అది ఖమ్మంలోని అంబేద్కర్‌భవన్. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల నుంచి వచ్చిన విద్యార్థులతో హాలు నిండిపోయింది. సైకాలజీ కౌన్సిలర్ లక్ష్మి చెబుతున్న మానసిక పాఠాలను ఆసక్తిగా వింటున్నారంతా. తరగతిగదిలో విన్న పాఠ్యాంశాలు జ్ఞానాన్ని ఇస్తే, లక్ష్మి పాఠాలు మానసిక వికాసాన్ని కలిగిస్తున్నాయి.
బడుగు విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నదే కానీ, వారి మానసిక ఎదుగుదలకు చొరవ చూపడం లేదు. ఆ లోటును పూడ్చాలనుకున్నారు తాళ్లూరి లక్ష్మి. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ మానసికశాస్త్రం, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సెలింగ్‌లో ఎంఫిల్ చేశారామె. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. ఇంత చదువు చదివి ఇంట్లో ఖాళీగా ఉండటం దేనికని.. అవసరమైన చోట తన సేవల్ని అందించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
మనోబలం అవసరం..
"మన దేశంలో మానసిక వైద్యుల ప్రాధాన్యం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది కాని అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్లకు చాలా ప్రాధాన్యమే ఉంది. చిన్నపిల్లల్లో నడవడిక, ప్రవర్తనకు సంబంధించి ఏ లోపాలు తలెత్తినా ఆ దేశాల్లో మానసిక వైద్యం తీసుకుంటారు. మన దేశంలో కూడా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో చదివే పిల్లలకు ఇలాంటి మానసిక వైద్యం అందించడం అవసరం'' అంటున్నారు లక్ష్మి. ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల్లో అపోహలు, భయాలు, ఆత్మన్యూనతా భావాలను పోగొడితే.. వారు అద్భుతఫలితాలు సాధిస్తారన్నది ఆమె నమ్మకం.
గత నాలుగేళ్ల నుంచి ఆమె ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఖమ్మం జిల్లాతోపాటు, విజయవాడ, గుంటూరులలోని నిరుపేద విద్యార్థులకు ఉచిత మానసిక వైద్యం అందిస్తున్నారు. "సాంఘికసంక్షేమ వసతిగృహాల పరిస్థితి దయనీయం. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకునే విద్యార్థులకు నైతిక ప్రోత్సాహం ఇవ్వాలి. వారికి వారు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోలేరు. శరీరానికి తిండి ఎలాగో, మనసుకు శక్తి కూడా అలా అవసరం. ఆ శక్తిని ఇస్తుంది సైకాలజీ కౌన్సెలింగ్. వెనుకబడిన విద్యార్థులు పలు మానసిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వారిలో సానుకూల దృక్పథాన్ని (పాజిటివ్ థింకింగ్) ప్రోత్సహిస్తే.. మంచి ఫలితం వస్తుంది. మేమిప్పుడు అదే పని చేస్తున్నాం'' అన్నారామె.
థెరపీలతో చురుగ్గా..
"ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల పిల్లలను ఎంచుకోవడానికి కారణం ఉంది. వారికి ప్రభుత్వం రోజుకు అయిదురూపాయలే ఇస్తుంది. అందులోనే టిఫిను, భోజనం అన్నీ జరిగిపోవాలి. బయట ఖర్చు పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో పిల్లల్ని హాస్టళ్లలో వదిలిపెట్టేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని బోలెడన్ని మానసిక సమస్యలు చుట్టుముడతాయి. జ్ఞాపకశక్తి లోపిస్తుంది. దానివల్ల లాంగ్వేజ్ బేసిక్స్ అలవడవు'' బాధపడుతూ చెప్పారు లక్ష్మి. వసతిగృహాల విద్యార్థులకొచ్చే మరొక సమస్య.. మాధ్యమం మారడం. కొన్ని క్లాసులకు వచ్చాక కొందరు విద్యార్థులు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియానికి మారాల్సి వస్తుంది. ఆంగ్లభాష మీద ఉండే భయాల వల్ల వార్షిక పరీక్షలప్పుడు ఫోబియో పట్టుకుంటుంది. వాటిని తొలగించేందుకు 'ఒకే రోజు రెండు ఉదయాలు' అన్న 'డాన్ థియరీ' టెక్నిక్‌ను విద్యార్థుల మీద ప్రయోగిస్తున్నారు లక్ష్మి. "ఒక రోజును 12గంటల చొప్పున రెండు భాగాలుగా విడగొట్టి ఆ సమయంలో విద్యార్థులకు రీడింగ్ అవర్స్‌ను పెడుతున్నాము. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. దీంతో పాటు 'మనకు ఒక లక్ష్యం కావాలి' అన్న భావనను విద్యార్థుల్లో నూరిపోసేందుకు 'న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెడుతున్నాను. దీనివల్ల ప్రతి విద్యార్థి మనసులో ఒక ఊహాచిత్రం (లక్ష్యం) ఏర్పడుతుంది. పిల్లలు దాన్ని సులువుగా గుర్తుపెట్టుకుంటారు. అది చదువును బలోపేతం చేస్తుంది'' అంటూ వివరించారామె.
ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని 'బాలవెలుగు' పిల్లలకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు లక్ష్మి. "ఇక్కడున్న పిల్లలంతా సింగిల్‌పేరెంట్ ఉన్నవాళ్లే. తల్లి లేదా తండ్రి ఒక్కరే ఉన్నవారు కాబట్టి.. ఇలాంటి పిల్లల్లో కొన్ని మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బిహేవియర్ థెరపీ, సైకోథెరపీ ద్వారా వాటిని తొలగిస్తున్నాను. పిల్లల్లో కౌమారదశ నుంచి యవ్వనదశకు వచ్చే సమయంలో హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. ఆ మార్పువల్ల ప్రవర్తనలో తేడాలొస్తాయి. ఇవన్నీ చదువును ప్రభావితం చేస్తుంటాయి. ఇక్కడే సైకాలజిస్టులు అవసరం అవుతారు. లోకజ్ఞానం తక్కువగా ఉండి, ఆత్మవిశ్వాసం లేని వాళ్లకు కూడా జాకబ్‌సన్ థియరీ, ఫెగ్గింగ్ మెథడ్‌లతో కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ను పెంచుతున్నాము'' అన్నారు లక్ష్మి.
- వల్లభనేని రమేష్‌బాబు,
ఫోటోలు : మహేష్, ఖమ్మం
ప్రభుత్వం రోజుకు అయిదురూపాయలే ఇస్తుంది. అందులోనే టిఫిను, భోజనం అన్నీ జరిగిపోవాలి. బయట ఖర్చు పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో పిల్లల్ని హాస్టళ్లలో వదిలిపెట్టేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని బోలెడన్ని మానసిక సమస్యలు చుట్టుముడతాయి.
- See more at: http://www.andhrajyothy.com/node/13606#sthash.XeqXeFfO.dpuf