మాది హర్యానా. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి రష్యన్ భాషలో పీజీ చేశా. కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశా. మా కుటుంబం మొత్తంలో నేనొక్కదాన్నే ఉద్యోగస్తురాలిని. అయితే పెళ్లయ్యాక, అమ్మాయి పుట్టాక ఉద్యోగం చేయడం కష్టం అనిపించింది. పాప బాధ్యతలే ముఖ్యం అనుకుని ఉద్యోగం మానేశా. కానీ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాక ఖాళీగా ఉండటానికి మనసొప్పలేదు. దాంతో కొందరు స్నేహితులతో కలిసి ఓ మ్యాగజైన్‌ని నిర్వహించా. అదీ సంతృప్తినివ్వలేదు. ఏం చేద్దామో తోచలేదు.
నా లాంటి పరిస్థితి మరికొందరు మహిళలకూ ఎదురవుతుంది కదా అని అప్పుడు అనిపించింది. అందుకే బాగా ఆలోచించి ఫ్లెక్సీమామ్స్‌ని ప్రారంభించా. పిల్లలు పుట్టాక ఉద్యోగం నుంచి విరామం తీసుకున్న మహిళలు కెరీర్‌లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేలా వారిని ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం. సౌకర్యవంతమైన పనివేళలున్న ఉద్యోగాన్ని కోరుకుంటూ, కుటుంబం, కెరీర్‌ని సమన్వయం చేసుకోవాలనుకునే మహిళలకు మేం ఉపాధి కల్పిస్తాం. అలాంటి అవకాశాలు ఏయే రంగాల్లో ఉన్నాయో వివరిస్తాం. దాంతోపాటూ దరఖాస్తును ఆకట్టుకునేలా రూపొందించుకోవడం మొదలుకొని ఇంటర్వ్యూలకు హాజరవడం, పని చేసే చోట రాణించడం.. ఇలా కెరీర్‌కి సంబంధించి ప్రతిదీ శిక్షణ ఇస్తాం. మంచి చదువూ, అనుభవం ఉండి కొంతకాలం విరామం తరవాత ఉద్యోగంలో చేరాలనుకునే వారికి కొంత శిక్షణతో ఉద్యోగాలిచ్చే సంస్థల గురించీ మేం ముందుగా తెలుసుకుంటాం.
ఆయా సంస్థల లక్ష్యాలూ, వాటికి తగ్గట్టు ఎటువంటి ఉద్యోగుల్ని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారో మాట్లాడతాం. మాకొచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి... ఆయా సంస్థల వాళ్లకి పంపిస్తాం. ఈ రకంగా మేం చేసిన ప్రయత్నాలతో సుమారు నాలుగొందల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మేం దరఖాస్తుల్ని పంపించే స్థాయికి చేరుకున్నాం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండు వేల మందికి ఉపాధి కల్పించాం. ప్రస్తుతం ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పుణేలలో మా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ మేం చూపించిన వాటిల్లో దాదాపు ఎనభైశాతం సౌకర్యవంతమైన పనివేళలు ఉన్నవే. ఇంటినుంచి పనిచేసే అవకాశం పొందిన వాళ్లూ ఉన్నారు. సాధ్యమైనంత వరకూ అలాంటి ఉద్యోగాలనే వెతుకుతాం. ఇంటినుంచి పనిచేయాలనుకున్నా... పార్ట్‌టైంగా ఉండాలనుకున్నా... తాత్కాలికంగా ఓ ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నా... మా డాట్‌కామ్‌లోకి ప్రవేశించి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన పని లేదు. ప్రస్తుతం మా దగ్గర పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు. మహిళలకు ఇచ్చే శిక్షణ, నిర్వహించే వర్క్‌షాప్‌ల కోసం మాత్రం నామమాత్రంగా కొంత ఫీజు తీసుకుంటాం. వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే మా భవిష్యత్ లక్ష్యం.
web site :http://www.fleximoms.in