె తన లక్ష్యాన్ని మరచిపోలేదు. సాహితీవేత్తగా సామాజిక కార్యకర్తగా తన జీవితాన్ని సమాజానికి అర్పిస్తూపోయారు. వ్యక్తిగత జీవితంలో ఒకే ఒక కుమారుడికి తల్లయిన మహాశ్వేత సామాజిక జీవితంలో లక్షలాది ఆదివాసులకు 'మహామాత' అయ్యారు. వారిని వెట్టిచాకిరి నుంచి తప్పించి వారి జీవితాలకొకదారి చూపించ గలిగారు. భారతీయ సాహిత్య చరిత్రలో చెమటను, నెత్తురునూ పట్టించుకుని మరెవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగి జగతినిండా శాంతిని మానవత్వాన్ని పరచిన 'మహాశ్వేత' ఆమె!


మూలం : వార్త దినపత్రిక 

0 Comments

అశ్వనీ మలాలా!

7/23/2013

0 Comments

 
Picture
తాలిబాన్‌లకు ఎదురు తిరిగిన మలాలాకు...
బతుకు చీకట్లతో పోరాడి గెలిచిన అశ్వనికి...
తేడా ఏం లేదు.
ఆడపిల్లల చదువు కోసం ఫైట్ చేస్తున్న మలాలాకు...
తనలా అంధులైన పిల్లల చదువు కోసం సర్వీస్ చేస్తున్న అశ్వనికి...
తేడా ఏం లేదు.
ఇద్దరూ సమస్యలను సవాల్‌గా తీసుకున్నారు.
ఇద్దరూ తమ ఈడు పిల్లలకు ఆదర్శంగా నిలిచారు.
అమ్మాయిలు ఇంతింత సాహసాలు చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం కలుగుతుంది!
వారి తల్లిదండ్రులకు సెల్యూట్ చెయ్యాలనిపిస్తుంది.
మలాలా గురించి ప్రపంచమంతటికీ తెలుసు.
‘మలాలా అవార్డు’ అందుకున్న అశ్వని గురించి తెలుసుకోవాలంటే మాత్రం
                                                   నేరుగా ఆమె అమ్మానాన్నలనే అడగాలి.
                                                   అదొక ఇన్‌స్పైరింగ్ స్టోరీ. అదొక ‘లాలిపాఠం’!

                             కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామం చేళ్లగుర్కి ప్రకాశ్ అంగడి స్వస్థలం. వ్యవసాయం మీద ఆధారపడిన ఉమ్మడి కుటుంబం వీరిది. ఒక ఏడాది తీవ్రమైన కరువు రావడంతో పొట్ట చేతబట్టుకుని భార్య వేదవతితో బెంగళూరు బాట పట్టారు ప్రకాశ్. అద్దె ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఇద్దరబ్బాయిల తర్వాత అమ్మాయి పుట్టడంతో మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయేలోపే ఆ చిన్నారికి చూపులేదని తెలిసింది. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ... ‘‘అశ్వనికి చూపులేదని డాక్టర్లు చెప్పగానే అశ్వని భవిష్యత్తును ఊహించుకుంటూ చాలా బాధపడ్డాను. చూస్తుండగానే అశ్వనికి నాలుగేళ్లు వచ్చేశాయి. చూపులేదనే మాట తప్ప మిగతా అన్ని విషయాల్లో తను చాలా చురుగ్గా ఉండేది. బళ్లో చేర్పించాలనుకుంటున్న తరుణంలో నగరంలోని రమణ మహర్షి ఆశ్రమ పాఠశాల గురించి విన్నాం. అక్కడ అంధుల కోసం ప్రత్యేక లిపిలో పాఠాలు చెబుతారని, హాస్టల్ సదుపాయం కూడా ఉందని తెలుసుకున్నాం’’ అంటూ ఆగారు వేదవతి.

గుండె దిటవు చేసుకున్నాం...


                      అశ్వనిని నాలుగేళ్ల వయసులోనే హాస్టల్‌కు పంపించడానికి మానసిక సంఘర్షణకు గురయ్యామని చెబుతూ... ‘‘అప్పట్లో మేం బ్యాటరాయణపురలో ఉండేవాళ్లం. అశ్వనిని చేర్పించాల్సిన స్కూల్ జయనగరలో ఉంది. రోజూ అశ్వనిని అంత దూరం తీసుకెళ్లి తీసుకురాలేక హాస్టల్‌లో చేర్పించామన్న మాటే కానీ మా మనసంతా ఆమె చుట్టూనే ఉండేది. శనివారం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేవాళ్లం. ప్రతి శనివారం ఇంటికి తీసుకువచ్చి మళ్లీ సోమవారం హాస్టల్‌లో వదిలేవాళ్లం’’ అని చెప్పారు ప్రకాశ్.

పట్టుదల ఎక్కువే!


                    అశ్వనికి పట్టుదల ఎక్కువేనంటూ టెన్త్‌పరీక్షల సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు ప్రకాశ్. ‘‘అశ్వనికి చిన్నతనంలో తరచూ జబ్బు చేసేది. టెంత్ పరీక్షల ప్పుడు తీవ్ర అనారోగ్యం పాలైంది. అయినా సరే, పరీక్షలు రాయాల్సిందేనని పట్టుబట్టింది. దాంతో రోజూ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చికిత్స చేయించి, పరీక్ష హాల్‌కు తీసుకెళ్లేవాళ్లం. పరీక్షలు ఆ పరిస్థితిలో రాసి కూడా 85 శాతం మార్కులతో పాసైంది. పీయూసీకి ఎన్‌ఎంకేఆర్‌వీ కాలేజ్‌లో చేర్పించాం. రోజూ ఎవరో ఒకరం కాలేజ్‌కి తీసుకెళ్లి, సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాళ్లం. ఒకరోజు మాకోసం ఎదురుచూడకుండా తనంతట తానే ఇంటికి వచ్చేసింది. ‘ఏదైనా జరిగుంటే’ అని మందలించా. కానీ తను ‘నాన్నా నేను రోజూ వెళ్లివస్తున్న దారేగా, ఒక్కదాన్నే రాగలను, భయంలేదు’ అంది. మానసికంగా తనెంత దృఢంగా ఉందనేది నాకప్పుడే అర్థమైంది’’ అన్నారు ప్రకాశ్.

డిగ్రీ సీటు కోసం పాట్లు!

                       అశ్వనిని డిగ్రీలో చేర్పించడానికి బెంగళూరు మహారాణి కళాశాలకు వెళ్లినపుడు ‘అశ్వని ఫెయిల్ అయితే తమ కాలేజ్‌కి చెడ్డపేరు వస్తుందని, తనకేమైనా జరిగితే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని’ సీటివ్వడానికి ససేమిరా అన్న సంఘటనను వివరించారు ప్రకాశ్. ‘‘అశ్వనికి సీటివ్వమని ప్రిన్సిపాల్‌ని కన్నీళ్లతో వేడుకున్నాను. అశ్వని పరీక్షల్లో ఫెయిల్ అయితే అదే క్షణం ఇంటికి తీసుకెళతానని, ఏం జరిగినా బాధ్యత తీసుకుంటానని హామీపత్రం రాసిచ్చిన తర్వాత చేర్చుకున్నారు. నా బిడ్డ ఎటువంటి ఇబ్బందీ తీసుకురాలేదు, పైగా ర్యాంక్ స్టూడెంట్ కూడ’’ అని తన గారాల పట్టి గురించి చెప్పారు ప్రకాష్.

సేవకే అంకితమవుతానంది... సరే అన్నాం...

                         అశ్వనికి ఐటీ సంస్థలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగంలో చేరకుండా తన ఆశయాన్ని బయటపెట్టింది. అదే విషయాన్ని చెబుతూ ‘‘అశ్వనిలో చిన్నప్పటి నుండి సామాజిక స్పృహ ఎక్కువే. ప్రభుత్వం నెలనెలా తనకిచ్చే పెన్షన్‌డబ్బు కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన వారికిచ్చేది. తనకంటూ ఆధారం లేకపోతే రేపటిరోజున పరిస్థితి ఏంటని భయపడ్డాం. తనలాంటి నలుగురికి ఆధారంగా నిలవడంలోనే తృప్తి ఉందని మాకు నచ్చజెప్పి ఒక స్వచ్ఛందసంస్థలో వాలంటీర్‌గా చేరి ఎంతోమందిని విద్యావంతులుగా చేయడానికి కృషి చేస్తోంది. ఆమె ఎంచుకున్న మార్గమే ఈరోజు ఇంత గౌరవాన్ని తెచ్చింది’’ అన్నారాదంపతులు.


                           కష్టాలను ఓర్పుతోనే దాటాలి! కష్టాలకు ఓర్చుకుంటూ విజయ తీరాల వైపు ప్రయాణించాలని పిల్లలకు నేర్పుతూ వచ్చామని ప్రకాష్ తెలిపారు. శివ, అశ్వని, ప్రేమ్ ముగ్గురూ తమ కాళ్లపై తాము నిలబడ్డానికే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారాయన. ‘‘పుట్టి పెరిగిన ఊళ్లో కరువు రావడంతో పొట్ట చేతపట్టుకొని బెంగళూరుకు వచ్చినప్పుడు మంచినీళ్లు తాగి కడుపునింపుకున్న రోజులను, రేయి- పగలు అనే తేడా లేకుండా ఆటో నడిపిన సంగతినీ చెప్తూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని వదులుకోలేదని గుర్తు చేసేవాడిని. వాళ్లు కూడా కాస్తంత వయసొచ్చాక నా మీద ఆధారపడలేదు. పెద్దబ్బాయి శివ... కుటుంబ ఆర్థికపరిస్థితుల దృష్ట్యా పి.యు.సి మధ్యలోనే వదిలేసి, నాతో కలిసి ట్రావెల్స్ ఏజన్సీ నిర్వహణ చూసుకుంటున్నాడు. అశ్వని అయితే రికార్డులకోసం మాపై ఆధారపడేది కాదు, కాలేజ్‌లో చెప్పే పాఠాలను రికార్డ్ చేసుకొని వచ్చి ఇంట్లో నోట్స్ ప్రిపేర్ చేసుకునేది. ఇక అశ్వని తమ్ముడు ప్రేమ్ బిఏ చేసి బెస్కామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. నా బిడ్డలందరూ నాకు చేదోడువాదోడయ్యారే తప్ప ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎప్పుడూ లేవు’’ అని చెప్పారు ప్రకాష్.

                        బాహ్యప్రపంచాన్ని చూడలేని తమ బిడ్డ మనోనేత్రంతో ప్రపంచాన్ని చూడగలదు అని నిరూపించిన తల్లిదండ్రులు ప్రకాశ్, వేదవతి. వారందించిన చేయూతతో తనలాంటి వారెందరికో చూపుగా నిలుస్తోంది అశ్వని.

అశ్వని విజయాలు!

  • మహారాణి కళాశాలలో అంధుల కోసం ప్రత్యేకమైన పుస్తకాల అవసరాన్ని యాజమాన్యానికి వివరించారు. ప్రస్తుతం ఆ కాలేజ్‌కి బ్రెయిలీ బుక్స్, కంప్యూటర్ స్క్రీన్ రీడర్‌లు కూడా వచ్చాయి.
  • విభిన్న ప్రతిభావంతుల హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న ‘లియోనార్డ్ ఛెసైర్ డిసెబిలిటీ’ (ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది) సంస్థలో 2011 జూలైలో సాధారణ వాలంటీర్‌గా చేరారు. కొద్ది కాలంలోనే నేషనల్ ఫెసిలిటేటర్‌గా ఎదిగారు.
  • నగరంలోని వివిధ కళాశాలల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం అందుబాటులోకి తీసుకురావాల్సిన వసతులపై ఆయా కళాశాలలయాజమాన్యాలతో చర్చించి సౌకర్యాలను ఏర్పాటుచేయించారు.
  • రాంచీలో ఆమె వెళ్లిన సమావేశానికి హాజరైన 90 మందిలో ఒక్కరు కూడా పాఠశాలకు వెళ్లడం లేదు. చదువు ఆవశ్యకత, బ్రెయిలీ లిపి వంటి సౌకర్యాల గురించి అశ్వని ఇచ్చిన కౌన్సెలింగ్‌తో స్ఫూర్తి పొంది ఆరోజే వారంతా స్కూల్లో చేరారు.
  • ఈనెల 12న న్యూయార్క్‌లోని యునెటైడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘మలాలా డే’ కార్యక్రమంలో అశ్వనిని అభినందించి, విభిన్న ప్రతిభావంతులైన బాలికల విద్యకోసం ఆమె చేస్తున్న కృషికి ‘యూత్ కరేజ్ అవార్డ్ ఫర్ ఎడ్యుకేషన్’తో ఐక్యరాజ్యసమితి సత్కరించింది.

అమ్మానాన్నలే నా కళ్లు!


                            నా తృప్తి కోసమే ఇదంతా చేస్తూ వచ్చాను. నేను కావాలన్నదానికి నా తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. నాకు రెండు కళ్లుగా మారి నేను ఎంచుకున్న బాటలో నడిపించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కరువైన ఎంతోమంది విభిన్న ప్రతిభావంతులు, ముఖ్యంగా అమ్మాయిలు ఇంటికే పరిమితమవుతున్నారు. అలాంటి వాళ్లను విద్యావంతులుగా చేయాలనేదే నా లక్ష్యం.    
- అశ్వని,

మూలం : సాక్షి దినపత్రిక


0 Comments

పురుషాధిక్యతను సవాలుగా.. మ్యాజిక్‌ మహిళ

7/22/2013

0 Comments

 
Picture
                     ఇంద్రజాల విద్యా ప్రదర్శనలో ఆమెకున్న పేరు అసమానమైనది. ఎక్కువగా పురుషులే కనిపించే మ్యాజిక్‌ కళలో ఆమె తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరింత విశిష్టత ఏమిటంటే, ఆమె భారతదేశంలోని మొట్టమొదటి రంగస్థల మహిళా ఐంద్రజాలికురాలు. ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో దిట్ట అయిన ప్రపంచ ప్రఖ్యాత మెజీషియన్‌ పి.సి. సర్కార్‌కు ఆమె స్వయానా మనుమరాలు. ఆమె పేరే - మనేకా సర్కార్‌.

                 పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న మ్యాజిక్‌ రంగంలో మనేకా సర్కార్‌ సాధించిన కీర్తి సామాన్యమైనదేమీ కాదు. ఆ ధోరణిని కొనసాగిస్తూ మరింత మంది మహిళలు మ్యాజిక్‌ వైపు రాకపోవడం మాత్రం ఆశ్చర్యకరమే! అయితే, ''పురుషాధిక్యత ఎక్కువగా ఉండే మన దేశంలో ఇంద్రజాల విద్యలోనూ అదే ధోరణి కనిపించడంలో ఆశ్చర్యం లేదు'' అని తేలిగ్గా నవ్వేశారు ఆమె. ''ఇంద్రజాలం చేసేవాళ్ళం సాధారణంగా దుర్గాదేవికి మరో పేరు అయిన మహా మాయను ఆరాధిస్తాం. పేరులోనే ఉన్నట్లుగా ఆమె ఈ మాయా కళకు దేవత. అలాగే, భోజ రాజు కుమార్తె అయిన భానుమతికి కూడా ఈ మాయాజాలం వచ్చని ఐతిహ్యం. ఇలాంటి కథలు, గాథలు భారతదేశంలో, విదేశాల్లో ఎన్నో ఉన్నాయి. కానీ, తీరా వాస్తవ ప్రపంచానికి వచ్చే సరికి మాత్రం మహిళా ఐంద్రజాలికుల సంఖ్య చాలా తక్కువ'' అని మనేకా సర్కార్‌ వివరించారు. మన దేశంలో ప్రబలంగా ఉన్న పితృస్వామ్య వ్యవస్థే అందుకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. చివరకు మ్యాజిక్‌ రంగంలోనూ అదే వ్యవహారం జొరబడిందంటారామె.

                 దీనికి ఆమె చెప్పిన వివరణ, చేసిన విశ్లేషణ కూడా ఆసక్తికరమే. ''ఏదైనా కథలోనో, సినిమాలోనో ఎవరైనా మహిళకు మాయాజాల విద్యలు ఉన్నాయని చెప్పాల్సి వస్తే, ఆమెను నెగటివ్‌ కోణంలో చూపెడతారు. మన కథల్లో వచ్చే 'బ్యాట్‌మన్‌', 'సూపర్‌మ్యాన్‌', 'స్పైడర్‌ మ్యాన్‌' - ఇలా అందరూ పురుషులే! శక్తిమంతమైన మహిళల్ని చూపెట్టడమే అరుదు. ఒకవేళ చూపెట్టినా, వాళ్ళందరినీ దుర్మార్గులుగానే చిత్రిస్తారు'' అని ఆమె వివరించారు.

                     నిజానికి, రంగస్థలం మీద ఓ మహిళ మ్యాజిక్‌ను ప్రదర్శించడమంటే, సైన్స్‌నూ, ప్రయోగాత్మకతనూ మిళితం చేసి, ఆమె మెజీషియన్‌ పాత్రను అభినయించడమే! చక్కటి ఐంద్రజాలికురాలని అనిపించేలా ఆమె ఎంతగా నప్పితే, ఆమె మ్యాజిక్‌ కూడా అంత బాగుంటుంది. కానీ, మహిళల మీద ఉన్న ప్రతికూల అభిప్రాయాల మూలంగా ఆడవారెవరూ మెజీషియన్లుగా కనిపించడం లేదు. చివరకు అది మ్యాజిక్‌కు పేరుబడ్డ తమ సర్కార్‌ కుటుంబంలోకి కూడా చొచ్చుకువచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. దాదాపు తొమ్మిది తరాల తరువాత వచ్చిన ఏకైక మహిళా మెజీషియన్‌ తానేనని మనేకా సర్కార్‌ తెలిపారు. కుటుంబంలోని మహిళల్లో ప్రతిభకు కొదవ లేకపోయినప్పటికీ, సామాజికంగా బహిష్కరణకు గురవుతామనే భయం, అంతరాంతరాళాల్లో గూడు కట్టుకున్న మూఢవిశ్వాసాల ఫలితంగా మెజీషియన్లుగా మహిళలకు అవకాశాలు లేకుండా పోయాయని ఆమె అంటారు.

                    కానీ, సాహసోపేతంగా ముందుకు వచ్చి, మహిళా మెజీషియన్‌గా మనేక సాధించిన పురోగతి ఎంతోమందికి ప్రేరణ నిచ్చింది. ప్రేక్షకులు ఆమెను ఓ ఇంద్రజాల కళాకారిణిగా ఆశ్చర్యానందాలతో చూస్తున్నారు. ''చాలామంది తల్లితండ్రులు వాళ్ళ కుమార్తెలతో నా దగ్గరకు తరచూ వస్తుంటారు. నన్ను చూశాక వారెంతో ప్రేరణ పొందుతున్నట్లు చెబుతున్నారు. ఏ పని చేయడానికైనా స్త్రీ పురుషులనే తేడా అడ్డంకి కాదని యువతులు చెబుతూ ఉంటారు'' అని మనేక ఆనందంగా అన్నారు. ఇంకా చెప్పాలంటే, రంగస్థలంపై మనేక చేసే అద్భుత ఇంద్రజాల విన్యాసాన్ని చూసి, తమకు ఎసరు వచ్చిందని అనుకోని పురుష మెజీషియన్లు లేరంటే అతిశయోక్తి కాదు.

                        ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, ఇంద్రజాలమంటే ఆసక్తి పెరుగుతుందే తప్ప, తరగడం లేదని ఆమె అన్నారు. మనలో ప్రతి ఒక్కరిలో ఓ మెజీషియన్‌ ఉన్నారన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. అందుకే, మనం కలలు గనే అంశాలు ఎంత అవాస్తవమైనా సరే, అవన్నీ నిజమైతే బాగుండునని కోరుకుంటూ ఉంటామని మనేక విశ్లేషించారు. ''కళ్ళెదురుగా కనపడే వాస్తవికత పెరుగుతున్న కొద్దీ అవాస్తవికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందుకే, వాస్తవికతను మరుగుపరుస్తూ, కనికట్టుతో అందరినీ ముగ్ధుల్ని చేస్తాం. పైపెచ్చు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలు ఎంతగా వృద్ధి చెందినా, వాటికన్నా పది అడుగులు ముందే ఉండడం వల్ల అవి ఏవీ మ్యాజిక్‌కు అడ్డంకి కాబోవు. పైగా, ఇవాళ మ్యాజిక్‌ అని అనుకున్నవి రేపటికి సైన్స్‌గా మారతాయి'' అని మనేక పేర్కొన్నారు.

మూలం : ప్రజాశక్తి దినపత్రిక


0 Comments

నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న లక్ష్మి

7/21/2013

23 Comments

 
Picture
                   మీకు మంచి తెలివితేటలున్నాయి. వ్యాపారంగా మలిస్తే నలుగురికి ఉద్యోగాలు సృష్టించే ఐడియాలున్నాయి. కానీ, ఐడియాను వ్యాపారంగా మలచుకునే మార్గాలు తెలియవు, వ్యాపారం నెలకొల్పేటందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకునే అవకాశాలు కనిపించడం లేదు... ఇదే మీ ఆవేదన అయితే, మిమ్మల్ని ముందుకు నడిపించే ఓ వ్యక్తి ఉన్నారు. ఆవిడే లక్ష్మి వి.వెంకటేశన్.లక్ష్మి... సామాన్యుల కోసం ఆలోచించే ఒక అసామాన్యుడి కూతురు. భారతదేశపు రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్ దేశానికి నాయకత్వం వహించి ముందుకు నడిపితే, ఆయన కూతురు యువతకు నాయకత్వ లక్షణాలు నేర్పుతున్నారు. అందుకోసం భారతీయ యువశక్తి సంస్థను నడిపిస్తున్నారు.

మంచి ఆలోచన నుంచి మరో మంచి ఐడియా

               అమెరికాలోని ఒక అత్యున్నత సంస్థలో ఉద్యోగం చేస్తున్న లక్షి చాలా సౌకర్యవంతమైన జీవితం గడుపుతుండగా వేల్స్ యువరాజు చేస్తున్న ఓ మంచిప్రయత్నం ఆమెను ఆకట్టుకుంది. అప్పటికే ఆమె అమెరికాలోని యువత ఆలోచనలను చాలా దగ్గరగా పరిశీలించారు. దానికితోడు బ్రిటన్‌లోని అట్టడుగు వర్గాలకు వేల్స్ యువరాజు ఫౌండేషన్ చేయూతనిస్తూ పలువురిని దేశానికి రూపురేఖలు మార్చేస్థాయికి తీసుకెళ్తోంది.అది లక్ష్మిని చాలా ఆకట్టుకుంది. మనదేశంలోని యువతకు కూడా అలా అవకాశం కల్పిస్తే ఎంతో బాగుంటుంది అనిపించింది. మరుక్షణమే ఉద్యోగానికి రాజీనామా లేఖ పెట్టేసి ఇండియా ఫ్లైటు ఎక్కేశారు. నలుగురిని నేరుగా ఆదుకునే కంటే నలుగురిని ఆదుకునే వారిని సృష్టించడం వల్లే వేగంగా, ఎక్కువమందికి సాయపడవచ్చని భావించారు లక్షి. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకువచ్చిందే ‘భారతీయ యువశక్తి ట్రస్ట్’ (బీవైఎస్టీ). ఇది లాభార్జన ధ్యేయం లేని ఓ విభిన్నమైన సంస్థ. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు, వ్యాపార సామర్థ్యాలు ఉండి... డబ్బు, అవకాశాలు లేక ఉండిపోయిన యువతకు ప్రోత్సాహం ఇచ్చి వారిని పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దడం బీవైఎస్టీ లక్ష్యం.

బీవైఎస్టీ ఏం చేస్తుంది!


                    మీ దగ్గర ఓ మంచి వ్యాపార ఆలోచన ఉంది. దాన్ని ప్రారంభిస్తే మీరు ఎదగడంతో పాటు మరికొంతమందికి ఉద్యోగాలు వస్తాయనుకోండి. మీ ఆలోచనను ప్రణాళికాబద్ధంగా పేపరు మీద పెట్టి, బీవైఎస్టీని సంప్రదించాలి. వారు మీ ఆలోచన సరైనదో కాదో పరిశీలిస్తారు. మంచి ఆలోచన అయితే మీకు రుణం మంజూరు చేయడంతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తారు.దీనికోసం మీకో మార్గదర్శకుడిని (మెంటర్) అందుబాటులో ఉంచుతారు. అతడు మీ ఆలోచన వ్యాపార రూపం దాల్చడానికి అవసరమైన సహకారం అందజేస్తాడు. ఎక్కడ ప్రారంభించాలి? ఎలా ప్రారంభించాలి? రాబోయే అడ్డంకులేవి? వాటిని ఎలా అధిగమించాలి? ఇలా ప్రతి విషయంలోనూ గెడైన్స్ ఇస్తూ ఈ సంస్థవారు మీతోడు ఉంటారు. చట్ట బద్ధంగా ఉండే ఏ వ్యాపారమైనా వీరు సహకరిస్తారు. బీవైఎస్టీ సాయం పొందాలంటే మీ వయసు 18-35 ఏళ్ల మధ్యే ఉండాలి. గ్రామీణ భారతంలో ఉపాధి సృష్టించే వ్యాపారం అయితే మరీ మంచిది. కానీ, తప్పనిసరిగా కొన్ని ఉద్యోగాలు అయినా సృష్టించగలగాలి.

ఇక్కడ నిరాశపరిచేవాళ్లు ఎక్కువ

కొత్త ఆలోచనలు చేసేవారికి, సొంత కాళ్లపై నిలబడాలనుకునేవారికి ఇక్కడ పరిస్థితులు అనువుగా లేవని అంటున్నారు లక్ష్మీ వెంకటేశన్. అమెరికా జనాభాలో 75 శాతం మంది ఏదో ఒక వ్యాపారం చేసిన వాళ్లే ఉంటారు. జయాపజయాలు పట్టించుకోకుండా ప్రభుత్వం అందుకు చాలా ప్రోత్సాహాన్నందిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం తక్కువ. ఉద్యోగం మానేసి ఏదైనా ప్రారంభించేవారిని సమాజంలో కూడా తప్పు చేస్తున్నట్లు చూస్తారు. ‘‘నిజానికి మనవాళ్లు చాలా సమర్థులు. యువత కూడా ఎక్కువ. ఇలాంటి చోట యువతరాన్ని మంచి ఆలోచనలతో ప్రోత్సాహిస్తే వారు నిరుద్యోగాన్ని మటుమాయం చేస్తారు’’ అంటారామె.1992లో ప్రారంభమైన బీవైఎస్టీ ఇప్పటివరకు 2000 మందిని వ్యాపార వేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తయారుచేసింది. వారిలో మిలియనీర్లు అయినవారూ ఉన్నారు. వీరంతా కలిసి సుమారు 30 వేల ఉద్యోగాలను సృష్టించారు. ఒక సంస్థ ప్రోత్సహిస్తే ఇన్ని ఉద్యోగాలు పుట్టాయంటే, ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ దేశంలో నిరుద్యోగానికి అడ్రస్ ఉంటుందా అన్నది లక్ష్మి వేస్తున్న ప్రశ్న.ఇప్పటి యువతలో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. మీరు కూడా అదే ప్రయత్నంలో ఉండి దిక్కుతోచకపోతే బీవైఎస్టీని కలవొచ్చు. దేశంలో ఆరు కేంద్రాలుంటే హైదారాబాదులో ఒకటి స్థాపించారు.


మూలం : తెలుగు విశేష్ 

23 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.