పోల్వాల్ట్ ..అడుగడుగునా పురుషాధిక్యం ఉట్టిపడేక్రీడ. శారీరక సామర్థ్యం, మానసిక దృఢత్వం ఎంతగానో అవసరమైన ఈ క్రీడలో పురుషులకు దీటుగా మహిళలు సైతం సత్తా చాటగలరని రష్యా సంచలన పోల్వాల్టర్ ఎలెనా ఇసిన్బయేవా చాటి చెప్పింది.
ఓల్గాగ్రాండ్ అద్భుతం
రష్యాలోని ఓల్గాగ్రాండ్లో కుళాయిలు బాగు చేసే వారి కుటుంబంలో పుట్టిన ఎలెనా జిమ్నాస్ట్గా తన జీవితం ప్రారంభించి, ఆ తర్వాత పోల్వాల్ట్ పట్ల ఆకర్షితురాలైంది. పదిహేను సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయ మహిళా పోల్వాల్టర్గా గుర్తింపు తెచ్చుకొని ప్రపంచ జూనియర్, యువజన విభాగాలలో ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత సీనియర్ విభాగంలో అడుగుపెట్టి రికార్డుల హోరు, పతకాల జోరుతో తనకు తానే సాటిగా నిలిచింది.
16 ఏళ్ళలో 30 ప్రపంచ రికార్డులు
- పోల్వాల్టర్గా పదహారేళ్ళ తన ప్రస్థానంలో ఎలెనా అధిరోహించని శిఖరం అంటూ ఏదీ లేదు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ముప్ఫై ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. మహిళా పోల్వాల్ట్ చరిత్రలో ఐదుమీటర్ల ఎత్తు రికార్డును అధిగమించిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించింది.
- 2004 నాటి ఏథెన్స్ ఒలింపిక్స్, 2008 నాటి బీజింగ్ ఒలింపిక్స్లో బంగారు పతకాలు, 2012 నాటి లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాలు సాధించింది. ప్రపంచ అథ్లెటిక్స్లో మూడుసార్లు చాంపియన్గా నిలిచింది.
- 2007 ప్రపంచ అథ్లెటిక్స్ గోల్డెన్ మీట్లో జాక్పాట్ విన్నర్గా, 2004 -05, 2008 సంవత్సరాలలో ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ అవార్డులు, 2007,2009 సంవత్సరాలలో ప్రతిష్ఠాత్మక లారెస్ అవార్డులు అందుకొంది. ప్రపంచ జూనియర్, యువజన, సీనియర్ విభాగాలలో చాంపియన్గా నిలిచిన ఎనిమిది మంది ఆల్టైమ్ గ్రేట్ అథ్లెట్లలో ఒకరుగా ఎలెనా నిలిచింది.
- పదహారు సంవత్సరాల పాటు అంతర్జాతీయ అథ్లెటిక్స్ అగ్రస్థానంలో కొనసాగడం అంత తేలిక కాదు. పోల్వాల్ట్ ద్వారా పేరు, ప్రతిష్ఠలు సంపాదించి , ఆ క్రీడకే మరో పేరుగా నిలిచిన ఎలెనా ఇటీవలే ముగిసిన 2013 మాస్కో ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్కు ముందే తన రిటైర్మెంట్ను ప్రకటించింది.
మాతృత్వం కోసం..
కఠోర దీక్ష, నిరంతర సాధనతో గత పదహారేళ్ళుగా గడిపిన 31 ఏళ్ళ ఎలెనాకు అమ్మ కావాలనీ , ఓ బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వపు మధురిమలు అనుభవించాలన్న కోరిక కలిగింది. అమ్మతనం కోసమే ముందస్తు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఆమే చెప్పింది.
స్వదేశంలో, వేలాది అభిమానుల సమక్షంలో ఆఖరు సారిగా ప్రపంచ పోటీల్లో పాల్గొన్న ఎలెనా ఏకంగా బంగారు పతకం సాధించి ప్రపంచ చాంపియన్ హోదాలో వీడ్కోలు తీసుకొంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి 2016 రియో ఒలింపిక్స్లో పాల్గొనాలని భావిస్తోంది. రష్యా సైన్యంలో సీనియర్ లెఫ్ట్నెంట్గా పని చేస్తున్న ఎలెనా అటు కుటుంబ జీవితానికీ, ఇటు క్రీడా జీవితానికీ సమప్రాధాన్యమిస్తూ, నేటి తరం మహిళలకు నిత్య స్ఫూర్తిగా, గర్వ కారణంగా నిలిచిపోతోంది.
16 ఏళ్ళ క్రీడా జీవితంలో 30 ప్రపంచ రికార్డులు
- 2004 ఏథెన్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో బంగారు పతకాలు
- 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్యపతకం
- 2007,2009 గోల్డెన్లీగ్లో జాక్పాట్ విన్నర్
- 2007,2009 టారెస్ అవార్డ్ విజేత
- 2004,2005,2008లో అత్యుత్తమ మహిళా అథ్లెట్
- మూడుసార్లు ప్రపంచ చాంపియన్
- యూత్, జూనియర్, సీనియర్ విభాగాలలో ప్రపంచ విజేతగా నిలిచిన ఎనిమిది మందిలో ఎలెనాకు చోటు
- 2004 సీజన్లో ఎనిమిది ప్రపంచ రికార్డులు
- ఇండోర్స్లో 5.01 మీటర్లతో ప్రపంచ రికార్డు
- 2009 జ్యూరిచ్ అవుట్ డోర్ మీట్లో 5.06 మీటర్లతో ప్రపంచ రికార్డు
- మహిళా పోల్వాల్ట్లో 5 మీటర్ల రికార్డు సాధించిన తొలి మహిళ