ఇరవై ఆరేళ్ల గీతాంజలి... ఢిల్లీలో మాస్ మీడియా కమ్యూనికేషన్‌లో పీజీ చదివింది. తల్లిదండ్రులు విద్యావంతులు. కూతురు ఉన్నతోద్యోగినిగా స్థిరపడితే చూడాలనుకున్నారు. కానీ జరిగింది మరొకటి. గీతాంజలి చదువుకునేప్పుడు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంఘాలతో కలిసి పని చేసింది. అప్పుడే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఢిల్లీలో మరో కోణం గురించి తెలుసుకుంది. రెడ్‌లైట్ ఏరియాలో మహిళలూ, వారి పిల్లల దుస్థితిని చూసి బాధపడింది. వారి జీవితాల్లో మార్పు కోసం కృషి చేయాలనుకుంది. చదువయ్యాక కార్పొరేట్ సంస్థలో చేరినా ఆలోచనలన్నీ ఆ లక్ష్యంపైనే. ఏడాది తిరిగేసరికి ఐదంకెల జీతమొచ్చే ఉద్యోగం మానేసింది. రెడ్‌లైట్ ప్రాంతంలోని పిల్లల కోసం స్కూలు ప్రారంభించాలనుకుంది. 'ఆ పిల్లల చదువు కోసమైతే ఇల్లు అద్దెకివ్వడం కుదరదు' అన్నారంతా. ఆ పిల్లల తల్లులూ, గీతాంజలిని మొదట్లో నమ్మలేదు. కొన్ని నెలల పాటు విసుగూ, విరామం లేకుండా అక్కడికెళ్లి, మహిళల్ని కలిసి వారి బాధలు వింది. ఆ వృత్తిలోంచి బయటికొస్తే, వేరే ఉపాధి మార్గం చూపిస్తానని భరోసా ఇచ్చింది.
కొన్నాళ్లకి అద్దెకి ఇల్లు దొరికింది. స్నేహితుల సాయంతో దాన్ని ఓ కార్పొరేట్ స్కూల్‌లా తీర్చిదిద్దింది. మెల్లగా పిల్లలు చదువుకోవడానికి రావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ముప్ఫై మంది చిన్నారులు ఆమె వద్ద చదువుకుంటున్నారు. మరో ముప్ఫై మంది మహిళలు వృత్తి విద్యా నైపుణ్యాలు నేర్చుకుని స్వయం ఉపాధితో జీవిస్తున్నారు. గీతాంజలి ప్రయత్నాలకు స్థానిక పోలీసులూ, స్వచ్ఛంద సంస్థల సభ్యులూ సాయం అందిస్తున్నారు. 'ఆ కూపంలో మగ్గుతున్న నాలుగు వేల మందిని బయటకు తీసుకొచ్చి కొత్త జీవితం ఇవ్వడమే నా లక్ష్యం. ఈ క్రమంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా, అడ్డంకులు ఎదురయినా తట్టుకునేందుకు సిద్ధమే' అంటోంది గీతాంజలి.