అక్రమ సంపాదనకు అలవాటు పడి కొందరు అధికారులు అడ్డగోలుగా ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం, ఒడిషా, బీహార్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా కొందరు ఇసుకను తరలించడాన్ని ఆమె గమనించింది. ఇసుక మా ఫియా దారుణాలను ఉన్నతాధికారుల దృష్టికి ఆమె తీసుకువెళ్లింది, పోలీసు అధికారులు చుట్టూ తిరిగింది. స్థానికుల ప్రజలకు ఎంతగానో చెప్పింది. అయనా, ఏ ఒక్కరూ ఆమె గోడు వినలేదు. ఎంతో కష్టపడి ఒకసారి పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించగలిగింది. అయనా, ఇసుక తవ్వకాలు ఆగకపోగా ఆమెపై దాడులు జరిగాయి. ఇసుక కాంట్రాక్టర్లు తమ వద్ద పనిచేసే మహిళలతో ఆమెపైనా, ఆమె పిల్లలపైనా దాడులు చేయించారు. ఆ బెదిరింపులకు లొంగ ఇసుక మాఫియాపై జజీరా సమరభేరి మోగించింది. ముందు తన సోదరులను ఇసుక తవ్వకాల వద్దకు పోకండా ఆపగలిగింది.
ఓ రోజు హఠాత్తుగా ఆమె తన ముగ్గురు పిల్లలతో పాటు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించింది. తొమ్మిది రోజుల పాటు ఆందోళన సాగించి, ఇసుక మాఫియకు అడ్డుకట్ట వేయాలంటూ వేడుకుంది. భారీ వర్షం కురుస్తున్నా పిల్లలు తడవకుండా గొడుగు పట్టుకుని, వణికించే చలిలో సైతం ఆమె ఆందోళన కొనసాగించింది. చివరకు తహశీల్దార్ వచ్చి ఇసుక మాఫియా చర్యలను అరికడతామని హామీ ఇచ్చిన తరువాత ఆందోళన విరమించింది. అయితే, తహశీల్దార్ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటంతో ఆమె ఈసారి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు ఉపక్రమించింది. తనతో పాటు బిడ్డలను కూడా వర్షంలో కూర్చోబెట్టి వారి ఆరోగ్యం పాడు చేస్తోందని స్ర్తి, శిశు సంక్షేమశాఖ అధికారులు జజీరాపై కేసు పెట్టారు. అయనాసరే ఆమె తన పోరాటం కొనసాగించి, కొంతమేరకు విజయం సాధించింది. బీచ్ వెంబడి పోలీసు యంత్రాంగాన్ని నియమించి ఇసుక తవ్వకాలను అరికడతామని హామీ ఇవ్వటమే కాకుండా ఆ మేరకు రక్షకదళాలను అధికారులు ఏర్పాటు చేశారు.
కొన్నాళ్లు ఇసుక తవ్వకాలు ఆగినట్లే ఆగి మళ్లీ ఊపందుకున్నాయి. జజీరా ఈసారి తన నిరసనను నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికే తెలియజేయాలని భావించి, తిరువనంతపురంలోని సచివాలయం ఎదుట తన పిల్లలతో ఆందోళన ప్రారంభించింది. ఆమె ఆందోళనకు స్పందించి సాక్షాత్తూ ముఖ్యమంత్రి దిగివచ్చి ఆమెను కలుసుకుని ఇసుక మాఫియా ఆగడాలను తెలుసుకున్నారు. బీచ్‌ల్లో ఇసుక తవ్వకాలను ఆపివేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయతే, అది ఎంతవరకు సమర్థవంతంగా అమలు జరుగుతుందో వేచి చూడాలి. దాశాబ్దకాలంగా ఇసుక మాఫియాపై జజీరా ఒంటరిగానే పోరాటం చేసింది. నేడు ఆమె వెనుక భర్త, కుటుంబ సభ్యులు, ఎంతోమంది పర్యాటకులు, పర్యావరణ ప్రేమికులు, వేలాది మంది స్థానికులు అండగా నిలుస్తున్నారు. జజీరా పోరాటం వల్ల పర్యావరణ పరిరక్షణపై జనంలో చైతన్యం పెరిగిందని ప్రముఖ సామాజిక కార్యకర్త సుల్ఫాత్ అంటున్నారు. రాజకీయ నాయకుల అండ లేకున్నా ఇసుక మాఫియాపై జజీరా చేస్తున్న పోరాటం స్ఫూర్తి దాయకంగా ఉందని స్థానికులు మద్దతు ఇస్తున్నారు. తమ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న జజీరాను ఇసుక మాఫియా ఏమీ చేయకుండానే ఊరుకుంటుందా? అన్న ఆందోళన జనంలో లేకపోలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఇసుక మాఫియాపై యుద్దం చేసిన ఐఎఎస్ అధికారిణి నాగ్‌పాల్ నిర్దాక్షిణ్యంగా సస్పెన్షన్‌కు గురైందని కేరళ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
‘నన్ను చంపినా, నా ఇంటిని నాశనం చేసినా ఇసుక మాఫియా నన్ను ఓడించలేదు. ఎందుకంటే- వాస్తవాలను, న్యాయాన్ని న మ్ముకుని పోరాడుతున్న నాకు ఎలాంటి ఓటమి ఉండదు’ అని జజీరా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. పడిలేచిన కెరటం వలే ఆమె నిత్యం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. అలుపెరుగని ఆమె పోరాటానికి ఎప్పటికైనా మంచి ఫలితం ద క్కుతుందని కేరళ వాసులు బలంగా నమ్ముతున్నారు.