మంచి ఆలోచన నుంచి మరో మంచి ఐడియా
అమెరికాలోని ఒక అత్యున్నత సంస్థలో ఉద్యోగం చేస్తున్న లక్షి చాలా సౌకర్యవంతమైన జీవితం గడుపుతుండగా వేల్స్ యువరాజు చేస్తున్న ఓ మంచిప్రయత్నం ఆమెను ఆకట్టుకుంది. అప్పటికే ఆమె అమెరికాలోని యువత ఆలోచనలను చాలా దగ్గరగా పరిశీలించారు. దానికితోడు బ్రిటన్‌లోని అట్టడుగు వర్గాలకు వేల్స్ యువరాజు ఫౌండేషన్ చేయూతనిస్తూ పలువురిని దేశానికి రూపురేఖలు మార్చేస్థాయికి తీసుకెళ్తోంది.అది లక్ష్మిని చాలా ఆకట్టుకుంది. మనదేశంలోని యువతకు కూడా అలా అవకాశం కల్పిస్తే ఎంతో బాగుంటుంది అనిపించింది. మరుక్షణమే ఉద్యోగానికి రాజీనామా లేఖ పెట్టేసి ఇండియా ఫ్లైటు ఎక్కేశారు. నలుగురిని నేరుగా ఆదుకునే కంటే నలుగురిని ఆదుకునే వారిని సృష్టించడం వల్లే వేగంగా, ఎక్కువమందికి సాయపడవచ్చని భావించారు లక్షి. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకువచ్చిందే ‘భారతీయ యువశక్తి ట్రస్ట్’ (బీవైఎస్టీ). ఇది లాభార్జన ధ్యేయం లేని ఓ విభిన్నమైన సంస్థ. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు, వ్యాపార సామర్థ్యాలు ఉండి... డబ్బు, అవకాశాలు లేక ఉండిపోయిన యువతకు ప్రోత్సాహం ఇచ్చి వారిని పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దడం బీవైఎస్టీ లక్ష్యం.
బీవైఎస్టీ ఏం చేస్తుంది!
మీ దగ్గర ఓ మంచి వ్యాపార ఆలోచన ఉంది. దాన్ని ప్రారంభిస్తే మీరు ఎదగడంతో పాటు మరికొంతమందికి ఉద్యోగాలు వస్తాయనుకోండి. మీ ఆలోచనను ప్రణాళికాబద్ధంగా పేపరు మీద పెట్టి, బీవైఎస్టీని సంప్రదించాలి. వారు మీ ఆలోచన సరైనదో కాదో పరిశీలిస్తారు. మంచి ఆలోచన అయితే మీకు రుణం మంజూరు చేయడంతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తారు.దీనికోసం మీకో మార్గదర్శకుడిని (మెంటర్) అందుబాటులో ఉంచుతారు. అతడు మీ ఆలోచన వ్యాపార రూపం దాల్చడానికి అవసరమైన సహకారం అందజేస్తాడు. ఎక్కడ ప్రారంభించాలి? ఎలా ప్రారంభించాలి? రాబోయే అడ్డంకులేవి? వాటిని ఎలా అధిగమించాలి? ఇలా ప్రతి విషయంలోనూ గెడైన్స్ ఇస్తూ ఈ సంస్థవారు మీతోడు ఉంటారు. చట్ట బద్ధంగా ఉండే ఏ వ్యాపారమైనా వీరు సహకరిస్తారు. బీవైఎస్టీ సాయం పొందాలంటే మీ వయసు 18-35 ఏళ్ల మధ్యే ఉండాలి. గ్రామీణ భారతంలో ఉపాధి సృష్టించే వ్యాపారం అయితే మరీ మంచిది. కానీ, తప్పనిసరిగా కొన్ని ఉద్యోగాలు అయినా సృష్టించగలగాలి.
ఇక్కడ నిరాశపరిచేవాళ్లు ఎక్కువ
కొత్త ఆలోచనలు చేసేవారికి, సొంత కాళ్లపై నిలబడాలనుకునేవారికి ఇక్కడ పరిస్థితులు అనువుగా లేవని అంటున్నారు లక్ష్మీ వెంకటేశన్. అమెరికా జనాభాలో 75 శాతం మంది ఏదో ఒక వ్యాపారం చేసిన వాళ్లే ఉంటారు. జయాపజయాలు పట్టించుకోకుండా ప్రభుత్వం అందుకు చాలా ప్రోత్సాహాన్నందిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం తక్కువ. ఉద్యోగం మానేసి ఏదైనా ప్రారంభించేవారిని సమాజంలో కూడా తప్పు చేస్తున్నట్లు చూస్తారు. ‘‘నిజానికి మనవాళ్లు చాలా సమర్థులు. యువత కూడా ఎక్కువ. ఇలాంటి చోట యువతరాన్ని మంచి ఆలోచనలతో ప్రోత్సాహిస్తే వారు నిరుద్యోగాన్ని మటుమాయం చేస్తారు’’ అంటారామె.1992లో ప్రారంభమైన బీవైఎస్టీ ఇప్పటివరకు 2000 మందిని వ్యాపార వేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తయారుచేసింది. వారిలో మిలియనీర్లు అయినవారూ ఉన్నారు. వీరంతా కలిసి సుమారు 30 వేల ఉద్యోగాలను సృష్టించారు. ఒక సంస్థ ప్రోత్సహిస్తే ఇన్ని ఉద్యోగాలు పుట్టాయంటే, ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ దేశంలో నిరుద్యోగానికి అడ్రస్ ఉంటుందా అన్నది లక్ష్మి వేస్తున్న ప్రశ్న.ఇప్పటి యువతలో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. మీరు కూడా అదే ప్రయత్నంలో ఉండి దిక్కుతోచకపోతే బీవైఎస్టీని కలవొచ్చు. దేశంలో ఆరు కేంద్రాలుంటే హైదారాబాదులో ఒకటి స్థాపించారు.
మూలం : తెలుగు విశేష్