జైలంటే శిక్షలూ, బాధలూ అన్న భావనను దూరం చేస్తూ... ఉదయ్‌పూర్‌లోని జైలు ఒక ఆశ్రమంలా కనిపిస్తుంది. ఉదయం లేచింది మొదలు అక్కడున్న ఖైదీల దినచర్య యోగా, ధ్యానంతో మొదలై... రాత్రి పుస్తకాలు చదవడంతో ముగుస్తుంది. శిక్ష అనుభవిస్తున్న వాళ్లలో చాలామంది చదువులతో రాణించారు. బయటికొచ్చాక ఉద్యోగాలు సాధించారు. మరి ఇదంతా ఎలా సాధ్యమైందంటే... వందల మంది ఖైదీల్లో మార్పు తీసుకొచ్చిన ఇందిర గురించి చదవాల్సిందే! దయ్‌పూర్ జైల్లో ఎవర్ని అడిగినా వాళ్లంతా చెప్పే పేరు ఇందిర.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖైదీల్లో మార్పు కోసం కృషి చేసింది. అందుకోసం రోజూ జైలుకి వచ్చి శిక్ష అనుభవిస్తున్న వారిని గమనించేది. కొందరు అపరాధ భావంతో కుంగిపోయేవారు. ఇంకొందరు కోపంతో వింత చేష్టలతో జైలు సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టేవారు. అలాగని వారి చేష్టలకు ఇందిర విసిగిపోలేదు. క్షణికావేశంలో నేరాలు చేసి అక్కడికొచ్చిన వారి జీవితాలు పూర్తిగా పాడయిపోకుండా చూడాలనుకుంది. ఆమె 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' గురు రవిశంకర్ శిష్యురాలు. యోగా, ధ్యానంతో వారిలో మార్పు తీసుకురావడం సాధ్యమే అనుకుంది. కానీ అది సాధ్యమయ్యే పనేనా? మొదట ఖైదీలు మాట వినాలి. అధికారులూ అనుమతి ఇవ్వాలి. ఈ రెండింట్లో మొదటిది జరిగితే, రెండోదాన్ని సాధించొచ్చు. అందుకే మొదట మహిళా ఖైదీలకు దగ్గరవ్వడానికి ప్రయత్నించింది.
కొందరు భయపడి దూరం జరిగారు. మరికొందరు తనపై దాడి చేసి, హింసాత్మకంగా ప్రవర్తించారు. ఇందిర అన్నీ ఓపిగ్గా భరించింది. తరచూ వారి మంచీచెడులూ కనుక్కొంటూ.. కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు తెలుసుకుని వూరటనిచ్చేలా మాట్లాడేది.ఇలా ఏడాది పాటు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఒక్కొక్కరుగా అందరూ తనని అర్థం చేసుకుని, ఆమె చెప్పినట్టు వినడం, మంచి పద్ధతులు పాటించడం చేశారు. సరిగ్గా అప్పుడు, వారికి రకరకాల నైపుణ్యాలు నేర్పించడానికి జైలు అధికారుల అనుమతి కోరింది. మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ మహిళా ఖైదీలు, ఆమె మాటలకిచ్చే విలువను ప్రత్యక్షంగా చూశాక ఒప్పుకోక తప్పలేదు. దాంతో జైల్లో యోగా, ధ్యానం తరగతులు మొదలయ్యాయి. కోపావేశాలను తగ్గించుకుని ఆనందంగా జీవించేలా 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' గురించి అవగాహన కల్పించింది.
నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పించింది. ఆర్నెల్లు తిరిగేసరికి జైలు వాతావరణంలో మార్పొచ్చింది. అల్లర్లూ, గొడవలూ తగ్గాయి. ఖైదీలలో జీవితం పట్ల కొత్త ఆశలు కలిగాయి. ఇదంతా గమనించిన అధికారులు ఆశ్చర్యపోవడమే కాదు... మరిన్ని మంచి పనులు చేయమని ఇందిరను ప్రోత్సహించారు. నెలకు రెండుసార్లు సైకాలజీ వర్క్‌షాపులూ... ప్రతి ఆదివారం యోగాకు సంబంధించిన సెమినార్లూ ప్రారంభమయ్యాయి. కళాశాల సెలవుల్లో విద్యార్థులనూ, లెక్చరర్లనూ పిలిపించి ఆసక్తి ఉన్నవారికి ఆంగ్లం, కంప్యూటర్ తరగతులూ... ఉన్నత విద్యావంతులకు ఫ్రెంచ్, జర్మన్ క్లాసులూ ఏర్పాటు చేసింది. జైలులో ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులతో మాట్లాడి వేల పుస్తకాలు తెప్పించి అందుబాటులో ఉంచింది. ప్రతి ఒక్కరూ రాత్రిపూట పడుకొనే ముందు కచ్చితంగా కాసేపయినా చదువుకోవాలనే నిబంధన పెట్టింది.
ఈ విధంగా మీ ప్రవర్తనలో తెచ్చుకునే మార్పుల వల్ల త్వరగా జైలు నుంచి బయటపడే అవకాశం ఉంది అంటూ నచ్చజెప్పింది. నలుగురైదుగురు ఖైదీలు తమ అనుభవాలను రాస్తే వాటిని పుస్తకాలుగా ప్రచురించింది.'ఖైదీలనగానే తప్పు చేసిన వాళ్లనే భావనతోనే అంతా చూస్తారు. వాళ్లు విడుదలై బయటకు వెళ్లినా, అపరాధ భావంతో నలుగురిలో కలవలేరు. కొందరి మానసిక స్థితి తీవ్ర స్థాయికి వెళ్లి... వాళ్లు బయటికెళ్లినా మనుషుల్ని ద్వేషిస్తారు. నేరాలు చేస్తారు. ఆ పరిస్థితులు తలెత్తకుండా అంతా ఆనందంగా ఉండాలనే ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాను. అవి కొన్ని వందల మంది ఖైదీల్లో మార్పు తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది. త్వరగా విడుదలైన వారిలో యాభై మందికిపైనే డేటా ఎంట్రీ ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధితో జీవిస్తున్నారు. డిగ్రీ మాత్రమే కాకుండా... జ్యోతిష్య శాస్త్రాన్నీ దూరవిద్య ద్వారా చదువుకొనే అవకాశం కల్పించాం' అంటూ వివరించింది ఇందిర.